గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)
అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి విడంబనం ఇతని కృతులు .సంస్కృతం చదివే వారందరికీ భాగవత చంపు అనుభవం లోకి వచ్చేదే .భారత చంపు అంతగా రాణి౦చక పోవటానికి కారణం ప్రత్యర్దికవి అనంత భట్టు రాసిన భారత చంపువు .ఈ చ౦పువు అ చంపువుకు గ్రహణం పట్టించింది .మూడవ కావ్యం శ్రీ శంకరాచార్య స్తుతి .నాలుగవది ఓరియెంటల్ లైబ్రరీకే పరిమితం
అభినవ కాళిదాసు దక్షిణ దేశ ప్రభువు రాజశేఖరుని ఆస్థాన కవి అన్నాడు కవి కు౦జరుడు .కాని ఇది సరిపోవటం లేదు .కవి కున్జరుని అభిప్రాయం ప్రకారం తన గురువు అభినవ కాళిదాసు రాజ శేఖర రాజు ఆస్థానం లో పలుకుబడిగల కవి .కొత్తవారినెవ్వరినీ ప్రోత్సహించనివాడు అయిన దుర్జయుని కవితా ప్రతిభతో జయించాడు .దీన్ని బట్టి వెల్లాల కవి 1235కాలం వాడని నిర్ణయించారు .తల్లి తిరుమలాంబ .తత్వ చంద్రిక ,విరోధ వరూధిని ,ప్రసంగ రత్నాకరం ,అద్వైత కామ దేను ,వేదాంత సిద్ధాంత సారం ,’’శృంగార శేఖర భాణం’’కూడా రాశాడు .వీటిని బట్టి వెల్లాల కవి అన్ని శాస్త్రాలలో గొప్ప పా౦డిత్యం ఉన్నవాడని తెలుస్తోంది .అభినవ కాళి దాస బిరుదు సమర్ధనీయం అనీ అని పిస్తుంది .మహోపాధ్యాయ పక్షధార ఎల్లయ్య శిష్యుడు అక్కయ సూరి రాసిన వ్యాఖ్యానం బట్టి వెల్లాల కవి గొప్పతనం ప్రదర్శితమైంది .మంధన ,బెల్లం కొండ రామ రాయ కవుల వ్యాఖ్యానాల వలన మనకవి ప్రతిభ అర్ధమవుతుంది .
భాగవత చంపు రాయటానికి కారణాలు కవి చెప్పుకొన్నాడు -”అభినవ పద పూర్వ కాళిదాసః ప్రగల్భః -త్రినయన దయితాయాః ప్రేమ దిమ్భర స్తృతీయః-విరచ యతి తయైవ ప్రేరితః ప్రేమ పూర్వ -హరి గుణ పరిణద్దం చారు చంపూ ప్రబంధం ”.
అభినవ కాళిదాసు తనపై మహా కవి కాళిదాసు ప్రభావం ఎలా ఉన్నదీ తెలియ జేశాడు .తన కావ్యమంతా ధ్వని ప్రధానమైనదని కనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలని చెప్పాడు .ఆరు విలాసాలతో ఉన్న ఈ చంపు శ్రీ కృష్ణుని జీవితం లో ముఖ్య ఘట్టాలను వివరిస్తుంది .చివర్లో రాధ ను కూడా ప్రవేశ పెట్టాడు .వారిద్దరి శృంగార చేస్టల వర్ణన కూడా ఉంది .అలక చెందిన పెద్దభార్య రుక్మిణీ దేవిని అనునయించటం తో ముగించాడు .
ఇతని శృంగార శేఖర భాణం శృంగార శేఖర ,ఉత్పలమాల ప్రేమ వ్యవహారం .కామ కోటి వల్లభ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .కవిగోత్రం కాశ్యప అని దీనిలో చెప్పాడు .చివరలో చెప్పిన శ్లోకం చూద్దాం –
”అనితర రసాదీనం భూయాదానంగా పదం -హృదయ మసు క్రుంచ్చ్రున్గార ద్వేత శృ౦ఖలితమ్
రస ధారా కలాపీడం శ్యామామయం కరుణామయం -శమయుత పునర్జన్మ వలేశం మమాపి పర౦ మహః ”
ఇప్పుడు వెల్లాలవారి’’ శృంగార శేఖర భాణ౦ ‘’గురించి తెలుసుకొందాం –
ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వెలువరించిన ఈ గ్రంథం మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండాగారం లోని ఒకే ఒక వ్రాతప్రతి ఆధారంగా పరిష్కరించి ముద్రించింది .పీఠికలో ఆంధ్రులు రాసిన భాణాలను ఎన్నిటినో పేర్కొని ,అభినవ కాళిదాస బిరుదా౦కితులను గురించి ప్రస్తావించి వెల్లాలవారు భాగవత చంపూ ప్రబంథాదులు రచించిన కవి అని తెలియజేశారు .ఇవికాక శ్రీ రంగాచార్య కృత పంచభాణ విజయం (1887),శ్రీ వరదాచార్య కృత వసంత తిలక భాణ౦ (1872)ఈచంబాడి శ్రీనివాసాచార్య కృత శృంగార తరంగిణీ భాణ౦ (1883)తమ ఇంట ఉన్నాయని ఈ ముగ్గురూ తెలుగువారే అనీ సమీక్షకులు శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు చెప్పారు .పీఠికలో పేర్కొన్న రేచర్ల సింగన కృతమైన ‘’కందర్ప సంభవ భాణం’’ లభించలేదని ,దీన్ని తన రచనయే అని చమత్కార మంజరిలో విశ్వేశ్వర కవి ,రసార్ణవ సుధాకరం లో సర్వజ్ఞ సింగ భూపాలుడు పేర్కొన్నారని చెప్పారు .
