ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

‘’అవును ఖచ్చితంగా ఉంది ‘’అంటున్నారు విశ్లేషకులు వివేక శీలురు .గాంధీ బహుపార్శ్వా  లున్న వ్యక్తి ,మనీషి .అంతటి మహోన్నతుని ఇప్పుడే కాదు ఎప్పటికీ విస్మరించలేము .తనజీవితం లో 40 ఏళ్ళు అహింసా  సిద్ధాంతానికి అ౦కిత మైనవాడు .మత ,రాజకీయ, సాంఘిక, నైతిక  ఆర్ధిక క్షేత్రాలపై తనదైన శాశ్వత ముద్ర వేసినవాడు .దేశ ,కాలాతీత సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నవాడు .సత్యం, అహింస, నైతికతలను తనపై ప్రయోగించుకొని నిగ్గు తేల్చిన అంతర్ దృష్టి ఉన్న మహాత్ముడు .అప్పటి ఆయన పరిష్కారాలు ఇప్పటికీ ఆచరణీయాలే  .1915 లో గాంధీ దక్షిణాఫ్రికానుంచి తిరిగి భారత్ చేరగానే ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే  దేశమంతా తిరిగి వాస్తవ పరిస్థితులు గమనించి ప్రజలనాడి తెలుసుకోమని ఆదేశించాడు .అలాగే చేస్తూ,దేశం లో పల్లెలలో ఉన్న దుర్భర దారిద్ర్యం ,రోగాలు, అనారోగ్యం ,కులవ్యవస్థతతో కునారిల్లిన  ,అణచి వేతకు లోనైన ,స్వేచ్చ అనుభవించని ప్రజలను గమనించాడు .చివరికి దేశం లో  గ్రామాలు ,దారిద్ర్యంపర్యాయపదాలు అని గ్రహించాడు . ఇలాంటి కోట్లాది  ప్రజలకు విముక్తికలిగితేనే అభి వృద్ధి సాధ్యం అనుకొన్నాడు .కనుక దీనికి తగిన ఉపాయం సంప్రదాయబద్ధంగా ,ఆధునికతతో రాకీయ నైతిక ,మతసంస్కరణలు తేవాలి అని నిశ్చయించుకున్నాడు .పాశ్చాత్య నాగరకత లో పెరిగినా ,ఆయనలో తరతరాల భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సిద్ధాంతాలు  స్థిరంగా వేళ్ళూ నికొనే ఉన్నాయి . ఆనాటి పరిస్థితులు నేడూ మనము౦దున్నాయి .కనుక గాంధీ కి ప్రపంచీకరణతో ఉన్న సంబంధం  ఇంకాబాగా ప్రాముఖ్యతవహిస్తోందని ,ఆయన భావాలు నేటికీ చెల్లుబాటు అవుతాయని మనకు అర్ధమౌతోంది .

  ఆయన చెప్పిన హింద్ స్వరాజ్ భారత దేశానికి అత్యంత అవసరమైన మాగ్నకార్టా .  అందులో సంశ్లేషణ ,సంయోగాలున్నాయి .వీటికి అ౦తస్సూత్రంగా సామరస్యం ఉండటం విశేషం .మానవులు సహజ సిద్ధమైన మానవ విలువలైన సహనం ,వివేకం ,సానుభూతి లను విస్మరించి మేధకే ప్రాధాన్యమిస్తున్నారు .ఇవి ఉంటే శారీరక మాసిక ,ఆధ్యాతిక శక్తి సంపన్నులౌతారు .ఆయన ప్రవచించిన హింద్ స్వరాజ్యం ఈ భావనల ఆధారంగా జాతి పెరిగితే కట్టుబాట్లతో ఉన్న స్వర్గం లో నివసించే వీలు కలిగి  ప్రపంచ దృష్టి మనపై పడుతుందని చెప్పాడు. కనుక మనకు తప్పని సరిగా కావాల్సింది పసిపిల్లవాడి మనస్తత్వం .దీనిపై గాంధీ ‘’నేను చేసింది అంతా ఇప్పుడు ఒక పిల్లవాడు కూడా అనువైన మనస్తత్వం తో సాధించగలడు .జ్ఞానం అన్ని వైపులనుండి ప్రవహిస్తుంది. కనుక శిష్యులమైన మనకు ప్రతిదీ  గురువై  బోధ చేస్తుంది ‘’అన్నాడు .ఇది సార్వకాలీన ,సార్వ దేశీయమైన సత్యం కాదా ?

