గౌతమీ మాహాత్మ్యం -52
70-ఖడ్గ తీర్ధం
గౌతమీ నది ఉత్తరతీరం లో ఖడ్గతీర్ధం స్నాన దానాలచేత మోక్షాన్నిస్తుంది .కవషుని పుత్రుడు కైలూషుడు యాచనతో కుటుంబపోషణ చేస్తున్నాడు .కాని తగినంత ఆదాయం రాక వైరాగ్యం పొంది ,తండ్రిని జ్ఞానఖడ్గం తో క్రోధ మోహాలను ఖండించే ఉపాయం చెప్పమని అడిగాడు .ఈశ్వరుని నుండి జ్ఞానం పొందాలని తండ్రి చెప్పాడు .అలాగే శివారాధన చేసి మెప్పించి రప్పించి జ్ఞానాన్ని పొంది ముక్తి ఇచ్చేకథలు చాలా చెప్పాడు .అందులోకొన్ని. తృష్ణ బహు రూపంగా ఉండే మాయ .పాపాలు చేయిస్తూ సంసారం లో బంధిస్తుంది .తృష్ణను చేదిస్తేనే మానవుడికి సుఖ శాంతులు లభిస్తాయి .ఆసక్తి అధర్మం .ఆత్మకు అది పరమ శత్రువు .దాన్ని జ్ఞానఖడ్గ౦ చేత చేదించి శివైక్యం పొందాలి .ఆశ పిశాచం లాగా ఆత్మలో ప్రవేశించి సుఖాలను దహిస్తుంది .ఆశనుకూడా జ్ఞానఖడ్గం తో చేదించి జీవన్ముక్తి పొందాలి .ఇలా చాలా చెప్పాడు పైలూషుడు .
చివరికి గంగాతీరం చేరి జ్ఞానఖడ్గం చేత మోహ విముక్తుడై ముక్తి పొందాడు .ఇదే ఖడ్గతీర్ధంగా ప్రసిద్ధి పొందింది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
71-అన్వింద్ర ఆత్రేయాది తీర్ధం
ఆత్రేయ మహర్షి గౌతమీ ఉత్తర తీరం లో మునులతో కలిసి సత్రయాగం ప్రారంభించాడు .అగ్ని హోత ,హవ్యవాహనుడు .యజ్ఞం పూర్తి చేసి, మహేశ్వరీ ఇష్టి కూడా చేసి మహదైశ్వర్యం సర్వత్ర గతి పొందాడు .తపః ప్రభావం చేత ఇంద్ర లోకానికి ,రసాతలానికి స్వేచ్చగా వెళ్లి వచ్చేవాడు .ఒక సారి ఇంద్రలోకం లో సిద్ధ సాధ్యులచే స్తుతి౦ప బడుతూ సేవలుపొండుతూ నృత్యగానాలతో సంతోషిస్తున్నశచీదేవి ,కొడుకు జయ౦తుడితో ఉన్న ఇంద్రుడి వైభోగం చూసి ,ఇంద్రభోగం పొందాలని వా౦ఛించాడు .స్వర్గం లో ఆత్రేయుడు గొప్పగా సత్కారాలు పొంది ,మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు .
భార్యతో దేవేంద్ర వైభవాన్ని వర్ణించి చెప్పి ఆ వైభవం చూశాక ఇంట్లో ఏమీ తినాలని పించటం లేదన్నాడు .తనప్రభావం చేత బ్రహ్మనే తనవద్దకు రప్పించి తనకు ఇంద్రపదవి ఇప్పించమని కోరాడు .క్షణాలలో అపర దేవేంద్ర లోకాన్ని త్వష్ట సృష్టించి ఇచ్చాడు .భార్యను శాచీదేవిగా భావించాడు .అన్ని స్వర్గసుఖాలు అప్సరసలపొందుతో సహా అనుభవించాడు .ఆత్రేయ వైభవం చూసి దానవ రాక్షసులకు అసూయ కలిగి ఇంద్రపురం అనే ఆపురాన్ని చేరి అస్త్ర శాస్త్రాలతో బాధింఛి చంపటానికి సిద్ధపడ్డారు .భయపడిన ఆత్రేయుడు తాను ఇంద్రుడిని కానని అదంతా బ్రహ్మ సృష్టించిన మాయా లోకమని చెబుతూ విష్ణువును స్తుతించాడు .అతనిమాటలు నిజమేనని గ్రహించి ఇలాంటి అనుకరణవలన ప్రాణ,మాన హాని కలుగుతుందని హెచ్చరించి అసురులు వెళ్ళిపోయారు .
బుద్ధి తెచ్చుకొన్న మైత్రేయుడు త్వ స్టను స్తుతిస్తే ఆయన వస్తే ఈ మాయాలోకం వలన తనకు ప్రాణహాని తప్ప సుఖం లేదని కనుక వెంటనే దాన్ని ఉపసంహరించి తన పూర్వపు ఆశ్రమాన్ని ఇస్తే హాయిగా సంతృప్తిగా జీవిస్తాను అని వేడుకొన్నాడు .త్వష్ట బ్రహ్మకోరికపై అలానే చేయగా రాక్షసులు వెళ్ళిపోయారు. బతుకు జీవుడా అనుకొంటూ ఆత్రేయుడు భార్యా శిష్యులతో గౌతమీ తీరం లో తపస్సు చేశాడు .అక్కడ ఒక గొప్ప యజ్ఞం జరుగుతుంటే సిగ్గుతో ‘’మోహం యెంత చెడ్డది ?తపస్సు చేసే నాకే భ్రాంతి కలిగించింది’’అనగా దేవతలు విని గతం గతః .ఇక నుండి ఈ తీర్ధం ఆత్రేయ తీర్ధంగా పిలువబడి సుఖ శాంతులు జ్ఞానం కలిగిస్తుంది ‘’అని దీవించి స్వర్గం చేరారని నారదునికి బ్రహ్మ చెప్పాడు .
సశేషం
మహాశివరాత్రి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4- 3-19-ఉయ్యూరు

