భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -9

సామ్రాజ్యం నుంచి విడిపోయే హక్కు

విఠల్ భాయ్ పటేల్ ఒక సమీక్ష చేస్తూ ‘’కేంద్ర ప్రభుత్వ ఆదాయం లో 45శాతం మిలటరీ వ్యయానికే పోతుంది .ఇండియాసెక్రెటరి  ఆయన నియమించే ఉద్యోగుల జీతాలు పెన్షన్ లు కాక ఇండియా  అప్పుపై వడ్డీ ఉన్నాయి .ఇవన్నీ పొతే ప్రజామంత్రి చేతిలో ఉన్న ఫైనాన్స్ నాం కే వాస్తి .ఇలాంటి స్థితిలో ఫైనాన్స్ శాఖను ఎవరూ కోరుకోరు .ఇండియా అప్పుపై ‘’గుండ్ర బల్ల సమావేశం’’ లో చర్చకు రాలేదు .కామన్ వెల్త్ నుంచి విడిపోయే హక్కు పై మాటేలేదు .ఇవన్నీ చూస్తె కేంద్రం లో జాతీయ ప్రభుత్వం ఏర్పడటానికి ఇష్టంగా లేదు అని పించింది .శ్వేతపత్రం అంతా మధ్యకాలం లో మాత్రమే అమలు అని చెప్పారు .ఈకాలం ఎన్నేళ్లో ప్రస్తావన లేదు .కొత్తరాజ్యా౦గ౦  ద్వారా స్వతంత్రం వస్తుంది అన్న నమ్మకం లేదు .వైస్రాయి అసాధారణ అధికారం ఇండియాలో విచ్చల విడిగా ఉపయోగిస్తూనే ఉన్నాడు .మూడవ సమావేశానికి ఎజెండాలేదు .వీలైనప్పుడల్లా కాంగ్రెస్ ను, గాంధీని అవమాన పరుస్తూ ,తమదే పై చేయిగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం .ఇర్విన్ తో ఒడంబడికలో గాంధీ తప్పటడుగు వేశాడని నా అభిప్రాయం.దాన్ని ప్రభుత్వం వారు ఒక కాగితం ముక్క గా భావించారు .కాంగ్రెస్ నాయకులు దాన్ని పూర్తిగా గౌరవించారు .బ్రిటిష్ అధికారులూ నిర్లక్ష్యం చేశారు  .బ్రిటిష్ కూట రాజనీతికి ఇది గొప్ప ఉదాహరణ .అంతర్జాతీయం గా తమకు అనుకూలభావన ప్రచారం చేసుకొన్నది ప్రభుత్వం .ఐకమత్యంలేని భారతీయులలొఎవరి దారి వారిది అయింది .’’ఇండియాకు  బ్రిటిష్ పాలనే మేలు ‘’అనే భావం ప్రపంచ దేశాలలో ప్రచారం చేయగలిగింది ప్రభుత్వం .గాంధీ తొందరపడి ఇర్విన్ తో ఒడంబడిక కుదుర్చుకొని శాసనోల్ల౦ఘన  ఉపసంహరించాడని నా విశ్వాసం .’’ఇండియాకు క్షేమకరమైన  నిబంధనలు ‘’అనే పదం  బ్రిటిష్ వారికి అనుకూలంగా మారింది.ఇలా వివాదం ఏర్పడినప్పుడు ఒక నిష్పాక్ష సంఘాన్ని నియమించి విచారణ చేయాలి .అది జరగలేదు .విదేశ వస్తు బహిష్కరణా ఆగింది .వాళ్లకు కావాల్సినవన్నీ జరిగి హమ్మయ్య అనుకొన్నారు .ఇదీ ఒకందుకు మంచిదే .సంపూర్ణ స్వరాజ్యం కోస౦  తీవ్రంగా కాంగ్రెస్ పనిచేసే అవకాశం కలిగింది .ఫెడరేషన్ లో సంస్థానాధీశులు చేరతారని నాకు నమ్మకం లేదు .ఈలోపు’’ ప్రొవిన్షియల్ అటానమి’’రాష్ట్రీయ స్వపరిపాలన రావచ్చు .ఇంగ్లాండ్ వెళ్ళిన బ్రిటిష్ ఇండియా ప్రతినిధులు ఫెడరల్ రాజ్యాంగం పై మోజుపడ్డారు .దీనితో గాంధీ ఉప్పు పన్ను రద్దు చేయగలడా ?మిలిటరీ ఖర్చు తగ్గించగలడా ?ఉద్యోగి పెన్షన్ తగ్గించే తీర్మానం పై ఓటు వేయగలడా .మద్య నిషేధం ,భూమి శిస్తు తగ్గించటం కుదుర్తుందా ?  ఇవన్నీ ప్రజా విప్లవానికి దారి తీసేట్లున్నాయి . రౌండ్ టేబుల్ సభ్యులు అలాచేయలేదు .అప్పర్ హౌస్ లో ఉన్న 200మంది సభ్యులలో నియమితులైన సం స్థానాధీశులు  80 మంది, .ప్రజాశాసన సభలో ఉన్న 300లో వందమందికి –జమీందారులు వర్తక వాణిజ్య ప్రముఖులు కు ప్రత్యెక ప్రాతి నిధ్యం .అంటే దేశపాలన అంతా సంస్థానాధీశుల జమీందార్ల ధనస్వామ్యుల చేతిలోనే బందీ అయి పొయి౦దన్న మాట.ఫెడరేషన్ లో చేరటానికి సంస్థానాధీశులు ఒప్పు కోరు. గాంధీ లండన్ వెళ్లి డౌనింగ్ స్ట్రీట్ లో చేయాల్సింది అంతా చేశాడు .ఫలించలేదు .గాంధీ ఎన్ని డబ్బాలు కొట్టినా గాంధీ –ఇర్విన్ ఒడంబడిక పెద్ద తప్పే .పరువు పోగొట్టుకొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి ‘’అని చాలా విపులంగా జరిగి పోయిన సంఘటనలన్నీ పూసగుచ్చి  చెప్పి తన భావాన్ని నిర్భయంగా బయట పెట్టాడు .

