కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -13

4-బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ అవధానిగారు, కుమారులు

 శ్రీరామ పురాగ్రహారానికి చెందిన నాలుగవ వారు   బ్రహ్మశ్రీ సామవేదం సూర్యనారాయణ  అవధాని   గారు హరితస గోత్రీకులు .తాతగారు  ముక్కామల కు చెందిన ఆహితాగ్ని ‘తండ్రి తెలుగు పండితుడు .తండ్రీ కొడుకులు అగ్నిహోత్రంకాని శ్రౌతం కాని చేయలేదు , వేదవిద్యకే ప్రాధాన్యమిచ్చారు ‘’వేదం చదవటం నేర్పటమే నా జీవితం ‘’అంటారు సామవేదం .కుమారులు నలుగురిలో ఇద్దర్ని వేదం లో పెట్టారు .వేద పండిత కుటుంబ కన్యలనే వారికి వివాహం చేశారు .అవిశ్రాంత వేదాధ్యయన ,అధ్యాపనమే వారి శక్తి సామర్ధ్యాలు .

 1932 డిసెంబర్ 30న జన్మించిన శ్రీ సూర్యనారాయణ అవధానిగారు నలుగురు అన్నదమ్ములలో చివరి వారు .పదవ ఏట ఉపనయనం జరిగి ,పదేళ్ళు దీక్షగా  వేదం  నేర్చుకున్నారు .మొదట పెద్దన్నగారి వద్దే ముక్కామలలో ,తర్వాత బిళ్ళకూరు లో శ్రీ వ్యాఘ్రేశ్వర చయనులగారి దగ్గర నేర్చారు .అ తర్వాత  బులుసు చయనులుగారి వద్ద శ్రీరామపురం లో అభ్యసించారు .కొంతకాలం ఇందుపల్లిలోని శ్రీ రాణి హయగ్రీవం గారి వద్ద చదివారు .విద్యాభ్యాస సమయం లో వారాలు చేస్తూ,మదుకరం తో జీవనం గడిపారు .1955 లో విజయవాడ లో’’ కర్మ ‘’లో పరీక్ష ఇచ్చారు .శ్రీ బాబళ్ళ శాస్త్రి గారి కోడలి చిన్న చెల్లెలు శ్రీమతి కమల ను వివాహమాడారు .వీరిది వేల్చేరులోని ప్రభల వారి  కుటుంబం .

 ఈ కొత్త క్రమపాఠి గారికి 1955 లో శ్రీరామపురం లో ఒక ఇంటిస్థలం ,ఇంటినిర్మాణానికి వెయ్యి రూపాయలు మంజూరయ్యాయి .దీనితో పాటు సాలుకు 15 బస్తాలు వడ్లు పండే ఎకరం పొలమూ వచ్చింది .ముక్కామలకు శ్రీరామపురం పదినిమిషాల నడక దూరం లోనే ఉన్నా అవధాని గారి తల్లి తనను వదిలి వెళ్ళవద్దని కోరింది .కాని ముక్కామలలో తమకున్న దానిలో తనకు దక్కేది అతిస్వల్పమే నని తెలిసి తనకంటూ ప్రత్యేకమైన గృహం ఎర్పరచుకోవాలనే నిశ్చయించారు .ఆనాటి గ్రామవాతావరణాన్ని గుర్తు చేసుకొని ‘’మట్టి రోడ్డు మీద నడవాలంటే తాతలు దిగోచ్చేవారు .రాత్రి పూట అయితే మరీ భయంకరం .దారిలో దొంగల భయం  కూడా.సెటిల్మెంట్ గాంగ్ ల ఆవాసాలు దగ్గరే ‘’అంటారు .

  శ్రీరామపురం లోని ఎకరం పొలం కౌలుకిచ్చేవారు .ఫలసాయం బాగానే ముట్టేది .క్రమగా షెడ్యూల్ కాస్ట్ వారి ప్రాబల్యం పెరిగి వారి ఆక్రమణకు గురై౦ది పోలం .’’వాళ్ళు మాపోలం లో గుడిసెలు వేసేశారు కొబ్బరికాయలు మాకు దక్కకుండా కోసేసేవారు .కోళ్ళపెంపకం కూడా చేసి మా బోటివాళ్ళు అడుగు పెట్టటానికి కూడా వీలు లేని దుర్భర పరిస్థితి కలిపించారు .ఈ బాధ పడలేక ఆ ఎకరాన్ని అయినకాడికి అతి తక్కువ ధరకే అమ్మేసి చేతులు దులుపుకొని ,పీడా విరగడ అయిందని  వేరొక చోట మళ్ళీ అరఎకరం  పొలం కొన్నాను ‘’అని ‘’బాపన ఎవసాయం ‘’కస్టాలు చెప్పారు సామవేదం . ఏడాదికి రెండుపంటలు పండే పొలం అది .దాన్నీ అమ్మేసి వేదపండితునిగానే జీవిక సాగించాలని నిర్ణయించుకొన్నారు .డబ్బు అడగటానికి నామోషి పడలేదు  వృత్తిలో నిలబడటానికి ఎందరెందరినో  ధనసాయం చేయమని అడిగారు .కొంతకాలం బయటికి వెళ్లి వేదవిద్య ప్రదర్శించి డబ్బు సంపాది౦చటమా, లేక ఇంట్లోనే ఉంటూ తనపిల్లలకు వేదం నేర్పటమా అనే సందిగ్ధం లో పడిపోయారు ‘’డబ్బు సంపాదన లేకపోతె సంసారం ఈదటం కష్టం .యాచనకు బయటికి వెడితే ఇంట్లో వేదాధ్యయనం సాగదు.ఈ రెండిటికీ లంగరు కుదరదు ‘’అని విచికిత్సకు లోనయ్యారు .చివరికి తానే ఒక నిర్ణయానికి వచ్చి ,నలుగురు కొడుకులలో వేదం పై అభిరుచి ఉన్న ఇద్దరికీ తానె ఇంటి వద్ద నేర్పుతూ మిగిలిన ఇద్దరికీ శాస్త్రాలలో పాండిత్యం కలిగించే లౌకిక విద్య నేర్పించాలనుకొన్నారు .ఇంతలో నాలుగవ కుమారుడికి ఉపనయనవయస్సు వచ్చింది .పెద్దవాడికి 24 ,మధ్యలో ఇద్దరికీ 22,21 వయసు .వీరిద్దరికీ 82 పన్నాలు వచ్చాయి .

