మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’

పది రోజుల క్రితం మా బామ్మర్ది  బ్రాహ్మి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చి ‘’బావా !మా  ఊళ్ళో ఎక్కడా వర్షాలు పడటం లేదు .పొలాలుదున్ని పంటలు వేసేసమయం మించిపోతోంది  మా రైతులు ఫోన్లమీద ఫోన్లు చేసి గోల చేస్తున్నారు .ఏదైనా ఉపాయం చెప్పుబావా ?అని గోల చేశాడు .

‘’ఒరేయ్ మీది పల్లెటూరు కదా .అక్కడ ఎరుకలు ఏనాదులు అనాది నుంచి కప్పలకు పెళ్ళిళ్ళు చేసి ఊరేగిస్తారుకడా .ఇప్పుడు ఫాషనై పోయి, వాళ్ళూ ఆపని చెయ్యట్లేదేమో నువ్వు వెళ్లి అక్కడ కప్పల పెళ్లి జరిపించిరా. వర్షాలు కురుస్తాయి ‘’అన్నాను

ఇవాళే వెడతా ఆపని చేసి నీకు ఫోన్ చేస్తాబా ‘’అని వెళ్ళాడు

మూడు రోజులతర్వాత ఫోన్ చేసి కప్పలపెళ్లి చేయించాను .రెండో రోజునే బ్రహ్మాండంగా వర్షం పడింది నాట్లు మొదలు పెట్టారు బా ‘ధాంక్స్ బా ‘’అన్నాడు .మంచే జరిగింది కదా అని సంతోషించా .

ఈ మధ్య వాడి విశేషాలేమీ తెలియలేదు .ఏమయ్యాడో అని కంగారు పడ్డాం నేనూ వాళ్ళ అ క్కయ్య  .

ఇవాళ పొద్దున్న మళ్ళీ ఊడి పడ్డాడు బ్రాహ్మి బామ్మర్ది .విశేషాలేమిటి అని అడిగా .తాపీ గా చెప్తా బావా అని లోపలికెళ్ళి వాళ్ళక్కయ్య పెట్టిన టిఫిన్ కాఫీ పుచ్చుకొని  త్రేనుస్తూ వచ్చి నాదగ్గర కుర్చీలో కూర్చున్నాడు .చెప్పరా విశేషాలేమిటో అన్నాను .

‘’నువ్వు నవ్వను అంటే చెబుతా బావా ‘’అన్నాడు. నవ్వనులే   చెప్పమన్నాను

‘’బావా ఈ మధ్య పిచ్చ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూ దేశమంతా అల్లకల్లోలం చేయటమే కాక మా ప్రాంతమ౦తా ముల్లోతు  నీళ్ళల్లో  మునిగిపోయింది .రైతులకుకాళ్ళూ చేతులూ ఆడలేదు .నాకు అర్జంట్ గా రమ్మని ఫోన్ చేశారు తప్పుతుందా. వెంటనే వెళ్లాను .గోడు మని ఏడుస్తూ రైతాంగం బిక్కు బిక్కుమంటూ నా కాళ్ళ పై పడి ‘’బాబుగారూ !అప్పుడు మీరు చెప్పినట్లే కప్పల పెళ్లి చేసి ఊరేగి౦చా౦  మంచి వర్షాలే పడ్డాయని సంతోషించాం .ఇప్పుడు  ఈ కుంభ వృష్టి  చేలన్నీ మునిగిపోయి కుళ్ళిపోయాయి .మీరేదే యెదైనాఉపాయ౦  చెప్పాలి ‘’అన్నారు కన్నీరు మున్నీరుగా .ధైర్యం చెప్పాను .నీకు ఫోన్ చేసి సలహా తీసుకొనే టైము  లేదు  .అందుకని నేనే ఉపాయం ఆలోచించి పరిష్కారం చేయించాను మా రైతులతో .

‘’ఏం చేయించావు అఘోరించు ‘’అన్నాను .

వాడు ‘’ఊళ్ళో చెరువులన్నీ  నిండాయి కనుక ఒక వెయ్యిఆడ, వెయ్యి మగ కప్పల్ని పట్టి తెమ్మన్నాను .నిమిషాల్లో తెచ్చారు .’’మాండూక్య’’ స్వామి ఆలయం లో వాటిని ఆడామగా వేరుచేసి దంపతులుగా వ్రేలాడ దీయించాను .’’కప్పగంతుల’’ శాస్త్రి గారిని పిలిపించా .ఆయనతో ఆ ‘’తోయ సర్పిత ‘’దంపతులకు శాస్త్రోక్తంగా ‘’చలికాపు’’ ,’’తోయసర్పిక ‘’ దంపతులను పీటలమీద కూర్చోబెట్టి  వాటికి ‘’రాతి బుట్టువు ‘’దర్దుర ‘’ముత్తైదువులతో మంగళసూత్రాలు పేనించి ,’’మరూక ‘’ రసరం ‘’దంపతులతో తలంబ్రాలు కలిపించాను .’’అజంభం’’ మద్దెల ,’’అజిరం ‘’డోలు ,’’అజిహ్వం ‘’సన్నాయి వాయించగా ‘’అనిమకం’’ ,’’అనూపం ‘’ల చేత తాళాలు వాయి౦చే ట్లు  సామూహికంగా 500కప్పడంపతులకు  వైభవంగా వివాహాలు జరిపించాను .