  గాంధీ ఆచరించి బోధించిన సత్యం, అహింస,ప్రేమ లకు కాలదోషం లేదు .శాంతి సుహ్రుద్భావాలతోనే ఘర్షణలు  వైరుధ్యాలు తొలగిపోతాయి .కత్తికంటే ప్రేమ ,శాంతి సాధించిన విజయాలు చరిత్రలో కోకొల్లలు .వైరుధ్యాలను చూసి నిరుత్సాహపడరాదు .వాటిని అధిగమించే ఆత్మ స్తైర్యం సాధించాలి .కనుక ప్రజాస్వామ్యాన్ని ఆధ్యాత్మిక స్థితికి ఎదగనీయాలి .రాజకీయ కార్యకలాపాలు దైవ విధిగా భావించాలి .రాజకీయ నాయకులు ప్రజా సేవకులుగా ఉండాలేకాని వారిని పీడించే దోపిడీ దారులుగా ఉండరాదు .ఉన్నత ప్రమాణాలున్న సమాజ నిర్మాణం అందరి బాధ్యత.ఆధునిక విజ్ఞానం సా౦కేతికతలలోని బలాలను, బలహీనతలను గ్రహించాలి .అవి పర్యావరణానికి చేసే హాని గుర్తించి జాగ్రత్త పడాలి .బాపు చెప్పిన సత్య౦ , అహింస, ప్రేమ అనే’’ త్రిక సిద్దా౦తమే’’ భూమిపై శాంతికి దోహద పడుతుంది .దీన్ని మనం సాధించాలి అంటే  మన మనోభావాలలో సంపూర్ణ విప్లవం రావాలి .

     తన జీవితం లో ప్రతిదశలోను సమగ్రమైన విలువలను పాటిం చి  మహాత్ముడు ఆదర్శమూర్తి అయ్యాడు .విలువలు మూల చింతనకు ఆధారాలు .ప్రవర్తన తీరును మలచుకొనే ముఖ్యాంశాలు .భిన్న భావాలను ,సమస్యలను అడ్డంకుల్ని అధిగమించటానికి సహకరించే సహజ  సాధనాలు .విలువల వ్యవస్థ వ్యక్తి తీరుకు గీటు రాయి .సమాజం లో అతని ఉన్నతిని  నిర్ణ యించేది కూడా .జీవిత లక్ష్యాలకు అవి నిర్దేశకాలు .వీటినే గుణాలు అంటాం .గుణాలు భావనలకు ,భావోద్వేగాలకు స్థితులు. నిర్ణయాత్మకత లకు స్థితులు .వీటిని మనిషి తన వివేకం ద్వారా సద్వినియోగం చేసుకొని  తన హేతువు ,ఎంచుకున్న ప్రక్రియ లకు న్యాయం చేస్తాడు .గుణాలన్నిటికీ శీలమే ఆధారం .శీలం లేని గుణాలు శోభిల్లవు .ఇవీ సార్వకాలిక  సత్యాలే  కదా.కనుక గాంధీ ని విస్మరించ లేము కదా .

  నేడు ప్రపంచమంతా ఉగ్రవాద భయోత్పాతాలో భీతిల్లు తోంది .ప్రతి వాడికీ హింస ఆయుధమై పోయింది .హింస ఆత్మవినాశన హేతువు అన్నాడు బాపు .అహింస సర్వ కాల క్రియా విధానం దానికి తుది లేదు .కాలాతీతమై౦ది కూడా .హింస చంపుతుంది. అహింస ఎప్పుడూ చంపనే చంపదు.అందుకే అంతర్జాతీయ వనరులు  విశ్వ వ్యాప్తంగా అందరికి  అందుబాటులో ఉంటున్నాయి.శాంతి, సౌమనస్యం, సుహ్రుద్భావాలతో ,దౌత్యనీతి తో  పరస్పర చర్చలతో సమస్యలు ,విభేదాలు  టెన్షన్ లు  పరిష్కరింప బడుతున్నాయి .ఐక్యరాజ్య సమితి  ప్రపంచ దేశాలమధ్య శాంతియుత వాతావరణ కల్పనకు ఇతోధికంగా కృషి చేసి విజయం సాధిస్తోంది .వీటన్నిటికి కావలసింది సహనశీలత, ఔదార్యం ఉన్న రాజకీయ దృక్పధం ,నిర్ణయం ,సహనం ,పట్టుదల లతో కూడిన అహింసా సిద్ధాంతంపై గట్టి నమ్మకం,విశ్వాసం .హింస , దౌర్జన్యాలు ఏనాడు అంతిమ విజయం సాధించలేదన్నది చారిత్రిక సత్యం .మరి గాంధీజీ భావాలు బూజు పట్టినవా ?కానే కాదు .నిత్య నూతనమైనవి .స్పూర్తి  దాయకమైనవి ..

