అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’
అనంతపుర కవి, విమర్శకులు,రిటైర్డ్ తెలుగు లెక్చరర్,సహృదయ మిత్రులు డా . శ్రీ రాధేయ తో నా పరిచయం పాతికేళ్ళుగా ఉంది .మొదటిసారిగా ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల మూడు రోజుల సభలలో పరిచయమయ్యారు .నేనూ ఆయనా ,మరో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండి సభలకు హాజరయేవాళ్ళం .ఆతర్వాత విజయ వాడ లో జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం జాతీయ ,అంతర్జాతీయ సభలలో తప్పక కలిసే వాళ్ళం .వారి శ్రీమతితో కూడా అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఆమెను చూసిన జ్ఞాపకం ఉంది .ఆయన రాసిన ‘’మగ్గం బతుకులు’’కవితా సంపుటి చదివి నేను స్పందించాను .సరసభారతి పుస్తకాలు పంపేవాడిని . నేను అమెరికా వెళ్లి రాసిన ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’గురించి విని పంపమంటే పంపాను .అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళం .సాహిత్యం అంటే ఆయనకు ప్రాణం. తానుఎన్నో పురస్కారాలు పొందినా ,తన ఇంటిపేరిట ‘’ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డ్ ‘’ ‘’ఏర్పరచి కవులనుంచి కవితా సంపుటులను ఆహ్వానించి ,అసలైన న్యాయ నిర్ణేతలతో ఎంపిక చేయించి ‘’ఫియర్ ఆర్ ఫేవర్ ‘’కు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతం గా అవార్డులు అంద జేసేవారు .ఉమ్మడి శెట్టి పురస్కారం అంటే అది సాహిత్య అకాడెమి పురస్కారం కంటే ఘనమైనదని స్వీకర్తలు భావించే వారు .అంతటి గౌరవం పురస్కారానికి కలిగించిన ఘనత రాధేయ గారిది.నవంబర్ 21 బందరు లో జరిగిన కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలలో వారిని నేను ఉదయం పూట సభలకు వెళ్ళక పోవటం వలన చూడ లేక పోయాను .ఇవాళ పోస్ట్ లో రాధేయ రాసిన ‘’సత్యా రాధేయం ‘’ పుస్తకం నాకు చేరింది. అందగానే ఆయనకు ఫోన్ చేసి చెప్పాను .వారి భార్య మరణించిన సంగతి పుస్తకం తీస్తే కాని తెలియలేదు .సానుభూతి ప్రకటించాను .’’చదివి అభిప్రాయం రాయండి ప్రసాద్ గారూ ‘’అన్నారు .వెంటనే చదివి రాస్తున్నాను .
ఇది రాధేయ భార్య సత్యా దేవికి స్మృత్యంజలి .’’యాన్ ఎలిజీ ఆన్ ది డెత్ ఆఫ్ హిజ్ బిలవ్డ్ అర్ధాంగి సత్య ‘’.ముఖ చిత్ర రచన శ్రీ గిరిధర్ చేసి సత్య గారికి జీవం పోసి ఆమె మరణి౦చనే లేదు ,మనమధ్యే ఉంది అనిపించారు .హాట్సాఫ్ టు గిరి .రాధేయ చెప్పుకొన్నట్లు ఇది ‘’సత్యారాదేయుల సత్య గాధ.అతుకు పడని ఒకపట్టు పోగు కథ పావుకోళ్ళ కన్నీటి లేఖ.క్షతగాత్రుని శ్వేతపత్రం ,వియోగి అంతర్మధనం .మానిషాద అనిపించిన క్రౌంచ పక్షి దీనాలాపం .కనుక రామాయణం అంతటి పవిత్ర వియోగ కావ్య౦.మాటలు కోల్పోయిన మహా శూన్యం లోంచి మొలిచిన హృదయ నివేదనం .ఆత్మ వేణువు పలికిన విషాద మోహనం .ఓ ప్రాణ వాయువు కత .’’ఉమ్మడి శెట్టి –ఉమ్మడి చెట్టు’’గా ఎదిగి కవిత్వ ఫలాలందించిన కథ. వారిద్దరి తొలి పరిచయం నుండి ‘’ఆమె ఆఖరి మజిలీ ‘’వరకు ఉన్న ఎన్నెన్నో జ్ఞాపకాల వసంతం .
