యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33
తురీయాశ్రమం
ఒకసారి మిధిలానగర వనం లో శిష్యులతో జనకమహారాజుతో ఉన్న యాజ్ఞవల్క్యునితో బృహస్పతి ‘’మహర్షీ !దేవుల అంటే ఇంద్రియాల ,దేవయజనాల అంటే ఇంద్రియ అధిష్టాన దేవతల,బ్రహ్మ సదనానికి కురుక్షేత్రం ఏది ?’’అని అడిగాడు .’’అవిముక్తమే కురుక్షేత్ర౦ .ఎక్కడికి పోయినా అదే కురుక్షేత్రం అనే భావన తో ఉండాలి .అందులోనే జీవకోటి ప్రాణాలు ఉత్క్రమణ చెందేటప్పుడు రుద్రుడు అంటే మనసు ,తారకము అంటే సంసార తరణకారణమైన బ్రహ్మం, ఆ కారణం వలన అమృత వంతుడై మోక్షం పొందుతాడు కనుక అవిముక్తాన్ని సేవించాలి ‘’అన్నాడు. మహర్షి.అత్రి ‘’అన౦త ,అవ్యక్తాత్మను ఎలా తెలుసుకోగలం ?’’ప్రశ్నకు ‘’ఉపాస్య మైన ఆత్మ అవ్యక్తం లోనే ప్రతిస్టింప బడి ఉంది. అది వరణలో, కాశి లో ప్రతిస్టింపబడి ఉంది. అన్ని ఇంద్రియాల పాపా లను నశి౦ప జేసేదే కాశి .అవిముక్తం యొక్క స్థానం లేక ధ్యాస భ్రువు ఘ్రాణం ల యొక్క మధ్య ప్రదేశం .ఇదే ద్యౌర్లోకం అంటే మస్త ,కపాల రూప స్వర్గ లోకం.,పరలోకం అంటే చుబుకావ సానమైన భూలోకం యొక్క సంధి అవుతుంది. అది అ౦తరిక్షలోకం తో సమానం .అన్నీ ఈ అవిముక్తం లోనే సంధానం చేయబడతాయి కనుక సంధి అని పిలుస్తారు బ్రహ్మవేత్తలు .దీనిలోనే ఉపాసిస్తారు ‘’అని వివరించగా శిష్యులు ‘’దేన్ని జపిస్తే మోక్షం వస్తుంది?’’అని అడిగారు .’’శతరుద్రీయం జపిస్తే .అది అమృతం అనే పేరుకలది .వాటివలననే అమృతుడౌతాడు ‘’అని సెలవిచ్చాడు .
జనకుడు ‘’సన్యాసం గురించి వివరించండి ?’’అని అడుగగా ‘’విరక్తి శూన్యుడు బ్రహ్మ చర్యం పూర్తి చేసి ,స్నాతకుడై మొదటి ఆశ్రమ౦ పై విరక్తుడుకావాలి. ఒకవేళ దానిమీదే ఆసక్తి ఉంటె ఒకటి నుంచి నాలుగు వేదాలు లేక షడంగాలు న్న స్వశాఖ కాని గురు శుశ్రూష పూర్వకంగా అధ్యయనం చేసి సమావర్తనం అనే కర్మ చే ముగించి యవ్వనం రాగానే గార్హస్త్యాశ్రమను స్వీకరించాలి . దీనిపై ఇచ్చ లేకపోతే కందమూలాలు ఆహారంగా అగ్ని హోత్రం చేస్తూ లేక అగ్ని హోత్రం లేకుండాకూడా అరణ్యం లో ఉండాలి. వనస్తాశ్రమ౦ తీసుకున్నాక దానిపై కోరిక లేకపోతే చతుర్దాశ్రమ౦ సన్యాసాశ్రమ౦ లేక ప్రవృజాశ్రమం తీసుకోవాలి .’’అని వివరించగా ‘’వైరాగ్యంకలిగితే సన్యాసం లో విశేషాలు వివరించండి ‘’?అని కోరగా ‘’బ్రహ్మ చర్య గృహస్థాశ్రమం వనాశ్రమం లలో దేనిలోను౦చైనా సన్యసించ వచ్చు .వ్రతి కాని అవ్రతికాని స్నాతుడుకాని అస్నాతుడుకాని అగ్నిహోత్రుడుకాని అనగ్ని హోత్రుడుకానీ కూడా సన్య సించ వచ్చు’’అనగా ‘’దీనికి కాలపరమైన నియమాలున్నాయా ?’’అడిగాడు జనకుడు ‘’ఎప్పుడు వైరాగ్యం పుడితే అప్పుడే సన్యాసిగా మారవచ్చు ‘’అన్నాడు మహర్షి .
