వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -10
మల్లినాధుడు వ్యాఖ్యాన ప్రారంభం ఎలా చేశాడు ?-3
శిశుపాల వధ పై మల్లినాధుని ‘’కూలంకష ‘’వ్యాఖ్యానాన్ని కూలంకషంగా తెల్సుకొందాం .మల్లినాధుడు నిష్పాక్ష పాత౦ గా గుణ దోషాలను విమర్శిస్తాడు .సాధుత్వ అసాదుత్వాలను ప్రమాణ పూర్వకం గా సిద్దాన్తీకరిస్తాడు .తప్పు ఉంటె చెప్పటానికి వెనుకాడడు .సాధ్యమైనంతవరకు కవి పోకడను సమర్ధిస్తాడు .కవి ప్రయోగం ఏవిధంగా సమర్ధనీయం కాదో ,చెప్పి దుస్సాధనం అనిపిస్తే ఖండిస్తాడు .ఇతర వ్యాఖ్యాతల అపోహల్ని దురభిప్రాయాలను అప వ్యాఖ్యానాలను అక్కడక్కడ ప్రస్తావించి నిరాకరిస్తాడు .దోషాలను చెప్పేవాడేకాని ,మల్లినాధుడు దోషాలనే వెతకాలనే రంధ్రా న్వేషకుడు కాదని గ్రహించాలి .విచక్షణతో పాటు సౌజన్యం మూర్తీభవించిన వ్యాఖ్యాత .’’వ్యాఖ్యానతో విశేష ప్రతి పత్తిః’’అన్నట్లు గ్రంధం లోని విశేషాలను తెలియ జేస్తూ ,దానికి అనుబంధంగా వ్యాఖ్యానం నడిపిస్తాడు .ఇవన్నీ పూర్వం మనం తెలుసుకోన్నవే .అవికాక సర్వం కష లో మిగిలిన విషయాలను తెలుసుకొందాం .
ఆకాశం నుంచి కిందకు దిగి వచ్చే తేజో రాశిగా నారద మహర్షి ని వర్ణిస్తూ మాఘకవి ‘’క్రమాదముం నారద ఇత్యభి బోధిస ‘’అని వర్ణించాడు కర్మవాచాకమైన నారద శబ్దం రెండవదిగా రావాల్సి ఉంటె ‘’ఇతి ‘’అనే దానితో చెప్పబడటం తో కర్మత్వం రాలేదని ‘’నిపాతే నాభిహితే కర్మాణి న కర్మ విభక్తిః’’అనే వామనుని సూత్రాన్ని సూచించి మల్లినాధుడు సమర్ధించాడు .
’’రణద్భి రాఘట్టనయానభస్వతః ప్రుధగ్వి భిన్న శ్రుతి మన్దలైః స్వరైః’—స్ఫుటీ భవద్గ్రామ విశేష మూర్చనా మవేక్ష మాణం మహతీం ముహుర్ముహుః’’అన్న శ్లోకం లో సంగీత విషయాలను కూలంకషంగా చర్చించి వెలుగు లోకి తెచ్చాడు .అవసరమైనంతవరకే గ్రహించి ‘’తత్రేహ నామాని తు-నాపేక్షిత ముచ్యతే –ఇతి ప్రతిజ్ఞా భంగ భయాన్నలిఖ౦త ఇతి ‘సర్వ మదాతం’’అని అందంగా ముగించాడని చెరువు వారు ఉవాచ . ద్వారకకు వచ్చే నారదుని వర్ణనలో మాఘుడు రాసిన శ్లోకాలను వ్యాఖ్యానిస్తూ మల్లినాధుడు ఆ శ్లోకం లోశ్రుతి స్వర గ్రామ మూర్చనాది సంగీత శాస్త్ర పారిభాషికాలను అను సందానించాడు .నారదుని వీణ మహతి .స్వర ప్రారంభం లో ప్రధమ శ్రావణ రూప హ్రస్వ మాత్ర శబ్ద విశేషాన్ని శ్రుతి అని ,శ్రుతి తర్వాత అనురణన ధ్వనికి స్వరమని ,స్వరాలు ఏడు అని ,స్వర సందోహాన్ని గ్రామం అంటారని ,నంద్యా వర్త ,జీమూత ,సుభద్ర అనే మూడు గ్రామాలకు షడ్జ ,మధ్యమ ,గాంధారాలు జన్మ హేతువులుగా ప్రసిద్ధాలని ,మూడు గ్రామాలలో ముఖ్యం గా ఏడేడు మూర్చనలు ఏర్పడగా మొత్తం 21 మూర్చనలు అవుతాయని ,ఇన్ని పారి భాషిక పదాలను నారద వర్ణనలో మాఘకవి తన సంగీత అభిజ్ఞాతను చాటుకున్నాడు. ఆ లోతుల్ని మల్లినాధుడు వెలికి తీసి వ్యాఖ్యానించాడు .
