వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -9
మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-2
మాఘకవి శిశుపాల వధ కావ్య వ్యాఖ్య ప్రారంభిస్తూ మల్లినాధుడు ఇందీవర శ్యాముడు ,ఇందిరానంద కారుడు వందారు జన మందారుడైన యదునందనునికి నమస్కరించి ,వప్ర క్రీడా విలాసాలలో దంతాగ్రాలతో ధరణిని గ్రుచ్చి ఎత్తి ఆదివరాహం లాగా కనిపిస్తూ ఉల్లాఘ ఉత్ఫణ ఫణాధర గరీయ మాన క్రీడా వదానుడైన ఇభరాజవదనుని ప్రార్చించాడు తర్వాత శారదాంభోజ వదన ,సన్నిధి ,సర్వద అయిన శారద తన వదనా౦బుజ౦ న సర్వ కామదయై సర్వదా సన్నిధి చేసేట్లు సరస్వతీదేవిని స్తుతించాడు. తరువాత ‘’వాణీం కాణ భుజీం ‘’శ్లోకం లో తన శాస్త్ర పరిచయాన్ని వ్యాఖ్యాన అర్హతను సాధికారంగా వెల్లడించి ,మహోపాధ్యాయ బిరుదున్న ఈ మల్లినాధసూరి మాఘ కావ్యానికి సర్వం కష వ్యాఖ్యానాన్ని రచిస్తున్నానని ,నామ నిర్దేశ పూర్వకంగా వివరించాడు .కావ్య అవతారిక నుండి మరో రెండు మల్లినాధుని శ్లోకాలు –దంతా౦చలేన ధరణీతల మున్నమయ్య –పాతాళ కేళిషు ద్రుతాది వరాహ లీలం
ఉల్లాఘనోత్ఫణ ఫణాదరగీయమాన –క్రీడావదాన మిభ రాజ ముఖం నమామి ‘’
‘’మల్లినాద సుదీస్సో య౦ మహోపాధ్యాయ శబ్దభాక్ -విధత్తే మాఘ కావ్యస్య వ్యాఖ్యాం సర్వం కషా భిధాం’’
తన వ్యాఖ్యాన సమగ్రత్వాన్ని ,రసభావ ధ్వని ,అలంకారాది సర్వ విషయ ప్రతిపాదికత్వాన్ని ప్రకటిస్తూ మల్లినాధుడు ఈ కింది విధంగా చెప్పుకొన్నాడు –
‘’ఏ శబ్దార్ధ పరీక్షణ ప్రణయినో ఏవా గుణాలంక్రియా –శిక్షా కౌతికినో విహుర్తు మనసో యేచ ధ్వనేరధ్వని
క్షుభ్యద్భావ తరంగితే రస సుధా పూరే మిమంక్షంతి యే- తేషామేవ కృతే కరోమి వికృతిం మాఘస్య సర్వంకషాం’’
దీనిభావం –ఎవరు శబ్దార్దాల సందర్భ శుద్ధి ఔచిత్యాన్ని పరిశీలించటానికి ఇష్ట పడతారో,ఎవరు గుణాల అలంకార లోతులను సమన్వయ విశేషాలను తెలుసుకోవటానికి ఉత్సాహ పడతారో ,ఎవరు ధ్వని ప్రస్తానం లో విహరించటానికి మనసు పడుతారో ,ఎవరు ఉవ్వెత్తున లేచే భావ తరంగాలుగల రసామృత సముద్రములో మునకలు వేయటానికి ఉరుకు లెత్తుతారో ,వారంద కోసమే ఈ ‘’సర్వం కష ‘’ను రచిస్తున్నాను ‘’అని వ్యాఖ్యానం యొక్క ప్రాశస్త్యాన్ని వివరించాడు .దీన్ని బట్టి ఇతర కావ్య వ్యాఖ్యానాలు చేయటం కంటే మల్లినాధుడు దీని వ్యాఖ్యానం రాయటానికి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోన్నాడని తెలుస్తోంది .
