గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
366- సంస్కృత నాటక కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006)
సాలగ్రామ కృష్ణ రామ చంద్రరావు 4-9-1925 న కర్నాటక లోని హసన్ లో జన్మించారు .చిన్నతనం బెంగుళూరు లో తాతగారి వద్ద గడిపారు .అక్కడే చదువు ప్రారంభించి, సంస్కృతం ను మహా సంస్కృత విద్వాంసుడు అగ్నిహోత్రి విఠలాచార్ వద్ద నేర్వటం మొదలు పెట్టారు .వీరి వద్ద నేర్చిన సంస్కృతం గొప్ప పునాదిగా ఏర్పడి ,ఆతర్వాత ఎన్నో సంస్కృత రచనలు చేయటానికి దోహదపడింది .తాతగారి మరణం తర్వాత నంజన్ గూడ్ అనే చిన్న పట్టణం చేరి,తలిదంద్రులవద్ద ఉండి పోయారు .మైసూర్ వెళ్లి చదువు పూర్తి చేసి సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు .పాళీ భాషనూ తరచి చూశారు .
మొదట్లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రిసెర్చ్ అసిస్టెంట్ గా చేరి ,తర్వాత ఆల్ ఇండియా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెంటల్ సైన్స్(N.I.M.H.A.N.S .) లో ఉద్యోగించారు.క్రమంగా పదోన్నతిపోంది 1965 నాటికి క్లినికల్ సైకాలజీ హెడ్ అయ్యారు . ‘’నిమ్హాన్స్ ‘’లో పని చేస్తున్నప్పుడే ‘’ది డెవలప్ మెంట్ ఆఫ్ సైకలాజికల్ థాట్ ఇన్ ఇండియా ‘’అనే గొప్ప గ్రంథం రచించారు .Thematic Apperception Test’’(T.A.T.)కార్డ్ లకు భారతీయ అనువర్తనం (వెర్షన్ )చేశారు .వీటిని ఆధారంగా ప్రయోగాలు కూడా చేశారు .మానసిక శాస్త్రాన్ని బాగా ప్రభావితం చేసిన భారతీయ సైకాలజీ ని ‘’నిమ్ హాన్స్ ‘’కోర్సులో చేర్ఛి సిలబస్ లో విప్లవాత్మక మార్పు తీసుకు రావటానికి విశేష కృషి చేశారు.
నిమ్ హాన్స్ ను 1965లో వదిలేసి బెంగుళూరు లో అనేక విద్యా సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా, సైకాలజీ, ఇండాలజీ, ఫిలాసఫీ,విద్య , సోషల్ వర్క్ మొదలైన విషయాలను బోధించారు .తర్వాత కాలమంతా ప్రసంగాలు ,రచనా వ్యాసంగం ,ఇంటివద్ద విద్యార్ధులకు బోధనలతో గడిపారు .
భారతీయత మూర్తీభవించిన సాలగ్రామ సంస్కృత ,ఆంగ్లభాషలలో గొప్ప గ్రంథాలు రచించారు .అవన్నీ భారతీయ సంస్కృతీ, వేదాంతం,కళ,సంగీతం ,సాహిత్యం కు సంబంధించినవే .సంస్కృతం లో ఒకనాటకం రాశారు .ఆచార్య బుద్ధ ఘోషుడు రాసిన ’’విశుద్ధమాగ్గ ‘’కు పాలీభాష లో వ్యాఖ్యానం రచించారు .’’సుమంగత గాథ’’పై పాళీ భాషలో పరిశీలనాత్మక గ్రంథం రచించారు .ఎన్ సైక్లో పీడియా ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ,శ్రీ చక్ర ,ది యంత్రాస్ ,ఎన్ సైక్లో పీడియా ఆఫ్ ఇండియన్ ఐకనోగ్రఫీ ,మంత్ర, తంత్ర, యంత్ర ,తంత్రా సైకాలజీ ,సాలగ్రామ కోశ ,సోషల్ ఇన్ స్టి ట్యూషన్స్ అమాంగ్ ది హిందూస్,గణేశ మొదలైన పుస్తకాలు కూడా రచించారు .
2-2-2006న 82 ఏళ్ళ వయసులో మరణించి ,సాలగ్రామ సన్నిధి ,శ్రీ రామ ,కృష్ణ సాన్నిధ్యమైన వైకుంఠం చేరే నాటికి ఆయన’’ 32 భాగాల ఆంగ్ల ఋగ్వేదం’’ రచిస్తున్నారు .ఆయన మరణి౦చిన తర్వాత 2007లో 16 భాగాలు ప్రచురి౦ప బడినాయి .అసలు సిసలు భారతీయత మూర్తీభవించిన అసమాన ప్రతిభాసంపన్నులు శ్రీ సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు.
చిత్ర లేఖనం శిల్పం లలో కూడా సాలగ్రామ నిష్ణాతులు .ఆయన వేసిన ,చెక్కినవి బెంగుళూర్ రవీంద్ర కళాక్షేత్రం లో శాశ్వతంగా చోటు చేసుకొన్నాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-19-ఉయ్యూరు

