గౌతమీ మాహాత్మ్యం -40
54-రామ తీర్ధం -2(చివరిభాగం )
యమలోకం లో దశరదునితో యమదూత ‘’మీ కుమారుడు శ్రీరాముడు గౌతమీ తీరం లో ఉండటంవలన ఆ పుణ్య ఫలితంగా నువ్వు నరకం నుండి ఉద్ధరి౦ప బడ్డావు .అతను లక్ష్మణ సమేతంగా గంగాస్నానం చేసి నీకు పిండ ప్రదానం చేస్తే నీ సమస్తపాపాలు హరి౦చి స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది ‘’అన్నాడు రాజు ‘’నేనే వెళ్లి వారిద్దరికీ ఆ మాట చెబుతాను అనుజ్న ఇవ్వండి ‘’అని వేడుకొన్నాడు .వారు అనుమతించగా గంగాతీరం చేరి సీతా రామలక్ష్మణులను చూడ గలిగాడు..రామాదులు పవిత్ర స్నానం చేశారు కాని అక్కడ తినటానికి ఏమీ దొరకలేదు .బాధతో రామునితో తమ్ముడు ‘’ బలపరాక్రమాలున్న మనకు అందులో దశరధ పుత్రులకే తినటానికి ఏమీ లేదు ‘’అనగా అన్న ‘’మనం బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేదు .భూసుర తృప్తి చేయని వారికి అన్నం దొరకదు ‘’అన్నాడు .
అదే సమయం లో దశరధుడు అక్కడికి చేరాడు .అతడు రాక్షసుడో భూతప్రేతమో అనుకోని విల్లు ఎక్కు పెట్టిబాణం వదిలాడు లక్ష్మణుడు .రాజు దుఖంతో తన తీరుకు విలపిస్తూ ఆ ముగ్గురితో ‘’నేను దశరధ మహారాజును .బ్రహ్మ హత్యా దోషం వలన నరకం లో యమ యాతనలు అనుభవించాను ‘’అనగా నిట్టూరుస్తూ రాముడు ‘’ఎందుకు అలా జరిగింది ?’’అని ప్రశ్నించగా తాను చేసిన మూడు బ్రహ్మ హత్యా పాతకాలవలను సవివరంగా చెప్పాడు .విన్న ముగ్గురూ మూర్చ పోయారు .కాసేపటికి తేరుకొన్న సీతాదేవి ‘’దుఖిస్తే ప్రయోజనం లేదు .ఒక దోషాన్ని మీరూ మరో దాన్ని లక్ష్మణుడు పంచుకోండి ‘’అనగా సోదరులు ఆనందంగా అంగీకరించారు .కోడలు సీత మాటలకు మామగారు పొంగిపోయి’’బ్రహ్మజ్నుడైన జనకమహారాజు కుమార్తెవు కనుక నీ నోటి నుండి ఇంత మంచి మాట వచ్చింది ‘’అని మెచ్చి ఎవరూ తన దోషాలను పంచుకోవలసిన అవసరం లేదనీ గంగలో స్నానించి పిండ ప్రదానం చేస్తే ,తన దోష నివృత్తి అవుతుందన్నాడు .
సరే అని అందరూ పవిత్ర గంగా స్నానం చేసి ,పిండప్రదాన౦ కోసం ప్రయత్నిస్తే ఏదీ దొరక్కపోతే ,లక్ష్మణుడు ఇంగుదీ మొదలైన పళ్ళు తెచ్చి వాటిని పిండి చేసి పిండాలు చేసే ఏర్పాటు చేశాడు .అంతటి దశరధ మహారాజుకు ఇంతటి అల్ప పిండాలా అని దుఖం ముంచుకొచ్చింది రాముడికి .ఆశరీరవాణి’’యదన్నః పురుషో రాజ౦ స్తదన్నాస్తస్య దేవతాః ‘’అన్నది అంటే మానవుడు దేన్నీ ఆహారంగా తింటాడో అతని దేవతలుకూడా అదే ఆహారాన్ని తింటారు ‘’.అత్యంత శ్రద్ధాభక్తులతో రాముడు తండ్రికి ఇందుగ పిండి పిండాలను సమర్పించాడు .ఆ క్షణం లో దశరధుడు కనిపించలేదు అతని శవం మాత్రం భూమిపై పడి ఉంది .ఈ ప్రదేశం ‘’శవ తీర్ధం ‘’గా ప్రసిద్ధి పొందింది . లోక పాలకులంతా అక్కడికి విచ్చేశారు .వారిని తన తండ్రి ఎక్కడ అని అడిగాడు రాముడు ‘’ఆయన బ్రహ్మహత్యా దోషాలు పోయాయి .స్వర్గ లోకం చేరాడు చూడు ‘’అనగా దివ్య తేజస్సుతో దశరధుడు వారికి దర్శనమిచ్చాడు .’’కుమారా !నాకు ఉత్తమ లోకాలు కలిగింఛి నన్ను తరి౦పజేశావు .పితృ దేవతలను తరి౦పజేసిన పుత్రుడు ధన్యుడు’’అని ప్రశంసించి దివ్య రధమెక్కిస్వర్గం చేరాడు
అక్కడున్న దేవతలతో రాముడు తన తండ్రి కి నిర్వర్తి౦చా ల్సినవి ఇంకా ఏమైనా ఉంటె చెప్పమని అడిగాడు .అప్పుడు వారు –
‘’నదీ న గంగయా తుల్యా న త్వయా సదృశః సుతం –న శివేన సమో దేవో న తారేణ సమో మంత్రః ‘’-గంగతో సమానమైనది ఏదీ లేదు .నీతో సమానమైన పుత్రుడు లేడు.శివునితో సమానమైన దేవుడు లేడు.ఓంకార మంత్రం తో సమానమైన మంత్రం లేదు ‘’అన్నారు.రాముడు చేసిన పితృకర్మవలన అతని పిత్రుదేవతలంతా తరించారనీ ఇంకా ఏమీ చెయ్యక్కరలేదని యధేచ్చగా తన వన ప్రయాణం సాగించమని ఆనతిచ్చారు .రాముడు అక్కడే శివలింగం ప్రతిష్టించి ,పూజించి అభిషేకించి ,స్తుతించాడు –‘
‘’నమామి శంభుం పురుషం పురాణం ,నమామి సర్వజ్ఞ మపర భవం –నమామి రుద్రం ,ప్రభు మక్షయం తమ్,నమామి శర్వం శిరసా నమామి ‘’రామ స్తుతికి పరమేశ్వరుడు పరమ సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’నేను చేసిన స్తోత్రం తో నిన్ను తృప్తి పరచే భక్తులకు కార్య సిద్ధి కలిగించు .పితరులకు కొడుకు పిందప్రదానామ్ చేస్తే వారు పవిత్రులై స్వర్గం చేరాలి .ఈ తీర్ధం లో చేసిన స్నానాదులన్నీశారీరక మానసిక పాపాలు తొలగించాలి .ఇక్కడ చేసిన స్వల్పదానమైనా అక్షయ దానం కావాలి ‘’అనికోరాడు .శివుడు రాముని మనసు గ్రహించి ‘’ఏవమస్తు ‘’అన్నాడు .ఇదే రామ తీర్ధం .లక్షణుడు వదిలిన బాణం పడిన చోటు బాణ తీర్ధం ‘’.సీతా స్నానఘట్టం ‘’సీతా తీర్ధం ‘’అయ్యాయి అని బ్రహ్మ నారదుడికి వివరించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-19-ఉయ్యూరు

