గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
371-కౌండిన్య శిక్ష –అజ్ఞాత కవి
కాలము వివరాలు తెలియని కవి రాసిన ‘’కౌండిన్య శిక్ష ‘’దొరికిన వ్రాత ప్రతి ఆధారంగా డి.జి.పాధ్యే మొదటి సారి కూర్చాడు ఆ తర్వాత ఆచార్య పుల్లెల శ్రీ రామ చంద్రుడు గారి సంపాదకత్వం లో సంస్కృత అకాడెమి 1980 లో వెలువ రించింది . కౌండిన్య శిక్ష లో 104 శ్లోకాలున్నాయి .కృష్ణ యజుర్వేదం లోని ఘన పాఠానికి చెందిన వికృతుల గురించి తెలియ జెప్పే గ్రంథం.వేద పండితులకు చింతామణి గా భాసిస్తుంది .
372-కాశిక కర్తలు –జయాదిత్య ,వామన
జయదిత్య ,వామన లు సంయుక్తంగా పాణిని అష్టాధ్యాయి పై రాసిన సంపూర్ణ వృత్తి .ప్రొఫెసర్ ఆర్యే౦దు శర్మ ,శ్రీ ఖండేరావు దేశపాండే,శ్రీ డి జి పాధ్యే ల సంపాదకత్వం లో సంస్కృత అకాడెమి 1969 లో ముద్రించిన పుస్తకం .ఉస్మానియా యూని వర్సిటి ,భండార్కర్ ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ,డా లీబిటీ,ప్రజ్ఞా పాఠశాల, బరోడా ఓరియెంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రరి, తంజావూర్ సరస్వతి మహల్ లైబ్రరీ లలో ని వ్రాత ప్రతులను క్షుణ్ణంగా అధ్యయనంచేసి తయారు చేసిన రెండుభాగాల శుద్ధ ప్రతి ఇది .
373-కాశికా వివరణ పంజిక కర్తలు –బోధిసత్వ దేశీయాచార్య ,జినేంద్ర బుద్ధిపాద
బోధిసత్వ దేశీయాచార్య జినేంద్ర బుద్ధిపాద లు సంయుక్తంగా రచించిన ‘’న్యాస ‘’అనే కాశికా వివరణ పంజిక అనే ఈ గ్రంథం జయాదిత్య ,వామనులు రాసిన ‘’కాశిక ‘’పై వెలువడిన మొట్టమొదటి వ్యాఖ్యానం .న్యాస లో జినేంద్ర బుద్ధి తాను రాసిన వ్యాఖ్యానాన్ని పూర్వం ఉన్న వ్యాఖ్యానాల నాధారంగా చేసుకొని రాశానని చెప్పుకొన్నాడు .మల్లినాథ సూరి తో సహా చాలామంది దీనిపై అనేక వ్యాఖ్యానాలు ఉప వ్యాఖ్యానాలు రాశారంటే దీనికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటో అర్ధమౌతోంది .ప్రొఫెసర్ పుల్లెల శ్రీరామ చంద్రుడు ,వి.సుందర శర్మల సంపాదకత్వం లో సంస్కృత అకాడెమి రెండు భాగాల ఈ పుస్తకాన్ని1985లో ప్రచురించింది .వ్యాకరణం పై వచ్చిన ఈ అపూర్వ గ్రంథం .వ్యాకరణం అధ్యయనం చేసేవారికి, పండితులకు విశేషంగా ఉపయోగపడుతుంది .
374-పదమంజరి కర్త –హరదత్త మిశ్ర
వామన ,జయాదిత్యల కాశిక కు హరదత్త మిశ్ర రచించిన వ్యాఖ్యానమే పదమంజరి .రెండుభాగాల ఈ గ్రంథం కాశిక పై అపూర్వ ఉన్నత వ్యాఖ్యానం .బాంబే ,భండార్కర్ ,బరోడా వ్రాత ప్రతులను ఆధారంగా చేసుకొని రూపొందించిన శుద్ధ ప్రతి .ఆచార్య పుల్లెల, శ్రీ సుందరరామ శర్మ గార్ల సంపాదకత్వం లో సంస్కృత అకాడెమి 1981 లో వెలువరించింది .మొదటి భాగం లో 1-4అధ్యాయాలపై ,రెండవ భాగం లో 5-8అధ్యాయాలపై వ్యాఖ్యానం ఉంటుంది.
375-ధాతు కారిక కర్త –చామరాజనగర శ్రీ కంఠ శాస్త్రి (19వ శతాబ్దం )
19 వ శతాబ్దపు సంస్కృత పండితులు ఆధునికులకు కరతలామలకంగా ఉండటానికి అనేక వ్యాకరణ గ్రంథాలు రాశారు .అందులో చామరాజనగర శ్రీ కంఠ శాస్త్రి రాసిన ‘’ధాతు కారిక ‘’ఒకటి .1989లో తెలుగు అక్షరాలలో వెలువడిన పుస్తకం ఇది .దీనిలో రెండవభాగం ‘’దాతు రూప ప్రకాశిక ‘’..సంస్కృత అకాడెమి ధాతు కారికను దేవనాగర లిపిలో 1996లో ప్రచురించింది .పాణిని ధాతుపాఠం ఆధారంగా ధాతువు లన్నిటినీ చర్చించిన పుస్తకం .శ్లోక రూపం లో ధాతువులు ,వారి అర్ధాలను వివరించే పుస్తకం ఇది .వ్యాకరణ విద్యార్ధులకు ,బోధకులకు ఉపయుక్త గ్రంథం.దీని సంపాదకులు ప్రొఫెసర్ బి .నరసింహా చార్యులు ,డా.వి శ్రీనివాస శర్మ గార్లు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-19-ఉయ్యూరు

