వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2

         తాతగారి రచన తత్వబోధామృతం

‘’తాతే లిల్లియలో –శివతాతే లిల్లియలో’’ అన్న కైవారం నారాయణ తాత గారి తత్త్వం నోటికి రాని వాళ్ళు, భజనలో పాడని వారూ అరుదు .అయన రాసిన తత్వాలు కీర్తనలు 162 లో తెలుగులో రాసినవి 144 అయితే కన్నడం లో 18 ఉన్నాయి .వీటిని ‘’శ్రీ అమర నారేయణ యతీంద్ర వేదాంత సారావళి ‘’గా పేర్కొంటారు .కొన్ని తెలుగు,కన్నడమిశ్రితాలుగా ఉన్నాయి .అంటే తెలుగులో మొదలై ,కన్నడం తో ముగుస్తుంది -మణి ప్రవాళ శైలి లాగా .వినాయకునికి అగ్ర తాంబూలం ఇచ్చి –‘’ఏకదంతా మూషికవాహన వేదముని గణ వందితా –సకల విద్యల కాదికర్తవు  సన్మునీ విఘ్నేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’సంశయింపక వాక్కు నొసగుము సరసుడవు విఘ్నేశ్వరా –ధరను కైవర పుర విహరుడవై వెలసి యున్న హరునకు –ప్రియ సుతుడవై నట్టి గజముఖ దేవుడవు విఘ్నేశ్వరా ‘’అని కీర్తించాడు భక్తిగా .కైవార క్షేత్ర దైవం అమర నారేయణ స్వామి తాతగారి ఆరాధ్య దైవం .స్థానిక మాండలికం లో ‘’అంబ ‘’ను ‘’అంబను చూడరమ్మా జగదంబ ను చూడరమ్మా –అఖిలా౦డేశ్వరి శంభుని సతి తాకొలువై యున్నది –పంజులు ,,కమ్మలు ,పాపట బొట్టును తళుకు బుడగలు ,తాళీపదకము –చక్కని తల్లికి ముత్యపు ముక్కర –పరమేశ్వరి తా కొలువై యున్నది ‘’.కైవారం తాత గారి సమాధి వద్ద రోజూఆయన రాసిన రామనామామృతగానం వినబడటం ఒక ప్రత్యేకత .-‘’రామరామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవా –రామ దశరధ తనయ దేవా –రామశ్రీ నారేయణా-చూడ చూడగ  వెన్నెలాయెను-చూపు నిన్నే చూచెనూ –అన్నింటాను నీదే కళలు అమర శ్రీ నారేయణా’’కీర్తన అక్కడ ప్రతిధ్వనిస్తుంటుంది .అన్నిటా హరి ఉన్నాడనే తత్త్వం బోధిస్తూ ,ఆత్మ సాక్షాత్కారం పొంది తమలోనే హరిని దర్శించమని హితవు చెప్పాడు –‘’ఏమందురా  శంభో,ఏమందు-ఏమందు ప్రజలకు నీ మందు దొరకాదు’’అంటూ మందు అంటే పరమాత్మ తత్త్వం అని ఎరుక పరచాడు .అన్ని చోట్లా జరిగే జాతర అక్కడ ఇచ్చే జీవబలి తాతకు ఇష్టం లేదు .దీనికి విరుగుడుగా చక్కని తత్త్వం బోధిస్తూ –

‘’జాతర చేతామా శక్తికి జాతర చేతామా –ఎప్పుడు గృహమున వప్పుగ ఉన్నది –ముద్దులాడి ముక్తికాంతా సతికి –జాతర చేదామా ‘’అని –‘’మీదగు మానస దీపము చేసి ముద్దుగ శక్తికి ముందర ఉంచి –క్రూర దున్నలను మూటిని దెచ్చి నారాయణేస్త్రమున నరికి యాలుచును –గూడమైన గుండు మల్లెలు దెచ్చి ప్రీతిగా శక్తికి అలంకరించి –పంచ భూతముల బలిగా నిచ్చి –తారక జ్యోతిని ధ్యానము చేసి ,రామామృతమనే పొంగలి బెట్టి జాతర ‘’చేదామని మానసిక పూజా విధాన ఉత్క్రుస్టత వివరించాడు.  ఇలా చేస్తే జీవకోటికి ప్రమాదం ఉండదుకదా .అజ్ఞానమనే చీకటి తొలగించి బ్రహ్మ రాతను సైతం మార్చే శక్తి గురువుకు ఉన్నదని గురు బోధ చేశాడు .దైవ భక్తితో పాటు తాతకు దీనజన రక్షణా ముఖ్యమే.  ఆ నాటి అనా వృష్టి ని పద్యాలలో వర్ణించి వారి బాధను కళ్ళకు కట్టించాడు .

