ధ్వని కోణం లో మనుచరిత్ర -2
స్వారోచి నాయనమ్మ వృత్తాంతం మనుచరిత్ర మొదటి మూడు ఆశ్వాసాలలోను ,మిగిలినవాటిలో తండ్రి స్వరోచి వృత్తాంతం వర్ణించాడు పెద్దనామాత్యుడు .మనోరమ మొదలైన వృత్తాంతాలు స్వరోచి కి సంబంధించినవి .వనదేవతా గర్భం లో స్వారోచి జన్మించటం ,మనుత్వం పొందటం తో ఈ ప్రబంధం పూర్తవుతుంది .తల్లీ తండ్రీ అయిన వనదేవత ,స్వరోచుల వలన దైవత్వం ,ప్రజాపాలన ,క్షాత్రధర్మాలు ,తాత అని పించుకొనే ప్రవరాఖ్యునిలోని ధర్మ మార్గం శమదమాది సద్గుణాలు సంక్రమించి స్వారోచి మనువు అయ్యే అర్హత పూర్తిగా పొందాడు .ధర్మమార్గాన ప్రజాపాలన చేసి ప్రజలకు సుఖ శాంతులు చేకూర్చాడు .కనుక ప్రబంధానికి ముఖ్యంగా ఉండాల్సిన ఏక వాక్యత అనే ధర్మం విచ్చిన్నం కాలేదు .ఈ చరిత్ర మార్క౦ డేయ పురాణం లోనిదే .కాని ఈ ప్రబంధం లో రసోచితమైన కథా సంవిధానం తో ,కొత్త తళుకులతో ఆంద్ర కవితా పితామహుడు పెద్దన లోకోత్తర సంవిధాన నైపుణ్యంతో ఈ ప్రబంధం తలమానికమైనది .
ఒకసారి ప్రవరుని గుణగణ గానం చూద్దాం .శమదమాదులున్నవాడు,వేలిమి ,సురార్చన,విప్రులను ,ఇంటికి ఆహ్వానించే ధర్మాలు పుష్కలంగా ఉన్నవాడు .ఊరు వదలి వెడితే భంగం కలుగుతుందేమో నని ఇల్లు వదలని ఆహితాగ్ని .అతిదులెవరైనా వచ్చారని తెలిస్తే యెంత దూరమైనా వెళ్లి ,ఇంటికి ఆహ్వానించి ఇస్టాన్నం తో సంతృప్తి పరచే అభ్యాగత సేవా తత్పరుడు .సద్బ్రాహ్మణుడు .ఇంద్రియాలకు వశమైతే బ్రహ్మాన౦దాని కి దూరమైపోతాడు అనే స్పృహ బాగా ఉన్నవాడు .తుచ్చమైన స్వర్గాది సుఖాలు మీసాలపై తేనెలు అని నమ్మినవాడు .ఇంద్రియ నిగ్రహం పుష్కలంగా ఉన్న జితేంద్రియుడు .అంతే స్ప్రుహణీయ మూర్తి .అంద చందాల విషయం లో ‘’యక్ష తనయే౦దు ,జయ౦త ,వసంత ,క౦తులనే గెలువజాలిన వాడు .వీతరాగుడే ,కాని ధర్మ పత్ని యందు మాత్రమె అనురక్తి కలవాడు .ఇన్ని సద్గుణాలప్రోవు ప్రవరుడు ధీర శాంతుడు .దానం ధర్మవీరం శాంతగుణం ఉన్నవారినే ధీర శాంతుడు అంటారు .
శాంతానికి శృంగారానికి పొసగనే పొసగదు..ఇవి పరస్పర విరుద్ధాలు .కాని ఒకే నాయకుడికి ఈ రెండు ఉండటం లో అనౌచిత్యం లేదు ,శాంతరసాశ్రయుడు ఒక్కోసారి శృంగార రసాశ్రయుడు కావచ్చు ,కాని ఈ రెండురసాలకు మధ్య కొంత వ్యవధి మాత్రం ఉండాలి ,అప్పుడు విరోధం ఉండదు అన్నారు డా రాజన్న శాస్త్రి గారు .ఉదాహరణగా జీమూతవాహనుడు శాంత రాసాశ్రయమూర్తి ,కాని మలయవతి అనురాగం తో శృంగార రసాశ్రయుడయ్యాడు .ఈ రెంటికి మధ్య అద్భుత రసాన్ని ప్రవేశ పెట్టి శాంత ,శృంగారాలకున్న వైరుధ్యాన్ని పరిహరించాడు కవి .కానీ , ఇక్కడ ప్రవరుడు శృంగార రసాశ్రయుడు అవటానికి వీలు లేదు. కారణం అతడు ఏకపత్నీ వ్రతుడు అవ్వటమే .దీనిపై చాలా స్ట్రెస్ చేసి పెద్దన ఒక పద్యం లో చక్కగా చెప్పాడు
‘’వాని చక్కదనము వైరాగ్యమున జేసి –కాంక్ష సేయు జార (వార )కామినులకు
భోగ బాహ్యమయ్యె , బూచిన సంపెగ –పొలుపు మధుకరా౦గనలకు బోలె’’’
అంటే అతని చక్కదనం వరకా౦తలకు కాదు కేవలం అర్దా౦గికే స్వంతం అని వ్యంగ్యంగా చెప్పాడు .దీనితో ప్రవరుని ఏకపత్నీ వ్రతనిష్ట తెలుస్తోంది .కనుక ఇతని శాంతానికి శృంగారం పొసగదు కనుక వేరొకఉపాది భేదం అవసరమై ,మాయా ప్రవరునితో ఆ లోటు తీర్చాడు కవి .దీన్ని రసగంగాధరకర్త జగన్నాధ పండితరాయలు ఒక శ్లోకం లో చెప్పాడు –
‘’సురా౦గనాభి రాక్లిస్టాః వ్యోమ్ని వీరా,విమానగాః-విలోకంతే నిజాన్ దేహాన్ ఫేరు నారీ భిరావృ తాన్ – అంటే స్వర్గం లో శృంగార భీభత్సాలమధ్య స్వర్గ లాభం అయిన వీర రసం కలిసి ఉంది .అంటే వీరు చనిపోయి స్వర్గం చేరి అక్కడ సురా౦గనలతో శృంగారం చేస్తూ ,తమ మృత శరీరాలను చూస్తున్నారు .అంటే చచ్చాక ఉపాధి భేదం కలిగి శృంగారానికి ఇబ్బంది రాలేదు .
