గౌతమీ మాహాత్మ్యం-7
తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2
రాక్షసులు కపిలుని ప్రభావం తెలిసి ,మాయతో సగరకుమారులను చంపే ప్రయత్నం చేశారు .గుర్రాన్ని ఆయన తల భాగానకట్టేసి దూరం వెళ్లి జరుగబోయేది చూశారు .సాగరపుత్రులు రసాతలనం చేరి అక్కడ నిద్రిస్తున్న మనిషిని ప్రక్కనే యాగాశ్వాన్ని చూసి ,తమ క్షాత్ర తేజం చూపాలని పాదాలతో మహర్షిని తన్నారు .నిద్రలేచిన ఆయన వాళ్ళను చూడగానే కాలి బూడిద అయ్యారు ..సగరునికి ఈవార్త తెలియలేదు .నారదుడు ఆయనకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు .ఏమి చేయాలో తోచక మిన్నకుండి పోయాడు .మిగిలిన ఒకే ఒక్క పుత్రుడైన అసమ౦జసుడుపేరుకు తగ్గట్టే మూర్ఖుడు ,చిన్నపిల్లలను బావిలోకి తోసి వినోది౦ చేవాడు .ప్రజలు రాజుకు ఫిర్యాదు చేశారు. ఆయనకు కోపమొచ్చి కొడుకునకు దేశ బహిష్కార శిక్ష విధించాడు .ఇతనికొడుకు అంశుమంతుడు .అతన్ని పిలిపించి విషయం చెప్పాడు .అతడు కపిలమునిని ఆరాధించి యాగాశ్వాన్ని తెచ్చి, తాతగారికి అప్పగించాడు .సగరుని క్రతువు పూర్తయ్యిది .
అంశు మంతుని కుమారుడు దిలీపుడు ధార్మికుడు. ఇతనికొడుకు భగీరధుడు .ఇతడు తనతాతల దుర్గతినివిని దుఃఖించి వారికి నిష్కృతి ఎలాకలుగుతుందని సగరుని అడిగాడు .కపిలమహర్షికి అంతాతెలుసునని ఆయన దర్శనం చేయమని చెప్పాడు. పాతాళానికి వెళ్లి కపిలుని ప్రసన్నం చేసుకొని వచ్చిన విషయం చెప్పాడు .శంకరుని ధ్యానించి శివ జటాజలం తో పితరులను ముంచితే కృతార్దులౌతారని ,కైలాసానికి వెళ్లి పరమేశ్వరుని మెప్పించి కార్యం సాధించమన్నాడు .అలాగే కైలాసం చేరి శుచియై తపస్సు ప్రారంభించాడు .శివుడు ప్రత్యక్షమై కావలసింది అడగమన్నాడు .’’మా పితరులను పావనం చేయటానికి నీ జటాజూటంలోని గంగను నాకిస్తే చాలు ‘’అనగా చిరునగవుతో గంగను స్తుతి౦చమనగా గంగకై తీవ్ర తపస్సు చేయగా ,ఆమె అనుగ్రహం తో , మహేశ్వరుని నుంచి గంగను పొంది ,రసాతలానికి తీసుకు వెళ్లి కపిలమునికి విన్నవించి ,ఆయన చెప్పినట్లుగా గంగకు ప్రదక్షిన చేసి చేతులు జోడించి తనపితరులకు సద్గతి కలిగించమని కోరగా ఆమె ప్రీతితో కపిలుని శాప౦తో దగ్దులై ముంచేసిన గుంటలన్నిటినీ నింపేసింది .పితరులకు ముక్తికలిగింది గంగాజలం తో ..గంగను భాగీరధ బాలుడు ‘’అమ్మా !నువ్వు మేరుపర్వతం మీదకాకుండా కర్మభూమి యందు ఉండాలి ‘’అని కోరగా గంగానది హిమాలయం చేరి ,అక్కడనుండి ,భరతవర్షం చేరి మధ్యనుండి పూర్వ సముద్రందాకా వ్యాపించింది .ఇలా క్షత్రియ బాలుడైన భగీరధుని వలన గంగ భూమిని ,రసాతలాన్ని చేరింది .వింధ్యకు దక్షిణంలో ఉన్నగంగ’’గౌతమి ‘’,వింధ్యకు ఉత్తరంగా ఉన్నది భాగీరధి అని పిలుస్తారు .
పదవ అధ్యాయం –వారాహీ తీర్ధ వర్ణన
నారదుడు బ్రహ్మను అన్ని తీర్దాల వివరాలు చెప్పమని కోరగా అన్నీ చెప్పటం ,వినటం కష్టం కనుక శ్రుతులలో ప్రసిద్ధమైనవాటిని మాత్రమే చెబుతానన్నాడు .త్ర్యంబకుడు ఎక్కడున్నాడో అది త్రయంబక క్షేత్రం .భక్తీ ముక్తీ ఇస్తుంది .వారాహ తీర్ధం ముల్లోకాలలో ప్రసిద్ధం .పూర్వం సింధు సేనుడనే రాక్షస రాజు దేవతలను ఓడించి ,యజ్ఞాన్నితీసుకొని పాతాళానికి వెళ్ళాడు . భూమిపై యజ్ఞయాగాదులు లేవు .దీనితో భూ సువర్లోకాలు నాశనమవగా ,సురలు రసాతలం చేరి ,వాడితో యుద్ధం చేసి జయించలేక విష్ణువుకు మొరపెట్టగా ,విష్ణుమూర్తి ‘’ఆదివరాహ మూర్తిగా’’ పాతాళానికి వెళ్లి అక్కడ దానవ సంహారం చేసి ‘’మహా యాగ ముఖం ‘’తో అంటే ‘’యజ్న వరాహ స్వామి ‘’గా భూమిపైకి వచ్చి గంగ దగ్గర రక్త సిక్తాలైన శరీరాన్ని కడుక్కున్నాడు .ఇక్కడ వారాహ కుండం ఏర్పడింది .తనముఖం లోని ‘’మఖం ‘’అంటే యజ్ఞాన్ని బ్రహ్మగిరిలో ఉన్న దేవతలకు అందించాడు .ముఖం నుండి యజ్ఞం పునరుత్పత్తి చెందింది .అప్పటినుంచి స్రువము ప్రధాన యజ్ఞా౦గ మైంది .కారణానతరం లో వరాహ రూపం దాల్చింది .ఈ వరాహ క్షేత్రం మిక్కిలి పుణ్యప్రదం .ఇక్కడ స్నాన దానాలు చేస్తే అన్ని క్రతువుల ఫలితం లభిస్తుంది ‘’అని బ్రాహ్మ నారదునికి చెప్పాడు.
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-18-ఉయ్యూరు

