యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32
ఉపాధుల గురించి చెబుతూ యాజ్ఞవల్యుడు ‘’జనన మరణ ప్రవాహరూపమైన సంసారం కల జీవుడు సంపూర్ణ పరబ్రహ్మమే .ఈ పరబ్రహ్మం దేహం లో బుద్ధితోకూడి విజ్ఞానమయమవుతుంది .మనసుతోకలిసి మనోమయమౌతుంది .ప్రాణం తోకలిసి ప్రాణమయమౌతుంది .నేత్రాలతో నేత్రస్వరూపం శ్రోత్రం తో శ్రోత్ర స్వరూపం అలాగే పృధ్వీ జల వాయు ఆకాశ తేజోమయ అజోమయ గ్రామమయ అకామమయం,క్రోధ అక్రోధమయం ,ధర్మ అధర్మమయ సర్వమయం అవుతోంది .కనుక మంచి చేస్తే మంచివాడు చెడు చేస్తే చెడ్డవాడు అవుతున్నాడు .కొందరు పురుషుని కామమయుడ౦టారు .కర్మఫలం అపేక్షించేవాడు కర్మఫలం పొందుతాడు .అతని మనసు దేనిమీద లగ్నమైతే అదే కర్మలి౦గ మవుతోంది .ఈలోకం లో చేసిన కర్మఫలం పరలోకం లో అనుభవించి ,కర్మఫలావసానం పొంది ,మళ్ళీ ఆలోకం నుంచి ఈలోకానికి కర్మలు చేయటానికే వస్తాడు . కర్మఫలం కోరక ,కోరికలు లేక ఆత్మకాముడు అవుతాడుఐన వాడి ప్రాణాలు విడిచిపోవు .ఇక్కడే బ్రహ్మమై పరబ్రహ్మమౌతాడు .హృదయం లోఇహ పర కోరికలు లేనివాడు చావులేనివాడౌతాడు.ఈ శరీరం లోనే పరబ్రహ్మ అవుతాడు. ప్రాణమే బ్రహ్మము .ప్రాణమే జగత్తును ప్రకాశి౦ప జేసే విజ్ఞాన స్వరూప తేజస్సు .’’అని చెప్పగా ‘’మళ్ళీ వెయ్యి ఆవులనిస్తున్నాను.మోక్షం కలుగుతుంది అని చెప్పే మంత్రాల అర్ధం చెప్పండి ‘’అన్నాడు జనకుడు .
యాజ్ఞవల్క్యుడు ‘’పరమాత్మ స్వరూపమైన బ్రాహ్మణుడు బ్రహ్మ విద్యా రూపమైన మోక్షమార్గం తెలుసుకోవాలి .ఆత్మ తత్త్వం తెలిసి ,నేనే పరబ్రహ్మ అని అని ప్రత్యక్షం చేసుకోన్నవాడే సర్వానికి కర్త అవుతాడు .వాడే ఆత్మ. ఆత్మ వాడే .వాడికి సర్వం ఆత్మ. .సర్వానికి వాడే ఆత్మ .కనుక అద్వితీయం, ఏకం అయిన పరమాత్మ నేనే అని తెలుసుకోవాలి .పరబ్రహ్మాన్ని తెలుసుకొంటే ముక్తులౌతారు .తాను నాశరహితమైన పరబ్రహ్మంను తెలుసుకొని పరమాత్ముడనయ్యానని ఉపాసన చేస్తే, ఆ పరబ్రహ్మ తేజం ప్రాణానికి ప్రాణం నేత్రానికి నేత్రం ,మనసుకు మనసు అని తెలిస్తే పరబ్రహ్మాన్ని నిశ్చయంగా తెలుసుకోన్నవాడౌతాడు .సద్గురు ఉపదేశం, పరమార్ధ జ్ఞానం మనసును సంస్కరిస్తుంది .ఇలాంటి మనసు చేతనే పరబ్రహ్మం ను తెలుసుకోవాలి ‘’అన్నాడు మహర్షి .
జనకుడు ‘’వాక్కు ,మనసులకు అతీతుడైన పరాబ్రహ్మాన్ని చూడటానికి మనసు ఎలా సాధనం అవుతుంది ?’’అని ప్రశ్నించాడు .మహర్షి ‘’మనసు పరబ్రహ్మాన్ని గోచరి౦ప నిది అయినా , శ్రవణ మనన నిధి ధ్యాసాదులచేత సంస్కరి౦ప బడి పరబ్రహ్మాకారం అవుతుంది .అలాంటి మనసు చేత పరబ్రహ్మను అనుసరించి చూడాలి .పరబ్రహ్మ దర్శన విషయం లో ఏకత్వం లేదు .ఇలా చూసినవాడు మరణం వలన చావు పొందుతాడు. ఈ పరబ్రహ్మ నిత్యం .అప్రమేయం. దీన్ని అనేక రకాలుగా అనుసరించి చూడాలి .ఈ ఆత్మ గొప్పది .ధృవమైంది ,జన్మలేనిది ధర్మాధర్మాలు లేనిది .ఆకాశం కంటే సూక్ష్మమైనది .అలాంటి పరమాత్మను తెలుసుకొని ప్రజ్ఞ కలిగించుకోవాలి .ప్రాణం లో విజ్ఞానమయ స్వరూపుడు .గొప్పవాడు ,పుట్టులలేని ఆత్మ స్వరూపుడు .అతడు బుద్ధి యొక్క విజ్ఞానానికి ఆశ్రయమైన ఆకాశం లో ఉంటాడు. అన్నీస్వాధీనం లో ఉంటాయి.నియామకుడు .ప్రభువు .ఇతడిని వేదవాక్యాలతో,యజ్ఞం తపస్సు చేత తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు .పరమాత్మ లోకం కావాలనుకోనేవారు సన్యసిస్తారు .ఆత్మ సకల కార్య ధర్మాలను అతిక్రమించి ఉంటుంది .సర్వం తానే అయిఉంటుంది .దేనికీ అంటుకోదు .పాపాలను అతడే దహించి వేస్తాడు. ఇతడే విపాపుడు అంటే పాపరహితుడు. విరజుడు అంటే కామరహితుడు. అవిచికిత్సుడు అంటే సందేహ నివర్తకుడు .అతడే బ్రహ్మం .అదే బ్రహ్మలోకం ‘’అని బ్రహ్మోప దేశ ప్రసంగాన్ని ముగించాడు యాజ్ఞవల్క్యుడు .
జనక చక్రవర్తి పరమాన౦ద భరితుడై ‘’మహాత్మా మహర్షీ యాజ్ఞవల్క్య అవతార పురుషా !నీకు నా విదేహ రాజ్యం అంతా ఇచ్చేస్తున్నాను .ఇకనుంచి నేను మీ సేవకుడను ఆజ్ఞాపించండి ‘’’అని వేడుకొన్నాడు .జనకపురం లో ఉండి యాజ్ఞవల్క్యుడు ఋషులకు బ్రహ్మోపదేశం చేశాడు .యోగాభ్యాసం చేయించాడు .
సశేషం