ఏకాదశ సర్గ లో వైతాళికులు శ్రీ కృష్ణుని మేలు కొలుపు పాడే సందర్భం లో శ్లోకాలోనూ సంగీత ప్రస్తావన ఉంది –
‘’శ్రుతి సమధిక ముచ్చైః పంచమం పీడ యంతః –సతత మ్రుషభహీనం భిన్నకీ కృత్య షడ్జమం
ప్రణి జగదు రకాకు శ్రావక స్నిగ్ధ కంఠాః–పరిణతి మితి రాత్రేః మాగాదా మాధవాయ ‘’
పంచమ ,ఋషభ,షడ్జ స్వరాలు వదిలేసి మిగిలిన స్వరాలతో కూడిన రాగ ప్రస్తారాలతో వంది మాగధులు సుప్రభాత గీతాలను పాడి మేలుకొలిపారు .షడ్జ ఋషభ షడ్జ స్వరాలు ప్రభాత సమయం లో ఉపయోగించ రాదు అని భరతమహర్షి చెప్పిన దాన్ని కవి బాగా అర్ధం చేసుకున్నాడని సూరి వ్యాఖ్య .
అలాగే మాఘ కవి కి ఉన్న నాట్య శాస్త్ర పాండిత్యాన్ని ,భరతుని ధనుంజయుని కవి ఎంత చక్కగా సమన్వయము చేసి రాశాడో వివరంగా తెలిపాడు .భోజనాలు నాటకాలులాగా ఉన్నాయని కవి రాశాడు .ఆ సంబంధం ఎలా ఉందొ సూరి వ్యాఖ్యానించాడు .అలాగే అలంకార కామ ,వైద్య ,ధనుర్వేద మంత్రం సాముద్రిక శకున ,రత్న ,గజ ,అశ్వ , శాస్త్రరహస్యాలన్నీ కవికి కరతలామలకాలు .వాటి లోతులను తరచి నిగ్గు తేల్చి చూపాడు సూరి ,మాఘ కావ్యం లో ప్రతి శ్లోకం లో ఏదో ఒక విశేషం ఉంటుంది .15 వ సర్గలో 34 శ్లోకాలు ప్రక్షిప్తాలు అనిపండితాభి ప్రాయం .శబ్దార్ధ శైలీ భావాలలో కూడా మిగిలిన కావ్యం కంటే తేడాలు కనిపిస్తాయి .వీటిలో స్తుతి ,నింద రెండు కూడా ఉన్నాయి .16 వ సర్గ లో అననుకూలమైన ప్రతికూల అర్ధ బోధకాలైన దూత వాక్యాలను వర్ణించే శ్లోకాలు పేలవం గా కావాలనే రాసినట్లున్నాయి.వల్లభ దేవుడు వీటికీ వ్యాఖ్యానం రాశాడు .కాని మల్లినాధుడు అవి మాఘ కవి రచన కానందున ‘’నా మూలం లిఖ్యతే కించిత్ ‘’అని తాను చేసిన ప్రతిజ్ఞననుసరించి వ్యాఖ్యానం చేయలేదు
‘’ప్రతి శరణమ శీర్ణ జ్యోతి రగ్న్యాహితానాం ‘’అనే శ్లోకానికి మీమా౦సా దర్శన పరిచయాన్ని విపులంగా రాశాడు .మల్లినాధుడు శ్రుతిమీమాంసా ప్రమాణాలతో శ్రౌత క్రియాదులను వివరిస్తూ సుదీర్ఘంగా వ్యాఖ్యానించి చివరికి ఇక ఈ చాందస గోస్టీ వ్యసనాన్ని చాల్లే పొమ్మని కొంటేతనంగా పూర్తీ చేశాడని చెరువువారి విశ్లేషణ .మల్లినాధుడు వ్యాకరణ ప్రక్రియను అంతటినీ సూత్రప్రదర్శన పూర్వకం గా వ్యాఖ్యానించి ‘’స సంతత౦ దర్శయతే గతస్మయః ‘’అనే కిరాతార్జునీయానికి రాసిన ఘంటా పద వ్యాఖ్యలో చక్కగా విచారించానని ,తాను వ్యాఖ్యానాలు రాసిన గ్రంధాలలో ఎక్కడెక్కడ అలాంటి ప్రయోగాలున్నాయో వాటిని సందర్భాను సారం గా చదువుకొనే వారికి తేలికగా ఉండేట్లు చేసి వ్యాఖ్యాతలకు ,విమర్శకులకు ఆదర్శ ప్రాయంగా మల్లినాద సూరి నిలిచాడు .
సశేషం
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-16 –ఉయ్యూరు

