భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -7
విఠల్భాయ్ పటేల్ రాజీనామా
25-4-1930న విఠల్ భాయ్ పటేల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్య ఉద్యమం లోకి దూకాడు .తన రాజీనామాకు కారణాలు తెలుపుతూ వైస్రాయ్ ఇర్విన్ కు –‘’డియర్ లార్డ్ ఇర్విన్ –నా అసెంబ్లీ సభ్యత్వానికి అధ్యక్షపదవికి రాజీ నామా పంపిస్తున్నాను .ఈ సందర్భం గా ప్రజలచే ఎన్నుకో బడిన అధ్యక్షుడు ఎన్ని కష్టాలు ఆటంకాలూ ఎదుర్కోవాలో తెలియజేస్తున్నాను .1925నుంచి ఈ పదవిలో ఉంటూ నిష్పక్షపాతంగా ఉన్నాను .ప్రభుత్వ ఆగ్రహానికి భయపడలేదు .నేను కొన్ని పొరబాట్లు చేసి ఉండచ్చు .కానీ నా స్వంత రాజకీయ భావాలతో పని చేయలేదు .అసెంబ్లీ లో అందరి అభిప్రాయం తీసుకోన్నాకే నిర్ణయాలు చేశాను .అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా నిష్పాక్షికత వదలలేదు .ప్రభుత్వ కోపానికీ గురైయ్యాను .ప్రభుత్వం కూడా చాలా సహించి ఊరుకొన్నది కానీ నా నిష్పాక్షిక తీర్పులను సహించలేక పోయారు .చక్రవర్తికి ఎంత అధికారం ఉందొ అసెంబ్లీ అధ్యక్షుడికీ అంతే అధికారం ఉంటుంది.సంవత్సరం నుంచీ నాకూ ప్రభుత్వానికి ద్వంద్వ యుద్ధమే సాగింది .ఈ పదవి నాకు ముండ్ల పొద అయింది .పత్రికలు కూడా క్రూరంగా ప్రవర్తించాయి .నేను ప్రతీకారం చేయలేక ఊరకుండిపోయాను .అప్పుడప్పుడు మిమ్మల్ని కలిసి నా అభిప్రాయాలు చెప్పేవాడిని .అంతకంటే ఏమీ చేయలేని నిస్సహాయత .ప్రజల దృష్టిలో అధ్యక్షుడి ని కించపరచటం కూడా చేశారు .నాపై దుష్ప్రచారానికి ఒక ముఠా ఏర్పరచారు .కానీ వారు ఏమి సాధించారో నాకు తెలీదు .కొందరు పత్రికా విలేకరులు ఆ ముఠా ను కలిసి వెళ్ళేవారు .వారి వ్యవహారం శ్రుతి మించింది.ఈ దేశం లోనే కాదు ప్రపంచం లో ఎక్కడ ఉన్న తెల్ల వాడికైనా ‘’వీడు ఎప్పుడు వెళ్లి పోతాడా ?’’అని ఎదురు చూస్తూ నాపై నిఘా వేశారు .నన్ను నొప్పించి రాజీనామా చేయించాలని వాళ్ళ ఉద్దేశ్యం అయి ఉండవచ్చు .నేను రాజీనామా చేస్తే ఇలాంటి పదవికి భారతీయులు అర్హులు కారు అని ప్రచారం చేసుకొంటారేమో .మీ ప్రభుత్వానికి నాపై ఆదరం లేదు .విశ్వాస రాహిత్యం తీర్మానం నెగ్గితేనే నేను రాజీనామా చేయాలి .ఆపని వాళ్ళ వల్ల కాలేదు .అభిప్రాయ భేదాలు తీవ్రమైనప్పుడు నాదే పై చేయి అయింది .నరాల బలహీనత ఉన్నవాడైతే ఎప్పుడో తోక ముడిచి పారిపోయేవాడు ,లేకపోతె జోహుకుం అనేవాడు .నా రూలింగ్ లు అసెంబ్లీ గౌరవాన్ని పెంచాయని ప్రపంచ ప్రజలు భావించారు .నేను ఈ పదవిలో ఉన్నంతకాలం నిరంతర ఘర్షణ సాగింది .ఈ నిరంకుశ ప్రభుత్వ౦ నుంచి రక్షణ కోసమే ప్రయత్నించాను .నా ప్రయత్నాలు మూడు వంతులు సత్ఫలితాల నిచ్చాయి .