  విఠల్ భాయ్ అమెరికా ప్రయాణం

గాంధీతో పాటు లండన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన పటేల్ వైస్రాయ్ ఆర్డినెన్స్ కు గురై,అసలే అనారోగ్యంగా ఉన్న ఆయన మళ్ళీ జబ్బుపడగా ప్రభుత్వం విడుదల చేసింది .మళ్ళీ వియన్నాకు వెళ్లి చికిత్స చేయించుకొని ,విశ్రాంతికోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు .కానీ భారత దేశ సమస్య ఆయన్ను వెంటాడుతూనే ఉంది .ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్లి భారత జాతీయ ఆశయాలు విస్తృతంగా ప్రచారం చేశాడు .

   అమెరికాలో ఇండియా రాయబారి విఠల్ భాయ్

స్వాతంత్ర్యం కోసం జాతీయుల సమీకరణం ఎంత ముఖ్యమో అంతర్జాతీయ సానుభూతి కూడా అంతే ముఖ్యం .వారి మోరల్ సపోర్ట్ చాలా ముఖ్యం .వివేకానంద స్వామి, ప్రతాప్ మజుందార్ ,లజపతిరాయ్ ,సర్ జేసి బోస్ ,సరోజినీ నాయుడు ,రవీంద్రుడు అంతకు ముందు అమెరికా వెళ్ళినవారే. ఇప్పుడు విఠల్ భాయ్ కూడా ..భారత్ లో ఐక్యత లేదనీ బ్రిటిష్ ప్రభుత్వం తొలగితే , కొట్టుకు చస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున బ్రిటిష్ ప్రభుత్వం  చేసింది .మన పటేల్ ధీరోదాత్తుడు కనుక  ఆ దుష్ప్రచారాన్ని  తిప్పికొట్టి యదార్ధం చాటి చెప్పిమేజారిటీ   అమెరికన్ లకు కనువిప్పు కలిగించాడు .రెండవ ప్రపంచ యద్ధం తర్వాత విజయ లక్ష్మీ పండిట్ అమెరికాలో భారత్ కు చేసిన సేవ చిరస్మరణీయం

