పద్యానికి ‘’బ్రహ్మ రధం ‘’పట్టిన పద్య కవితా బ్రహ్మోత్సవాలు_
పద్యం అవుట్ డేటెడ్ దానికి మనుగడ లేదు అనే అభిప్రాయాన్ని మార్చాలన్న ఆలోచనతో ,పద్యానికి పునర్ వైభవం కల్పించాలన్న సదుద్దేశ్యం తో ,యువకులలో పద్యం పై మక్కువ కలిగించాలన్న ధ్యేయం తో ఆంద్ర ప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ,ఆంద్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ,దివి ఐతిహాసిక మండలి సంయుక్త ఆధ్వర్యం లో ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి పూనిక ,ప్రేరణతో ,ఆంధ్రుల తొలి రాజధాని ,తెలుగు భాషకు మాత్రమే ఉన్నఒకే ఒక దేవుడైన ఆంధ్ర మహా విష్ణువు దేవాలయం లో తెలుగు భాషా సంస్కృతులకు ఇతోధికంగా తోడ్పడిన ఆముక్త మాల్యద రచనకు స్వీకారం చుట్టిన ఆంద్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వ భౌముడైన శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహ సమక్షం లో ఫిబ్రవరి 18 19 శని ఆదివారాలలో శ్రీ కృష్ణ దేవరాయ మహోత్సవం లో భాగం గా రెండు రోజుల’’ తెలుగు కవితా బ్రహ్మోత్సవాలు’’ జరిగాయి . పద్యం హోరులో స్తబ్దత దూరానికేక్కడికో కొట్టుకు పోయింది .పిలిస్తే పద్యం, పలకరిస్తే పద్యం గా సాగింది .రెండు రోజుల్లోనూ కనీసం 130 మంది లబ్ధ ప్రతిష్టు లైన కవులు నవ్యాంధ్ర లో ఉన్న 13 జిల్లాల నుండి వచ్చిపాల్గొన్నారు అంటే దీని విజయానికి అంతకంటే నిదర్శనం ఏమి కావాలి ?ఈ మొత్తం కార్యక్రమానికి సమన్వయ కర్తగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డాజి వి పూర్ణ చంద్ వ్యవహరించి సర్వ సమర్ధతతో నిర్వహించారు .దీనికి సాంస్కృతిక శాఖ కార్య దర్శి ప్రముఖ రచయిత శ్రీ డి.విజయభాస్కర్ తోడ్పాటు మిక్కిలి శ్లాఘనీయం .
మొదటి రోజు 18 వ తేదీ శనివారం ఉదయం శ్రీ విజయభాస్కర్ ఆహ్వానం ,సమన్వయము తో సభ జరిగింది .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి ప్రారంభోపన్యాసం అందరినీ ఆకర్షించింది శ్రీకాకుళం ప్రాశస్త్యాన్ని ,పద్య వైభవం ఆవశ్యకతను చక్కగా వివరించారు ,ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చిన రాజప్ప్ప సభా ప్రారంభం చేశారు .జ్ఞానపీఠ మూర్తి దేవి పురస్కార గ్రహీత ఆచార్య శ్రీ కొలకలూరి ఇనాక్ గారికి మంత్రి గారి చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది .ఆత్మ కూరి మొల్ల రాసిన రామాయణం కు శ్రీ మున్నెల్లి శివ శంకరయ్య ,శ్రీమతి దగ్గుపాటి శ్రీదేవి రచించిన వ్యాఖ్యానం ను శ్రీ ఐలాపురం వెంకయ్య ఆవిష్కరించారు .శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఉత్సవ విశేషాలను వివరించారు .పద్య కవితగా కావ్యమో నాటకమో ,ప్రబంధమో రాసిన కవులకు గోప్పపారితోశికం తోపాటు ప్రభుత్వమే ప్రచురణ బాధ్యతా చేబడు తుంది అని అందరూ ప్రకటించటం కవులకు గొప్ప ఊరట ప్రేరణ ,స్పూర్తి గా ఉంది.