ఆమెను పెళ్లి చూపులలో చూడగానే ‘’చిన్ని కుటుంబం చింతలు లేని కుటుంబం ‘’భావనలో ఆమె వెంటనే నచ్చేసింది .రాధేయ నిర్ణయాన్నిఇరువైపులా స్వాగతించారు .30-5-1979 న సత్య ,రాధేయ లు ఒక్కటై ‘’సత్యా రాధేయం ‘’అయ్యారు .వివాహాన్ని కవులు హర్షించి అక్షరాక్షతలు జల్లారు .’’సత్యాదేవిని వెతికి పట్టుకొన్నావ్ ‘’అని కుందుర్తిఅంటే , ,’’మీ కల్యాణం కమనీయం ‘’అని సినారె ఒకపాటే రాశారు .పెళ్ళినాడు కవిసమ్మేళనం కూడా జరిపించి పెళ్ళికొడుకుగా కవి సమ్మేళనానికి అధ్యక్షుడుగా రాధేయ ద్విపాత్రాభి నయనంచేసి సవ్య సాచి అనిపించుకొన్నాడు ..ఆమె తన చిటికెన వ్రేలు పట్టుకొని తనకవిత్వ ప్రేమనగరి లోకి ఆడు గుపెట్టిందని మురిసిపోయాడు .పులిచెర్ల ఆడపడుచు ఉమ్మడి శెట్టి వారి కోడలై౦దని సంబర పడ్డాడు .ఆమె బడి పంతులు కూతురు ,తనకు తెలిసిన ‘’బతుకు నేత’’ తెలియంది .మగ్గం వీళ్ళ జీవన వేదం .ఆయన్ను పేరుపెట్టి పిలవలేను, ఏమండీ అనటం ఇష్టమూ లేదు కనుక ‘’అయ్యా ‘’అని పిలుస్తాను అంటే ఆ ఆర్ద్రత కు పులకించి పోయాడు .గ్రేడ్ వన్ హిందీ పండిట్ గా ఉద్యోగం లో చేరగా ‘’అవధులు లేని ఆనంద కవితా విహారి ‘’అయి ,అప్పటిదాకా స్నేహితులైన ఆకలీ ,పేదరికం తనకు తలలు వంచి చేతులు జోడించాయి .
రాధేయ పుట్టి పెరిగిన ‘’యామవరం ‘’కవిగా ఆయన ఉనికి చాటితే ‘’పందిళ్ళ పల్లి ‘’పెళ్లి పందిరిగా అవార్డ్ కు శ్రీకారం చుట్టింది .మాస్టారైన ఆమె తండ్రి ఆమెచదువును స్కూల్ విద్యతో ఎందుకు ఆపెశాడో తెలీక ఆమెను చదూకోమంటే ‘’నా కెందుకయ్యా చదువులు ?ఇంటిని చక్కదిద్దుకొనే చదువు ఉంది. నువ్వు చదివి పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకో మన జీవితాలు బాగు పడతాయని హితవు చెప్పిన అసలైన అర్ధాంగి ‘స్వయం సిద్ధ ‘’సత్య .ఆరేళ్లలో ఎ౦ .ఎ .కూడాపాసై ,డాక్టరేట్ కూడా సాధించి ఆమె నమ్మకాన్ని నిజం చేశాడు .
ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ‘’ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డ్1988లో స్థాపించి ,ప్రతి ఏడాదీ అర్హులకు అవార్డ్ పాతికేళ్ళుగా ఆమె ఆరోగ్యం బాగా లేకపోయినా ,తాను రిటైర్ అయినా,పెన్షన్ డబ్బుతో అందిస్తూ,’’అవార్డ్ రజతోత్సవాన్నిఘనంగా విశేషంగాహాజరైన కవుల మధ్య జరిపి ‘,ఆమె వేదికపైన ‘’అనివార్య పరిస్థితుతల లోఅవార్డ్ విరమించాలని అనుకొన్నాం ‘’అని ప్రకటించగానే .సభాసదులు పెద్ద ఎత్తున అసమ్మతి తెలియ జేస్తే ‘’ఈ వార్డ్ రావాలని ప్రతి తెలుగు కవీ ఎదురు చూస్తాడు కనుక కొనసాగాలి ‘’అనికోరితే అవాక్కై ‘’చెప్పుకోలేని కుటుంబ సమస్యలున్నాయి .మీ అభిమానం ముందు మేము ఓడిపోక తప్పటం లేదు. కొంతకాలం అవార్డ్ ను కొనసాగిస్తామని మా వారితరఫున మాట ఇస్తున్నాను.క్షమించు ‘’అయ్యా ‘’అనగానే శ్రోతల ఆగని చప్పట్ల తో ఇద్దరూ తడిసి పోయారు అశ్రునయనాలతో .
