ఏకప్రాస సీతారామ శతకం
అల్లమరాజు రామకృష్ణ కవి ఏక ప్రాస సీతారామ శతకం రచించి జగ్గమపేట శ్రీ సీతారామస్వామి ఆలయ ధర్మకర్త శ్రీ మోగంటి కొండ్రాజు గారి ద్రవ్య సహాయంతో,కాకినాడ శ్రీ సరస్వతీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించాడు వెల.కేవలం పావలా.
పీఠికలో శార్దూల పద్యం లో –‘’శ్రీ మా హైమవతీ సరస్వతుల గూర్మిం బెన్నురంబందునన్-సామేనన్,రసనాగ్రభాగమున నిచ్చల్ దాల్చి ముల్లోకముల్
ప్రేమన్బ్రోచుపురాణ పూరుషులు పేర్మి గాన్త్రు రశ్రా౦త మున్ –శ్రీ మోగంటి కులామృతాబ్ధిశశియౌ శ్రీ కొండ రాజాఖ్యునిన్ ‘’అని కృతిభర్తను ర్రక్షించమని లక్ష్మీ ,పార్వతీ సరస్వతులను వాళ్ళ భర్తలైన త్రిమూర్తులను ఒక్క పద్యం లోనే బహు చమత్కారంగా వర్ణించాడు కవి .తర్వాత జగ్గమ పేట పురాన్ని వర్ణించాడు .
గోదావరీ తీరం లో పిఠాపురం సంస్థానం లో రత్నగిరి దగ్గర సకల సౌభాగ్యాలతో జగ్గమపేట వర్ధిల్లింది .దానికి చెందిన 45 పల్లెలకు కరణీకం ఆర్వెల నియోగులైన మోగంటి వారు .రాజ్యాంగ మంత్రం తంత్రాలలో ,పాలనలో ప్రసిద్ధులు.సత్యవాక్య పరిపాలనలో ,సాదు సజ్జన సేవలో,వితరణలో మేటివారు .కాశ్యప గోత్రులు .ఈ వంశం లో –‘’తిరుపతి రాజు బుట్టె గవి దీన జనావళి గాచిబ్రోవ శ్రీ –తిరుపతి రాజే ఈతడన ధీవర సన్నుతుడౌచు దాన ని
ర్ఝరఝర కల్ప భూరుహ విశారద శారద నారదేందుధి-క్కరణ యశో శాలు డరికాలుడుసద్గుణ శీలు డౌననన్ ‘’
ఈయనకొడుకు మల్లప రాజు గ్రామణిత్వం లో దిట్ట.ఈతిరుపతి సీతమ్మ దంపతులకు దుర్మతి నామ సంవత్సరం శుద్ధ చతుర్దశి సోమవారం నాడు గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉండగా కొండల్రాజు జన్మించాడు .కాశీప్రయాగ మొదలైన తీర్ధ యాత్రలు చేసి ,తృప్తి చెందక ‘’రమాహృదీశు’’దేవాలయం కట్టించి ‘’శ్రీ సీతారామ స్వామి దేవాలయం ‘’అని పేరుపెట్టి వైభవోపేతంగా విగ్రహాలను ప్రతిష్టించాడు.నిత్యపూజా శ్రీరామనవమినాడు కల్యాణం నిర్వహించాడు .తర్వాత భద్రాచలం శ్రీరంగం కంచి మొదలైన్ పుణ్య క్షేత్ర దర్శనం చేసి ,తిరిగి వచ్చి భగవధ్యానంతో తరిస్తున్నాడు .
ఒక రోజు –‘’హరితస గోత్ర సంభవుడ నల్లమ రాజ కులాబ్ధి సోముడ-న్మరియునురామకృష్ణ కవి మాన్యుని పౌత్రుడ ,రామ చంద్ర ధీ
వరుని తనూజుడన్ ,సుకవి వంద్యుడ గృష్ణ విలాస కావ్యమున్ –సిరిమగానిన్ గృతీన్ద్రునిగ జేసినా రామకృష్ణు డన్ ‘’అని తన్ను గురించి చెప్పుకొన్న ఈ కవి ఆ సీతారామ దేవాలయ దర్శనం చేసి అందలి శిల్ప కళా వైభవానికి ఆశ్చర్య పడి,పరవశుడయ్యాడు .ఈ స్వామిపై ఏకప్రాస శతకం రాసి ఆలయ నిర్మాత కొండ్రాజుగారికి అంకితమిచ్చి జీవితం ధన్యం చేసుకోవాలనుకొన్నాడు .ప్రమాది వత్సర ఆషాఢ శుక్ల దశమిఆదివార౦ శతకం వ్రాయటం మొదలుపెట్టి ,మూడే మూడు రోజుల్లో పూర్తి చేశాడు .తప్పులు ఉంటె మన్నించమని బుధులను కోరాడు కవి .
శతకాన్ని శార్దూలం లో శ్రీ సీతారామ స్తుతి చేసి ప్రారంభించాడు –‘’’
‘’శ్రీమన్మంగళదేవతా హృదయ రాజీవార్కు మౌనీంద్ర సు –త్రామా బ్జాత శంకర ప్రముఖ గీర్వాణార్చి తాంఘ్రి ద్వయున్
శ్యామా౦గు౦జల జేక్షుణు౦ ,గుణ నిధింస్వర్ణా౦బరు౦ జిన్మయున్-రామున్సర్వ జనాభిరాము మదిలో బ్రార్ధింతు నశ్రా౦తమున్ ‘’.