తరువాత అవధాన సరస్వతి శ్రీ పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ ఆధ్వర్యం లో 40 మంది కవులు తాము రచించిన పద్యాలను గానం చేసి మెప్పించారు .భోజన విరామం తరువాత మరో 30 మందికవుల పద్య గానం జరిగి .అందరినీ అలరించింది .కవులందరికీ శాలువాలతో శ్రీ బుద్ధప్ర సాద్,శ్రీ విజయ భాస్కర్ లు సత్కరించి ఆంద్ర మహా విష్ణువు జ్ఞాపికను ‘’కృష్ణా తీరం ‘’బృహత్ గ్రంధాన్ని కానుకగా అంద జేశారు . సాయంత్రం కళారత్న ,నాట్యా చర్య శ్రీ కె వి సత్యనారాయణ బృందం ‘’శ్రీ కృష్ణ దేవరాయ గోసంగి ‘’కూచి పూడి నృత్య రూపకం ప్రదర్శించారు .విద్యార్ధినీ విద్యార్ధులు స్థానికులు ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేశారు .డప్పు కోలాటం రంగ వల్లి ప్రదర్శన ఆకర్షనీయం గా ఉన్నాయి .దేవాలయం లో గోదాదేవి మూర్తి ఉండాలన్నఒక కవి సూచనను అందరూ సమర్ధించారు .నన్ను పద్యం రాయమని శ్రీ పూర్ణ చంద్ ప్రోత్సహించాగా 5 ఆటవెలదులతో సయ్యాట లాడి శ్రీ రామ లక్ష్మణాచార్యులగారిచే పరిష్కరింప జేసి ‘’ముదిమి వయసున ఆటవెలది తో సయ్యాట ‘’శీర్షిక గా చదివి ఒకప్పుడు శ్రీకుళానికి ప్రసిద్ధి తెచ్చిన ఆటవెలదులు అంటే దేవ దాసీలకు పద్య పంచ రత్నాలను అంకితం చేస్తున్నట్లు ప్రకటించాను .బహుశా వారిని ‘’వాడు కున్న వారే ‘’కాని వారికి అంకిత మిచ్చిన వారెవ్వరూ ఉండి ఉండరు .నేనే ‘’ఆ పని ‘’అంటే అంకితం చేశాను .
19- వ తేదీ రెండవ నాటి కార్యక్రమం లో శ్రీ తిరుమల శ్రీని వాసా చార్య ప్రసంగం ఆసాంతం ఆహ్లాదంగా విషయ వివరణ పరంగా రాయల మహత్తర శక్తి కి దర్పణం గా సాగింది. వారి పద్యాలు చాలా రస స్పూర్తిగా ఉన్నాయి .60 మందికవులు పద్య కవితలు వినిపించి సత్కారం అందుకున్నారు .భోజనానతరం మంత్రులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి శ్రీ పైడి కొండల మాణిక్యాల రావు పాల్గొని దిశా నిర్దేశం చేశారు .శ్రీగుమ్మడి గోపాలకృష్ణ ,శ్రీ అన్నవరపు రామస్వామిగార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .శ్రీ ఉమా గారి ప్రేరణతో నే మర్నాడు 20 వ తేది సోమవారం కవులందరం పోలవరం టూర్ చేశాం .సాయంత్రం 4 గం లకు శ్రీమతి పుల్లా భొట్ల శాంతి స్వరూప్ ,శ్రీతాతా సంజీవ శర్మ లు యువ జంట అష్టావధానం నిర్వహించారు .ఆశువు స్థానం లో నేను ‘’104 ఉపగ్రహాల ను ప్రయోగించిన రాకెట్టు ,దాన్ని నిర్మించి ప్రయోగించిన శాస్త్ర సాంకేతిక నిపుణులపై ‘’రాకెట్ వేగం తో నడిచే పద్యం చెప్పమని అడిగితే ద్విపదలో చెప్పారు .పంచచామరం లో చెబితే అదిరేది .