జనకుడు ‘’ఆతుర సన్యాసం ‘’విశేషాలు చెప్పండి మహాత్మా !’’అని అడిగాడు .’’మనసు వాక్కు చేత సన్య సి౦చాలి .ఇది వేదమార్గం దీనిననుసరిస్తే బ్రహ్మవేత్త ఔతాడు.సంవర్తకాదులు ,పరమ హంసలు రహస్యమైన ఆచారాలు పాటిస్తూ ఇతరులకు ఉన్మత్తులుగా అనిపిస్తారు .పరమహంసలు త్రిదండం కమండలం ,శిక్యం , ,పవిత్ర జలపాత్ర,శిఖా ,యజ్ఞోపవీతాలను ‘’భూ స్వాహా ‘’అనే మంత్రం చేత జలం వదిలి ఆత్మ సాక్షాత్కారం పొందాలి .యదా జాత రూపజాతుడు అంటే దిగంబరుడు నిర్ద్వంద్వుడు ,నిష్పరిగ్రహుడు ,బ్రహ్మ సాక్షాత్కార వంతుడు ,పరిశుద్ధ హృదయుడు అయి ,ప్రాణ ధారణం కోసం నియమిత కాలాలలో కడుపు అనే పాత్రలో భిక్షాన్నం ఉంచాలి .లాభానస్టాలు సమానంగా భావించాలి .శిధిల దేవాలయం, పుట్ట వృక్షమూలం ,కుమ్మరి ఇల్లు , అగ్ని హోత్ర శాల , ఇసుక దిబ్బ ,కొండగుహ ,చెట్టు తొర్ర సెలయేరు ఎడారి లలో ఎక్కడైనా నివసించాలి .నిర్మముడు ,అప్రయత్నుడు ,ప్రణవ ధ్యాన పరాయణుడు ,అంతర్ముఖుడు అయి, సన్యాసం తో దేహాన్ని త్యజించాలి ‘’అని చెప్పి భార్య మైత్రేయితో ‘’నేనూ ఊర్ధ్వాశ్రమానికి అంటే సన్యాసాశ్రమానికి పోవాలను కొంటున్నాను.దీనికి నీ అనుమతి నాకు కావాలి .నీకు కాత్యాయినితో పాటు నా ధనాన్ని సమానంగా ఇచ్చేస్తాను ‘’ .అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
మైత్రేయి ‘’మీరు ఇచ్చే ధనమే కాదు సమస్త ద్రవ్యాలతో కూడిన ఈ భూమి నంతా నాకు ఇస్తే మాత్రం నేను ముక్తురాలనౌతానా ?’’అని ప్రశ్నించింది .’’ముక్తికలుగదు కాని సుఖజీవనం లభిస్తుంది ‘’అన్నాడు .’’ముక్తినివ్వని ఆ ధనంనాకు వద్దు . మోక్షసాధన మే చెప్పండి ‘’అన్నది .’మైత్రేయిని దగ్గరకు రమ్మని కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా ‘’నీకు ఇష్టమైన మోక్షసాధనం గురించి చెబుతాను .ఏకాగ్ర చిత్తం తో విను .భర్త తన ప్రయోజనం కోసం కాక ఆత్మ కోసమే ప్రియుడు ఔతాడు .అలాగే భార్యాపుత్రులు డబ్బు అన్నీ తమ ప్రియానికై ప్రియం కాక ఆత్మ ప్రయోజనానికే ప్రియం ఔతాయి ..మనన నిధి ధ్యాసాదులవలన విజ్ఞానం చేతా సమస్తమూ తెలుస్తాయి .ఆత్మ స్వరూపాన్ని అతిక్రమించి ఏదీ ఉండదు .అప్పుడే సర్వం ఆత్మ స్వరూపమౌతుంది .నామ రూప వికారాలు కల జగత్తుకంటే పూర్వమే ప్రజ్ఞాన ఘన రూపమైన ఆత్మ ఉన్నది .వేదాలనుంచి వాదాలదాకా సకలానికి ముఖ్యస్థానం అదే .’’అన్నాడు . చర్మానికి సమస్త స్పర్శలు ,జిహ్వకు సకలరూపాలు ,నాసికకు అన్ని రకాలైన గంధాలు ,నేత్రానికి అన్ని రూపాలు ,చెవికి సకల శబ్దాలు మనసుకు సకల సంకల్పాలు బుద్ధి సకల విద్యలకు ,చేతులు సకలకర్మలకు యోని సకలాన౦దానికి , గుదం సకల మల విసర్జనకు ,పాదాలు సకలగామనాలకు వాక్కు సకల వేదాలకు ముఖ్య స్థానాలౌతున్నాయి ‘’అని వివరించాడు.
