‘’బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -1
పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి కవీశ్వరుని పద్య సీతారామాంజనేయ సంవాదాన్ని ,వచనం లో సరళీకరణం చేసి సుబోధకంగా రాశారు సంస్కృతాంధ్ర రచయిత ,రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ ,పొన్నూరు వాసి ,జ్యోతిష శాత్ర వేత్త ,సరసభారతికి ఆత్మీయులు అయిన డా.నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సర్వులకు అర్ధమయ్యే రీతిలో రాసి బాలబోధ అని నామకరణం చేశారు .పంతులు గారికవిత్వం ఆపాతమధురం .విషయం పరమ వేదా౦త పరమైనా చదువుతుంటే మహదానందం కలిగిస్తుంది .దాన్ని బాలబోదగా రాసి శాస్త్రిగారు మహోపకారం చేశారు .దీన్ని ‘’సీతారామాంజనేయ సారగుళిక’’అని రసవత్తర నామం పెట్టారుకూడా .ఈ పుస్తకాన్ని నాకు శాస్త్రిగారు సుమారు ఒకపక్షం రోజులక్రితం పంపారు .కానీ చూడటానికి ఇవాళే కొద్దిగా వెసులుబాటు దొరికింది .పంతులుగారంటే నాకు అమిత భక్తీ .వారిపద్యాలు చదివి పుస్తకం లో రాసుకొన్నానుకూడా ఎప్పుడో .
మొదటగా ‘’శరీర ,ఇంద్రియాలకు భిన్నమైన పరబ్రహ్మం నేనే .నువ్వూ పరబ్రహ్మమే ‘’అని సీతాసమేత శ్రీరాముడు శిష్యుడు హనుమంతుని ఉద్ధరించాలని జ్ఞానోపదేశం చేస్తున్నాడు .కవి రామబ్రహ్మాన్నిధ్యానించి ,ప్రకృతి రూపిణ సీతాదేవిని మనల్ని కాపాడాలని కోరాడు .తర్వాత గణపతిని ,హనుమను స్తుతించాడు.కాళిదాసాదికవులనూ ,గురుపరంపరనూ తలచుకొన్నాడు .
మొదటి అధ్యాయం లో కైలాసం లో పార్వతి శివుని సేవిస్తూ వరం కోరుకోమంటే శ్రీమన్నారాయణుడు అనుగ్రహించే మంత్రం బోధించమని కోరగా శివుడు చెప్పటం మొదలుపెట్టాడు –‘’మూడు సార్లు రామనామం పలికితే వెయ్యి సార్లు విష్ణుసహస్ర పారాయణ చేసినట్లే .శ్రీరామమంత్రం పురుషార్ధమేకాకమోక్షాన్ని కూడా ఇస్తుంది .రాముడే తారక బ్రహ్మం కనుక ,ఆబ్రహ్మాన్ని సాక్షాత్కారించుకొనే మార్గం చెప్పమని హనుమ సీతమ్మను అడిగాడు .సీతాదేవి జీవబ్రహ్మ అభేదం బోధించే యోగాన్ని వివరించింది .యోగంలో విశేషాలు నియమాలు సమాధి వివరించి ,పై ఎనిమిదింటితో చేసే అభ్యాస యోగం వివరించింది .రాజయోగం సాధన చిత్కలరూపం చెప్పి హంస స్వరూపం చెప్పింది –మాయలో ప్రతిబింబించిన బ్రహ్మ చైతన్యం మాయతో కలిసి హంస అనే జీవుడవుతాడు .ఈహంస మూలాధారం మొదలైన పద్మాలను చేరినప్పుడు ఆయా ఆనంద అనుభూతులు కలుగుతాయి .ఈ హంస బ్రహ్మ వాహనమైనహంసలా చరిస్తుంది .ఆహంస పాలు నీరు విడగొట్టినట్లే ,ఈ హంస సంసారం వదిలి భగవంతుడిని చేరుతుంది .ఇతడే రాజయోగి .ఇతడినే హంస అంటారు .
