యాజ్ఞ వల్క్యులు
యాజ్ఞ వల్క్యమహర్షి సూర్యుని అనుగ్రహం వలన శుక్ల యజుర్వేదాన్ని15 శాఖలుగా విభజించి ,అందులో ప్రధమ శాఖను కణ్వునికి ,ద్వితీయ శాఖను మధ్య౦దునికి ,మిగిలిన వానిని శాబీయ ,స్థాపానీయ,కాపార ,పౌండర వత్స ,ఆవటిక ,పరమావటిక ,నైధేయ,నైనేయ ,జౌఖేయ ,వైజేయ ,బైజన , గాలవ ,పౌరాశల్యులకు ఒక్కొక్కరికి ఒక్కో శాఖ ఉపదేశించి ప్రచారం చేయించాడు .వీరంతా యాజ్న వల్క్య వంశం వారే కనుక యాజ్న వల్క్యులని పిలువబడ్డారు .వీరినే శుక్ల యజుర్వేదులని ,వాజసనేయులనీ అంటారు .ఈ పదిహేను శాఖలకు సూత్ర కారుడు కాత్యాయన మహర్షి .కనుక కాత్యాయన సూత్రులనీ పిలుస్తారు .ప్రధమ శాఖను ఏర్పరచిన కణ్వమహర్షి సంప్రదాయులను కాణ్వులు ,ప్రధమ శాఖీయులు ,ఆది శాఖీయులు ,అగ్రశాఖీయులు ,మూల శాఖీయులు అని కూడా అంటారు .మాధ్యందిన మహర్షి సంప్రదాయయానికి చెందినవారిని మాధ్య౦దినులు అంటే , మిగిలిన శీఖీయులను ఆయా ఋషుల పేరిట పిలువబడుతున్నారు .
ప్రస్తుతం కా ణ్వ ,మాధ్యందిన శాఖల వేదం తప్ప మిగతా శాఖల వేదాలు ప్రచారం లో లేవు .తెలుగు కన్నడం తమిళ మాతృ భాష ఉన్న శుక్ల యజుర్వేదీయులంతా కాణ్వు లే.మరాఠీ గుజరాతీ ,హిందీ బెంగాలీ ,పంజాబీ మాట్లాడే వారంతా కూడా కాణ్వులే.వీరి సంఖ్య చాలా తక్కువే దాదాపు వీరంతా మాధ్య౦దినులే .
కాణ్వులలో నియోగులు ,వైదీకులు వారి వృత్తిని బట్టి ,నివ సహించే ప్రదేశాన్నిబట్టి హనుమకొండలు ,దువ్వలు ,కాకులపాడు ,ఆర్యులు ,అరవలు అనే 5 నాడీ భేదాలేర్పడ్డాయి .ఇప్పుడు వీరంతా నాడీ భేదం పాటించకుండా సంబంధాలు కలుపుకొంటున్నారు.స్వరాజ్యం నా జన్మహక్కు అని ఎలుగెత్తి చాటి ,గీతా రహస్య గ్రంథం రాసిన బాలగంగాధర తిలక్ , కాశీ విశ్వ విద్యాలయ సంస్థాపకులు పండిత మదన మోహన మాలవ్యా మాధ్యందిన శాఖీయులే .ఆంధ్ర దేశం లో కాణ్వులలో దేశ ముఖులు,దేశ పాండ్యా లు ,జమీందార్లు భూస్వాములూ ఉన్నారు. కాణ్వ శాఖీయులు రాజ్య పాలన కూడా చేశారు .క్రీ .పూ. 73నుండి క్రీ.పూ.28 వరకు శుంగ వంశం అంతరించాక ,మగధ సామ్రాజ్యాన్ని పాలించిన గుణ హీనుడు ,పరభామినీ లోలుడైన శుంగ వంశ ‘’దేవ హూతి’’ని చంపి రాజ్యాధికారం చెలాలాయి౦చిన వాడు ‘’వాసు దేవ కాణ్వ ‘’.ఇతని తర్వాత’’ భూమిత్ర కాణ్వ’’ ,నారాయణ కాణ్వ,సుశర్మ కా ణ్వా లు పాలించారు .గజపతి మహారాజు ప్రధాన మంత్రి ,రాజకీయ దురంధరుడు ,త్యాగ శీలి ,గ్రామకరణోద్ధరుడు గోపరాజు రామప్రధాని ఈ శాఖ వాడే .నిరతాన్న ప్రదాతలు ,తానీషాసుల్తాన్ మంత్రి వర్యులు అక్కన్న మాదన్న సోదరులు ,భద్రాద్రి శ్రీ రామ దేవాలయ నిర్మాత మహా రామభక్తుడు భక్త రామదాసు అనబడే కంచర్ల గోపన్న ,పాండు రంగ మహాత్మ్యాన్ని రచించి వికటకవి యై అష్ట దిగ్గజకవులలో ఒకడని గుర్తింపు పొందిన తెనాలి రామకృష్ణ కవి కాణ్వ శాఖీయులే .
కాలక్రమం లో వీరు ఆర్ధికంగా చితికి పోవటం వలన శ్రీ కూచి పంచాగ్నుల మన్నారు శాస్త్రి గారు, శ్రీ పువ్వాడ వెంకటరావు గారు కలిసి మద్రాస్ లో కాణ్వ శాఖ మహత్వాన్ని గురించి గ్రంథ ప్రచురణ చేసి ప్రోత్సహించి ,1872 లో మద్రాస్ లో పెద్ద బహిరంగ సభ జరిపి ఆ శాఖీయులందరికీ ప్రేరణ కలిగించి ‘’యాజ్ఞ వల్క్య నిధి ‘’ఏర్పాటు చేసి ఆదుకొన్నారు .5-11-19 19 లో తెనాలిలో యాజ్ఞ వల్క్య సభ జరిపి ,సంచలనంతెచ్చారు. 1925 లో మూడు రోజుల సభ శ్రీ వివి గిరిగారి తండ్రి శ్రీ జోగయ్య పంతులుగారి అధ్యక్షతన జరిపి ,తర్వాత శ్రీ భాగవతుల లక్ష్మీపతి ,శ్రీ వంగిపురపు చలపతి రావు గారి సంపాదకత్వం లో ‘’శ్రీ యాజ్న వల్క్య ‘’మాసపత్రిక స్థాపించి నడిపారు .దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య ,’’ఆంద్ర యాజ్న వల్క్య సంఘం ‘’ను పునరుద్ధరించారు .1952 లో గుంటూరు పండరీ పురం లో దాతల సహకారం తోశ్రీయాజ్నవల్క్య క్షేత్రం ‘’నిర్మించి ,శ్రీ మైత్రేయీ కాత్యాయినీ సమేత శ్రీ యాజ్న వల్క్య మహర్షి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి, తర్వాత క్షేత్రాన్ని బాగా అభి వృద్ధిపరచి వివాహాది శుభకార్యాలు జరపటానికి వసతి సౌకర్యాలు కల్పించారు .మా అబ్బాయి రమణ వివాహం ఇక్కడే జరిగింది .ఇలా యాజ్నవల్కీయుల సముద్ధరణ జరిగి వారికెంతో మేలు చేకూర్చింది .
ఆధారం –శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రచించి, గుంటూరు లోని ‘’ఆంద్ర యాజ్నవల్క్యసంఘం’’ ప్రచురించిన ‘’కణ్వగురు వాజసనేయ యాజ్న వల్క్య చరిత్రము ‘’ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-18 –ఉయ్యూరు

