భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –6
కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం )
91వ శ్లోకం లో దీక్షితులు –
‘’ఆమోద కాంతి భ్రుదహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ గణైః దివిషత్ గుణైశ్చ
అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’
వరదా !నీ ముఖం లో పరస్పర విరుద్ధ గుణాలున్న చంద్రుడు ,కమలం ఒకే చోట కలసి ఉన్నట్లు ఉంటుంది .కమలం లో కేవలం సుగంధం ఉంటుంది .చంద్రునిలో కాంతి మాత్రమే ఉంటుంది .కాని నీ మోములో కాంతి సుగంధం రెండూ కలిసి ఉంటాయి. ఇది పరమాశ్చర్య కర విషయం .కమలం పగలే వికసిస్తే చంద్రుడు రాత్రిమాత్రమే ప్రకాశిస్తాడు .కానీ స్వామీ నువ్వు మాత్రం రాత్రీ ,పగలు అనే తేడా లేకుండా ప్రకాశిస్తావు .కమలాన్ని ద్విజులు అంటే పక్షులే కోరుకొంటాయి .కాని నిన్ను ద్విజులు అంటే బ్రాహ్మణులు దేవతలు కూడా కోరుకొంటారు .
అ౦కాది రూఢసహజశ్రీ అంటే –అధిరోహించిన లక్ష్మి కలది అని అర్ధం .లక్ష్మి సహోదరుడే చంద్రుడు .కాని నీముఖం ఎలాంటి గుర్తులతో గుర్తి౦చాల్సిన అవసరమే లేదు .దానికి సహజ కాంతి ఉంది .
మరో శ్లోకం లో వరద రాజ స్వామి నిస్శ్వాసం నుండి వేద విద్య వెలువడిందని ఆయన ముఖార వింద౦ లో ఉన్న సరస్వతి దాన్ని గ్రహిస్తోందనీ అంటాడు .విద్యారణ్య స్వామి వేద భాష్య భూమిక లో ‘’యశ్య నిఃశ్వసితం వేదాః,అస్య మహతో భూతస్యనిఃశ్వసితమే తధ్యద్రుగ్వేదోయజుర్వేదః సామవేదః ‘’అనే మంత్రాన్ని పేర్కొన్నారు .
102వ శ్లోకం లో –
‘’పద్మానురాగ జుషి లోహిత శుక్ల కృష్ణాం—ఆసేదుషి ప్రకృతి మాద్రుతమీనరూపే
శ్రుత్యంత భాసిని మదావల శైల నాద –త్వల్లోచనే త్వయి చ భాతి నమే విశేషః ‘’
‘’హే హస్తి చలవాసా వరదా !ఎర్రని ,తెల్లని ,నల్లని గుణాలతో కూడిన ప్రకృతిని మత్స్యాకారం తో కర్ణాంతం వరకు వ్యాపించిన నీ నేత్రాలలో స్వీకరించావు .అయితే నీ నేత్రాలకూ నీకు భేదమే లేదు. నేత్రాలు త్రివర్ణాత్మకాలు అంటే తెలుపు ,ఎరుపు జీర ,నలుపు రంగులతో ఉంటాయి .సాంఖ్యులు చెప్పిన ప్రకృతి,సత్వ ,రాజస్తమస్సులతో అంటే మూడు రంగులు లేక గుణాలతో ఉంటుంది .సాంఖ్యుల ప్రకృతికి వేదాంతుల మాయ కు భేదమే లేదు ..ఈవిషయాన్ని ‘’అజామేకాం లోహిత శుక్ల క్రిష్ణా౦ ‘’మంత్రమే వివరించింది .అలాంటి ప్రకృతే నిన్ను ఆశ్రయించుకొని ఉందికదా ,నేత్రాలూ నీలోనే ఉన్నాయి ,ప్రకృతి లేక మాయ నిన్నే ఆశ్రయించి ఉంటుంది .ఆప్రరుతి లక్షణాలు నీ కళ్ళల్లో ఉన్నాయి .శ్రుత్యంతం అంటే వేదాంతం .మీన రూపం అంటే మత్స్యావ తారం .
తరువాత శ్లోకం లో ‘ప్రజాపతి నిన్ను దర్శించి ముక్తుడయ్యాడు.అందుకని మరో సృష్టి కర్త అవసరమయ్యాడు .అతన్ని సృష్టించే శ్రమ లో ఉన్న నీ ఫాల భాగం పై స్వేద జలకణాలా అన్నట్లు కిరీటం దగ్గరున్న ముత్యాలు శోభిస్తున్నాయి ‘’అన్నాడు .
అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ప్రమోషన్ ప్రజాపతి పదవి .ఉన్న ప్రజాపతి మోక్షం పొందాడు వరద రాజ దర్శనం తో .ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీ గా ఉంది .ఆపదవిని భర్తీచేసేపనిలో పడ్డాడు .అందుకే చెమటలు కారుస్తున్నాడు .భగవంతుని లలాట స్వేద జలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని ‘’మహోపనిషత్ ‘’తెలియ జేసింది –
‘’అధ పునరేవ నారాయణః సోన్యత్కామో మనసా –ధ్యాయత తస్య ద్యానాంతస్థస్య లలాటాత్ స్వేదోఃపతత్-తా ఇమా ఆపస్తాభ్యః సు తేజో హిరణ్య మండల మభవత్ –తత బ్రహ్మా చతుర్ముఖో జాయత ‘’
ఇంతకీ అసలు చెప్పిందేమిటి ?వరదుని కిరీటం లోని ముత్యాలు స్వేద బి౦దువులులాగా ఉన్నాయి అని చెప్పటమే
చివరిది అయిన 105వశ్లోకం లో అప్పయ్య దీక్షితార్ వరదుని అమృత రూపం నిరంతరం స్పురించాలని కోరుకున్నాడు
‘’ఆపాద మాచికుర భార మశేష మంగ –మానంద బృంద లసితం సద్రుశామ సీమం
అ౦తర్మమ స్పురంతు సంతత మంతరాత్మన్-అంభోజ లోచన తవ శ్రిత హస్తి శైలం ‘’.