   అగ్రహారం వదలి బయటికి ఆశీర్వచానాలకు  వెళ్ళేవారు .లేకపోతె వేదం సభలలో పాల్గొనేవారు .మహా శివ రాత్రికి పట్టిసీమ లోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయం లో జరిగే స్వస్తి వచనానికి వెళ్ళేవారు .తిరుపతిలో వరుణ పూజలో పాల్గొనేవారు .అవసరమైతే శ్రౌత విధులకు ఆహ్వానిస్తే వెళ్ళేవారు .’’నా సంసారం గడవటానికి డబ్బుకావాలి. అందుకే వెళ్లి డబ్బు పొంది వచ్చేస్తాను. దీనికి పశ్చాత్తాపం పడాల్సింది ఏమీలేదు .క్షమాపణ అవసరం లేదు’’అన్నారు  .తన వేదస్వరానికి లెక్కకట్టి ఇచ్చే ధనం కోసం చివరిదాకా ఎక్కడికైనా  ఏ సమయం లోనైనా వెళ్ళేవారు .ఎక్కడ ఏ సభ ఎప్పుడు జరుగుతుంది ,ఎవరి ఆధ్వర్యం లో అరుగుతుంది ,యెంత సంభావన గిడుతుంది అన్న లెక్కలన్నీ ఆయనవద్ద సిద్ధంగా ఉంటాయి .దాదాపు ఆ సభలన్నీ ఉభయ గోదావరి జిల్లాలలోనే ఉండేవి .ఒక్కోసారి గుంటూరు, కృష్ణా ,విశాఖ జిల్లాలలో అరుదుగా జరిగేవి .వాటికీ వెళ్ళేవారు .ఒక సారి మద్రాస్ లో అత్యంత సంపన్న బ్రాహ్మణుడి నుంచి కూడా ఘన సంభావన పుచ్చుకున్నానని తెలిపారు .

  జీవితం లో చాలా ఒడిదుడుకులు చూశారు .ముసలితనం లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకొన్నారు .1994 లో తిరుపతిలో జరిగిన వైష్ణవ యాగానికి 150మంది వేదపండితులు ఉదయం 7 గంటలనుండి మధ్యాహ్నం వరకు 12 రోజులు వరుసగా పారాయణకు పిలిచారు .వెయ్యి అగ్నిహోత్రాలు లక్ష్మీ నారాయణులకు ఏర్పాటు చేశారు. ఇద్దరు కుమారులతో అవధానిగారు వెళ్ళారు .మళ్ళీ వీరి ముగ్గురినీ 60 మంది వేదపండితులతోపాటు 7 రోజులు వేదపారాయణకు 1955 ఆగస్ట్ లో కంచిలోస్వామి  60 వ జన్మ దినోత్సవం కు ఆహ్వానించారు .ముగ్గురికీ  తలా వెయ్యిన్నూట పదహార్లు ,ఒక   బంగారు నాణెం ,14 తులాల వెండి పళ్ళెం నూతనవస్త్రాలు ,భార్యలకు కొత్త చీరలు  కానుకగా అందించారు  .మూడు నెలల తర్వాత పుట్టపర్తికి శ్రీ సత్యసాయి బాబా 70 వ జన్మ దినోత్సవానికి  ఆహ్వాని౦ప బడిన  70 మంది వేదపందడితులతో పాటు ఈ ముగ్గురూ వెళ్ళారు  .ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు ,బాబా సృష్టించి ఇచ్చిన చేతిగడియారం, నూతనవస్త్రాలు ,భార్యలకు సిల్క్ చీరలు ,ఒక్కోక్కరికి రెండు బంగారు గాజులు ,ప్రెజర్ కుక్కర్ ,వారం రోజులు ఉచిత భోజన వసతి కల్పిస్తూ ప్రయాణం ఖర్చులకుగాను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఘనంగా సన్మానించారు .

సామవేదం వారి ఫోటో జత చేశాను చూడండి

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.