తర్వాత కందపద్యాలలో ఏక ప్రాసతో ‘’ శ్రీ జగ్గమ పేటధామ సీతారామా’’మకుటం తో శతకం మొదలు పెట్టాడుకవి .మొదటిపద్యం –
‘’శ్రీ జనక తనూజా హృ-ద్రాజీవ విరాజ మాన ,రాజీవాప్తా
రాజద్రూప పరాత్పర –శ్రీ జగ్గమ పేటధామ సీతారామా’’
కొండ్రాజు గారు కట్టించిన దేవాలయం లో ‘’ఓజన్ శ్రీ హరి ,గిరిజా గణరాజార్క ‘’స్థాపనం చేశాడు .-రాజ శరాబ్జసుపర్వో- ర్వీజ మహా జలదిరాజవిష్ణు పదీ-సత్తేజోవిశద యశా –‘’శ్రీ జగ్గమపేట’’.మరోపద్యం లో ఇంద్రుని ‘’జీవనదాశ్వ ‘’అన్నాడు తమాషాగా .ఉపాధులకు ఆజీవాలు అన్నాడు .’’జాజుగల నీ పదంబులు –జాజుల చేమంతి పూల సంపెంగనలన౦ –భోజములతో పూజిస్తానన్నాడు .కావి రంగును జాజు అన్నాడు .అజాను వ్యాప్త సుబాహా అంటాడు .జాంబూనద చేలా అంటాడు పీతాంబర ధారి అనటానికి .జేజేలు రావణాదుల –చే జిక్కుల కోర్వలేక సేవించిన నెం-తే జంపితి వా దైత్యుల ‘’లో జేజేలు అంటే దేవతలు .ఓజతో రామా అంటే ఏ జడుడికైనా వైకుంఠ ప్రాప్తి ఇస్తాడట .బీజం లో ద్రుమం లా, పృద్వీజం లో బీజంలాగా ‘’విశ్వము నీలో –నా జగతిలో న నీవును ‘’అని జగత్పిత ను వర్ణించాడు .జిగి గుబ్బలకనులు అంటాడు . ‘’జేజేపెద్దన నంగా –జేజే పెద్దను శివు౦డు –జెల్లిన శివుని-ట్లోజనెలకొల్పు చుంటివి ‘’అని పురాగాధ వర్ణించాడు.
‘’స్త్రీజన నిందిత శూర్పణ-ఖా జారను రూపు మాపి ఖరముఖ రక్షో –రాజిని గూల్చిన మేటి ‘’రాముడు అన్నాడు ..’’ఆజియును నీ విలోకన-పూజా స్మరణాను లాపములు జరపని దు –ర్భాజనులు నరకగాములు ‘అని చెప్పాడు .ఇక్కడ ఆజి అంటే క్షణకాలమైనా అని అర్ధం .పర్వతాన్ని జీమూతేశ ధారి అనీ ,వాజీ శ్వారా ధిరోహా ‘’అని గరుత్మంతుని వాహనంగా కలవాడా అనీ అన్నాడు .ఇక్కడ వాజీ అంటే పక్షి .ఏప్రయత్నమూ అనటానికి ఏ జతనమూ అన్నాడు.యత్నం ప్రకృతి జతనం వికృతి అని చిన్నప్పుడు చదువుకొన్నాం . ..’’నీ జవుకుపలుకు లెన్నో –యోజన్ జవి గ్రోలు కర్ణ యుగళము కటువౌ – కాజనులమాటలానునె’’లో జవుకు పలుకులు అంటే మనోహర శబ్దాలు .
.’’తేజీ లందములు గో –రాజియు వెండియును బైడిరాసుల నిడి ‘’కొండ్రాజును దయతో చూడు అని రాముడిని కోరాడు కవి.’’రాజీవ కులజు డల్లమ –రాజశ్రీ రామ కృష్ణ రాట్కవిశతకం –బోజరచించి యొసగె గొను ‘’
తర్వాత అష్టకాలు రాశాడు .తర్వాత మత్తకోకిల గానం చేసి స్వామివారలకు కవిరాజ విరాజితం తో పూజించాడు.దత్తాక్షరీ ,మందాక్రాంత వృత్తం చెప్పి సుగంధి వృత్తం లో సువాసనలు గుప్పించాడు .ఆఖర్న భుజంగ ప్రయాతం తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు –ప్రభావంబునన్ వేచి భక్తి ప్రపత్తిన్ – శుభంబొప్ప నాన౦ద శుద్ధిన్ సతంబున్-గాభీరాపగన్ జేయగా గల్గు పుణ్యం –బభీష్టంబు లన్సిద్ధి నందించు ధాత్రిన్ ‘’
కవికి మంచి స్వారస్యం ఉంది .కవిత్వ శుద్ధి బాగా ఉంది .ధారాపాత కవిత్వం తో ‘’జకార ‘’ ప్రాసాన్ని ఓజస్సు తేజస్సు తో సఫలీ కృతం చేశాడు .జగ్గం పేట సీతారాముల కీర్తికి అక్షర పూజ చేసి ధన్యుడయాడు అల్లం రాజు రామ కృష్ణ కవి .
ఈ శతకమూ ,ఈ కవీ పెద్ద గా ప్రాచుర్యం పొందలేదేమో అనిపించింది . పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-21-ఉయ్యూరు

