మా తండ్రిగారు కీ .శే .విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారు అనంతపురం జిల్లా హిందూపురం ఎడ్వర్డ్ కారోనేషనల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండిట్ గా 1950లో పని చేస్తున్నప్పుడు ”త్యాగ ధనులు ”అనే పుస్తకం రచించారు .దీనికి ఉయ్యూరు లోని ఉమాప్రిస్ నిర్వాహకులు ,మా నాన్న గారి ముఖ్య స్నేహితులు శ్రీ ఆదిరాజు చంద్ర మౌళీశ్వరరావు గారు సహాయకులేకాక వారి ప్రెస్ లో పుస్తకం ముద్రించారు . 118 పేజీలున్న ఈ పుస్తకం వెల 14 అణాలు . ఈ పుస్తకం అప్పుడు కృష్ణా జిల్లా బోర్డు హై స్కూళ్లలో ఉపవాచకం -నాన్ డిటైల్డ్ గా బోధింపబడేది . ఇందులో1-నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 2- భీష్ముడు 3-శ్రీరాము డు 4 -విజయలక్ష్మీ పండిట్ 5-ఖాన్ సోదరులు చేసిన త్యాగం గురించి వివరించారు . త్యాగధనుని త్యాగాన్ని కీర్తిస్తూ ఒక ఆటవెలది పద్యం రాసి, తర్వాత వచనం లో విషయం తెలియ జేశారు .ఇప్పుడు ఆ పద్యాల గురించి మాత్రం తెలుసుకొందాం .
https://archive.org/details/ThyagaDhanulu
1-నేతాజీ సుభాష్ చంద్ర బోసు
”రాష్ట్రపతి పదవి విరక్తి తో త్యజియించి -దొరల కన్ను లందు దుమ్ముకొట్టి
తెల్ల దొరలవాడల దేశీయ సైన్యంబు -నడిపి నట్టి బోసె నాయకుండు ”
2-భీష్ముడు
”తనదు రాజ్యమెల్ల త్యాగంబు జేసియు -బ్రహ్మ చర్యమనెడి వ్రతము పూని
స్థిర మనస్కు డగుచు దేవ వ్రతుండును-భీష్ము డనుచు బెద్ద పేరు గాంచె ”
3- శ్రీరాముడు
”ప్రజలు కోరుకొనిరి రాముడె రాజని -రాము డెంచె బ్రజల బ్రాణములుగ
ప్రజలు మెచ్చనట్టి పని జేయనొల్లని -రాము వంటి ప్రజల ప్రభువు వలయు ”
4-విజయలక్ష్మీ పండిట్
”భారతీయ కాంగ్రెసు గౌరవముల నంది – భారతీయ విజ్ఞాన సంపత్తి నెల్ల
నితర దేశము లందు బోధించినట్టి -విజయ లక్ష్మి పండిట్ బోలు వెలది కలదె ”
5- ఖాన్ సోదరులు
”జాతిమతములతోడ ప్రసక్తి లేక -గాంధిజీ యాశయముల గలసి మెలసి
యున్న ఖాన్ సోదరులవంటి యుత్తములగు -మానవు లరుఁదు కద !ముసల్మాను లందు ”
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-3-19-ఉయ్యూరు
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D