ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

రోసికా ష్విమ్మర్ అని అందరూ పిలిచే రోసికా బడ్డీ ష్విమ్మర్ 11-9-1877 న హంగేరి లోని బుడా పెస్ట్ లో జ్యూయిష్ కుటంబం లో జన్మించిన ఫసిఫిస్ట్ ఫెమినిస్ట్ ,మహిళా ఓటు హక్కు ఉద్యమకారిణి .ప్రపంచ ప్రధమ మహిళా ఫెడరలిస్ట్ గా గుర్తింపు పొందింది .భాషా శాస్త్రాలను సంగీతాన్ని ఇష్టపడి చదివింది .కాని కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఛిన్నా భిన్నమవటం తో బుక్ కీపర్ గా ఉద్యోగం చేయాల్సి వచ్చింది .మంచి విషయాలపై ఆసక్తి ఉండటం వలన ,స్త్రీలకు జరుగుతన్న అన్యాయాలు ఆమె దృష్టి లో పడి మహిళాభ్యుదయానికి సేవ చేయాలని నిశ్చయించు కొన్నది.
1897 లో ఇరవై ఏళ్ళ వయసులోనే ‘’హంగేరియన్ వుమెన్ క్లెర్క్స్ అసోసియేషన్’’ ను నిర్వహించింది . ఏడేళ్ళ తర్వాత 1904 లో ‘’హంగేరియన్ ఫెమినిస్ట్ అసోసియేషన్ ‘’స్థాపించి ,’’హంగేరియన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ ‘’స్థాపనకు సహకరించింది . హంగేరియన్ పీస్ సొసైటి బోర్డ్ మెంబర్ అయింది .1909 లో హంగేరి ప్రభుత్వం ష్విమ్మర్ కు చైల్డ్ వెల్ఫేర్ గవర్నింగ్ బోర్డ్ లో పదవి నిచ్చి గౌరవించింది .
1913 లో ‘’ఇంటర్ నేషనల్ వుమన్ సఫ్రేజ్ అలయన్స్( ‘’ఐ .డబ్ల్యు. ఎస్ .ఎ.)కు కరెస్పాండింగ్ సెక్రెటరి అయింది .కారీ చాప్ మాన్ కాట్ తో యూరప్ అంతా విస్తృతంగా పర్యటించి మహిళా ఓటు హక్కు ప్రాధాన్యం పై అనేక బహిరంగ సభలలో ప్రసంగించి విషయాన్ని ప్రపంచ దృష్టి కి తెచ్చింది . ’’ఆనో ‘’(మహిళ)అనే మేగజైన్ కు సంపాదకత్వం వహించింది . 1914 లో లండన్ కు వెళ్లి అక్కడ చాలా ఐరోపా వార్తా పత్రికలకు కరెస్పా౦డెంట్ గా పని చేసింది . తర్వాత ఐ .డబ్ల్యు. ఎస్. ఏ. కు ప్రెస్ సెక్రెటరి అయింది .మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవటం తో స్వదేశానికి రాలేక పోయింది .ఘర్షణల నివారణకు ఉద్యమించింది .1914 లో అమెరికా పర్యటించి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ ను కలిసి యుద్ధ నివారణకు ఒక తటస్థ సమావేశాన్ని నిర్వహించమని డిమాండ్ చేసింది .1915 లో ‘’వుమెన్స్ పీస్ పార్టి ‘’స్థాపనకు కృషి చేసింది .
నెదర్ లాండ్ దేశం లోని ‘’ది హేగ్ ‘’లో 1915 లో ఏప్రిల్ 28 నుండి మే 10 వరకు జరిగిన ‘’ఇంటర్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ వుమెన్ ‘’సదస్సులో యుద్ధం లో పాల్గొంటున్న దేశాలమధ్య ఘర్షణ నివారణకోస౦ ష్విమ్మర్ ప్రవేశ పెట్టిన ‘’న్యూట్రల్ కాన్ఫరెన్స్ ఫర్ కంటిన్యుయస్ మీడియేషన్ ‘’తీర్మానం ఆమోదింపబడి ఆమె స్పందనకు విశేష గౌరవం కల్పించారు .అదే ఏడాది చివర స్టాక్ హోం కు ‘’పీస్ షిప్ ‘’చాప్టర్ విషయమై హెన్రి ఫోర్డ్ సమర్ధన సాధించింది .కాని ఫోర్డ్ మాట నిలబెట్టుకోక పోవటం తో 1916 జూన్ లో అత్యవసర ఘర్షణ నివారణకు మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సంస్థపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ ఉద్యమం నిర్వహించింది .ఆమె ఆందోళన ఫలించి యుద్ధ విరమణ జరిగింది.అప్పుడామె ‘’వుమెన్స్ ఇంటర్ నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడం ‘’సంస్థ ఉపాధ్యక్షురాలైంది .
