ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -158
61—అత్యంత ప్రసిద్ధ ప్రతీకాత్మక హాస్యాత్మక పురాణ నవలా రచయిత-ధామస్ మాన్
మార్సెల్ ప్రౌస్ట్ అనే ఫ్రెంచ్ రచయితా,ఐరిష్ రచయితా జేమ్స్ జాయిస్ ,అమెరికా రచయిత ధామస్ ఉల్ఫ్ ,జర్మన్ రచయితధామస్ మాన్ రాసిన స్వీయ చరిత్ర లాంటి నవల లు ఇరవై వ శతాబ్దం లో కొత్త లోకాలను చూపి౦చాయి .మాన్ పురాణ రచనలు రాయటం మొదలు పెట్టే దాకా మిగిలినవారి లాగానే చాలా కల్లోలం అనుభవించాడు .మిగిలినవారి కంటే వేరుగా ఉండటం ఆయన కోరుకొన్నాడు .దీనికోసం ఒంటరితనం అనుభవించాడు మధ్య తరగతి సంపన్న కుటుంబానికి చెందినా వాడైనా .
జర్మనీలోని పాత హాన్సీటిక్ టౌన్ లోని లూబెక్ సిటీలో ధామస్ మాన్ 6-6-1875న జన్మించాడు .పాల్ ధామస్ మాన్ గా చర్చి రికార్డ్ లో పేరు నమోదైంది .స్టూడెంట్ మేగజైన్ లో రాసిన వాటిని పాల్ ధామస్ పేరుతొ రాశాడు .మాన్ వంశం తర తరాలుగా ప్రసిద్ధమమైనదే .తాత చాలా పేరున్నవాడు .నెదర్లాండ్స్ కు ‘’కాన్సల్ ‘’గా ఉండేవాడు .తండ్రి ధనవంతుడైన ధాన్యం వ్యాపారి ,రెండు సార్లు సెనేటర్ గా ఒక సారి లూబెక్ మేయర్ గా ఉన్నవాడు .కన్జర్వేటివే కాని సంప్రదాయ పధ్ధతి పాటి౦చనివాడు .సౌత్ అమెరికా ప్లాంటర్ ,పోర్చుగీస్ క్రియోలీ జర్మన్ కుమార్తెను పెళ్లి చేసుకొన్నాడు .వీరి మొదటి కుమారుడు తాత లాగా లిబరల్ గా ప్రసిద్ధుడు ,తల్లిలాగా ప్రముఖ నవలా కారుడు .అయిదుగురు సంతానం లో ధామస్ రెండవ వాడు తండ్రి గౌరవాన్ని మెచ్చుకొంటూనే చీదరించుకోనేవాడు .కాని తల్లి అంటే వీరాభిమానం చూపేవాడు .తల్లి పియానో ,మా౦డలీన్ వాయించటం లో నేర్పరి .ఆ పట్నం లోని తతిమ్మా ఆడవారి కంటే చాలా భిన్నంగా అన్నిట్లోనూ కనిపించేది .
మాన్ బాల్య విద్య అంత హుషారుగా సాగలేదు .ప్రష్యన్ ల పెత్తనం ఎక్కువ .సాహిత్య గంధం వారికి పడేదికాదు .శిక్షణా గొప్పగా ఉండేదికాదు .మన వాడి కాలక్షేపం అన్నగారి ‘’టాయ్ దియేటర్ ‘’లోనే ,అక్కడున్న పుస్తకాలతోనే .ఆన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ కధలు ,హోమర్ రాసిన గ్రీకు పురాణ కధలు బాగా చదివాడు .15వ ఏట తండ్రి చనిపోయాడు .కుటుంబ ఆదాయం క్రామంగా తగ్గిపోయి,దివాలా ఎత్తేయటం జరిగింది .లంకంత కొంప బేరానికి పెట్టారు .ఇంట్లోని పురాతన వస్తువులన్నీ అమ్మేశారు .పిల్లలను తీసుకొని తల్లి కొంచెం వెచ్చని ప్రాంతమైన దక్షిణం వైపు ఉన్న మ్యూనిచ్ చేరింది .ధామస్ మాత్రం లూబెక్ లోనే అన్న హీన్రిచ్ తో ఉండిపోయి స్కూల్ విద్య పూర్తీ చేశాడు గోదే,షిల్లర్ ,హీన్ కవులను అనుకరిస్తూ రొమాంటిక్ కవితలు రాశాడు వీటికి ‘’స్ప్రింగ్ స్టార్మ్’’అనే పేరుపెట్టి ఒక చిన్న పత్రికకు పంపిస్తే ఆవి ప్రచురితమవగా మహా సంతోషించాడు 19వ ఏట మ్యూనిచ్ లో ఉన్న కుటుంబానికి చేరుకొన్నాడు సీరియస్ గా ,తనకే ప్రాముఖ్యం ఉండాలనుకొనే ఈ నల్లకళ్ళయువకుడి చూపులో భవిష్యత్ రచయిత దర్శనమయ్యేది .ఇన్సూరెన్స్ ఆఫీస్ లో తాత్కాలికం గా పనికి కుదిరాడు .అకౌంట్స్ రాస్తూ ,దొంగతనంగా ఫిక్షన్ రాస్తూ ఒక చిన్న కద రాసి పత్రికకు పంపితే అది అచ్చు అయి చూసుకొని మురిసిపోయాడు .పొగడ్తలూ లభించాయి .ఒక ఏడాదికే దట్టంగా ముక్కు పొడుం పీలుస్తూ ముక్కు లెగరేసే చీదుతూ రోతగా ఉండే గుమాస్తాల మధ్య ఉండటం అసహ్యమని పించింది. ఈగుమాస్తా చాకిరీ విసుగనిపించి. తండ్రి ఆస్తిపై వచ్చేరాబడి బాగానే ఉండటం టో మళ్ళీ చదువు లో దిగాడు .యూని వర్సిటి లో చేరి ఫిలాసఫీ సాహిత్యం చదివాడు .తల్లి అతనికి మరో 12నెలల స్వేచ్చ ఇచ్చింది .ఈ కాలం ఇటలీలో గడిపాడు .అప్పటికి హీనస్ రిచ్ అక్కడే ఉన్నాడు,తన పెద్ద గ్రంధం రచనలో మునిగి ఉన్నాడు .ధామస్ చిన్న కధలు రాస్తూ ‘’లిటిల్ మిస్టర్ ఫరీద్ మాన్ ‘’పేరుతొ కదా సంపుటి ని 23వ ఏట ప్రచురించాడు .
