అఘోరీ బాబా -1
బదరీనాధ్ కు దగ్గరలో ఉన్న శ్రీనగర్ కు దగ్గర గంగానది ఒడ్డున ఒక శక్తి దేవాలయం దానికి దగ్గర్లో అఘోరీ బాబా గుహ ఉన్నాయి .అఘోర విధానం తాంత్రికమైనది అర్ధం చేసుకోవటం చాలాకష్టం .కొద్దిమంది యోగులకు స్వాములకు ఆమార్గంబాగా తెలుసు.అది గూడార్ధమైన ఖగోళ శాస్త్ర సంబంధ రహస్య శాస్త్రం .దీన్ని జబ్బులు నయం చేయటానికి వాళ్ళు ఉపయోగిస్తారు . జీవితంలోని అత్యున్నత స్థాయి శక్తులపై ఆధిపత్యం పొందటానికి చేసే సాధన .ఇది ప్రాణాయామ0 కంటే శ్రేష్ఠమైన మార్గం .ఈ జీవితానికి ,తర్వాత దానికి మధ్య అది ఒక వంతెన లాటిది .అఘోరి శాస్త్రాన్ని చాలా కొద్దిమంది యోగులు మాత్రమే సాధన చేయగలరు .కానీ వారి విధానాలు విని తెలుసుకొని చూసి సామాన్యులు భయానికి గురౌతారు
శ్రీనగర్ చుట్టు ప్రక్కగ్రామాల ప్రజలు అక్కడ గుహలో ఉన్న అఘోరి బాబా అంటే భయంతో హడలెత్తి పోతారు .ఆయన పేరు చెబితేనే ”కార్చేస్తారు. ” .అటువంటప్పుడు ఆయన దగ్గ్గరకు వెళ్ళే సాహసమే చేయరు .ఒక వేళ ఆయన దగ్గరకు వెడితే బ0డ బూతులు తిట్టి ,గులకరాళ్ళతో కొట్టి పంపిస్తాడు .ఇలాంటి అఘోరి బాబా ను చూడటానికి స్వామి రామా కాలినడకన వెళ్ళాడు .బాబా 6 న్నర అడుగుల పొడవు తో బలిష్టమైన శరీరం తో దాదాపు 75 ఏళ్ళ వయసుతో పెద్దగడ్డ0 గో నె తో నేసిన అంగోస్త్రం తో కనిపించాడు .గుహలో గోనె పదార్ధం తప్ప మరేమీ లేవు.స్వామిరామా తనతోపాటు స్థానిక పురోహితుడిని వెంట తీసుకు వెళ్ళాడు .ఆయన భయపడుతూ వణుకుతూ నే వచ్చాడు .బయలుదేరేముందు రామా తో ”వీడు దొంగ సన్యాసి మురికి మనిషి .నువ్వు చూడదగిన మనిషి కాదు ”అని హెచ్చరించాడు
ఇద్దరూకలిసి చీకటి పడే ముందు సాయంకాలానికి బాబా దగ్గర కు చేరారు .తనగుహకు గంగానదికి మధ్యనున్న ఎత్తైన రాయి మీద అఘోరి కూర్చుని కన్పించాడు .వీళ్ళిద్దర్నీ తనప్రక్కనే కూర్చోమన్నాడు .వెంటనే ”నా వెనకాల నువ్వు నన్ను నానా బూతులు తిడతావు ,ఇప్పుడు కపట వినయంగా చేతులు ముడిచి దండాలు పెడుతున్నావే ?”అన్నాడు పండిట్ ను తీవ్రంగా .కంగారుపడ్డ పండిట్ నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తుంటే -”వెళ్ళద్దు .నదికి వెళ్లి నాకు మంచినీళ్లు కుండతో తీసుకురా ”అని చెప్పగా వెళ్లి తెచ్చాడు .పండిట్ చేతికి మా0సం నరికే పెద్దకత్తి ఇచ్చి ”నదిలోఒక శవం తేలుతోంది .వెళ్లి దాన్ని ఒడ్డుకు లాగి దాని తొడ ,కాలి పిక్క మాంసాన్నికొన్ని కిలోలు నరికి నాకు తీసుకురా ”అని ఆజ్ఞాపించాడు బ్రాహ్మణ పండితుడైన ఆయన జీవితం లో ఎప్పుడూ కలలో కూడా ఊహించనిపని .ఆయనతోపాటు స్వామి రామాకూడా వణికి పోయారు ..అడుగు ముందుకు వేయలేకపోయారు పండిట్ . .అఘోరీకి ”ఎక్కడో”కాలిపోయింది .తీవ్ర స్వరం తో ”నువ్వు వెళ్లి ఆ మాంసం తేకపోతే నేనే నిన్ను చంపి తినేస్తా .నీ ఇష్టం ఏం చేస్తావో చెయ్యి ”అన్నాడు .