ఎంతో మానసిక క్షోభ అనుభవించాను .ప్రజల విశ్వాసం ఉన్నదన్నమాట ఒక్కటే నాకు ఓదార్పు .పైన తెలిపిన అక్రమ విషయాలనే గర్హిస్తున్నాను .ఇది అంతరించాలని నా కోరిక .ఈ పదవిలో ఉంటూ దేశ సేవ చేయలేను అని బాగా అర్ధమైంది .కనుక ఇందులో ఉండి ప్రయోజనం లేదు .దేశ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి .ఇంకా పదవినే పట్టుకొని ప్రాకులాడితే నా దేశానికి తీవ్ర దోహం చేసిన వాడిని అవుతాను .కిందటి సారే నేను ‘’నేనుకూడా రాజీనామా చేసే సమయం వస్తుందని’’ సూచనగా చెప్పాను .కాంగ్రెస్ కోరికలు సమంజసాలు అని మీ ప్రభుత్వం భావించటం లేదు .గాంధీ ప్రతిపాదించిన అధినివేశ ప్రతిపత్తిని చర్చించటానికి రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని భావించాడు .ఇది సమంజసం అని నా నమ్మకం.కనుక ఈ ప్రత్యెక పరిస్థితులలో నా అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చి సరాసరి భారత స్వాతంత్ర సమరం లో నా శక్తి యుక్తులు విని యోగించాలని భావించి రాజీనామా చేస్తున్నాను .ఇప్పటిదాకా మీరిచ్చిన సహకారానికి ధన్యవాదాలు .నా నియోజకవర్గం 1928వరదలకు చాలా కష్టనష్టాలపాలైంది .మీరుస్వయంగా దర్శించి ప్రజలను ఆదుకొన్నారు ధన్యవాదాలు .అనధికార హోదాలో నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను ‘’అని లేఖ రాశాడు పటేల్ భాయ్ .
ఈసుదీర్ఘ లేఖకు వైస్రాయ్ ప్రతి స్పందించి పటేల్ రాజీనామా ఆమోదించి –‘’బార్డోలీ సత్యాగ్రహం లో ప్రభుత్వం తన సలహాప్రకారం నడిచింది అనటం సరికాదు .శాంతియుత సంప్రదింపులు వదిలి శాసనోల్లంఘనలు మొదలైన వాటికి పూనుకోవటం మున్ముందు విచారించాల్సి వస్తుంది ‘’అని క్లుప్తంగా లేఖ రాశాడు .పటేల్ రెండవ సుదీర్ఘ లేఖలో ‘’ 1920 సహాయ నిరాకరణ శాంతియుతంగా సాగినా విజయవంత౦ కాలేదు .అప్పుడే మీరుకొత్తగా వచ్చారు .గాంధీ అనుచరులను తప్ప అందరితో మీరు మాట్లాడారు .మీ –నా సంభాషణలో కాంగ్రెస్ శక్తిని గాంధీ విధానాన్ని చాలా సార్లు శంకించారు .మీరు తప్పుడు సలహాలు వింటారని తెలిసింది .గాంధీ నాయకత్వం లో ఒక బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం బయల్దేరుతుందనీ మీ దమననీతి మీకే చేటు తెస్తుందని చెప్పానుమీకు .ఇలాంటి సలహామీకు ఎవ్వరూ ఇచ్చి ఉండరు .మీరు నా మాట వినే స్థితిలో లేరప్పుడు .1927లో నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు చక్రవర్తితో బర్కిన్ హెడ్ మొదలైన వారితో అవే మాటలు చెప్పాను .బాధ్యతాయుత ప్రభుత్వాలనుఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిస్థితులు ఏర్పడతాయనీ గట్టిగానే చెప్పాను .