గౌతమీ మాహాత్మ్యం -13
21-గరుడ తీర్ధం
ఆది శేషుని కుమారుడు మణినాగుడు గరుత్మంతునికి భయపడి శంకరుని భక్తితో మెప్పించి ,వరం కోరుకోమనగా ,గరుడుని వలన అభయం కోరగా సరే అన్నాడు .ఇక గరుడభయం లేదని క్షీర సముద్ర సమీపంలో గరుడు ఉండే చోటికి వెళ్ళాడు .వాడిని గరుడుడు నాగపాశంతో బంధించి తన ఇంట్లో ఉ౦చేశాడు .నందీశ్వరుడు ఈశ్వరునితో మహానాగుడు సురక్షితంగా ఉండవచ్చు లేక శాశ్వతంగా బందీ అయి ఉండవచ్చునన్నాడు .శివుడికి విషయం తెలిసి ,విష్ణుమూర్తి ని స్తుతించి ,నాగుడిని విడిపించి తీసుకురమ్మన్నాడు .నంది విష్ణువుకు చెప్పగా ,ఆయన గరుడుని నాగుడిని నందితోపంపమని చెప్పగా అతడు ఇవ్వనని మొండికేసి ,నిష్టూరంగా ‘’ఇతర ప్రభువులు అడిగినవన్నీ ఇస్తావు .నాకేదీ ఇవ్వవు .పైగా నేను తెచ్చుకొన్నది లాక్కుం టావు .శివుడు చూడు నందిద్వారా నాగుని విదిపించుకొంటున్నాడు .నువ్వేమో నా సంపాదన నందికి దోచిపెడుతున్నావు .ఎల్లకాలం నిన్ను మోస్తున్నందుకు నాకు దక్కే ప్రతిఫలం ఇంతేనా ?సజ్జనులు సేవకులకు అడిగినా అడక్కపోయినా ఇస్తారు .నువ్వు ఇవ్వనూ ఇవ్వవు . పైగా నాది అప్పనంగా ఇతరులకు అప్పచెబుతావు నాబలమవలన యుద్ధాలలో గెలిచినా ,నువ్వే గొప్ప వీరుడవని పొగుడుకొంటావు’’అని రెచ్చి పోయాడు .పన్నగ శయనుడు చిరునవ్వు నవ్వి నంది ,లోకపాలుర సమక్షం లొ ‘’నువ్వు బుద్ధిమంతుడివి .మహా బలవంతుడివి .నేనే నిజంగా అశక్తుడిని .నా చిటికెనవ్రేలిని మోసుకొని నంది దగ్గరకు వెళ్ళు ‘’అని ,గరుడుని నెత్తిపై తన చిటికెన వ్రేలు ఉంచగా అతడి శిరస్సు పొట్టలోకి దూరిపోయింది. పొట్ట పాదాల దగ్గరకు చేరి గరుత్మంతుడు పొడిపొడి అయ్యాడు .
తన ‘’లావు’’ ఏమిటో తెలిసిన గరుడుడు ఏడుస్తూ ‘’పొరపాటైంది లోకనాధా !.సర్వ లోకభర్త, కర్తానువ్వే .అపరాధాలు చేసేవారిని క్షమించే కరుణాకరుడవని మునులు నిన్ను స్తుతిస్తారు .ఆర్తుడనైన నన్ను రక్షించు ‘’అంటూ ప్రాధేయపడ్డాడు .లక్ష్మీ దేవి ‘’ఆపదలో ఉన్న ఈ సేవకుని కరుణించు ‘’అనగా మురారి నందితో గరుడుని తీసుకొని శంకరుని చేర్చమనగా ,గరుడుడితో సహా నాగాన్ని శంకరుని వద్దకు తీసుకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు .
శివుడు గరుత్మంతునితో ‘’గౌతమీ నదిలో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకో ‘’అని చెప్పగా గంగానదిలో మునిగి పాపదూరుడై శివ కేశవులను స్తుతించి ,బంగారు రెక్కలు పొంది ,వజ్ర శరీరుడు,మహాబలుడు ,అతి వేగగామి,సర్వ శక్తిమంతుడై గరుత్మంతుడు విష్ణులోకం చేరి మళ్ళీ సేవాకార్యంలో చేరాడు .గరుడుడు స్నానించిన చోటు గరుడ తీర్ధం గా ప్రసిద్ధి చెందిందని ,అక్షయ ఫలమిస్తుందని బ్రహ్మ దేవుడు నారద మహర్షికి వివరించాడు .
22 –గోవర్ధన తీర్ధం
నారదునికి బ్రహ్మ గోవర్ధన తీర్ధ మహిమ వర్ణిస్తూ –జాబాలి అనే బ్రాహ్మణుడు పొలం దున్నుతూ ,మిట్టమధ్యాహ్నమైనా అలసి వగరుస్తున్నా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వకుండా అవి ఏడుస్తున్నా వదలకుండా కొడుతూ బాధించేవాడు .ఆ మూగజీవుల బాధ చూసి కామధేనువు ,సురభి నందికి చెబితే ,ఆయన శివుడికి విన్నవిస్తే ,ఆయన ఆజ్ఞతో నంది సమస్త గోగణాన్నితెచ్చి దాచేశాడు .లోకాలన్నీ తల్లడిల్లి సురులు బ్రహ్మకు చెప్పగా ఆయన శివుడిని వేడుకోమనగా వెళ్లి సుప్రసనన్నుని చేసుకొనగా నందిని అడగమని చెప్పగా ,తమకు ఉపకారం చేసే గోవు ను ఇవ్వమని కోరగా ‘’గో సవము ‘’ఆనే క్రతువు చేయని చెప్పగా ,వారు గౌతమీ తీరం లొ’’ గోసవ క్రతువు ‘’ చేయగా గౌతమీ నది శుభ పవిత్ర పార్శ్వభాగం లో దివ్య ,మానుష గోగణాలు వృద్ధి అవటం ప్రారంభించాయి .అప్పటినుండి గోవులు వర్ధనం చెందిన ఈ తీర్ధం ‘’గోవర్ధన తీర్ధమయింది.దీనిమహిమ అనంతం ‘’అని బ్రహ్మ నారదుని తెలియ జేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21 11-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

