’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-16
మానవల్లి రామ కృష్ణ కవి గారు
మానవల్లి రామకృష్ణగారు మద్రాస్ నుంగం బాకం లో 1866లో జన్మించారు తండ్రి రామశాస్త్రి అష్టా దశ భాషా పండితులు .తనగురించి’’మృగావతి ‘’కావ్యం లో –
‘’చెన్నపురి చూళ నివసించు చున్న వాడ-వైదిక బ్రాహ్మణుడ,మానవల్లి కులుడ-రామ దైవజ్ఞ పుత్రుడరాజనుతుని –త్యాగరాయ పండితుని ప్రియాను జుండ’’అని మాత్రమె చెప్పుకొన్నారు .క్రిస్టియన్ కాలేజీ లో చదివే టప్పుడే ‘’ఆంధ్రభాషను గూర్చిన ఉపన్యాసము ‘’వైజయంతి పత్రికలో రాసి విద్వాంసుల మన్నన పొందారు .పట్టభద్రులై వనపర్తి సంస్థానం లో విద్యాధికారిగా జీవితం ప్రారంభించారు .1901వరకు పని చేసి అభిప్రాయ భేదాలవలన మళ్ళీ వెళ్ళలేదు .వనపర్తిలో ఉన్నప్పుడు ‘’బ్రహ్మవిద్యా విలాస ముద్రాక్షర శాల’’లో’’విస్మృత కవుల గ్రంథమాల’’మొదలుపెట్టి మొదట వల్లభారాయుడి ‘’క్రీడాభి రామం ‘’,నన్నే చోడుని ‘’కుమార సంభవం ‘’ప్రచురించాడు నన్నె చోడుడు నన్నయ్య కంటే ముందువాడు అన్నారు .దీనితో ఆంద్ర దేశం లో గగ్గోలు పుట్టింది .తెలుగు పండితులు ఆయన్ను శత్రువుగా భావించారు .ఇంత దుమారంరేగినా మీరేమీ మాట్లాడరేం ?’’అని మద్రాస్ లో ఒక సారి రామచంద్ర గారు అడిగితె ‘’చెప్పేదేదో ఆ గ్రంథ పీఠిక లోనే చెప్పేశాను .మళ్ళీ మళ్ళీ చెప్పటం ఎందుకు ?’’అన్నారట .ఆయన సంస్కృత ఆంద్ర మళయాళ తమిళ కన్నడ ఇంగ్లీష్ భాషలలో నిష్ణాతులు .
కవిగారు ఆంధ్రులకు ప్రసాదించిన మరో రచన ‘’ప్రబంధ మణి భూషణం ‘’.అనేక కావ్యాలనుంచి వివిధ భాగాలు సేకరించి కథ గా కూర్చిన కృతి.త్రిపురా౦త కోదాహరణ ,నీతి ముక్తావళి ఆంధ్రతిరువాయిమొళి,,శ్రీరంగ మహాత్మ్యం ,సకల నీతి సమ్మతం గ్రంథాలు ప్రచురించారు .తెలంగాణా అంతా తిరిగి ‘’లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్’’ను విద్వత్ పూర్ణమైన పీఠిక,శాసనాల నకళ్ళతో సహా ప్రకటించారు.ఇలా చేస్తూనేతెలుగు సంస్కృతాలలో ఏం ఏ పాసయ్యారు .ఆయన ఏ పుస్తకం రాసినా ఆంద్ర విమర్శకులు చెలరేగేవారు .దీనితో తెలుగులో రాయటం మానుకొన్నారు .
మద్రాస్ పచ్చయప్ప కాలేజిలో మూడేళ్ళు సంస్కృత లెక్చరర్ గా పని చేశారు .మద్రాస్ ప్రభుత్వ విద్యా శాఖ వీరిని తాళపత్ర గ్రంథ సేకరణకు నియమించింది .ఈయనా ఉభయ మీమాంసాలంకార శాస్త్ర పారంగతులు ఎస్ కే రామనాధ శాస్త్రి కలిసి మద్రాస్ రాష్ట్రమంతా గాలించి అపూర్వ గ్రంథాలు సేకరించారు .కవి గారి ధారణా శక్తి అమోఘం .ఒక సారి చూస్తె చాలు మనసులో అది ముద్ర అయిపోతుంది .ఒక ఊళ్ళో పండితులు తమవద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు .కవిగారు ఊరికే చూసి ఇస్తాను అని చెప్పి ఒక గంట పుస్తకాలు తిరగేసి ,ప్రధానఘట్టాలు మనసులో ముద్రించుకొని ,బసకు వెళ్లి వివరంగా రాసేశారట .
కవిగారు –కుందమాల చతుర్భాణినాట్య శాస్త్రం వంటి అపూర్వ సంస్కృత గ్రంథాలు పరిష్కరించి విపుల పీఠికలతో ప్రచురించారు .భరత కోశం అనేది భరత శాస్త్ర సర్వస్వమే .నన్నె చోడుని కుమార సంభావ ప్రతి లాహోర్ లో ఉందని తెలిసి అప్పుడు అక్కడున్న రామ చంద్రగారికి ఉత్తరం రాస్తే తెలుగు పేరుతోఉన్న ఆతాటాకు గ్రంథం దొరికింది కాని అందులో కొన్ని ఆకులే ఉన్నాయి .శూద్రకమహాకవి రాసిన ‘’వత్సరాజ చరిత్రం ‘’ను కవిగారు ‘’వత్సరాజు చరిత్ర ‘’నవలగా రాశారు .1916లో నిడదవోలు వెంకటరావు గారింట్లో బస చేసి భరతుడి నాట్యశాస్త్రాన్నీ ,టీకా తాత్పర్యాలతో సహా నకలు రాసుకొన్నారు .అప్పుడే ప్రాచ్యలిఖిత భండాగారానికి క్యురేటర్ గా ఉన్నారు 1940లో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీడర్ గా చేరి 1951దాకాపని చేశారు.
కవిగారి జీవిత చరమ దశ దీనంగా గడిచింది .ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి పొట్ట పోషించుకొనే వారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకు నెలసరి గౌరవవేతనం ఇచ్చేవారు .ఆతర్వాత డా పోణంగి శ్రీ రామ అప్పారాగారు రామచంద్రగారికి తెలియజేస్తే నెలరోజులు ఇంట్లో ఉంచుకొని ఆతిధ్యమిచ్చారు .సరదాగా మాట్లాడుతూ ‘’సెంచరీ కొట్ట లేనేమో “?అని 91వ ఏట 21-9-1957 మానవల్లి రామకృష్ణకవిగారు పరమపదించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-10-8-20-ఉయ్యూరు