    గ్రామీణాభి వృద్ధి గాంధీజీ ముఖ్య సిద్ధాంతాలలో మరొకటి.  వస్తు అమ్మక లాభాలు  అన్నీ    బడా పారిశ్రామికవేత్తల జేబుల్లోకి అప్పనంగా ప్రవహి౦చకుండా వృత్తి పనివారలకు చేరేట్లు మహాత్ముడు ఆదర్శ వంతమైన ఆర్ధిక సూత్రం చెప్పి అమలు చేయించాడు .అదొక మోడల్ గా ప్రసిద్ధి చెందింది .వినియోగదారుల అవసరాలు  తీర్చటమే కాక అత్యున్నత నాణ్యతతో తక్కువ ధరలకే అందేట్లు  వస్తూత్పత్తి జరగాలని అభిలషించాడు .తమ పెట్టు బడులు సమాజం లో ఏ వర్గాలవారు  వలన లాభ పడుతున్నారో గ్రహించాలి .నేతపని వారు తయారు చేసే స్థానిక ఖాదీ వస్త్రాలకన్నా ,బ్రిటన్ నుంచి దిగుమతి అయిన మిల్లు వస్త్రాలు చాలా చౌక అయినా ,వాటిని వాడితే దేశీయ పరిశ్రమలు దెబ్బతిని వృత్తి పని వారల జీవితం  దుర్భరమౌతుంది.నిరుద్యోగం పెరిగి పోతుంది .అదే విధంగా వ్యవసాయాధార ఉత్పత్తులకూ అదే గతి పడుతుంది .గాంధీజీ అలాంటి విదేశీ వస్తువులవలన  భారత దేశానికి వెన్నెముకగా ఇప్పటి వరకు నిలచిన గ్రామీణ ఆర్ధిక స్థితి మొత్తం దిగజారి పోతుంది అని విశ్వసించాడు ..ఇంతటి దూర దృష్టి ఉన్న మహాత్ముని ఆర్ధిక విధానం ఎన్నటికీ శిరోధార్యం కాదా ?

  అంతమాత్రాన దూసుకు వస్తున్న పెట్టు బడి దారీ విధానం లోని చిక్కులు గాంధీకి తెలియనివి కావు .మానవత్వం తో కూడిన ఆయన ఆర్ధిక విధానాలు  యాంత్రిక పెట్టుబడి దారుల పురోగతిని నిలువరించటానికి సమర్ధమైనవి కావు . కనుక అందరికి పనికి వచ్చే తగిన ఒక ప్రణాళిక సూచించాడు  .మానవ శక్తి తక్కువగా ఉన్న దేశం యంత్ర పరిశ్రమతో వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకో వచ్చు .కాని ఇండియావంటి అధిక జనాభా ఉన్న దేశానికి యంత్ర పరిశ్రమ అనర్ధ దాయకం .దేశం తన అవసరాలకు చాలినత మాత్రమే ఉత్పత్తి చేయాలి .అధికోత్పత్తి వలన అంతర్జాతీయ ఆర్ధిక పరుగు ప్రారంభమై చివరికి దోపిడీకి దారి తీస్తుంది  గాంధీ ఆలోచన ప్రకారం ప్రస్తుత ఇండియా పరిస్థితికి  అంతా ,బ్రిటిష్ కాలనీ వాళ్ల దూకుడు యా౦త్రీకరణమే కారణం .అని పూర్తిగా విశ్వసించాడు .

   ఆర్ధిక విషయాలపై బాపు అభిప్రాయాలు అతి సాధారణ౦గా  సూటిగా ఉండేవి .అయినా వాటిని అన్ని స్థాయిలలో అందరూ విమర్శించారు .పైగా అభి వృద్ధి నిరోదకమైన తిరోగమన పద్ధతులు అన్నారు .కాని ఆయనకు లోతైన రాజకీయ గర్భితార్ధం బాగా తెలుసు .ఆర్ధిక ఉద్దేశ్యాలు ,ఇ౦పీరియలిజం ,కాలనిజం లకు మూల సూత్రాలని ఆయనకు పూర్తిగా అవగతమైన విషయమే .కనుక కాలనీ వాసుల ఆర్ధిక లాభాలపై బతుకుతున్న బ్రిటిష్ ప్రభుత్వం పై విరుచుకుపడి వాటిని బలహీన పరచాలని నిశ్చయించాడు  .దీన్ని ఆధారంగా భారతీయ ఆర్ధిక విధానం బలపడాలని  అనుకున్నాడు .తన జీవితమంతా దీనిపైనే దృష్టి పెట్టాడు .ఆయనది  ఆధ్యాత్మిక అలంకారం తో,ముసుగుతో  ఉన్నరాజకీయ సాధనం అనుకోవటం పొరబాటు .ఆయనకు నిజంగా కోట్లాది పేద ప్రజల  అభి వృద్ధి మాత్రమే ముఖ్యం .హృదయం లేని యాంత్రికత తో  వృద్ధి  చెందే ప్రపంచ ఆర్ధికం, అన్నిటిలోని నైతికత ను అడ్డ గిస్తుంది అని మహాత్ముని భావన .ఆయన కాలం లో గాంధీగారి ఆర్ధిక నమూనా ప్రభావం చాలా ఉధృతంగా  ఉండేది .దాన్ని భారత దేశంమాత్రమేకాక ,  ప్రపంచం లో చాలా దేశాలు  అమలు చేసి అభివృద్ధి సాధించి విజయాలు అనేక రీతులలో, స్థాయిలలో సాధించాయి  .అదొక ఆదర్శ ఆర్ధిక విధానం అని పేరు పొందింది . కనుక బాపు భావనలు దేశాతీతమని పించాయన్నమాట అక్షర సత్యమే కదా .

మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ చిరు ధారావాహిక

  సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-9-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.