గౌతమీ మాహాత్మ్యం -12
19-జనస్థాన తీర్ధం
నాలుగు యోజనాల జనస్థాన తీర్ధం స్మరణతోనే ముక్తినిస్తుంది .వైవస్వత మన్వంతరం లోజనకమహారాజు వరుణునిపుత్రికను పెళ్ళాడాడు .ఆయన తనపురోహితుడు యాజ్ఞ్యవల్క్యుని ‘’భుక్తివలన ,సుఖం వలన ముక్తి ఎలా లభిస్తుంది ?’’అని అడిగాడు .దాని కతడు ఆయనమామగారైన వరుణుని అడగమని సలహా ఇచ్చాడు .ఇద్దరూకలిసి వరుణుని చేరి అడిగారు .వరుణుడు ‘’ముక్తి రెండురకాలుగా లభిస్తుంది .ఒకటి కర్మద్వారా రెండు ఆకర్మద్వారా .వేదాలన్నీ ఆకర్మమార్గం కంటే కర్మమార్గమే శ్రేస్టమన్నాయి. ధర్మార్ధ కామమోక్ష పురుషార్ధాలన్నీ కర్మబద్ధాలే .కర్మ రాహిత్యం తో ముక్తి వస్తుందనేది అపోహమాత్రమే .కర్మ చేతనే ఏదైనా సిద్ధిస్తుంది. మానవులు మనోవాక్కాయ ములచేత వైదిక కర్మలు చేయాల్సిందే దీనివలన భుక్తితోపాటు ముక్తికూడా లభిస్తుంది. ఆకర్మకంటే కర్మ పుణ్య ప్రదం .బ్రహ్మ చర్యాది ఆశ్రమకర్మలన్నీ విశేష పుణ్య ప్రదాలే .వీటిలో గృహస్థాశ్రమ౦ మిక్కిలి శ్రేష్టం దీనివలననే భుక్తీ ముక్తీ కలుగుతాయి ‘’అని చెప్పాడు .
వరుణుని వీరిద్దరూ ‘’భుక్తి ముక్తి ఇచ్చే దేశం, తీర్ధం ఏవి ?’’అని అడుగగా ‘’భూమిపై భారతవర్షం అందులోనూ దండకారణ్య ప్రాంతం పుణ్య దాయకం .ఇక్కడ చేసే కర్మ భుక్తి ముక్తి హేతువౌతుంది .తీర్ధాలలో గౌతమి అనే గంగ శ్రేష్టమైనది .మానవులకు ముక్తినిస్తుంది ఇక్కడ చేసే యజ్న దానాలవలన భుక్తి ముక్తులు లభిస్తాయి .’’అన్నాడు ఇద్దరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు .జనకుడు తర్వాత గంగా తీరం వెళ్లి యాజ్ఞ్యవల్క్యుని ఆధ్వర్యం లొ ఆశ్వమేధాది యాగాలు చేసి ముక్తిపొందాడు ఆయన వంశం లొ అనేక జనకరాజులు గౌతమీ నదివలన ముక్తి చెందారు .జనకుడు యజ్ఞం చేసిన నాలుగు యోజనాల ప్రదేశం ‘’ జనస్థానం’’ అయింది .స్మరణ మాత్రం చేత కోర్కెలను తీరుస్తుంది అప్పటినుంచి ఇది’’ జనకతీర్ధం’’ అయిందని బ్రహ్మనారదునికి తెలిపాడు .
20 –అరుణా –వరుణా సంగమ ఆశ్వభాను తీర్ధం
కాశ్యపుని పెద్దకొడుకు ఆదిత్యుడు అనే సూర్యుడు. త్వష్ట పుత్రిక ఉషను పెళ్ళాడాడు .వీరిపుత్రులే వైవస్వతమనువు ,యముడు .యమునా కూతురు .ఉష సూర్య ప్రతాపాన్ని భరించలేక పోతోంది.ఉపాయంగా తన చాయను తన రూపం తో సమానమైనదాన్ని చేసి ,ఆమెనే భర్తకు ప్రీతికలిగిస్తూ సంతానాన్ని సాకమని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పి అమె అంగీకరించగా సూర్య గృహం నుండి ఉష వెళ్లి పోయింది .
