ఇది విన్నారా ,కన్నారా !-1
1.’’గాయక సర్వ భౌమ ‘’బిరుదు పొందిన పారుపల్లి రామ కృష్ణయ్య పంతులు గారు కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో 1882 డిసెంబర్ 5న శ్రీ శేషాచలం పంతులు శ్రీమతి మంగమ్మ దంపతులకు జన్మించారు
2-పంతులు గారి షష్టి పూర్తీ నాడు వారికి విజయవాడ నగర వీధులలో గాజా రోహణ సన్మానం చేశారు ..ఏ సంగీతకారుడికీ ఇంతటి ఘన సన్మానం జరగ లేదు అదొక రికార్డ్ .
3-శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ పారుపల్లి వారి శిష్యులు .రామునికి సీత కృష్ణునికి గీత ఎలాగో అలాగే శిష్యులకొరకు పారుపల్లి వారు అన్నారు బాలమురళి .
4-పారు పల్లి యనెడి పావన నామంబు –విజయవాడ లోన వెలయ కున్న
ఏ స్థితి ని గనెదమో ?ఏ గతి నుందుమో-మాద్రుశులగు మంద మతులు నేడు ‘’అన్నారు మహా విద్వాంసులు శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచారి గారు.
4-ఫిడేలు నాయుడు గారు అనే శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అంటే ఈశ్వరుడు తనదైన సంగీతాన్ని నాయుడు గారి ‘’ద్వారా ‘’వెదజల్లి ఇంటిపెరైన ద్వారం ను సార్ధకం చేశారని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు పద్యం లో కొనియాడారు.
5-రాజాజీ ‘’కళాసరస్వతి నాయుడు గారి వేళ్ళతో ఆడుకొంటుంది ‘’అన్నారు .
6-మృదంగ మహా విద్వాంసుడు శ్రీ దక్షిణా మూర్తి పిళ్లే,నాయుడుగారి ఫిడేలు కచేరి చూసి వారి వ్రేళ్ళను కళ్ళకు అద్దుకొన్నారు .
7-వయోలిన్ కు గౌరవం తెచ్చిన వారు ద్వారం వారే .
8-నాయుడుగారికి అయిదారేళ్ళ వయసులో చూపు మందగించి క్షీణిస్తే ,స్కూల్ టీచర్ వీరి అంధత్వాన్ని పరిహసిస్తే చదువు మానేసి సంగీతం లో ప్రవేశించారు .ఈ మేస్టారే ఆ తర్వాత నాయుడుగారు కాకినాడ సరస్వతీ గాన సభలో కచేరీ చేయగా విని ‘’నన్ను క్షమించరా –నిన్ను చిన్నప్పుడు అవమానించాను ‘’అని క్షమాపణ చెప్పారు .
9-విజయనగర సంగీత కళా శాలలో చదవాల్సిన నాయుడు గారు అక్కడ చదవకుండానే ప్రొఫెసర్ గా మహా రాజా వారి చే నియమింప బడ్డ్డారు . విద్యార్దికాకుండానే సరాసరి ప్రొఫెసర్ అయిన ఆయన గొప్పతనం ఎన్నదగినది .
10-సంగీత సరస్వతి శ్రీమతి వీణ ధనమ్మాళ్ రోజూ వీణ పై సాధన చేస్తూ చివరగా ‘’కృష్ణా ‘’అని వీణను కింద పెట్టేసేది మళ్ళీ ఎవరు అడిగినా వాయించే ది కాదు .కాని ఒక సారి ద్వారం వారు ఈమె ఇంటికి రాగా వారిపై గౌరవంతో కింద పెట్టిన వీణ తీసి మళ్ళీ వాయించి వారి గౌరవానికి తగినట్లు ప్రవర్తించింది .