‘’అదేమిట్రా వర్షాలతోజనం చస్తుంటే మళ్ళీ ఈ పెళ్ళిళ్ళు  ఏమిటి ?విరోచనాలవాడికి భేదిమందు వేసినట్లు .ఆకాశం మళ్ళీ చిల్లి పడదా ?’’అన్నాను

‘’తొందర పదమాకు బా .అంత తెలివితక్కువగా చేస్తానా  .వెంటనే మళ్ళీ ఆ దంపతులను పెళ్లి చేసిన దంపతులతో ఊళ్లోకి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి  సెంటర్ లో అందరూ చూస్తుండగా ఒక్కో మగకప్ప తో దాని జంట ఆడకప్ప మెడలో కట్టిన తాళి వరుసప్రకారం విప్పించేసి ,మా ‘’దాటరి’’రావు ను జడ్జీ గా ,’’ప్లవంగమ ‘’పంతులును మా తరఫు లాయర్ గా ,’’భేక ‘’శర్మ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పెట్టి ,తాళి ఎందుకు విప్పించామో వాదోపవాదాలు జరిపించి ఆ కప్పదంపతులకు పరస్పర అంగీకారంతో విడాకులు ఇవ్వమని కోరుతూ అర్జీపెట్టించి ,జడ్జీ గారు సావధానంగా అంతా క్షుణ్ణంగా విని  ఆదంపతులకు విడాకులు సామూహికంగా ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి అందరికి ఉపశమనం కలిగించారు .గ్రామ సర్పంచ్ ‘’వరుణ దంతావల ‘’రావు ,మునసబు ‘’వృష్టిభువు’’ చౌదరి ,కరణం ‘’శాలూర ‘’పంతులు సాక్షులుగా సంతకాలు చేశారు .విశేషంగా జనం పోగై ఈ విడాకుల సంరంభ మహోత్సవాన్ని కనులారా చూసి మహదానంద భరితులయ్యారు .కాలువలు చెరువులు దరువులలోని’’హరి ‘’లన్నీ  బెకబెక మని అంగీకారాన్ని ధ్వనిపూర్వకంగా సామూహికంగా తెలియజేశాయి .మా వూళ్ళో దేవుడి ఊరేగింపుకు కూదాఎప్పుడూ బయటకు రాని వాళ్ళు ఆ రోజు ఊరి జనమంతా అక్కడే ఉన్నట్లుగా అత్యుత్సాహంగా వచ్చి చూసి ఆశీర్వదించారు విడాకుల ‘’పుండరీక ‘’దంపతులను .తమ జన్మలు చరితార్ధమైనట్లు భావించారు జీవితం ధన్యమైన భావన పొందారు .పదిరోజులక్రితం గుడిలో కప్ప పెళ్లి చేస్తే ఇంటింటికీ వెళ్లి పిలిచినా  ఆవైపు కన్నేయని జనం ఆరోజు మాత్రం మూగిపోయారు .పెల్లికంటే విదాకులంటే అంత మోజు అనిపించిన్దేమోబావా ‘’అన్నాడుబామ్మర్ది

‘’సరే ఫలితం ఏమిటి “’అడిగాను

‘’కప్పల పెళ్ళికి  ఎంతబాగా వర్షాలు  కురిశాయో ,కప్పల విడాకుల వలన ఒక్కసారిగా వర్షాలు ఆగిపోయిజనం ఊపిరి పీల్చుకున్నారు .ఒకచిన్న ఐడియా మా ఊరి వాళ్ళ జీవితాలనే మార్చింది బా ‘

‘’బాగుందిరా నీ ‘’మాండూక్యోపనిషత్’’అన్నాను .ఎప్పుడు వచ్చిందో వాళ్ళ అక్కయ్య కూడా వచ్చి మాతోకలిసి పగలబడి నవ్వింది తమ్ముడితెలివి తేటలకు .

మనవి-ఇందులో కప్పకు ఉన్న నానార్ధాలు సరదాగా వాడాను గ్రహించగలరు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-8-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.