‘’సాగ్నికుడికి సన్యాసం లో ఇష్టి విశేషాలేమిటి ?జనకుని ప్రశ్నకు ‘’కొందరు ప్రజాపతి దేవతా ఇష్టిని మాత్రమే చేస్తున్నారు .అది విధానం కాదు. అగ్ని దేవతాత్మక ఇష్టి నే చేయాలి .కారణం అగ్ని అంటే సాధనాత్మఅయిన ప్రాణం .తర్వాత దానికంటే గొప్పదైన’’ త్రైధాతవేయమైన ఇష్టి’’ చేయాలి. అంటే ఇంద్ర దేవతాకమైన ఇష్టి చేయాలి .ఇది సత్వం –శుక్ల రూపం ,రజము –లోహ రూపం ,కృష్ణము –కృష్ణ రూపం కలది కనుక ఆపేరొచ్చింది .దీన్ని యధావిధిగా పూర్తి చేసి ‘’ఆయంతే’’అనే మంత్రం తో అగ్నిని ఆఘ్రాణి౦చాలి ‘’అని చెప్పగా ‘’నిరగ్ని కులకు సన్యాస విధి ఏది ?అని ప్రశ్నించిన రాజుకు ‘’గ్రామం లేక శోత్రియ స్థానం నుంచి పవిత్రాగ్ని తెచ్చి విరజాహోమాన్ని పురుష సూక్తం తో యదా శాస్త్రంగా వ్రేల్చి పూర్ణాహుతి చివర ‘’అయంతే యోనిః’’అనే మంత్రం తో అగ్నిని ఆఘ్రాణి౦చాలి .ఒకవేళ అగ్నిహోత్రం లభించకపోతే జలాలలో హోమం చేయాలి కారణం జలాలే సర్వదేవతలు .ఉదకస్థలం లో పూర్ణాహుతి నిర్వహించి ‘’సర్వాభ్యోదేవతాభ్యో జుహోమి స్వాహా ‘’అనే మంత్రం తో హోమం చేసి హుత శేషాన్ని భుజించాలి .హుత శేషం రోగ నివారకం అమృతం ప్రణవమే ఈ మూడురూపాల కు మోక్షం అని తెలుసుకోవాలి. అదేబ్రహ్మం దానినే జపించాలి ‘’అని స్పస్ట పరచాడు .’’
ఆత్రిముని ‘’యజ్ఞోపవీతం లేనివాడు బ్రాహ్మణుడు ఎలా ఔతాడు “’అని అడుగగా ‘’స్వసాక్షికమే అంటే స్వయం ప్రకాశ రూపమే పరమహంసకు యజ్ఞోపవీతం .ప్రైషానంతరం శిఖా ,యజ్నోపవీతాలను ఉదకం లో పడవేసి మూడు సార్లు ఆచమనం చేయాలి .ఇదే పరివ్రాజకులకు విధి .వీరాద్వం లో నడిచి కాని ,అనాశక వ్రతం ఆచరి౦చి కాని, నీటిలో పడికాని మహా ప్రస్థాన మెక్కి కాని శరీరాన్ని విడిచిపెట్టాలి .సన్యాసి కాషాయాంబర దారి శిఖా కేశ మీసాలు లేనివాడు ,అపరిగ్రహుడు శుచి అద్రోహి ప్రాణం నిలవటానికి మాత్రమే మాధుకరం భిక్ష చేసి భుజించేవాడు అయితే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు ‘’అని విడమరచి వివరించాడు యాజ్ఞవల్క్యుడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-19-ఉయ్యూరు