ఆస్ట్రియా నుండి హంగేరి విడిపోయి 1918 లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్రధాని మిహలి కరోల్యి స్విట్జర్లాండ్ కు ష్విమ్మర్ ను రాయబారి గా నియమించి ఆమె విశేష కృషికి గౌరవం కలిగించాడు .ఈమెయే ప్రధమ మహిళా రాయబారి అయి రికార్డ్ సృష్టించింది . ఏడాది తర్వాత 1919 లో కమ్యూనిస్ట్ పాలన ఏర్పడి నప్పుడు వారిని ఆమె ద్వేషించటం తో ఆమె పౌరహక్కులు కోల్పోయింది .1920 లో మిక్లాస్ హోర్తీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడ దోసినప్పుడు ఆమె వియన్నాకు పారి పోయింది .1921 లో అమెరికా చేరి చికాగో లో స్థిరపడి మళ్ళీ హంగేరి మొహం చూడలేదు .చికాగోలోనే ఉంటూ’’హంగేరి లో స్త్రీల రాజకీయాల ‘’కోసం శ్రమిస్తూనే ఉంది .
అమెరికాలో ష్విమ్మర్ ఫసిఫిస్ట్ భావాలకు సోషలిస్ట్ భావాలుగా ముద్ర వేశారు . తన వ్యక్తిత్వం పై వేసిన అపవాదు నుండి బయటపడటానికి పోరాడుతూనే ఉంది . ఫ్రెడ్ మార్విన్ ఆమెను జర్మని గూఢ చారి అని బోల్షేవిక్కుల ఏజెంట్ అని అభియోగం మోపినప్పుడు ఆమె పరువు నష్టం దావా వేసి 17, 000 డాలర్ల నష్ట పరిహారం పొందింది .అయినా ఆమె ఫాసిస్ట్ భావాలవలన ఆమెకు అమెరికా పౌర సత్వం లభించలేదు .అమెరికా సుప్రీం కోర్ట్ అమెరికా కు ఆమెకు జరిగిన న్యాయ పోరాటం లో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు నిచ్చింది .1946లో అమెరికాకు జిరౌర్డ్ కు మధ్య నడిచిన కేసు లో ఆమెకు ఊరట లభించింది .జీవితాంతం అమెరికాలో’’ స్టేట్ లెస్ సిటిజన్ ‘’ గా ఉండి పోయింది .
జీవిత చరమాంకం లో ష్విమ్మర్ ‘’ప్రపంచ ప్రభుత్వం ‘’కోసం కృషి చేసింది .1935 లో ‘’వరల్డ్ సెంటర్ ఫర్ వుమెన్స్ ఆర్కైవ్స్ ‘’ను మేరీ రైటర్ బియర్డ్ తో కలిసి స్థాపించింది .1937 లో ష్విమ్మర్ కు ‘’ప్రపంచ శాంతి ‘’బహుమతి నిచ్చి గుర్తించి గౌరవించారు .అదే ఏడాది లోలా మేవరిక్ లాయడ్ తో కలిసి ‘’ప్రపంచ ప్రభుత్వం ‘’కోసం ప్రచారం ప్రారంభించింది .20 వ శతాబ్దం లో ఇదే ప్రపంచం లో’’ మొట్టమొదటి ఫెడరలిస్ట్ ఆర్గ నై జేషన్ ‘’.20 వ శతాబ్దం లో ఫెడరలిస్ట్ ఉద్యమం బాగా ఊపు అందుకొని ‘’అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటు ‘’కు ఊతమిచ్చింది .ఈ ఖ్యాతి అంతా ఆమెకే దక్కాలి .కాని దీనికి కారణ భూతురాలైన ష్విమ్మర్ ను గుర్తుంచుకున్నవారు అరుదైపోవటం విడ్డూరం అనిపిస్తోంది .1947లో ఆమె పేరు ను ‘నోబెల్ శాంతి బహుమతి’’కోసం ఎంపిక చేసి పంపారు .కాని దురదృష్ట వశాత్తు మరుసటి ఏడాది శాంతి బహుమతిని ఎవరికీ ప్రకటించక పోవటం తో ఆమెకు అందుకొనే అదృష్టం చే జారి పోయింది .
71 వ ఏట న్యుమోనియా సోకి న్యూయార్క్ లో 3-8-1948 న ప్రపంచ శాంతి కపోతం రోసికా ష్విమ్మర్ అసువులు బాసింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.