   1932లో అమెరికా వెళ్ళిన విఠల్ భాయ్ ఇండియాలో జైలు జీవితం, నాలుగు సార్లు ఆపరేషన్ లతో ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది .అయినా లెక్క చేయకుండా భారత విధానాలను అమెరికన్లకు తెలియ జెప్పటానికి తీవ్ర కృషి చేశాడు .న్యూయార్క్ ,ఫిలడెల్ఫియా, బోస్టన్ డెట్రాయిట్, వాషింగ్టన్ మొదలైన పెద్ద పట్టణాల మేయర్లు ఆయనకు హృదయ పూర్వక స్వాగతం చెప్పి గౌరవించారు .బొంబాయి మేయర్ గా, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా ఆయన చేసిన సేవ ప్రముఖ అమెరికన్ పత్రికలలో విశేషంగా ప్రచురితమైంది .కాలీజీలు, చర్చిలు, క్లబ్బులలో ఆయన ఉపన్యాసాలు పెద్ద ఎత్తున జరిగాయి .వస్తుతః మహా వక్త ,మహా వాక్ చమత్కృతి ,సమగ్ర విషయ సంగ్రహణం తో శ్రోతలను మై మరపించాడు ,జనం తండోప తండాలుగా హాజరయ్యే వారు .ఇండియాకు ఫ్రీడం ఎంత అవసరమో నొక్కి చెప్పాడు .ఆయనతో మాట్లాడి అక్కడి వారంతా ప్రభావితులయ్యారు .

    వాస్సార్ కాలేజి ఉపన్యాసం

 ఒకసారి పటేల్ స్త్రీలకు  ఉన్నత విద్య నేర్పే అతి పురాతన వాస్సార్ కాలేజిలో ప్రసంగించాడు ,.చిన్నా ,పెద్దా నోరు వెళ్ళ బెట్టి విన్నారని వార్తాకథనం .ఉత్సాహ ఆనంద ఆవేశాలను ఆపుకోలేకపోయారు శ్రోతలు .ఉపన్యాసం తర్వాత చేసిన కరతాళధ్వనులు ఎంతో సేపటికి కానీ ఆగలేదట .ప్రాచీన వైభవం ఉన్న భారత్ కు స్వతంత్రం రావాల్సిందే దానికి అర్హత గురించి ఎవరూ చెప్పక్కర్లేదు .స్వపరిపాలన బాధ్యత భారతీయులకు అప్పగించాల్సిందే అనే నిజాన్ని అమెరికన్లకు కల్గించాడు .అమెరికాలో ఉన్న ఆరు నెలలో ఎంతో కృషి చేశాడు పటేల్ .ఇండియాలోని మిత్రుడికిలేఖ రాస్తూ  పటేల్ ‘’నేను ఈ దేశంలో 85ఉపన్యాసాలిచ్చాను .అనేక ముఖ్యులు పరిచయమయ్యారు .బాల్టి మోర్ లో ఫారిన్ పాలిసి అసోసియేషన్  ఆధ్వర్యం లో పెద్ద సభలో మాట్లాడాను .అన్నితరగతుల వారూ హాజరయ్యారు.నాకూ ఫ్రెడరిక్ వైట్ కు చర్చ జరిగింది .ఈ చర్చ కోసమే సభ జరిగింది .మార్చి 11న నాకూ ,వెడ్జి వుడ్ బెన్ కూ న్యుయార్క్ లో చర్చా సభ అరుగుతుంది .పై సంస్థ యే దీన్నీ నిర్వహిస్తోంది .ఆతర్వాత డబ్లిన్ ,లండన్ జెనీవా  వియన్నాలు చూసి చివరికి ‘’ఇండియా జైలు ‘’లో వచ్చి పడతా .ఇక్కడ నేను ఒక్కడినే పని అంతా చేసుకొంటున్నాను .తృప్తి గానే ఉన్నాను .

  సశేషం

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.