గౌతమీ మాహాత్మ్యం -34
46-శేష తీర్ధం
శేషుడు రసాతలానికి అధిపతి .సమస్త ఫణి రాజులు అతని అధీనం లో ఉండేవారు .అంతకు పూర్వమే దేవతలు రాక్షలకు అది ఆవాసభూమి .నాగరాజును అడ్డుకొనగా అతడు బ్రహ్మకు ‘’స్వామీ !నువ్వే నన్ను పాతాళాకి పంపావు .కాని దేవదానవులు నన్ను రానివ్వటం లేదు .నువ్వే దిక్కు ‘’అని శరణువేడాడు . బ్రహ్మ గౌతమీనదికి వెళ్లి ,మహాదేవుని అర్చించి శరణు పొందమని హితవు చెప్పాడు .అలాగే గంగానది చేరి పవిత్ర స్నానం చేసి , త్రిదశాధిపతి పరమేశ్వరుని ధ్యానం చేశాడు –
‘’నమః సహస్ర శిరసే నమః సంహారకారిణే-సోమ సూర్యాగ్ని రూపాయ జలరూపాయతే నమః ‘’
‘’సర్వదా సర్వ రూపాయ కాలరూపాయ తేనమః –పాహి శంకర సర్వేశ పాహి సోమేశ సర్వగ –జగన్నాథ నమస్తుభ్యం దేహి మే మనసేప్సితం ‘’అని బహువిధాల స్తుతించాడు .ప్రీతిమానసుడై శివుడు నాగుని కోరికలన్నీ తీర్చాడు .దేవ రాక్షస వినాశానికి శూలం ఆయుధంగా ఇచ్చి శత్రు సంహారం చేయమన్నాడు .
శేషుడు పాములనందర్నీ వెంటబెట్టుకొని రసాతలం చేరి శూలంతో దేవ రాక్షాస సంహారం చేసేసి ,బిలం ద్వారా పైకి వచ్చిశివుని దర్శించాడు .ఆ బిల తలం నుండి పవిత్ర జలం ఉత్పన్నమై గంగానదిలో కలిసింది .శివుడి దగ్గర ఉన్న విశాలమైన కుండం వద్ద శేషుడు నిత్యహోమం చేశాడు .కనుక ఆనీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది .ఈ జలం గంగా సంగమ౦ అయి ,పవిత్ర తీర్ధ స్థలమైంది .చాలాకాలం అక్కడే శివ ధ్యానం తో గడిపి శివ వరప్రసాదం తో సకల అభీష్టాలు నెరవేర్చుకొని మళ్ళీ పాతాళం చేరాడు .అప్పటి నుంచి ఇది నాగతీర్ధంగా పిలువబడింది.ఇది సకల కోరికలను తీరుస్తూ ,ఆయుస్సు సంపద కలిగిస్తుంది ఇక్కడి స్నానదానాలు ముక్తినిస్తాయి అని బ్రహ్మ దేవుడు నారదునికి చెప్పాడు .
47-వడవాది సహస్ర తీర్ధం
మహానలం ,వడ వానలం అని పిలువబడే ప్రసిద్ధ క్షేత్రం గూర్చి నారదునికి బ్రహ్మ వివరించాడు .వడవా అనే నది అక్కడ ఉన్నది జరా మృత్యునివారకం .నైమిషం లో ఋషులు ఒకప్పుడు యజ్ఞం చేసి మృత్యువును ‘’శాంత చిత్తు’’ని చేశారు .మృత్యు నాశనం జరగటం లేదుకనుక ప్రాణులు మరణించటం లేదు .స్వర్గం శూన్యమైంది .మానవ లోకం జనం తో నిండిపోయింది .అప్పుడు దేవతలు రాక్షసులని మునుల సత్రయాగాన్ని భగ్నం చేయమన్నారు .అలా చేస్తే తమకేమిటి లాభం అని వాళ్ళు ప్రశ్నించారు .యజ్ఞార్ధ ఫలం దక్కుతుంది అని చెప్పారు దేవతలు . .
రాక్షసులు దేవతలమాట విని ఋషుల సత్రయాగానికి రాగా ,వారు మృత్యువును ప్రార్ధించారు .అందరూ ఆలోచించి నైమిశం వదిలి ,శమితతో అగ్నిని మాత్రం తీసుకొని అత్యంత వేగంగా గౌతమీ తీరం చేరి స్నానించి మహేశ్వరుని రక్ష చేయమని-‘’మహానలం ,మహాకాయం ,మహానగ విభూషణ౦ -మహా మూర్తి ధరం దేవం శరణం యామి శంకరం ‘’అని
మృత్యువుకూడా ‘’రాక్షసేభ్యో భయం ఘోరమాపన్నం త్రిదశేశ్వర – యజ్ఞ మాస్మా౦ శ్చ రక్షస్వ యావత్సత్రం సమాప్యతే ‘’అనీ ప్రార్ధించారు .సంతుష్టి చెందిన సదాశివుడు మృత్యువుకు ఇష్టమైంది కోరుకోమన్నాడు .ఆయన రాక్షసులవలన మహర్షుల సత్రయాగం విచ్చిన్నమైంది ,కనుక యజ్ఞం పరిసమాప్తి వరకు తమందర్నీ రక్షించమని వేడుకొన్నాడు .శివుడు అలాగే అని చెప్పి వారి కోరిక తీర్చాడు .శమితమైన మృత్యువుతో ఋషుల యజ్ఞం పూర్తయింది .దేవతలు హవిర్భాగం కోసం వచ్చారు .
మహర్షులకు తీవ్రమైన కోపం వచ్చి యజ్ఞ వినాశానికి రాక్షసులను పురికొల్పి పంపినందుకు ,ఇకనుండి రాక్షసులతో నిత్యం శత్రుత్వమే కలుగుతుంది అని శపించారు .అప్పటినుండి దేవతలకు రాక్షసులు శత్రువులైపోయారు .అక్కడ ఉన్న వడవ ను మృత్యువు భార్యగా చేసి అభిషేకించారు ఋషులు .ఆ అభిషేక జలమే నదీ రూపం పొంది వడవా నది అయింది .మృత్యువు స్థాపించి పూజించిన శివలింగం ‘’మహానల లింగం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఆస్థానం వడవా సంగమం గా ప్రసిద్ధమైంది .స్పర్శ మాత్రం చేత ముక్తి నిస్తుంది .సర్వాభీష్ట సిద్ధి నిచ్చే వెయ్యి తీర్దాలు ఆ నదికి రెండువైపులా వర్ధిల్లాయి .
సశేషం
రేపు 10-2-19 ఆదివారం సరస్వతీదేవి జన్మదినమైన శ్రీ పంచమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-19-ఉయ్యూరు