విధి ఎప్పుడు ఏ వింత ఆట ఆడుతుందో తెలియదు .బెంగుళూర్ లో జరిగిన బైక్ ప్రమాదం లో సత్య మృత్యువు అంచుకు చేరి ,మెమరీ కోల్పోయి ,మద్రాస్ లో వైద్యం కోసం కొడుకు దగ్గర ఉండాల్సి వచ్చి ఇద్దరి మధ్య ఎడబాటు తప్పలేదు .26వ సభ పలమనేరులో బాలాజీ జరిపిన అవార్డ్ సభకు హాజరై ప్రముఖ కవి శ్రీ కే శివారెడ్డిని గుర్తించి అపలకరిస్తే ఆయన అప్రతిభుడై ఆమె బాగా కోలుకున్నదని భరోసా ఇచ్చాడు .సత్యా రాధేయ దంపతులకు బాలాజీ దంపతులు వేదికపై వేదాశీస్సులు ఇప్పింఛి చిరస్మరణీయం చేశారు .’’అవార్డ్ త్రిదశాబ్ది సభ’’ జరిపే ఆలోచన చేసి రిటైర్ మెంట్ లో దాచుకొన్న డబ్బుతో దాన్ని నిర్వహించి ఆనందం ఆర్ణవమైనట్లు దంపతులు భావించారు .రాష్ట్ర, రాష్ట్రేతర కవులు పెద్ద పెట్టునవచ్చి ‘’కృష్ణ దేవరాయల స్వర్ణయుగం ‘’ను కళ్ళకు కట్టించి౦చారు .ఆ సభలో సత్యాదేవి ‘’ఎన్నో కష్టనష్టాలతో ముప్పై ఏళ్లుగా అవార్డ్ క్రమ౦ తప్పకుండా ఇస్తున్నాం .ఎంతోమంది కవులకు ఆతిధ్యమిచ్చే అదృష్టం మాకు దక్కింది .మా పిల్లలు పూనుకొంటే అవార్డ్ కొనసాగిస్తాం నాకు కవిత్వం ఏమీ తెలీదు ‘’అయ్య’’మంచి పని చేస్తాడుకనుక నా శక్తి కొలదీ సహకరించా ‘’అనగా అందరి హృదయాలు ఆర్ద్రమయ్యాయి .అదేఆమే చివరి మాటలు అని ఎవరూ అనుకోలేదు .ఆమె కు మద్రాస్ లో ఉండాలని పించక ఆమాటే చెబితే చలించిపోయాడు రాధేయ .మంత్రాలయం చూసి వచ్చారు .ఆయన గుండె బలం ఆమె అయినా ,ఆమె బలాహీనమైన గుండెతో బతుకుతోందని డాక్టర్ చెపితే నమ్మలేక పోయాడు .అన్ని సభలలో తనకు గుండేధైర్యమిచ్చి నిలబడి’’తనకు ముందు నడిచి’’ఒకే చరణం యుగళగీతమై’’ కేటలిస్ట్ అయి నడిపించిన ప్రియ సత్య గుండె అంత బలహీనమా అని ఆశ్చర్యపోయాడు .నాలుగు దశాబ్దాలు ఆయనతో చేయి చేయి కలిపి నడచిన అర్ధాంగి సత్యాదేవి కానరాని లోకాలకు చేరింది .’’ఈమలి సంధ్యలో నా ఆఖరి మలుపు ఎక్కడో ‘’?అని రాధేయ విచారించాడు .మందహాసాన్ని జారవిడుచుకొని ప్రశ్నార్ధకాలను మోసుకొంటూ తిరుగుతున్నాడు .ఆయన ధైర్యం కవిత్వం దీనంగా కనిపిస్తోంది .బతుకు మగ్గం వణకి,పడుగు పేక చిక్కుబడి పోయాయి .ఆమె ఆయన కళ్ళ ముందు లేని వేళ, తడారి పోయిన పెదాలను తడుపుకొంటూ తమకన్నీటి కథ. రాశాడు .
ఈ పుస్తకం చివరలో ప్రముఖ కవుల ,ఆప్తుల అభిప్రాయాలున్నాయి . అద్భుతమైన కవితా రూప దాంపత్య కథ గా ‘’సత్యా రాధేయం ‘’నిలిచిపోతుంది .శ్రీ రాధేయ కుంగిపోకుండా ,మరింత ధైర్యబలం తెచ్చుకొని సాహితీ ప్రస్థానం కొన సాగించాలని కోరుతున్నాను .ఆ కుటుంబానికి నా సానుభూతి తెలియ జేస్తూ ,సత్యాదేవి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-12-21-ఉయ్యూరు