సీతమ్మ ఆతర్వాత హనుమకు జీవుల యదార్ధ రూపాన్ని బోధిస్తూ నాడీమండలం అందులోని భాగాలు ,ఇంద్రియాలు వాయువుల జాబితా చెప్పి ,శ్రీరాముడు 10రకాల ప్రణవ నాదాలతో చిద్బిందువులో ,కళలలో కలిగే అన్ని విశేషాలకు సాక్షి .చిద్బిందువు అంటే విజ్ఞాన కోశమే .భగవంతుని రూపమైన ఆనందమయకోశమే చైతన్య కళ.గర్భగోళ౦ లో ప్రాణాలు మొదలైన వాయువులు కదలటంచేత కలిగే లోపలి శబ్దమే ప్రణవ నాదం .తర్వాత హంస తత్వాన్నీ ,మూల ప్రకృతి తత్వాన్నీ బోధించింది .
మూల అజ్ఞానం పోవాలంటే ‘’నేను జ్ఞాన స్వరూపుడను ,పరిశుద్ధుడను ,ప్రకృతి సంబంధం వల్ల మాత్రమె మలినుడిని అని ధ్యానిస్తూ ఉంటె చిత్త చాంచల్యం తగ్గి ,మూల అజ్ఞానం పోతుంది .హంస తత్వ ప్రక్రియలో రేచక కుంభక పూరక అంతర కు౦భకాలను వివరించింది .షట్చక్ర స్వరూపాన్ని చక్కని పట్టికలో క్లుప్తంగా వివరించారు శాస్త్రిగారు .మొదటి అధ్యాయం లోచివరగా తురీయావస్ధ గూర్చి ఇలా చెప్పారు –హమాస రూపమైన జీవుడు ప్రణవనాదం మొదలైన వాటితో యోగాభ్యాసం ఉపాసన వలన భగవంతునిలో చేరినప్పుడు ఏర్పడే అవస్థ మెలకువ ,కల నిద్ర కు భిన్నంగా ఉంటుంది .అప్పుడు మనసు బయటి విషయాలు వదిలేసి బ్రహ్మం లో చేరుతుంది .ఇదే ఉన్మినీ అవస్థ .ఈ స్థితిలో ఏర్పడిన శుద్ధమనసు స్థితి అమనస్కం అంటారు .పూర్ణ పరబ్రహ్మం లో విహరించటం జరిగి అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడి ,మోక్షజీవులకు స్థావరం అవుతుంది .ఇక్కడ బ్రహ్మం స్వయం ప్రకాశకం .బ్రహ్మ స్వరూపాలైన జ్ఞానం ,ఆనందం అయిపోయి రమిస్తూ ఉంటాడు .దీనినే నిరంతరం ధ్యానిస్తే ,మనసు నిశ్చలమై ,’’చిణి’’ అనే పది నాదాలు వినగా వినగా, చివరికి ఘంటాధ్వని వినిపిస్తుంది .అప్పుడు మనోహర ఆనందమయ బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ రాజయోగం తోకూడిన యోగి నేనే బ్రహ్మం అని పలుమార్లు16ఘడియలు ధ్యానిస్తే ,కలయిక ఏర్పడి ,ఆ స్థితిలో మనసు ప్రాణవాయువుతో ,ఇంద్రియాలతో విలీనమై ,జీవుడు బ్రహ్మతో ఐక్యమయ్యే ఈఅవస్థనే ఉపనిషత్తులు రాజయోగం అన్నాయి .సూక్ష్మ బుద్ధికి ఇది ఆరు నెలలలో సిద్ధిస్తే, మందునికి ఏడాది పడుతుంది ‘’అని సీతమ్మ హనుమన్నకు తెలిపింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-21-ఉయ్యూరు