సూరి లేఖినీ నర్తన విన్నాణాన్ని నిపుణ౦ గా పరిశీలిస్తే –మేఘ సందేశ ,శిశుపాల వధ వ్యాఖ్యానాలు రెండు గ్రంథస్త విషయాన్ని బట్టి ,అనేక అంశాలు ,అనేక రహస్యాలు తెలియ జేయటం లో ఉదాత్తం అని పిస్తాయి .ఎన్నో శాస్త్ర పరిశీలనం చేసి ,సప్రమాణంగా ఆయా సందర్భాలను పరిష్కరించటం లో మల్లి నాధుడు ఈ కావ్య ద్వయ వ్యాఖ్య రచన కోసం ఎన్నో ఏళ్ళు చాలా కస్ట పడ్డాడని తెలుస్తోంది .అందుకే ‘’మాఘే మేఘే గతం వయః ‘’అని ఆయనే చెప్పిన మాట వలన అర్ధమౌతోంది అని చెరువువారు శ్రీ గరిమెళ్ళ వారి వ్యాఖ్యానం లో పేర్కొన్నట్లు తెలియ జేశారు .
అప్పటికే పంచకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి మల్లినాధుడు ముదుసలి అయ్యాడు .నైషదానికి కూడా వ్యాఖ్య రాయాలని కోరిక కలిగింది .జరా భారం తోజారిపోతున్న కనుబొమలను దారం తో ఎత్తి కట్టుకొని ,తాళ పత్ర గ్రంధాలను తడివి తడివి చదువుతూ ,శిష్యులచే చదివించు కొంటు వ్యాఖ్యానం చేశాడని ,మిత్రులెవరో ఇంతకాలం ఏం చేశావు ,ఇంత శ్రమ చేసి ఇప్పుడు రాయటం ఎందుకు అని ప్రశ్నించి ఉంటారని అందుకే ‘’మాఘానికి ,మేఘానికి వ్యాఖ్యానాలు రాయటం లో నా ఆయుర్దాయం చాలా భాగం గడిచి పోయింది ‘’అని చెప్పి ఉంటాడని విజ్ఞులు భావిస్తున్నారు .నిజంగానే ఆ వ్యాఖ్యల గొప్పతనం అంతటిది .ప్రబంధ ధ్వని కి ఉదాహరణమైన నైషదానికి చేసిన వ్యాఖ్యానం కూడా అసామాన్యమైనదే .తన పంచ కావ్య వ్యాఖ్యానాలను చదివిన వారికి ,అందులో సర్వంకషాధ్యయనం చేసిన వారికి నైషధం లోని సర్వార్ధ రహస్యాలు తేలికగా గ్రహించ గలరనే నమ్మకం తో నైషద వ్యాఖ్య ‘’జీవాతువు ‘’ను క్లుప్తంగా రాశాడని పండితాభిప్రాయం .
మాఘ కావ్యం లోని విశిస్టత,,పరిపాకం ,అర్ధ నిర్భరత ,విషయ బాహుళ్యం ,అనేక శాస్త్ర పరిచయం ,కదా సంవిధాన వైచిత్రి, అపూర్వ వర్ణనా విస్ఫూర్తి ఆ కావ్యం మీద గౌరవాన్ని పెంచుతాయి. కనుక అతి శ్రద్ధగా ఈ కావ్యాన్ని ,కావ్య కర్తను సూరి మనసారా శ్లాఘించాడు –
‘’నేతాస్మిన్ యదు నందన స్స భగవాన్ వీరః ప్రదానో రసః –శృంగారాది భిరంగవాన్ విజయతే పూర్ణా పునర్వర్ణనా’’
‘’ఇంద్ర ప్రస్థగమాద్యుపా య విషయః చైద్యా వ సాదః ఫలం –ధన్యో మాఘ కవిః వయం చ కృతినః తత్సూక్తి సంసేవనాత్ ‘’ ఇంత మెచ్చుకొన్న మాఘ కావ్యం శిశుపాల వధ కు చేసిన’’ సర్వం కష’’ వ్యాఖ్య లో ఏ ఏ విషయాలను ,ఏయే విధంగా సమన్వయము చేసి దీనికి అంతటి గౌరావాన్ని సంపాదించాడో తెలుసుకోవాల్సిందే .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-16 –ఉయ్యూరు