ఓ అంతరాత్మా !అ౦ భోజలోచనా !జ్ఞాన వంతులు కడుపార జుర్రే నఖ శిఖ పర్యంతమైన నీ అమృత స్వరూపం ,నిరంతరం న హృదయం లో స్పురించుగాక .
ఇతి శ్రీమత్ భారద్వాజ కుల జలధి కౌస్తుభ –శ్రీమత్ అద్వైత విద్యాచార్య శ్రీ విశ్వజిత్ యాజి శ్రీ రంగ రాజాధ్వరి వర సూనునా –శ్రీమదప్పయ దీక్షితేన కృతం వరజ రాజ స్తవ వివరణం సంపూర్ణం .’’
అప్పయ దీక్షితుల చిరు పరిచయం –
‘’ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ ప్రాభాకర పరిశ్రమః –తత్రాపి యాజుషీ శాఖా నల్పస్య తపసః ఫలం ‘’
అని తెలుగు భాషను మెచ్చుకొన్న మహా పండితుడు మహా విద్వాంసుడు అప్పయ దీక్షితులు తమిళనాడు లోని దక్షిణ ఆర్కాటు జిల్లా అంటే తుండీర మండలం లోని ‘’అడియ పాళెం’’లో జన్మించాడు .ఈయన పితామహుడు అచ్చాన్ లేక ఆచార్య దీక్షితులు ఒక సారి శ్రీ కృష్ణ దేవరాయలు భార్యా సమేతంగా శ్రీ కంచి వరద రాజ స్వామి దర్శనానికి వస్తే రాణిపై ఈయన ఒక శ్లోకాన్ని ఆశువుగా చెప్పాడు .సంతోషించిన రాయలు ఆయనను ‘’వక్షస్థలాలా చార్యుడు’’అనే బిరుదు నిచ్చాడని ‘’చిత్ర మీమాంస ‘’లో మనవడు అప్పయ దీక్షితులు చెప్పాడు .ఇంతకీ తాత గారి శ్లోకం దాని పరమార్దం ఏమిటి ?
‘కా౦చిత్ కాంచన గౌరా౦గీం వీక్ష్య సాక్షాదివశ్రియం –వరద స్సంశయా పన్నో వక్షః స్థల మవైక్షత ‘’ అంటే
‘’లక్ష్మీ దేవిలాగా ఉన్న అనంత సౌందర్య రాశిని అయిన ఈమెను చూసి తన వక్షస్థలం పై లక్ష్మీదేవి ఉందొ లేదో అని కంగారు పడి వరదయ్య తన వక్షస్థలాన్ని తడుముకొన్నాడట ‘’.ఈ శ్లోకం తోనే తాత అచ్చాన్ దీక్షితులు ఒక్కసారిగా ‘’వక్షస్థలాచార్యుడు ‘’అయిపోయాడు .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందో లేదోకని ఒక శ్లోకం ఈయన పేరునే మార్చేసి రికార్డ్ సృష్టించింది .
అప్పయ తాత గారికి ఇద్దరు భార్యలని ఒకామె వైష్ణవ సాంప్రదాయానికి రెండవ ఆమె శైవ సాంప్రదాయానికి చెందినదని తెలుస్తోంది .వైష్ణవ సాంప్రదాయపు ఆమె పేరు’’ తోతరాంబ’’,అని ఆమెకు నలుగురు కొడుకులని ,పెద్ద కొడుకు రంగ రాజాధ్వరి అని అంటారు .ఈయన తండ్రిలాగానే యాగాలు చేశాడు .అందులో ‘’విశ్వజిద్యాగం ‘’చేసి కీర్తి పొందాడు ‘’అద్వైత విద్యా ముకురం ‘’అనే గ్రంధాన్ని ,’’వివరణ దర్పణం ‘’మొదలైన గ్రంధాలను రాసిన మహా మనీషి ఈయన జ్యేష్ట కుమారుడే మన అప్పయ దీక్షితులు .భారద్వాజ గోత్రీకుడు ,’’శ్రీ కంఠమత స్థాపనా చార్య ‘’,చతురధిక ప్రబంధశత నిర్వాహకః ‘’ ‘’,మహా వ్రత యాజీ ‘’బిరుదులు పొందాడు .కాలం 16వ శతాబ్దం లో చాలాభాగం ,17వ శతాబ్దిలో కొంత భాగం లో జీవించాడు .మొత్తం మీద 104గ్రంధాలు రాశాడు .వాటిపేర్లను తానే పట్టికగా ఇచ్చాడు వాటిలో చాలా వాటికి వ్యాఖ్యానాలూ తానే రాశాడు .విద్యా రణ్య స్వామి తర్వాత అంతటి పక్ష పాత రహిత బుద్ధి ఉన్న మహా విద్వాంసుడు దీక్షితులు ..’’సర్వ దర్శన సారం ‘’ఆయన సర్వమత సమదృష్టికి గొప్ప ఉదాహరణ .చిన బొమ్మనాయక రాజు అప్పయ దీక్షితులకు స్వర్ణాభి షేకం చేశాడు .
ఆధారం –అప్పయ దీక్షిత కృత వరద రాజ స్తవం –వ్యాఖ్యానం –శ్రీ దేవర కొండ శేషగిరి రావు .
వరద రాజ స్తోత్రం ముఖ చిత్రం జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-16-ఉయ్యూరు