గౌతమీ మాహాత్మ్యం -27
40-ఇలా తీర్ధం -2
బుధుడు తల్లి ఇలాకాంతను ఏమికావాలని అడిగితె పుత్రుని ఇవ్వమని కోరగా లోక ప్రసిద్ధుడైన క్షత్రియ పుత్రుడు జన్మిస్తాడని చెప్పగా కొంతకాలానికి బుధ ,ఇలాకాంత లకు కుమారుడు జన్మించగా స్వర్గ లోకమంతా దిగి వచ్చి ఆశీర్వదించగా ఆబాలుడు గట్టిగా అరవటం చేత అతడికి ‘’పురూరవుడు’’ అని పేరుపెట్టి బుధుడు ప్రయోగ సహిత ధనుర్విద్య నేర్పాడు.తల్లి దుఖిస్తుండగా అతడు కారణం అడిగితె ఆమె ‘’పూర్వం నేను పొందిన దుఖం జ్ఞాపకం వచ్చింది ‘’అనగా దాన్ని వివరిచమని కోరగా ఆమె సవిస్తరంగా జరిగిందంతా చెప్పేసి,ఆమెకు పుంస్త్వం ఎలాగు వస్తుందని అడగగా బుధుని అడగమని పంపగా ,తండ్రిని చేరిఅడుగగా ‘’మహా ప్రాజ్నా పుత్రా !నాకు ఇలుడు తెలుసు.అతడు ఎలా స్త్రీ అయిందీ తెలుసు .దీనికి నువ్వు శివపార్వతులను ఆశ్రయించు వారే మార్గ దర్శకులు ‘’అనగా వాళ్ళను చేరటం ఎలా అని అడిగితేశివ పార్వతులు గౌతమీ తీరం లో ఉంటారని వారిని మెప్పించమని హితవు చెప్పాడు .
బుధ పురూరవులు ఇలా గంగానదిని చేరిఉమాశంకరులను స్తోత్రాలతో మెప్పి౦చారు –
‘’యౌ కుంకుమేన స్వశరీరజేనస్వభావ హేమ ప్రతిమౌ సరూపౌ –యా వర్చితౌ స్కంద గణేశ్వరాభ్యాం ,తౌ మే,శరణ్యౌశరణం భవేతాం’’
‘’సంసార తాపత్రయ దావా దగ్ధాః-శరీరణో యౌపరి చింత యంతః-సద్యః పరాంనిర్వృతిమాప్ను వంతి-తౌశంకరౌ మే శరణం భావేతాం ‘’అంటూ బుధ, ఇలా లు స్తుతించారు భావం –బంగారు వన్నె శరీరం నుంచి పుట్టిన కుంకుమ తో సమానమైన రూపం కలవారో ,ఎవరు స్కందుని ,గణపతి చేత పూజింప బడినారోఅలాంటి పార్వతీ పరమేశ్వరులకు శరణు .
సంసార తాపత్రయ మనే దావాగ్ని చే దహింప బడే మానవులు ,ఎవరిని భావించి ,పరమానందం తృప్తీ పొందుతారో అలాంటి ఉమామహేశ్వారులు మాకు శరణు .
పురూరవుడు కూడా ‘’ఎవరివలన ఈ ప్రపంచం పుట్టి పెరిగి లయమౌతుందో అలాంటి గౌరీ శంకరులను శరణు వేడుతున్నాను ‘’అని ప్రార్ధించాడు .ఉమాదేవి ఇతడిని ఏం కావాలని అడగగా ఇలా రాజు తెలియక ఉమావనం లో ప్రవేశించిస్త్రీగా మారాడు.ఆయనకు పుంస్త్వం ఇవ్వు ‘’అని కోరగా ఆమె శివాజ్ఞతో సరేననగా శివుడు వారిని గౌతమీ స్నానం చేస్తే అంతా సుఖమౌతుందని చెప్పాడు .
అలాగే వారు గౌతమీ స్నానం చేయగా బుధుని భార్య శరీరం నుంచి నీరు స్రవించి అయే లో నుంచి నృత్య గీత లావణ్యాలతో గంగాజలం లో కలిసిపోయింది .అక్కడి నుండి నృత్య ,గీత లావణ్య (సౌభాగ్యా )నదులేర్పడి గంగలో సంగమించాయి .ఇవే పుణ్య సంగమ త్రయం .
ఉమామహేశ్వర వరం తో ఇలాకాంత ఇలారాజుగా మారి రాజు మహాభ్యుదయం కోసం అశ్వ మేధ యాగం చేశాడు .అప్పుడు చతుతురంగ బలాలను ,రాజ్యాన్ని దండకారణ్యం లో ఉ౦చేశాడు.అక్కడ వెలసినదే ‘’ఇలాపురం ‘’.తర్వాత తన పుత్రులకు రాజ్యపాలన అప్పగించి ,పురూరవునికి ఈ కొత్త రాజ్యం కు రాజును చేశాడు .ఇలభూపతి పుంస్త్వం పొంది ,యాగం చేసి ,ఎక్కడ నృత్యగీత సౌభాగ్యనదులేర్పడి గంగా సంగమం చేశాయో ఆ గౌతమి ఉభయ తీరాలలో 16శుభ తీర్దాలేర్పడ్డాయి .ఇక్కడే ఇలేశ్వర శివుడు కొలువై ఉన్నాడు .ఇక్కడ చేసిన అన్ని కార్యాలు సర్వ శుభాలనిస్తాయి .అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-18-ఉయ్యూరు
—