11-పాశ్చాత్య వాద్యం అయిన వయోలిన్ ను మొదటగా భారతీయీకరణ చేసి మన సంగీతానికి అనుగుణంగా మార్చినవారు సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తు స్వామి దీక్షితులవారి తమ్ముడైన బాల స్వామి దీక్షితులు .
12-పాశ్చాత్య సంగీత మర్మాలను అవగాహన చేసుకొని ,యే పాశ్చాత్య సంగీత పాఠం ఎదురుగా లేకుండానే ,ఆ సంగీత రచనలను అతి తేలికగా వాయించే వారట ద్వారం వారు ..
13-నాయుడు గారిని మద్రాస్ లో ఉంచాలని శిష్యులు భావించి ఆహ్వానించారు .రెండుషరతులపైన వారు అంగీకరించారు .ఒకటి తన విద్యా గురువు అన్నగారైన శ్రీ వెంకట క్రిష్నయ్య నాయుడు గారికి కొంత పారి తోషికం తో సన్మానించటం .రెండవది జబ్బు పడిన ఒక సంగీత విద్వా౦సు నికి ఆర్ధిక సాయం చేయటం .అలాగే శిష్యులు స్పందించారు .ఆ జబ్బు పడిన సంగీత విద్వాంసుడు ఎవరో కాదు ఒకప్పుడు నాయుడు గారు కచేరీ చేస్తుంటే నాయుడుగారిని నిందిస్తూ ,అక్కడ తానూ రాసిన కరపత్రాలను ముద్రించి పంచి పెట్టిన వారు ..ఎంతటి దయార్ద్ర హృదయులో నాయుడు గారు దీన్ని బట్టి తెలుస్తుంది .
14-నాయుడుగారి కళ్ళకు ఆపరేషన్ చేయిస్తామని చాలా ముందుకు వచ్చారు .వారికి అది ఇష్టం లేదు దానికి కారణం గా ‘’సంగీతానికి మనో నేత్రం అవసరం .నాకుబాహ్య నేత్రాలు లేవు కనుక నా మనో నేత్రాన్ని వికసింప జేసుకో గలిగాను .అందుకే నా సంగీతం పరి పక్వ దశకు వస్తోంది .మన సంగీతం ఏకత్వాన్ని సూచిస్తుందికనుక ఇది ఏక స్వర సంగీతం .దీనికి ఏకాగ్రత, తపస్సుకావాలి .కళ్ళు ఉంటె చూపు బుద్ధి చాంచల్యం పొంది ఏకాగ్రత కుదరదు .అందుకే నా సంగీతానికి నా బాహ్య నేత్రాలను సమర్పించుకొన్నాను ‘’అని ఒక యోగిలాగా చెప్పారు .
15-‘’సంగీతం వినబడే ఒక తపస్సు .కర్నాటక సంగీతం శ్రావ్య స్వరాల ద్వారా మోక్షాన్ని పొందే అతి తేలిక మార్గం .ఇది నాద బ్రహ్మోపాసన .ఒక యోగాభ్యాసం ‘’అన్నారు నాయుడుగారు .
16-‘’నాయుడుగారి చేతి వ్రేళ్ళకు కన్నులున్నాయి .అలాగే మృదంగ విద్వాంసులు శ్రీ కోలంక వెంకట రాజు గారి వ్రేళ్ళలో వీణ లున్నాయి’’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .
17-‘’ఈ వాయులీన సాహిత్య మాదుర్యముల్ –దేవతా స్త్రీ కంఠ దీప్త రావమ్ములో –పారిజాతామోదభావమ్ములో –సురనదీ జీవమ్ములో!’’అన్నారు విశ్వనాధ
18’’నీ గాన నిర్ఝరి మోక్ష ద్వారమునకుమార్గం బని ‘’ద్వారం ‘’నీ ఇంటి పేరు దనరె’’అన్నారు .
ఆధారం –ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన ‘’మన గాత్ర ,తంత్రీ వాద్య సంగీతవిద్యానిధులు ‘’గ్రంధం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-16-ఉయ్యూరు
—