‘’తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం  ‘’అని పాండురంగ మహాత్మ్యం సినిమాలో కస్తూరి శివరావు బృందం పాడిన పాట మాదిరే తాత –‘’తొమ్మిది వాకి౦డ్లు కొంప –దుఖమునకిది మూల దుంప –ఎంచితే కలగూర గంప –తెలుసుకో నీ తాడు తె౦పా –డెబ్బది రెండు వేల నాళ్ళు అరువది తొమ్మిది కీళ్ళు –తోకపురుగులు మూడు సార్లు –నిండి ఉన్నది నీచు నీళ్ళు –మలమూత్రముల కుంట,మాంసము నెత్తార పెంట –మురికి పేగుల ముద్దు జంట కూడినది మలకోవి తుంటా ‘’అని శరీర మర్మాన్ని వివరించి దేహం పై మొహం వదిలేయమన్నాడు .కైవారం కొండ ఎక్కమని ‘’బకు డుండు గుండు చూడండా –భీమేశ్వరును మీద నిండా –భక్తీ భాగ్యము వేడు కొండా –పశ్చిమ ద్వారమున పొండా –అమర నారేయుణుని నమ్ముకొండా’’అని తన క్షేత్రానికి జి.పి.ఎస్ .సిస్టం లో మార్గం చూపించాడు .

  మతాలన్నీ చిక్కు పురాణాలు అని చెప్పి ,అందరిలో ఉన్న దేవుడు ఒక్కడే అని తెలియ జేశాడు .దొంగ సన్యాసులను ,కపట వేష దారులనుఎండగడుతూ -‘’ఏనుగు నెక్కిన యోగీశ్వరునకు –ఏపి మొరిగితే భయమౌనా ?’’అని ఎద్దేవా చేశాడు  .

మణి ప్రవాళ శైలిలో రాసిన అరుదైన కీర్తన వైభవం చూద్దాం –‘’బిత్తరి గురువు బెత్తాలు బట్టుక కట్ట్యేలమీదను నడిచేరురా –కళ్ళు కడవ రీతి కడుపులు పెంచుక మైనిండ గంధము పూసేరురా ‘’అని తెలుగులో మొదలుపెట్టి –‘’జ౦గకెక్కుల విల్లా లింగెక్క హోలెయిల్ల శివ భక్త కరిగెఈగ సారిదినో –బేడరమనెపూటమాడిద నంజుండ ఇద్దస్టు హేళిదేఇదు కేళిరి-నారాయణ స్వామి  హేళిదశిందు నుడి సుల్లెంద  బాయిగె ముళ్ళాకిరో’’అని రాసి జ౦గా నికి కులం ,లింగానికి అంటూ లేవు అని సత్యం చెప్పాడు .బహిస్టైన స్త్రీలలో కూడా శివుడు ఆ సమయం లోనూ ఉంటాడు అనే కఠోర సత్యాన్ని ,బోయవాడు పెట్టిన మాంసం శివుడు తినలేదా అని తత్వ బోధ చేసి చివరికి ‘’నా మాటలను ఎవరైనా  తప్పు అంటే వాళ్ళ నోళ్లల్లో ముళ్ళు కొట్టండి ‘’అని ఖచ్చితంగా చెప్పాడు కైవారం తాత .

  తాత చెప్పిన కాలజ్ఞానాదుల గురించి తరువాత ముచ్చటించు కుందాం –

సశేషం

  మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -23-3-18-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2

  1. Mastanvali says:

    తాతగారు రాసినటువంటి పుస్తకాలు పిడిఎఫ్ లో ఏమైనా దొరుకుతాయా వాటిని ఎలా పొందాలి

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.