మరోఆశువుగా ఈ పద్య బ్రహోత్సవాలను తిరుమల వేంకటేశ్వరుడు తన బ్రహోత్సవాలతో పోల్చుకొని ఎలా ఆనంది౦ చాడో చెప్పమని అడిగాను. మంచి పద్యమే చెప్పారు .ఈ అవధానం లో ఘంటా నాదం చాలా ప్రత్యేకంగా ఉంది .ఒక పృచ్చకుడు సుమారు 10 అక్షరాల వాక్యం ఇస్తే ఒక అవధాని దాన్ని పళ్ళెం మీద గరిటె తో కొడితే దాన్ని విని మరో అవధాని ఆ మాటలను తెలియ జేయాలి .బాగా చేశారు ఇద్దరూ. అప్రస్తుతం కొంచెం డోసు మించినా బాగుంది .మంచి అవధానం చూశామన్న సంతృప్తి అందరికి కలిగింది . శ్రీ మీగడ రామస్వామిగారి ప్రత్యేక రాగాలతో చేసిన పద్యగానం గొప్ప ఆకర్షణ .ఈ రెండు అవధానాలతో ‘’పద్యకవితా బ్రహ్మోత్సవం’’ ,’’పద్య కవితా మహా బ్రహ్మోత్సవం’’గా మారి మహాద్భుతమైన విజయాన్ని చేకూర్చింది .పూర్వ కవుల ముఖ్యమైన పద్యాలను సేకరించి మీగడ రామస్వామి వంటి గాయకులతో స్వర రాగ యుక్తంగా గానం చేయించి సి డి.లుగా తెచ్చి భవిషత్ తరాలకు భద్రపరచాలన్న సూచన అందరికి ఆమోద యోగ్యమైంది .అమలు జరగాలని ఆశిద్దాం దివి సీమ ముడుబిడ్డ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి వేటూరి రాసిన దివిసీమ జాతీయ గీతాన్ని గానం చేసి సి డి విడుదల చేయించారు భగవద్గీతా గానమూ చేశారు. చివరగా కుమారి అంబిక నృత్య ప్రదర్శన తో కార్యక్రమాలు పూర్తీ అయ్యాయి . కొస మెరుపు –మొదటి రోజు కాఫీ టిఫిన్లు బాగానే ఉన్నాయి మధ్యలో మజ్జిగా ఇచ్చారు .సాయంత్రం వేదికపై ఉన్న అతిదులకే కాని కవులకు కనీసం టీ కూడా ఇవ్వలేదు .బిస్కట్లూ లేవు .ఉదయం కాఫీ కూడా కొద్దిమందికే అందాయి .రెండవ రోజు ధద్ధ్యోజనం ,పులిహారే టిఫిన్లు బాగా లేవు .శ్రీకాకుళం అంటే చక్ర పొంగలికి ప్రసిద్ధి .దాని రుచికాదు కదా వాసన కూడా తగల క పోవటం పెద్ద లోపం . కాఫీ అసలు లేదు .కాఫీ గత ప్రాణులు చాలా ఇబ్బంది పడ్డారు .మధ్యాహ్నం భోజనం స్వీటు హాట్ తో బాగానే ఉంది .ఆ తర్వాత కవులను పట్టించుకున్న నాధుడు లేడు.ఎండ వేడిభరించలేనిది .మజ్జిగ ఇస్తే ముసలి ప్రాణాలకు ఊరటగా ఉండేది .సాయంత్రం టీ కాని ,స్నాక్స్ కాని’’ గెస్ట్ ఆఫ్ ఆనర్’’ లకు తప్ప ఎవరికీ లేవు .ఇలా ఏ సాహితీ సభలోనూ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు .కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించే జాతీయ ,అంతర్జాతీయ సభలలో ఎవరికీ ఏ లోటూ ఉండేదికాదు .ఇలా ఇక్కడ జరుగ కుండా ఉండాల్సింది .ఇవి చంద్రునిలో చిరుమచ్చలే.చంద్రుని ఆహ్లాద వెన్నెల ముందు ఇవి లెక్కలోకి రావు .
ఇంతటిభారీ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించిన వారందరికీ అభినందనలు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-17 –ఉయ్యూరు