మనుచరిత్రలో వరూధిని పూత పసిడి వంటి వలపులతో గంధర్వకులంలో పుట్టినా ఆజాతి స్వభావానికి విరుద్ధంగా ,బ్రాహ్మణుడైన ప్రవరుడినే వరించింది .ఆతడు అంగీకరించని తనమనసు శరీరం నిష్ప్రయోజనం అని స్పష్టంగా చెప్పింది .కనుక ఈమె’’ ఏకాయత్త’’.అనన్య కాంత ఐన ఈ వరూధిని అనురాగం ఫలించాలి అంటే నాయకుడికి ఉపాధి భేదం ఉండటమే పరిష్కారమార్గం .కేవలం రసాంతర సమావేశం లో విరోధాన్ని పరిహారం చేయాలని ప్రయత్నిస్తే అది ప్రవరుని శీలానికి మచ్చ అవుతుంది ,అనౌచిత్యమౌతుంది అంటారు శాస్త్రిగారు .ఆ అనౌచిత్యాన్ని ,రస విరోధాన్ని పెద్దనకవి ఎలా పరిష్కరించాడో చూద్దాం –
‘’అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట –పట్టి దీర్చిన గంగామట్టి తోడ –జెక్కు టద్దముల౦దు ,జిగి వెల్లువలు జిందు ,రమణీయ మణికుండలములతోడ
బసిడి వ్రాత చెరంగు,మిసిమి దోవ జెలంగు –నరుణా౦శు కోత్తరీయంబు తోడ –సరిలేని రాకట్టు ,జాలువా మొలకట్టు –బెడగారు నీర్కావి పింజ తోడన్
ధవళ ధవళములగు జన్నిదములతోడ –గాశికాముద్ర యిడిన యుంగరము తోడ
శా౦తరసమొల్కు బ్రహ్మ తేజంబు తోడ –బ్రవరుడయ్యె వియచ్చర ప్రవరుడపుడు.’’
ఒక్కసారిగా గ౦ధర్వ కుమారుడు అచ్చంగా ప్రవరుడు అవ్వటం అద్భుత రసా విష్కారమే .ఈవిధంగా శాంత ,శృంగారాల మధ్య అద్భుత రసం ప్రవేశపెట్టి రసభేదాన్ని, ఉపాధి భేదం చేత అనౌచిత్యాన్ని పోగొట్టి , ‘’టుబర్డ్స్ ఎట్ వన్ షాట్’’ గా పరిష్కరించాడు పెద్దనకవి .ఒరిజినల్ ప్రవరుడు వరూధిని ప్రణయాన్ని తిరస్కరించి ,తన గుణ సంపత్తిని పెంచుకొన్నాడు .ప్రవరుడు గంధర్వునిలో ప్రవేశించటం లో ప్రవరాఖ్యుని ప్రమేయం అస్సలు యేమీ లేదు .గంధర్వుడికి ఉన్న’’ శా౦బరీ మహిమ’’ప్రవరుని రూపు రేఖా విలాసాలతోపాటు దేహ సమిద్ధ శిఖి దీప్తి కూడా అతనికి సంక్రమించింది .వరూధిని డూప్లికేట్ ప్రవరుడినే తనమనో నాయకుడిగా భావించి రతి సౌఖ్యం అనుభవించింది .ఆమె మనసంతా ప్రవరుడే ఉన్నాడుకనుక ఆభావంతోనే పొందుసుఖం పొందింది .అందుకనే ఈమె పౌత్రుడికి ప్రవరాఖ్యుని శమదమాది సద్గుణాలు సంక్రమించాయి. ఇదే భావనాబలానికున్నఅద్భుత శక్తి .కనుక ఈ గంధర్వుడు చీకటి తప్పు చేయటానికి మాత్రమే పనికొచ్చాడు , కాని వాడికి ప్రత్యేక అస్తిత్వం అంటూ ఏమీ లేదు .కనుకనే కవి’’ అతడి పేరు కూడా ‘’ఎక్కడా ప్రస్తావించలేదు .అతడొక భభ్రాజమానం ,భజగోవిందంమాత్రమే. పులిహోరలో కరేపాకు . మొత్తం మీద ఈమొదటి కథలో అంటే వరూధినీ వృత్తాంతం లో ప్రవరాఖ్యుడే కథానాయకుడు .ప్రధానరసం శృంగారమే అని తేల్చి చెప్పారు డా .కొరిడె రాజన్న శాస్త్రి గారు .
దీపావళి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-18-ఉయ్యూరు
—

