జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కథా మంజరి ‘’-2(చివరిభాగం )
ఈ కథా మంజరిని ‘’క థా తత్వావలోకనం ‘’పేరుతొ ఆచార్య సార్వ భౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చక్కగా విశ్లేషించి విషయ వివరణ చేశారు –‘’ఒరియా సాహిత్యం లో ఫకీర్ మోహన్ దాస్ రచించినవిఖ్యాతమైన అనుకరణకు అసాధ్యమైన శైలి ఉన్న ‘’రేవతి ‘’కథ ను విక్రమ దేవ వర్మ తన కథా రచనలో కొంత వరకు సాధించారు .లోక వ్యవహారాన్ని నిరూపిస్తూ ,నైతిక సంస్కారం కల్గించటం ఇందులో కనిపిస్తాయి .ఈయన కథలలో పాత్రలకు భగవన్నామాలైన –నారాయణ ,దామోదర ,పురుషోత్తమ ,గోవర్ధన విశ్వనాథ ,లలిత అనే ఉంటాయి .విభిన్న మనస్తత్వాలున్న పాత్రలవి పురుషోత్తముని చాతుర్యం లో పుత్రప్రేమ ,తాతామనుమల మధ్య సంబంధం చూపిస్తే గుణవతి లో ,తల్లికి కొడుకుపై ఉన్న వాత్సల్యం ,మైత్రిలో స్నేహితులమధ్య బంధం ఎప్పటికీ మాసిపోదు అని చూపించారు .
‘’కవృ’’-వర్ణనే అనే ధాతువు నుంచి కవి శబ్దం నిష్పన్నమైంది. కవి అంటే వర్ణనా నిపుణుడు .వర్మ కావ్య తత్వ మర్మజ్ఞులు కనుక కవితా సంపద పుష్కలం గా ఉన్నవారు కనుక అనేక సందర్భాలలో ఆ చాతుర్యాన్ని ప్రదర్శించి మెప్పు పొందారు .కథకు కావ్యత్వం కల్గించారు .పాత్రల స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్నిచిన ప్రతిభ వారిది .ఆనాటి ప్రజలలో ఉన్నాచార వ్యవహారాలను కథలలొఅవసరమైన చోట పొందుపరచారు .ఆడపిల్లకు 12ఏళ్ల లోపే పెళ్లి చేయటం దానివలన కలిగే అనర్ధాలు ,శారదా చట్టాన్ని ఉల్లంఘి౦ చిన వారికి శిక్ష .అయినా ప్రాచీన సంప్రదాయాన్ని వదులుకోలేక రహస్యంగా పెళ్లి చేయటం మామూలైంది .ఆనాటి సమాజం లో భూతాలూ దెయ్యాలంటే భయం ,నరక భీతి ఎక్కువ .కూడనిపని చేస్తేసమాజం నుంచి వేలివేయటం ఉంది .గోబరియా కథలో గొల్లలు కాఫీ హోటల్ కు వెడితే వెలి వెయ బడ్డారు .జైలుకు వెళ్ళిన వారిని జాతి నుంచి వెలి వేసేవారు .సపన్నుల వేశ్యా భోగ లాలసత్వం లలితా పత్ని కధల్లో చూపారు .
వర్మగారు కథలలో –తలిదండ్రుల్ని మనం నిరాదరిస్తే ,వాళ్ళు మనల్ని హీనంగా చూస్తారు ,చదువుకొన్న వారికి జీవనోపాధి దొరక్కపోతే క్రూరులైసమాజాన్ని దోచుకొంటారు ,భర్త లోఎన్ని దోషాలున్నా భార్య సహనం తో సహజీవనం చేయాలి ,బాల్య వివాహ నిషేధం ,విధవా వివాహ పరిహరించటం ,ఎవరైనా స్వయం కృషితోనే పైకి రావాలి వేషాన్ని బట్టి ఎవరినీ నమ్మరాదు ప్రభువుకోసం ప్రాణాలు అర్పించే వారి కుటుంబాలను రాజు ఆదుకోవాలి ఉత్తముల మైత్రి పెన్నిధి వంటి అనేక నీతులు ఉపదేశించారు .
విక్రమ దేవ వర్మగారు కథలలో నీతి బోధించే సందర్భాలలో స్వయంగా శ్లోకాలు రాసి,లేక ప్రసిద్ధమైన శ్లోకాలు పేర్కొని బలం చేకూర్చటం విశేషం –‘’జంతు కళా కర్మఫల నిశ్చే భోగి ‘’-ప్రాణి చేసిన కర్మను బట్టి ఫలాన్ని అనుభవిస్తాడు .’’యుక్తియుక్తం వచోగ్రాహ్యం ‘’ యుక్తియుక్తంగా బాలుడు చెప్పినా వినాలి ,’’జనని సర్వత్ర సంసారం పక్షపాతినీ సినా ‘’ఎక్కడైనా తల్లులు పిల్లల పై పక్షపాతం చూపిస్తారు .వర్మాజీ సుమతి శతకం లోని ‘’ఉపకారికి నుపకారం ‘’పద్యాన్ని ఒరియా భాషలో అందంగా –‘’ఉపారీర ఉపకార –కరణ గణే నాహి ధీర –అపకారీర ఉపకార –కరణమాత్ర గ ణేధీర ‘’అని అనువాదం చేశారు .
వర్మగారి కతలను జాగ్రత్త గా పరిశీలిస్తే ఆయన సమాజాన్నిఅత్యంత నిశితంగా పరిశీలించారనీ ,సంస్కృత సాహిత్యం లో అపూర్వమైన పా౦డిత్యమున్నవారనీ ,సుదేర్ఘ లోకానుభావమున్నవారనీ మనకు అర్ధమవుతుంది ‘’అని ఆచార్య సార్వభౌమ తమ అర్ధాంగి శ్రీమతి ప్రభావతి గారి అనువాద ప్రతిభ ను శ్లాఘించారు .కనుక నాపని చాలా సులువైంది. వారి వాక్యాలే ఉదాహరించి కథలలోని లోతుల్ని మీకు చూపాను .ఒరియా నుంచి తెలుగులోకి ఈ 21కథలను అనువదించి ,తమ ఒరియా సామర్ధ్యాన్ని తెలుగు పలుకు బడులలో ఉన్న అందాన్నీ పాఠకులకు అందించారుశ్రీమతి వేదుల . .వర్మగారికి ప్రభావతిగారికి ఆచార్య సార్వ భౌములకు ధన్యవాదాలు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-21-ఉయ్యూరు