అన్న హీన్రిచ్ ప్రోత్సాహం తో భయ పెట్టేంత పెద్ద సైజు లో ఉద్గ్రంద రచన చేస్తూ 1898లో జర్మనేకి తిరిగి వస్తూ తనతో ‘బడ్దేన్ బ్రూక్స్ ‘’అనే ఆ మహా గ్రంధాన్ని తెచ్చాడు .ప్రచురణ కర్త పుస్తకం సైజు సగానికి సగం తగ్గించమని ప్రాధేయ పడ్డాడు .అదంతా తన పూర్వీకుల కద,ఆనాటి సమాజం కద అవటం తాను ఇంకా యవ్వనం లోనే ఉండటం వలన తక్కువ పేజీలలో దాన్ని కుదించి న్యాయం చేయలేనని తగ్గించటానికి ససేమిరా అన్నాడు . పబ్లిషర్ అభ్యంతరాలను తోసి రాజంటూ రెండుభాగాలుగా దీన్ని 1902 లో ప్రచురించాడు .ఊహాతీత విజయం వరించింది .ఒక్క ఏడాదిలోనే రెండు భాగాలను కలిపి ఒకే పుస్తకంగా ప్రచారించాడు .అంతడిమాండ్ వచ్చింది ఆ పుస్తకానికి. మాన్ ను ‘’డాజ్జ్లింగ్ పో ర్టెంట్ ‘’అంటే’’ మిరుమిట్లు గొలిపే ఉత్పాతం ‘’అన్నారు .ప్రపంచం లోని సజీవ భాషలన్నిటి లోకీ ఈ నవల అనువదించ బడింది .అదొక సమకాలీన క్లాసిక్ అయింది .జర్మనీలో ప్రతి ఇంటిలోనూ బైబిల్ టో పాటు ఈ పుస్తకమూ చోటు చేసుకొన్నది .1935లో జర్మన్ భాషలో వెలువడిన ఈ గ్రంధం ఒక మిలియన్ కాపీలకు పైనే అమ్మకాలు సాధించింది .1929లో ధామస్ మాన్ కు నోబెల్ ప్రైజ్ ను సాహిత్యం లో ప్రదానం చేస్తూ కమిటీ ‘’మాన్ రాసిన గొప్ప నవల బడ్దేన్ బ్రూక్స్ కు మాత్రమే ఈ పురస్కారం ‘’అని మెచ్చి ఇచ్చింది .
బడ్దేన్ బ్రూక్స్ లోని కధను తెలియ జేస్తూ ఉప శీర్షికగా ‘’ఒక కుటుంబ పతనం ‘’(డిక్లైన్ ఆఫ్ ఎ ఫామిలీ ‘’అని అర్ధవంతంగా పేరు పెట్టాడు .19వశతాబ్దం లోని మూడు తరాల కధాగమనం ఇందులో .ఊహాతో తనవారి ఉద్దాన పతనాలను ఆవిష్కరించాడు .ధనాన్ని కోల్పోవటం ,సంస్కృతిలో ఉన్నతి సాధించటం చూపించాడు .నిర్వహణ చాలా సహజంగా ఉన్నా ,అంతరార్ధం అంతా-ఆది భౌతికంగా (మెటా ఫిజికల్ )గా ఉండటం విశేషం .ప్రసిద్ధ వేదాన్తులైన నీజేషీ స్కాపెంహార్ లను పూర్తిగా అధ్యయనం చేశాడుకనుక ఆ భావ పరమపర లో నడిపాడు .నీజేషీ వేసిన ప్రశ్న ‘’మన ఉనికికి పరమార్ధం ఉందా ?అన్న దానికి వివరణ ఇది .ఇందులో సామాన్య పౌరుడిప్రపంచానికి ,సమాజం లో ఇమడలేని ఆర్టిస్ట్ ప్రపంచానికి ఉన్న తేడాను గొప్పగా వివరించిన నవల .కుటుంబ గాదా సరిత్సాగారమే కాకుండా సామాజిక సమస్యా కదా సాగరం కూడా .ఒక రకం గా మన విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’లాగా అనుకో వచ్చు నేమో ? .దీనినే మాన్ భాషలో ఏం చెప్పాడో చూద్దాం –‘’it is my bourgeois conscience makes me see in the artist life ,in all irregularity and all genius ,something profoundly disreputable ,that fills me with this lovelorn ‘’faiblesse ‘’for the simple and good ,the comfortably normal ,the average unendowed respectable human being ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-16-ఉయ్యూరు