గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
368-ఆయుర్వేదాబ్ది సారం –అజ్ఞాత కర్త
ఆయుర్వేదం లోని సారాన్ని అంతటినీ అందించే ఉద్గ్ర౦థమే ఆయుర్వేదాబ్ది సారం .రెండుభాగాలలో ఉన్న ఈ గ్రంథం మొదటిభాగం లో 4,433 శ్లోకాలున్నాయి .రోగాలకారకాలు రోగ లక్షణాలు ,నివారణ చర్యలు తెలియ జేస్తుంది .దీని కర్త ఎవరో తెలియదుకాని బహు శ్రమ కోర్చి ,పూర్వ గ్రంధాలనుండి విషయాలను సేకరించి తయారు చేశాడు .ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చి౦చాడు అజ్ఞాతకవి .వ్రాత ప్రతిలో చివర 1796లో త్రిపాఠీ మహా శుక ప్రసాద్ దీన్ని పూర్తి చేసినట్లున్నది .జిజ్ఞాసువులకు ,పరిశోధకులకు అరచేతిలోని ఉసిరి ఈ గ్రంథంఅని దీని ప్రచురణకు సంపాదకత్వం వహించిన ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడుగారు అభిప్రాయపడ్డారు .
దీని రెండవ భాగ0 ప్రొఫెసర్ ఎం.గోపాలరెడ్డి సంపాదకత్వం లో వెలువడింది .ఇందులో 5,476శ్లోకాలు ఉపజాతి వసంత లతిక , దోద్ధాక ,పృథ్వి ,శార్దూలం స్రగ్ధర మొదలైన వివిధ ఛందస్సులలో అనుష్టుప్ చందం లో ఉన్నాయి . మొదటిభాగం లో లాగానే అన్ని విషయాలతోపాటు మందులు తయారు చేసే విధానం విస్తృతంగా వర్ణించబడింది .వ్యాధుల నిర్ధారణకు నాడీ పరీక్షా మూత్ర పరీక్షా విధానమూ వివరించబడింది .మనిషి జీవన ప్రమాణాన్ని గురించి చర్చి౦చి దీర్ఘాయుస్సుకు తీసుకోవలసిన మెళకువలు కూడా చేర్చారు .ఉత్తమ వైద్యం అంటే ఏమిటో వివరణ ఉంది .దీర్ఘకాలం బ్రతకాలంటే మందుల అవసరమేమిటో వివరించబడింది .దీర్ఘకాలం జీవించాలనే ఇచ్చ కు రోగాలు లేకుండా ,ఆరోగ్యంగా అంతకాలం ఎలా జీవించాలో వివరణ ఉన్నది.ఈ భాగమూ విద్యార్ధులకు వైద్యులకు సిద్దాన్జనంగా ఉన్నది
ఈ రెండుభాగాలను సంస్కృత అకాడెమీ ప్రచురించింది .
369-రుగ్వేదార్ధ సార కర్త –దినకర
ఇప్పటిదాకా ప్రచురణ పొందని దినకర రాసిన రుగ్వేదార్ధ సార గ్రంథాన్ని సంస్కృత అకాడెమి డాఆర్యేందు శర్మ సంపాదకత్వం లో 1959లో ప్రచురించింది.ఋగ్వేదం లోని 200 మంత్రాలకు దినకర రచించిన వ్యాఖ్యానం ఇది .బరోడా ,బికనీర్ గ్రంధాలయాలలోని వ్రాతప్రతులనుసేకరించి ప్రింట్ రూపం ఇచ్చిన అపురూప గ్రంథం .1-8అస్టకాలలో 86,13,6,2,1,1,4,94మంత్రాలకు దినకరుడు వ్యాఖ్యానం చేశాడు .
370-క్రియాస్వర లక్షణం కర్త –సూరు భట్ట
సంస్కృత అకాడెమి డా పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి సంపాదకత్వం లో సూరు భట్టు రచించిన క్రియా స్వర లక్షణం గ్రంథాన్ని1983లో ప్రచురించింది .కృష్ణ యజుర్వేద స్వర విధి ‘’యత్’’మరియు’’ హి’’ పదాలతో ప్రారంభమౌతాయని అందుకే దీనికి ‘’యో హి భాష్యం ‘’అనే సార్ధకనామం ఏర్పడిందని ఆచార్య పుల్లెల చెప్పారు .అనేక గ్రంధాలయాలలోని మాన్యు స్క్రిప్ట్ లను కాచి వడపోసి తెచ్చిన అపూర్వ గ్రంథం.డా బూర్గుల రామ కృష్ణారావు గారు సంస్కృత అకాడెమి అధ్యక్షులుగా ఉన్నప్పుడే 1956లోనే వెలుగు చూడాల్సిన ఈ పుస్తకం ,అని వార్యకారణాలవలన ఆలస్యమై ,ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు సంస్కృత అకాడెమి అధ్యక్షులయ్యాక 1983లో ప్రచురింపబడింది .
సశేషం
ఆధారం –సంస్కృత అకాడెమి కేటలాగ్
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-19-ఉయ్యూరు