మైత్రేయి ‘’కనిపించేదంతా లయమైతే సర్వం బ్రహ్మం ఎలా ఔతుంది ?’’అని అడిగింది మైత్రేయి .’’బాహ్యాభ్యంతరం లేని ఆత్మ ప్రజ్ఞాన ఘనమైందే. అంటే విశేష జ్ఞానం యొక్క ఘన స్వరూపం ఔతోంది .ఈ ఆత్మ భూతాలనుండి పుట్టి ,వాటిని అనుసరించి మరణిస్తుంది .జ్ఞానోదయానికి ముందు విశేష జ్ఞానం కలిగి మరణం తర్వాత భేదమనేది లేని బ్రహ్మం ఔతుంది .’’అన్నాడు .’’తమరు పరబ్రహ్మం లో విరుద్ధ ధర్మాలున్నాయని చెప్పటం చేత నాకు భ్రాంతి కలుగుతోంది .ఇదివరకు జీవాత్మ విజ్ఞాన ఘన స్వరూపం అని చెప్పారు మీరు .చనిపోయాక జీవాత్మకు ‘’నేను వీడు ‘’అనే లక్షణాలు కల విశేష జ్ఞానం లేదని ఇప్పుడు అంటున్నారు ?’’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేనలా చెప్పలేదే .అజ్ఞానం చేత ఆత్మకు దేహే౦ద్రియ మైన జీవభావం కలిగింది .అది జ్ఞానం చేత నశి౦చగా ,శరీరాది సంబంధ మైన సంజ్ఞఅంటే నేను వీడు అనే భావం ఉపాధి లేకపోవటం వలన నీరు లేకపోతె చంద్రుని ప్రతిబింబం కనపడనట్లు లేకుండా పోతుంది . సర్వం ఆత్మ స్వరూపమైనప్పుడు దేనితో చూస్తాడు ఆఘ్రాణిస్తాడు రుచి చూస్తాడు పలుకుతాడు ?ఆత్మకంటే వేరే ఏదీ లేకపోవటం వలన ఇతరాలను తెలుసుకోవటానికి వీలే లేదు .నేతి నేతి నిశ్చయ భావనతో ఆత్మ ఆకారం లేనిదని తెలుసు కోవాలి .ఆత్మయే ఆత్మను తెలుసుకోవాలి .ఇదే అమృతత్వం ‘’అన్నాడు .’
ఇలా యానవల్క్య మహర్షి బ్రహ్మవాదిని అయిన మైత్రేయికి అమృత తత్వాన్ని బోధించి సన్యసించి ,నిత్యాన౦దు డయ్యాడు .
ఓం ఇతితత్సత్
యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర సంపూర్ణం .
ఆధారం –ముందే చెప్పినట్లు శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రచించిన ‘’కణ్వ గురు వాజసనేయ యాజ్ఞ వల్క్య చరిత్రం ‘’.
మనవి- దీనిని 10-9-2018లో అంతర్జాలం లో రాయటం మొదలుపెట్టి 25-9-18కి 7 ఎపి సోడ్ లు మాత్రమే రాసి ,మిగిలినదంతా ఆధ్యాత్మిక గందరగోళం మనకు అర్ధం కాదులే అనుకోని ఆపేశాను .తర్వాత మిగిలినవి ఎన్నో చాలారాశాను .సింగపూర్ నుంచి శ్రీధర్ ఫోన్ చేసి ఎందుకు ఆపేశారంటే సమాధానం చెప్పలేకపోయా .కొంత తీరిక దొరికాక మళ్ళీ 20-2-19న 8వ ఎపిసోడ్ ప్రారంభించి ,జాగ్రత్తగా పుస్తకం చదివి అర్ధం చేసుకొని మనసుకు పట్టించుకోని గహనమైన విషయాలను కూడా తేలికగా అర్ధమయ్యే ట్లు నాకు తెలిసిన౦త వరకు,అర్ధమైన౦త వరకు మీకు అందించే ప్రయత్నం చేసి పట్టు వదలని విక్రమార్కుడిలా ఇవాళ 11-3-19 న 34వ ఎపిసోడ్ తో పూర్తి చేశాను .ఒక కారణజన్ముడైన మహాత్ముడు యాజ్ఞవల్క్య మహర్షి గురించి సంపూర్ణంగా రాసిన అదృష్ట వంతుడనయ్యాను.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-19-ఉయ్యూరు

