నాద యోగం -8
భాగవతం లో నాద యోగం
భాగవత మహా పురాణం లో నాద యోగం గురించి అనేక ఉదాహరణలున్నాయి .అందులో శ్రీకృష్ణ భగవానుని లీలలలో పరమార్ధాలు ,అన్యార్ధ విశేషాలు వర్ణింప బడినాయి .కృష్ణ కధలో ‘’కృష్ణ భగవానుడు తన అంతః పురాన్ని వదిలి అరణ్యం లోకి వెళ్ళాడు .అది శీతాకాలపు మొదటి పండు వెన్నెల పౌర్ణమి నాటి అర్ధ రాత్రి .శ్రీకృష్ణుడు వేణుగానం మహాద్భుతంగా చేస్తున్నాడు .ఆ అనంత నీరవనిశీధిలో వేణు నాద తరంగాలు అన్ని వైపులకూ వ్యాపించి జగన్మొహనం కలిగిస్తున్నాయి .చీకటి కారడవి నుండి వస్తున్న ఆ నాదం వ్రేపల్లెలోని గోపికల చెవులకు వినిపించింది .అంతే ఇళ్ళల్లో ఉన్న గోపికలు ఇళ్ళను ,భర్త ,పిల్లల్ని వదిలేసి క్షణాలమీద వేణుగాన లోలుని చెంతకు పరుగు పరుగున వచ్చేశారు .ఎక్కడినుండి వేణునాదం వినిపిస్తోందో,ఎలా అక్కడికి చేరుకోవాలో దారీ తెన్నూ ఏమిటో వారికేమీ తెలియదు .కాని రావాల్సిన చోటుకే చేరుకొన్నారు ,అదీ ఆ నాద సమ్మోహన ప్రభావం . .వచ్చి వేణుగాన లోలుని చుట్టూ చేరి నాట్యం చేయటం ప్రారంభించారు .అలా కొంత సేపు చేసిన తర్వాత వారిలో ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణుడు తన తోనే ప్రత్యేకంగా నాట్యం చేస్తున్న మధుర భావన కలిగింది .దీనినే రాస లీల అన్నారు .
ఈ కధ అద్భుతమైనది .కాని దీన్ని ప్రపంచం సరిగ్గా అర్ధం చేసుకోలేదు .దీన్ని పూర్తిగా అర్ధం చేసుకొన్నవారు మహాత్ములైన యోగీశ్వరులు .నాదయోగులకు శ్రీ కృష్ణుడే ఉన్నత స్తరం లో ఉన్న చేతన..ఆయన నుండే అత్యుత్తమ సూక్ష్మ నాదం తమ నాద సాధనలో ఉద్భవిస్తుందని విశ్వ సిస్తారు .వేణునాదావిర్భావ ప్రదేశం వారిని సమ్మోహితుల్ని చేసి ప్రతి వ్యక్తిత్వ చేతననూ మరచి పోయి ఆ నాద పారవశ్యం లో ఆనందాను భూతి పొందుతారు .అప్పుడు వారి ఇంద్రియాలు వ్యక్తిగత ఆనందం ,అవగాహన కేంద్రాలనుండి ఉపసంహరించుకొంటాయి . అవన్నీ వెనక్కి తగ్గి ,వేణు నాదం ఆవిర్భవించిన చోటుకు చేరారు .ఈ స్థితిలో అనుభవ జ్ఞానాలు పూర్తిగా బాహ్య విషయాలతో తమ కున్న బంధనాలను విచ్చేదనం చేసుకొ౦టాయి అని గ్రహించాలి .మరొక రకంగా యోగి భాష లో చెప్పాలంటే ‘’ధారణ జరిగింది .ధ్యానం ఉదయించాలి ‘’.
సంస్కృతం లో కృష్ణ శబ్దానికి గొప్ప అర్ధం ఉంది .కృష్ణ అంటే వెనక్కి తగ్గటం లేక ఆకర్షించటం అనే రెండు అర్ధాలున్నాయి .ఈ శబ్దం ‘’కర్షన్ ‘’అనే దాతువునుండి ఆవిర్భవించింది .కనుక కృష్ణ అంటే లాగేవాడు ఆకర్షించేవాడు ,వెనక్కి లాగేవాడూ అనే అర్ధాలున్నాయి .వ్యవసాయదారుడు ,అనీఅర్ధం ఉంది .గోపి అంటే సంస్కృతం లో గోవు లేక ఆవు అని అర్ధం .సంస్కృతం లో’’ గో ‘’అంటే ,ఇంద్రియానుభావాలు ,ఆవు ,బీద ,అణకువగా ఉండటం , పూర్తిగా ఉన్న సకల విశ్వం అని అర్ధాలున్నాయి .కనుక గోపి అంటే ఇంద్రియ అనుభవాలు అని లోపలి అర్ధం బాహ్యార్ధం గోవులను కాసేవారి పిల్ల .ప్రతీకాత్మికంగా గోపి అంటే ఇంద్రియానుభవాలు .మరి ఈ గోపికల భర్తలు ఎవరు ?కళ్ళకు రూపం భర్త .,చెవులకు శబ్దం భర్త .వినబడాల్సిన అత్యుత్తమ సూక్ష్మ నాదం వినిపించగానే ఇంద్రియానుభవాలు ,బాహ్య౦గా వినిపించే శబ్దాల నుండి విడిపోయి ,అంతర్ నాదం తో ఐక్యమౌతాయి .ఈ విధానాన్ని ‘’ప్రత్యాహారం ‘’అంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-16-ఉయ్యూరు

