శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం
వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.
పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ కంటాఆశిరయ, యల్లమాంబ దంపతులకు రెండవ కుమారుడు .14వ ఏట కాకినాడ రేచర్లపేట లో నివసిస్తుండగా కేవలపరబ్రహ్మ ,శివనారాయణ ద్వయ జ్యోతి స్వరూపులు ,శ్రీ యడ్ల రామదాసు సద్గురువుల కటాక్షం తో సాంఖ్య,తారక ,అమనస్క,పరిపూర్ణ రాజయోగాదులు నేర్చారు .20వ ఏట ‘’సుజ్ఞాన బోధిని ‘’రచింఛి ముద్రించారు .గురువులు సంతోషించి ‘’నీఉన్న స్వగ్రామం లో శ్రీరామమందిరం ఏర్పాటు చేసి ,శ్రీరామ శతకంగా నూట ఎనిమిదిసీసపద్యాలురాసిఆ రామునికే అంకితమిచ్చి ధన్యుడవు కమ్ము ‘’అని ఆశీర్వదించగా ,వెంటనే శక్తికొలదీ రామమందిరం రేచర్లలో నిర్మించి శ్రీరామ శతకం రాసి ,గురువుగారికిచూపి పరిష్కరింప జేసి ముద్రించారు .ముందుగా గురువుగారిపై రేగుప్తిరాగం ఆటతాలం లో ఒక తత్త్వం’’నమస్తే శ్రీయడ్ల రామార్యా –శ్రీమత్పరబ్రహ్మా మిము స్మరామి గురురాయా –విమలమగు తత్పదములను హృత్కమలమధ్యమునందు జేర్చి,ఏమరక భజియించి మ్రొక్కెద —‘’ రాసి సంర్పించారు. –
‘’శ్రీ రఘువర పుత్రశృంగార గుణ గాత్ర త్రైలోక్యపావనధన్యచరిత –పార్వతి పతి మిత్ర పండిత గణ స్తోత్ర శ్రీ లక్ష్మి నాయకా శ్రిత పవిత్ర —ధరను శ్రీ కంటా అప్పలదాస పోష –శరణు శ్రీరామ రేచర్లపురనివాసా ‘’అని సీసాలు మొదలెట్టి ,’’యతిగణ ప్రాసలు ,తర్కం తెలీదు నీ నామ సంకీర్తనే తప్ప సాధన యుక్తి తెలీదు కనుక నువ్వే అన్నిటికి ఆధారంగా నా శతకాన్ని పూర్తి చేయించాలని ఆపద మొక్కులు మొక్కాడు కవి .రాజాధి రాజైనా తీర్ధయాత్రలు చేసినా సకల విద్యాసారం తెలిసినా ,సద్గురుని చేరకపోతే ఫలించదు అన్నాడు .రామ దాస సద్గురువుల అనుగ్రహం తో ‘’మమతలుడిగి నిశ్చలమతి ‘’అయ్యాడు .’’నారాయణా నీదు నామ స్మరణ మహిమ భవభయ౦బులెల్ల బారదోలు ‘’ అని నమ్మాడు .తర్వాత మాయ ను వర్ణించాడు .నిజసంపదలు భూమిమీద నిలవవు .కాయము నీటి బుగ్గ అని తెలుసుకోకపోతే యమ పాశం లో పడాల్సిందే అన్నాడు .హరినామ స్మరణ చేస్తే అరిషడ్వర్గాలు నాశానమౌతాయి అని భారోసా గా పల్కాడు .శబరి, కరిరాజులను కాపాడావు అనీ .రా అంటే పాపాలుపోతాయనీ ,మా అంటే కవాటాలు మూసుకుపోతాయని రామశబ్ద మహాత్మ్యం చెప్పాడు.’’గోవింద సర్వేశ గోపాల మాధవా నా ఎదుట నిలువవే నల్లనయ్యా ‘’అని ఆర్తిగా కోరాడు .పిపీలికాది బ్రహ్మ పర్యంతం నీ మహిమలే అని సత్యం చెప్పాడు .తల్లీ తండ్రీ గురువు నువ్వే రామయ్యా అన్నాడు .’’శ్రీలక్ష్మి నా తల్లి శిరులిచ్చి బ్రోచును ,శ్రీరాముడే తండ్రి చేబట్టి రక్షించును ‘’అన్నాడు .అద్దం గుడ్డివాడికి అగపడనట్లు , చెవిటి వానిముండు శంఖం ఊదినట్లు ,కోతికి జలతారు కుళాయి ఇచ్చినట్లు చేన చెనటికి వేదం చెప్పినట్లు పణ్యస్త్రీలకు పతిభక్తి బోధించినట్లు ,విటులకు శీలం ఉ౦దన్నట్లు,మందమతికి నీ మహా మంత్రం ఉపదేశించి నట్లు వ్యర్ధమే అన్నాడు .
‘’మదిలోన నీ యొక్క మహిమలు వర్ణింఛి స్మరియింప నారడుడను గాను ,తండ్రితోపోట్లాడే ప్రహ్లాదుడను కాను .కనుక నీ పాదపద్మాలే నాకు శరణు అని విన్నవించుకొన్నాడు .అమరేంద్ర సుతునికి ఆత్మ తత్త్వం తెల్పి ,పవన సుతుని అతిప్రేమగా చూపినట్లు ,రావణానుజుడిని రాజు చేసినట్లు ,పాంచాలి మానభంగం కాచినట్లు ,గోపికలకు కూర్మి కలిగించినట్లు తనకు ప్రత్యక్షమవమని ప్రాధేయపడ్డాడు .నిరతం నిన్ను వర్ణించటం నా వంతు నిజంగా రక్షించటం నీ వంతు అని రామయ్యపైనే భారం మోపాడు గడుసుకవి .షణ్మతాలకు ఒక్కడే స్వామి , శృంగారాలకు సువర్ణం ఒక్కటే ,తనువులకు జీవం ఒక్కటే ,రంగుపశువులకు పాలు తెల్లవే ,ఎక్కడచూసినా పరబ్రహ్మం ఒక్కడే .
ఆతర్వాత దశావతార వర్ణన చేసి ,ఆవతార విశేషాలు సీసాలలో కరిగించి మెరుగుపెట్టాడు .చివరగా ఫలశ్రుతి చెబుతూ ‘’ఈశతకమెల్ల సాంతము గాను చదివి,వినిన యట్టిసజ్జనులకు ‘’పాపాలు తొలగి పరమపదమబ్బి ,ఆయురారోగ్యాలు వర్ధిల్లు తాయని భరోసా ఇచ్చాడు కాటం కవి .శతకాన్ని 20-12-1912లో పూర్తిచేశాడు కవి .
ఈ శతకానికి శతాబ్ద చరిత్ర ఉంది .ఎవ్వరి కనుల్లోనూ పడలేక పోవటం వింత . చక్కని దారాశుద్ది తీవ్రమైన భక్తీ ఆర్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నశతకం ఇది .హాయిగా చదూకొని పారాయణ చేయ తగ్గది.దీన్ని పరిచయం చేసే అదృష్టం నాకు దక్కింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-21-ఉయ్యూరు