దశ విధ రూపకాలలో భాణం ఏకాంకిక . .శృంగార లేక వీర రస ప్రధానం .కాని శృంగార ప్రదానాలే ఎక్కువై జుగుప్స కలిగిస్తాయన్నారు శాస్త్రీజీ .భాణకర్తలు దాదాపు అందరూ వ్యాకరణ తర్క మీమాంస వేదాంతాలలో నిష్ణాతులే .
భాణం ఏక పాత్ర ప్రయోగం తో ,రంగ ప్రవేశం చేయని పాత్రల ప్రస్తావనతో ,ఆ పాత్రల స్వరాలను చక్కగా అభినయిస్తూ రక్తి కట్టిస్తుంది .ఖడ్గయుద్ధాలు ,పొట్టేళ్ల పోరాటాలు ,కోళ్ళపందాలు ,జార ధర్మాసనాలు వర్ణింపబడతాయి .ఆయాపాత్రల ,శబ్దాల అనుకరణ వలన ప్రయోజన సిద్ధి లభిస్తుంది .అందుకే భాణం శ్రవ్య కావ్యానికి దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది అంటే ధ్వన్యనుకరణ విద్యా ప్రదర్శనానికి భాణం గొప్ప వేదిక అవుతుందన్నమాట .ఒకే పాత్ర అద్భుతమైన నాటకీకరణ ,అసాదారణమైన ధ్వన్యనుకరణ వలన భాణం బహు రక్తికడుతుంది . శృంగార శేఖర భాణంలో ప్రధమ శ్రేణికి చెందిన ప్రాతిభా విలాసం తక్కువగాఉన్నా ,కవితాధార ,శృంగార రసవర్ణన ,చమత్కారం పుష్కలం గా ఉన్నాయి .కవి కవిసమయాలను అనువుగా ఉపయోగించుకొన్నాడు అని సంపాదకులు చెప్పింది యధార్ధమన్నారు నోరివారు .ప్రస్తావనలో సూత్రధారుడు ప్రేక్షక సమాజం గురించి చెబుతూ –
‘’అధీతరతి తంత్రాణా మనంగ –బ్రహ్మ వాదినం –సోయం విదగ్ధ మిశ్రాణా౦ –సమాజ సముపస్థితిః’’అంటాడు .నాయకుడు దారిలో చందనలత తల్లి రమ్మని లోపలి పిలువగా అనుకొన్నమాటలు –
‘’కిమాత్ధ?అంతర్న ప్రవిశ్యతే భావే వేతి-శిఖి సాంప్రతముత్పలమాలాయా దర్పణ పరిణయ నోత్సవార్ధం గమ్యతే –శ్వః సమాగామాన్తాస్మి –ఇయ మాశీః
‘’స్తవ శాలి సుతా యాస్తే తరంగిత రతిక్రియం -అస్తు మన్మథ సర్వస్వ మఖండిత మిదం వయం ‘’
చివరలో భరత వాక్యం కూడా కాముకుల ఆశయాలకు అనుగుణంగానే సాగింది –
‘’అనితర రసా ధీనం భూయా దనంగ పదం పదం(పరం ) –హృదయ మసకృచ్చ్సంగా రాద్వైత శృంగలితం నృణాం-శశిధర కలా పీడం శ్యామామయం కరుణామయం –శమయతు పునర్జన్మ క్లేశం మమాపి వరం మహః ‘’
ఆధారం –శృంగార శేఖర భాణ౦ పై శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు 1973 జనవరి భారతి మాసపత్రికలో చేసిన సమీక్ష .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-19-ఉయ్యూరు

