18.11.2016
సాహిత్యాభిమానులైన మిత్రులకు,
శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ, గారి అభినందన లేఖా మకరందము
నమస్కారములు ! నేను ఈమధ్య ‘మా అన్నయ్య’ అనే కవితా సంకలనం మీద నేను రాసి పంపిన సమీక్షను మీరు చదివే ఉంటారు. అందులో ప్రస్తావించిన కొన్ని కవితా మకరందాలను ఆస్వాదించి, ప్రముఖ కవి, పండితులు, మిత్రులు శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ గారు తన సహృదయ స్పందనలను రెండు అందమైన కందాలలోనూ, ఒక ఆట వెలది లోనూ కవిత్వీకరించి నాకు పంపారు. ఆ అందాల కందాలనూ, బాలలా ఆటలాడిన ‘ఆట వెలది’ నీ ఈ క్రింద మీకందిస్తున్నాను. మనసుతో అందుకొని ఆనందిస్తారని ఆశిస్తున్నాను:
శ్రీ రామడుగు శర్మ గారు, గుంటూరు: 10.11.2016
కం !! “ గీతాంజలి మూర్తి” సఖా !!
మా తలపులయందు నిలువ “మా అన్నయ్యే”
చేత : ప్రీతిచే మీదగు
వ్రాతయె; “గబ్బిట” సఖుండె భాగ్యుండాయెన్ !!
కం !! “..అన్నయ్య” కవన సంకల
నోన్నతిని గురించి మీరలున్నతరీతిన్
‘అన్నన్న !’ – అనెడి విధముగ పన్నిన విశ్లేషణంబు బాగుండె సఖా !
“మా అన్నయ్య” ను గురించి:
ఆ.వే !! నాకె కాదు మా కుటుంబ జనాళి
కెల్ల వేళలందు చల్లనైన
జాడ; తోడు – నీడ, మేడ మా అన్నయ్య
గుర్తు వచ్చె; నివియె కోటి నతులు !!
అవ్యాజాభిమానంతో ఈ కవితలు రాసి పంపిన శర్మ గారికి శతథా నా హృదయపూర్వక ధన్యవాదములు.
– గీతాంజలి మూర్తి –