ఉష తన తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది .ఆయన ‘’స్త్రీలకు తగినపనికాదు నువ్వు చేసింది .స్వేచ్చా ప్రవృత్తి వినాశహేతువు .నువ్వు ఇక్కడ ఉండరాదు.నీ భర్తదగ్గరకే వెళ్ళు ‘’అని నచ్చ చెప్పాడు .ఆమె వినక ఉత్తర కురు దేశం వెళ్లి ఆడగుర్రం రూపంతో భర్తను గురించి తపస్సు చేసింది.అక్కడ చాయదేవితో సూర్యుడు సంసార సుఖాలు అనుభవిస్తున్నాడు .వీరిద్దరికీ సావర్ణి ,శని కొడుకుకులుగా,విస్టి అనే దుస్టకన్య కూతురుగా పుట్టారు .అప్పటినుంచి సవతి సంతానంపై భేదభావం చూపించేది .యముడుగ్రహించి చాయను కాలితో తన్నాడు .ఆమె యముడిని అతనిపాదం చిన్నమై పోతుందని శపించింది .ఏడుస్తూ తండ్రికి చెప్పుకొన్నాడు .
విషయం అర్ధమై ఆదిత్యుడు ఉత్తర కురు దేశానికి వెళ్లి బాడబ అంటే గుర్రం రూపం లో తపస్సు చేస్తున్న ఉషను పురుష అశ్వ రూపం లొ చేరి సకిలించాగా ,ఆమె భర్త గుర్రం రూపం లొ వచ్చాడని గ్రహించి పారిపోగా ,వెంబడిస్తూ ఇద్దరూ వింధ్యపర్వతం దాటి దక్షిణం వైపు పరిగెత్తుతూ గౌతమీనది దగ్గరకు చేరగా ,అక్కడ జనస్థానం లొ ఉన్న మునిబాలురు గుర్రాన్ని ఆపేశారు .భానుడు కోపంతో ఋషులను కొడుకులను వట వృక్షాలు గా మారమని శపించగా,మునులు దివ్య దృష్టితో గ్రహించి సూర్యుని స్తుతించగా అతడు ఆడగుర్రం దగ్గరకు చేరి ,భర్త అని తెలుసుకొని ఇద్దరూ గౌతమిలో దిగి సుఖించగా ,ఆమె ముఖం నుంచి వీర్యం కారగా అది గంగాలోపడి అశ్వినీ దేవతలు పుట్టారు .
ఈ మహా సంఘటనకు ఆశ్చర్యపడి దేవ ముని ఓషధి, దిశాదేవాతలు,త్వష్ట మొదలైన అందరూ అక్కడకు చేరగా మామగారితో సూర్యుడు తనను సానబట్టి తన తేజస్సును తగ్గించి ఉషకు అనుకూలం చేయమని కోరాడు .త్వష్ట అలాగే చేయగా ‘’ప్రభాస తీర్ధం ‘’ఏర్పడింది .బాడబ రూపాలలో ఉషా ఆదిత్యులు గంగానదిలో సంగమించి,అశ్వినీ దేవతలా జన్మకు కారణ మైన చోటు ‘’అశ్వినీ తీర్ధం ‘’అయింది .యమునా, తాపీ లు తండ్రిని చూడటానికి వచ్చిన ప్రదేశం ‘’భాను తీర్ధం ‘’.అరుణా ,వారుణా నదులు గంగను కలిసిన చోటు లన్నీ 27 వేల తీర్దాలయ్యాయి –‘’స్మరణా త్పఠనా ద్వాపి శ్రవణాదపి నారద –సర్వపాపవినిర్ముక్తో ధర్మవాన్స సుఖీభవ ‘’అని బ్రహ్మ నారదమునికి వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20 11- 18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
. ,
—

