ఇది విన్నారా కన్నారా ! 18
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం
239ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తారని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే జగన్మాత వారి చేతులలో వీణ ను ప్రసాది౦చి౦దట .వారి వారసుల వద్ద ఆ వీణ ఇప్పటికీ ఉందట .ఆ వీణకు ‘’యాళి’’అదో ముఖంగా కాక ఊర్ధ్వ ముఖంగా ఉండటం విశేషం .అంటే వీణ శిరస్సు కిందికి కాక పైకి ఉంటుందన్నమాట .
240-మైకుల్లేనికాలం లో దూరంగా ఉండేవారికీ వినబడాలని వైణికులు తంత్రులను బలంగా మీటేవారు .దీనివలన నాదం లోని అందం పోయేది .శివ మహా దేవుడు వీణ వాయించినట్లు త్యాగ బ్రహ్మ కీర్తనలో ఉంది .చాలామంది వీణ వాయించినా వారికే కీర్తి వచ్చిందికాని వీణకు రాలేదు .ఈమని వారు జన్మించి పరమేశ్వర వీణకు ఘనతను సాధించి పెట్టారు .వారు జన్మించి ఉండక పోతే ఇది సాధ్యమై ఉ౦డేదికాదంటారు ముదిగొండవారు .’’అన్ని వాద్యాల స్థాయిలో వీణను నిలబెట్టి ,కొత్త ఊపిరులూది ,నూతన జన్మ నిచ్చి ,సర్వ స్వతంత్ర ,సంపూర్ణ ,సమగ్ర ఘన వాద్యం గా నిలిపిన ఘనత మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి మహోదయులదే’’అన్నారు ఆచార్య ముదిగొండ .
241-‘’ఆర్కెస్ట్రాలో వెనక ఉండే దుర్దశ నుంచి తప్పించి దాన్ని ఉచ్చ స్థాయికి తెచ్చి ,గాత్ర ధర్మాల నన్నిటిలోను వీణను నిలిపి ,గాత్రం కంటే ఎక్కువగా వీణ మాధుర్యాన్ని నింపి ,సంగీత ప్రపంచాన్ని అమృత పానం చేయించిన సంగీత జగన్మోహిని యొక్క పుంభావ మూర్తి శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు ‘’అని విశ్లేషించి చెప్పారు ముదిగొండజీ .వీణ ను బయటి వస్తువుగా భావించక ,తన ‘’దేహాత్మ’’ లలో ఒకదానిగా ,తన ఆత్మగా ,అంతరాత్మ గా భావించి,దానితో లయించిన నాద యోగి ఈమని శాస్త్రీజీ .గాయకుని గొంతు కంఠంలో ఉంటే ,శాస్త్రి గారు తన గొంతును బయట ఉన్న వీణకు ఇచ్చి ప్రదర్శించారు .ఆయనలోని గొంతుకూ ఆయన ఒడి లోని వీణకూ భేదం లేనే లేదు .దీక్షితులవారు ‘’మీనాక్షి మేముదం దేహి ‘’అని పాడుతూ జగన్మాతలో లీనమైతే శంకర శాస్త్రిగారు నాలుగున్నర గంటల సేపు గుంటూరు లో వీణ కచేరి చేసి ,ఆజ్ఞాపక లహరీ ప్రవాహం మనసు నిండా నింపుకొని అదే రోజు రైలులో ప్రయాణం చేస్తూ అనంత వాయువులలో తన ప్రాణ వాయువును లయింప జేసుకొన్నారు .వారి ప్రక్కనే వారి వీణ కూడా ఉంది .ప్రాణోత్క్రమణ కు ముందు చాలా కాలంగా వారు తమ వీణ తో మాట్లాడుతూ ఉండేవారట .ఆ మాటల్లో సారాంశం ‘’నేను ఎప్పుడు చెబితే అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు ‘’అని .వీణ వారికి జడపదార్ధం కాదు .అది ఆయనలోని సరస్వతీ మాత .వీణలో ఆవాహనమైన ఆ దేవతా మూర్తినే దర్శించేవారాయన .పేరుకే కాక నిజంగానే భోళా శంకరులే శంకర శాస్త్రి గారు .వీణ మీద ఈషణ్మాత్ర తిరస్కృతి కూడా వారు సహించేవారు కాదు .ఒక సంగీత విమర్శకుడు ఒక సారి ఆయనతో చమత్కారంగా ‘’అయ్యా !ఇప్పుడు సరస్వతీ దేవి వీణ ను వదిలేసి ,అంతకన్నా సౌఖ్యమూ ,ఎక్కువ సౌలభ్యమూ ,వేగ సిద్ధీ ఉన్న వయోలిన్ ను పట్టుకోన్నట్లుంది ‘’అంటే శాస్త్రిగారు ఆయన వైపు ‘’గుడ్లురిమి ‘’చూశారట .వీణ అంటే వారికి అంతటి నిబద్ధత .శాస్త్రిగారికి ముందుకాలం లో వీణను విద్వాంసులు కష్టం అనుకోని వేగంగా వాయించేవారు కాదు .ఆ లోటును పూడ్చి శాస్త్రిగారు మహా వేగంగా వాయించి యెంత తేలికో రుజువు చేశారు .సరోద్ వాయించే అమ్జాద్ ఆలీఖాన్ కు వేగంగా వాయించటం మహా ఇష్టం .అలాంటి ఖాన్ సాబ్ తో శాస్త్రి గారు వీణతో యుగళం వాయించి ప్రపంచ శ్రోతలనే మెప్పించారు .వారి సాధన ,ప్రయోగం అంతటివి.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-10-8-16-ఉయ్యూరు

