బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -1
‘’సుబ్రహ్మణ్యేశ్వరీయం ‘’అనే పేరుతొ బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం ను శతావధాని బ్రహ్మశ్రీ పిశుపాటి చిదంబర శాస్త్రి గారు రచించారు ,దీన్ని కాకినాడ సుజనరంజనీ ముద్రాక్షర శాలలో ప్రోలాప్రగడ బ్రహ్మానంద రావు గారి చేత 1912 కవిగారు ముద్రింప జేశారు .వెల ము౦దు రాసి, తర్వాత గీతలతో చెరిపేశారు. బహుశా పావలా ఉండవచ్చు.’
కవిగారు విద్వత్ కవులకు ఒక విన్నపాన్ని పద్యాలలో చేస్తూ ‘’కృష్ణానదికి దక్షిణాన పది యోజనాల దూరంలో కరవది గ్రామం లో తాను పిశుపాటి వంశం లో జన్మించాననీ,తనకు 20 ఏళ్ళు అనీ ,చిదంబర శాస్త్రి అని తనను పిలుస్తారనీ ,’’పూర్వ పుణ్యమున నీ పుస్తకంబు భక్తీ కొలదిని రచియించి పరమ పురుషునకు సమర్పణం చేశాను ‘’అని చెప్పారు.
ఆతర్వాత సంస్కృతం లో శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం రాశారు .మొదటి శ్లోకం –
‘’అ౦సా౦చ త్సర్వలోక ప్రచిచిత మభరం దాస మందార మన్మ-చ్ఛ౦సా పాత్ర౦ సుగాత్రం భవ నిరతి లతాదాత్ర ముధ్య చ్చరిత్రం
హింసా హింసా విచారే పరమగురు మనంతాకృతి చింతిత నీయం –తమ్ సుబ్రహ్మణ్యదేవం భజత బుధ గణః శ్శ్రేయనామా మేష పంధాః’’
చివరగా ‘’చిదంబరాభి ధానోహం పిశుపాటి కులోద్భవః -త్వా మేవ శరణం యాత స్సుబ్రహ్మణ్య ప్రసదమే’’ అని పూర్తి చేశారు .
తర్వాత పద్యాలలో శ్రీ వర్ధిల్లే బిక్కవోలు లో ఆవిర్భవించి అందరినీ కాపాడుతూ ‘’విశద వీధుల ‘’చూపించే సుబ్రహ్మణ్య దేవోత్తముని కీర్తించారు .ఈ మహాత్యం రాసి స్వామికి అన్కితమిస్తున్నానని తన మనోగతం ఎరిగించారు .సరస్వతమ్మ ‘’పలుకు పలుకున వెలయు నప్పులకు వెలది ‘’అని స్తుతించి ,సౌభాగ్యశ్రీ కలిగించే ‘’కలిమి నెలత ‘’ను ప్రసన్నం చేసుకొని ,’’జగదంబ పరాదేవి ఆది శక్తి ,కాళి,భగవతి కవిలోక కల్పవల్లి ‘’కి కైమోడ్చారు .
ఆతర్వాత తన కుల విశేషాలు చెప్పుకొన్నారు .వెలనాటి వారు వేద వేదాంగాలలో నిష్ణాతులు ,సరస గాన సాహిత్యాలలో మేటి వారు ,కర్ణ ధర్మ దధీచి లకు దీటైన దాన ధర్మానుయాయులు ,ఆపన్న రక్షకులు ,అలాంటి వశంలో పిశుపాటి వారింట చిదంబర బుధుడు పుట్టాడు .కామాక్షిని పెళ్ళాడి .చాలాకాలానికి పిల్లలు పుట్టకపోతే ,ఆ కులం లోనే పేరు భొట్లు అనే ఆయన కొడుకులలో ఒకరిని తమకు దత్తత ఇమ్మని కోరగా వెంటనే అంగీకరించి సీతారాముడు అనే కొడుకును దత్తత ఇవ్వటానికి ఇష్టపడగా స్వీకరించి చక్కగా పెంచుకొన్నారు .అతడు గొప్ప పేరు తెచ్చుకొని ,కనకాంబను పెళ్ళాడి ఆమె ద్రౌపదిలాగా పరమసాద్విగా సేవలు అందిస్తుంటే ,కడుపు పండి,పెద్దకొడుకు మనకవి చిదంబరం ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు .మాతామహులైన పాలపర్తి సుబ్బయ శాస్త్రి ,లింగామా౦బ దంపతులు . భారద్వాజ గోత్రీకుడైనకవి పెంచిన తలి దండ్రులకు విధేయుడుగా ఉన్నాడు .తనకు సంస్కృతాంధ్రాలు పాణినీయం ,వర కవిత్వ రచన నేర్పిన గురువులకు అంజలి ఘటించి ,కృతిని బిక్కవోలు సుబ్బరాయ దేవునికి అన్కితమిస్తున్నానని తెలిపాడు .సుకవి స్తుతి చేసి ,కుకవి నిరసనమూ చేసి ,దోషాలుంటే మన్నించమని కోరాడు.సుబ్రహ్మణ్య షష్ఠి నాడు బిక్కవోలు బుధులు ‘’కరువది గ్రామ రత్నానివి ఉభాయభాషలలో అద్వితీయుడవు కండగల కవిత్వం గీర్వాణ ఆంధ్రాలో చెప్పగల మేటివి ,కాళికా దేవి కృపా పాత్రుడవు .కనుక మనస్వామి మహాత్మ్యాన్ని కావ్యంగా రాసి తరించి మమ్మల్నీ తరిమ్పజెయ్యి ‘’అనికోరగా సరే అని షస్త్యంతాలురాసి ప్రారంభించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-21-ఉయ్యూరు

