గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 )
29-9-1875 న కేరళలో వాడక్కేదతునారాయణ నంబూద్రి ,పాపికుట్టి పిశరస్యార్ దంపతులకు త్రిసూర్ జిల్లా అత్తూర్ అనే కుగ్రామం లో కృష్ణ పిశోరడి జన్మించాడు . స్వగ్రామ౦ లోనే ప్రాధమిక విద్య పూర్తీ చేసి మేనమామ భారత పిశోరడి ప్రేరణతో సంస్కృతం నేర్చాడు .తర్వాత వ్యాకరణం ,కావ్యాలలో వెలదాతు రామున్నినంబియార్ వద్ద నేర్చి పండితుడైనాడు .వెంగేరి వాసుదేవ నంబూద్రి అనే బాబాయ్ తన ఇంటికి ఆహ్వానించి అలంకార వ్యాకరణ న్యాయ శాస్త్రాలలో నిష్ణాతుని చేశాడు .చేరువంనూర్ సభామఠంలో వృద్ధ పెదనాన్న నిర్వ హించే వేద పాఠ శాల నిర్వహణలో రెండేళ్ళు సహాకయకుడుగా ఉన్నాడు .ఈ నిర్వహణ బాధ్యత ఇష్టం లేక దాచుకొన్న పాతిక రూపాయలతో కొడు౦గలూర్ కోవిలక్కం కు వెళ్ళిపోయాడు .
అప్పటికే అలంకార న్యాయ శాస్త్రాలావు ఉద్దండుడైన అత్తూర్ కృష్ణ భట్టాశ్రీ గోదావర్మ తమ్పురాన్ వద్ద న్యాయం లో ప్రత్త్యేక శిక్షణ పొందాడు .ఇక్కడ ఆయన జీవితాన్ని చక్కగా తీర్చి దిద్దుకున్నాడు .22వ ఏట పూర్ణ ప్రజ్ఞతో స్వగ్రామం చేరి సంస్కృత భాషను నేర్పటం ప్రారంభించాడు .తాను అద్దె కు ఉంటున్న ఇంటి యజమాని మూప్పి నాయరు కృష్ణ మొదటి శిష్యుడు .నాయర్ కు సంస్కృతం నేర్పుతూ ఆయనవద్ద వీణ నేర్చుకొన్నాడు .25 వ ఏట నన్ని కుట్టి ని వివాహమాడాడు .మామగారుభారత పిశోరడి గొప్ప వైణిక విద్వాంసుడు .కూతురూ మంచి వైణికురాలు .భార్య ,మామగారు వైణికులు అవటం తో అత్తూర్ వీణా సాధన అద్వితీయంగా సాగింది.వీరిఅన్యోన్య దాంపత్యం 56 ఏళ్ళునిరాఘాటం గా కొనసాగింది .తరువాత భార్య మరణించింది .
అలట్టూర్ హై స్కూల్ లో టీచర్ గా జీవితం ప్రారంభించి ,తర్వాత 5 ఏళ్ళు త్రిసూర్ లోని భారత విలాసం ప్రెస్ లో పని చేశాడు .కేరళ పాణిని బిరుదాంకితుడైన ఎ.రాజరాజ వర్మ ఆహ్వానం పై తిరువనంతపురం మహా రాజా కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ గా వర్మ స్థానం లో చేరాడు . ఓరియెంటల్ డిపార్ట్ మెంట్ కు 16 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నాడు .19 27 లో తిరువాన్కూర్ మహారాజుకు ట్యూటర్ గా నియమింపబడి అయిదేళ్ళున్నాడు . పదవీ విరమణతర్వాత స్వగ్రామం త్రిస్సూర్ వెళ్లి అనుక్షణ వ్యాపకం తో సుఖ జీవనం గడిపాడు . ‘’శ్రీ తిలకం ‘’అనే స్వగృహం నిర్మించుకొని దానిని సంగీత గురుకులంగా నిర్వహించి ఎందరికో సంగీత విద్య నేర్పాడు . కవి, సంగీతకారుడు ,నాటక రచయితా ,వ్యాసరచయిత మహా విద్వాంసుడు,పరిశోధకుడు సంస్కృత ,మళయాళ భాషా పండితుడు అయిన కృష్ణ’’విద్యాధనం సర్వ ధన ప్రధానం ‘’అనే సూక్తిని ‘’విద్యా దదాతి వినయం ‘’అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినవాడు .వినయ౦ ,సర్వోత్కృష్ట గుణ సంపన్నుడు .నేర్పటం ఎంత ఇష్టమో ఇతరుల వద్ద నేర్చుకోవటమూ ఆయనకు అంతే ఇష్టం అని గురువు కె.పి నారాయణ పిశోరడి అన్నమాటలు పూర్తీ సత్యాలు .