గత్యంతరం లేక పండిట్ వెళ్లి ఆ శవం లో కోరిన మాంసాన్ని ఖండించి ,ఈ నరుకుడు అలవాటు లేనందున తన రెండు చేతి వ్రేళ్ళు తెగి రక్తం కారుతూ తీసుకొచ్చాడు .పండిట్ కానీ రామా కానీ సహజ స్థితి లో లేరు .పండిట్ దగ్గరకు రాగానే అఘోరీబాబా అతని తెగిన వ్రేళ్ళను తన చేతితో తడిమాడు .వెంటనే రక్తం కారటం ఆగిపోయి వ్రేళ్ళు బాగు పడ్డాయి . చిన్న మచ్చ కూడా కనిపించలేదు .
ఒక మట్టి కుండలో తెచ్చిన మాంసం ముక్కలు వేసి ,పొయ్యి మీద పెట్టి ఒక చిన్న రాయిని మూతగా పెట్టమన్నాడు .అలానే చేస్తుండగా ”ఒరే పంతులూ ! ఈ కుర్ర స్వామికి ఆకలిగా ఉందని తెలీదా నీకు నీకు ఆకలి వెయ్యటం లేదా ?”అని విరుచుకుపడ్డాడు .ఈ ఇద్దరూ ‘బాబా మేము పూర్తి శాకాహారులం ”అని గొణిగారు .దీనికి మళ్ళీ మండి పోయిన బాబా ”నేను మాంసం తింటాననుకొన్నార్రా బడుద్ధాయిలూ ?ఇక్కడి ప్రజలు అనుకొంటున్నట్లు నేను మురికి ముండా వాడిగా కనిపిస్తున్నానా?నేనూ శాకాహారినేరా భడవల్లారా ”అన్నాడు .మరి ఈ వింత ప్రవర్తన ఏమిటో ఈ ద్వయానికి అర్ధం కాలేదు .. పదినిమిషాలు మాంసం ఉడికాక పండిట్ ను ఆకుండను తన దగ్గరకు తెమ్మన్నాడు .దగ్గరలో ఉన్న చెట్టు పెద్దఆకులు మూడు కోసుకురమ్మని భూమి మీద పరవమని వాటిలో కుండలోని మాంసం వడ్డించమని చెబితే బెంబేలెత్తుతూ పండిట్ యెంత కర్మ కాలిందిరా బాబూ అనుకొంటూ ..తర్వాత అఘోరి గుహలోకి వెళ్లగా పండిట్ ,రామా చెవుల్లో ”ఇంత ఘోరం నా జన్మలో చూడలేదు స్వామీ .ఎలాంటి కులం లో పుట్టాను ఎలాంటి నీచమైన పని చేశాను ఇక నేను బతకటం వ్యర్థం ””అంటే రామా ”ఇక ముయ్యి .ఇక్కడినుంచి మనం తప్పించుకొనే వీలే లేదు .ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు .ఇంతలో బాబామూడు చిన్న మట్టి ముంతలు బయటికి తెచ్చాడు పండిట్ ను కుండలోని మాంసాన్ని ఆకుల్లో వడ్డించమన్నాడు .
పండిట్ కుండపై ఉన్న మూత తీసి చేతులు లోపల పెట్టి రామా ఆకులో వడ్డించగా ఆశ్చర్యం అది రసగుల్లా లు గా కనిపించింది .అది రామా కు అమిత ఇష్టమైన పదార్ధం బాబా గుహకు వస్తుండగా రసగుల్లా గురించి ఎందుకో ఆలోచన వచ్చింది స్వామిరామాకు .ఆయనకు కావాల్సిందే తయారైందన్నమాట. తెల్లమొహాలు వేసిన రామాతో అఘోరి ”ఇది స్వీటే . మాంసంకాదు అనుమానించకుండా తినండి ”అన్నాడు .ఇద్దరూ అతి రుచికరంగా ఉన్న రసగుల్లా లను చాలా ఇష్టంగా తిన్నారు మిగిలిన దాన్ని పండిట్ కు ఇచ్చి గ్రామం లో అందరికి పంచిపెట్టమని పంపాడు ఇదంతా హిప్నాటిక్ టెక్నీక్ అనిపించింది స్వామిరామా కు .రామా బాబా దగ్గరే ఉండి యోగ సాధన చేశాడు .మిగిలిన కధ తర్వాత.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
.

—