మాకు కొన్ని షరతులమీద కొన్ని ఉద్యోగాలు ఇవ్వమనీ,అప్పుడు రక్షణ సమస్యలు ఏర్పడవు అనీ చెప్పాను .పరిష్కరించకపోతే 1920పరిస్థితులే ఏర్పడతాయనీ చెప్పాను .ఇంగ్లాండ్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసి పై విషయాలన్నీ చెప్పాను .సైమన్ కమీషన్ కు బాధపడ్డాను .నా సలహాలు బూడిదలో పోసిన పన్నీరు అయింది .దేశమంతా సైమన్ గో బాక్ అని నినదించింది నేనూ రిజైన్ చేసిపాల్గొందామనుకొన్నా ,వద్దన్న మీ సలహా పాటించాను .మీ ఇంగ్లాండ్ ప్రయాణం మాకు మేలు చేస్తుందని ఆశపడ్డాను .మీరు బయల్దేరేటప్పుడు ‘’గాంధీ నెహ్రు లను సంప్రదించి ఎలాంటి ప్రకటన చేస్తే బాగుంటుందో అది కాంగ్రెస్ కు కూడా నచ్చుతుంది ‘’అని చెప్పి పంపాను .కానీ గాంధీ ప్రభావం మీకంటికి ఆనలేదు .బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్కు తప్ప ఇంకే పార్టీకి అధికారం అప్పగించదు అనికూడా చెప్పాను .మీరు ఇండియాకు తిరిగివచ్చి ప్రభుత్వం తరఫున ప్రకటన చేశారు .దానికాపీ నాకూపంపారు .మీ ప్రకటన కాంగ్రెస్ ను ద్వైవీ భావం లో పడేస్తుందని మీకు సూచించాను .రౌండ్ టేబుల్ సమావేశం జరగటానికి ముందు రాజకీయ ఖైదీలను అందర్నీ విడిచిపెట్టాలి .ప్రముఖ రాజకీయవేత్తలనుఆహ్వానిన్చాలి .సమావేశం తర్వాత మేరు మాకేదో తవ్వి తలకెత్తుతారని అని నేను అనుకోవటం లేదు .బ్రిటిష్ ప్రకటన కాంగ్రెస్ అంగీకరించాలి తోకపార్టీలతో కాదు . .పరిస్థితుల్ని చక్కబరచే దమ్మున్నవాడు గాంధీ ఒక్కడే .ఆయన్ను సంతృప్తి పరచండి .1921నుండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మీరు అణచి వేస్తూనే ఉన్నారు .కానీ అది అపూర్వ చైతన్యం ప్రజలలో తెచ్చింది .మీకు కనువిప్పు కలగాల్సింది పోయి కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తించారు .గాంధీని ఆహ్వానించి ఒడంబడిక చేసుకోండి .మాకు సంపూర్ణ స్వరాజ్యమే కావాలి .అధినివేశ ప్రతిపత్తిని మీరు అంగీకరించి తీరాలి .సహృదయంతో పరిష్కరించాలని మీకున్నా ,మీకష్టాలు నాకు తెలుసు .సర్వ త్యాగం చేయటానికి భారత జాతి సిద్ధంగా ఉంది .మీపలుకుబడి ఉపయోగించి ప్రభుత్వాన్ని ఒప్పించండి లేకపోతె రాజీనామా చేసి వెళ్ళిపొండి .కోట్లాది భారతీయుల మనోభావాలు గ్రహించండి .మీకు ఇంగ్లాండ్ లో అన్నిపార్టీ లతో సన్నిహిత సంబంధాలున్నాయి .ఇండియా సేక్రేటరికి మీపై అమిత విశ్వాసం ఉంది .మీరు ధైర్యంగా ముందడుగు వేస్తె ఇండియాకే కాదు అందరికీ మహోపకారం చేసినవారుగా చరిత్రలో నిల్చిపోతారు ‘’అని రాశాడు పటేల్ భాయ్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-11-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.