బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -2(చివరిభాగం )
ద్వితీయాశ్వాసం లో వాసుదేవ తత్త్వం అంటే –అన్నిటినీ ప్రకాశి౦ప జేసేదీ ,దేనిచేతనూ ప్రకాశి౦ప బడనిది,అంతటా ని౦డిఉండేదీ , ,తనకంటే వేరుకానిది ,జ్ఞానరూపమైనది మంగళమై చలించనిది మొదలైన లక్షణాలున్నది .పరమాత్మ అంటే పంచభూతాలతో సూర్య చంద్రులతో ప్రకాశించేది అని చెప్పి ,భ్రమర కీటకన్యాయం అంటే వివరించింది సీతాదేవి హనుమకు .తర్వాత కల్పం మాయాస్వరూపం వివరించింది .సృష్టికి,భగవంతునికి ఉపాదానకారణం ,సహకారి కారణం ,నిమిత్తకారణం సంబంధాలున్నాయి. అవిద్యలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు .తర్వాత సూక్ష్మ సృష్టిక్రమం ,వివరించి ,లింగ శరీరమంటే అయిదు జ్ఞానేంద్రియాలు ,నాలుగు అంతరింద్రియాలు ,అయిదుకర్మేన్ద్రియాలు ప్రాణం మొదలైన 19.ఇవి ఒక్కొక్క జీవునిలో ఉంటె వ్యష్టి ,జీవుల౦దరిలోవీ కలిపితే సమష్టి .తర్వాత స్థూల దేహ సృష్టిక్రమ వర్ణన చేసి చెప్పి,వామన భూత సృష్టి చెప్పింది .పరమాత్మ స్వరూప వర్ణన చేసి ,ఓంకారం అంటే వివరించింది .అకార ,ఉకార మకారాలు .ఆకారం లో విశ్వ విరాట్, పురుషులు ,ఉకారం లో తైజసుడు ,సూత్రాత్మ ,మకారం లో ప్రాజ్ఞుడు ఈశ్వరుడు ఉంటారు .పంచకోశ వివరణం చేసి ఆత్మ గూర్చి వివరాలుచేప్పి ,దృక్కు,దృశ్యాలను వివరించింది
మాయను వదిలించుకొని జీవుడు తనకు దేవుడికి ఉన్న శేష శేషి భావాన్ని గుర్తించి తనకు పరమాత్మకు భేదం లేదని తెలుసుకోవటమే తత్వమసి .త్రిపుతి అంటే జ్ఞాత ,జ్ఞానము ,జ్ఞేయము ,ద్రష్ట దర్శనం ,దృశ్యం ,శ్రోత శ్రవణం శ్రావ్యం భోక్త భోగం ,భోజ్యం .పిమ్మట ఆధ్యాత్మ అధిభూత ఆది దైవతాలను తేలికగా అర్ధమవటానికి గొప్ప పట్టికలో వివరించారు శాస్త్రిగారు.కాలస్వరూపం వివరించారు
తృతీయ ఆశ్వాసం లో అమనస్క రాజయోగం వివరించింది సీతామాత .శ్రీరామరామ రామ అంటే గొప్ప వివరణ ఇచ్చింది .బ్రహ్మాకారం గా చేయబడిన వృత్తిజ్ఞానం శ్రీ .ఆశ్రీ చేత రామణీయుడై తత్వమసి వాక్యంతో తత్ అనే దానికి లక్ష్యార్ధమే శ్రీరాముడు .రామ అంటే వృత్తిజ్ఞానానికి సాక్షియైన ప్రత్యగాత్మ అ౦ టేత్వం పదానికి లక్ష్యార్ధం .మూడవ రామ అంటే ప్రత్యగాత్ముడైన జీవుడు బ్రహ్మ రూపుడే అనే అద్వైత భావన అయిన అసి పదానికి అర్ధమే .ఆతర్వాత వైరాగ్యం అంటే –బ్రహ్మమును సాక్షాత్కారించుకోవటానికి పొందే అర్హత అని చెప్పింది మోక్షానికి అవసరమైనవి –తనను తాను పొగుడుకోకపోవటం ,చేసిన దాన ధర్మాలు చెప్పుకోకపోవటం ,జీవులకు బాధ కలిగించకపోవటం ,రుజుమార్గం లో జీవించటం ,ఓర్పు మొదలైన 20గుణాలు కావాలి .తర్వాత యోగిలక్షణాలు ముక్తుల భేదాలు వివరణ చేసింది .
శాస్త్రిగారు పుస్తకం చివరలో ఈ గ్రంధం లో వచ్చిన పారిభాషిక పదాలు వాటి అర్ధాలు వివరించారు .దీనివలన విషయం ఎవరి సహాయం లేకుండా సులువుగా అర్ధం చేసుకొనే వీలు కలుగుతుంది .
డా నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుబంధం లో తాము రచించిన సంస్కృత శ్రీ హనుమద్ద౦డకం ,కిందటి హనుమజ్జయ౦తికి ,కల్యాణానికి నేను శాస్త్రిగారిని శ్రీ సువర్చలాదేవి లగ్నాష్టకాలు ఎక్కడైనా దొరుకు తాయా లేకపోతె శ్రమ పడి వ్రాయమని అర్ధిస్తే ,లగ్నాష్టకాలు రెడీగా లేవనీ తామే వ్రాసి పంపిస్తామనీ చెప్పి ఒకవారం లో రాసి పంపారు .వాటిని ఇక్కడ చేర్చి అందరికీ అందుబాటులోకి తేవటం ముదావహం .శాస్త్రిగారి గీర్వాణ పాండిత్యానికి అవి మచ్చుతునకలుకూడా .బాలబోధ గా శాస్త్రిగారు పరశురామపంతుల లింగమూర్తి గురు మూర్తిగారి ‘’సీతారామాంజనేయ సంవాదం ‘’ను అందరికీ అందుబాటులోకి తెచ్చారు .వారికి ఆంధ్రలోకం రుణ పడి ఉంటుంది .
శాస్త్రిగారి సెల్ నంబర్ -99851 01234
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-7-21-ఉయ్యూరు