భారత విలాసం ప్రెస్ లో పని చేసినప్పుడు ‘’మణి దీపిక ‘’పై వ్రాసిన సమీక్ష రాజరాజ వర్మ దృష్టిలో పడి మహా రాజా కాలేజి కి ఆహ్వానించాడు .రాజరాజ వర్మవద్ద పరిశోధనకు సంబంధించిన మెళకువలు గ్రహించాడు .భాస నాటకాలను వెలికి తీసి ప్రచురించిన గణపతి శాస్త్రి తో పరిచయం మంచి మార్పు తెచ్చింది .ప్రాధమిక వ్యాకరణ గ్రంధం ‘’బాలరత్నం ‘’రాసి ,చారిత్రిక భాషా సాహిత్య గ్రంధంగా ‘’లీలాతిలకం ‘’రచించాడు .అనేక విషయాలపై బహు గ్రంధాలు రాశాడు .’’రసిక రత్నం’’జర్నల్ స్థాపించి వెలుగు చూడని ఎన్నో కావ్యాలను వెలుగులోకి తెచ్చాడు .మహాకవి కాళిదాసు శాకుంతల నాటకం ను ‘’కేరళ శాకుంతలం ‘’గా 1937 లో రాసి ప్రచురించాడు . దీన్ని మెచ్చిన కొచ్చిన్ మహారాజు ‘’పండిత రాజ ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .
ఆయన ప్రతిభా సర్వస్వం గా సంగీతం పై అనేక సంవత్సరాలు పరిశోధన చేసి రచించిన ‘’సంగీత చంద్రిక ‘’1954 లో ప్రచురించాడు.12అధ్యాయాలతో 700పేజీలున్న బృహత్ గ్రంథమిది .ఇందులో నాద, శ్రుతి స్వర ,వీణ గ్రామ మూర్చన ,మేళ తాళ , వర్ణాలంకార , గమకస్థాయి ,,ప్రబంధ రాగ ,గీత అధ్యాయాలున్నాయి .1728 సూత్రాలకు మూలం, సూత్ర భాష్యం రాశాడు .చివరి అధ్యాయం’’ గీత ‘’లో రామాయణానికి సంబంధించిన కధలకు చెందిన 443 గీతాలు దేనికది ప్రత్యేక రాగ౦ ,,తాళం లో న్నాయి .వీటికి సాహిత్యం స్వరమూ కూడా కూర్చాడు . .గ్రంధం అద్భుత విశ్లేషణాత్మక వివరణ గా ప్రత్యేకంగా రూపొందించాడు .ఇందులో భరతుని నుంచి ఆధునిక కాలం వారి వరకు ఉన్న వారి వ్యాఖ్యానాలన్నీ పొందు పరచాడు .
పిశోరడి రచనలు –సంగీత చంద్రిక ,భాష్యువుం ,సాహిత్యవుం ,కేరళ సాహిత్య చరితం ,కేరళ చరితం ,విద్యా వివేకం ,భాష దర్పణం ,ఉత్తర రామాయణం (అనువాదం ),శాకుంతలం (అనువాదం )లీలాతిలకం -వ్యాఖ్య .జీవిత౦ లో చివరి రోజు వరకు సాహిత్య సంగీత కృషి చేస్తూనే 5-6-1964 న స్వగృహం ‘’శ్రీతిలకం ‘’లో బంధు మిత్రులందరి సమక్షం లో 89 వ ఏట మహా సంస్కృత సంగీత విద్వాంసుడు అత్తూర్ కృష్ణ పిశరోడి శ్రీ కృష్ణ లోకానికి చేరుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-2-17 –ఉయ్యూరు
.