మ మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11

     మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -11

11-సంగీత నటనా దర్శక దిగ్దేశకులు –శ్రీ  దైతా గోపాలం

కృష్ణా జిల్లా ఆంద్ర మహా విష్ణు క్షేత్రమైన శ్రీకాకుళం లో  పాపనాశనం అనే శివారు గ్రామం లో దైతా వెంకటాచలం ,అన్నపూర్ణమ్మ దంపతులకు దైతా గోపాలం 1900లో జన్మించారు .అక్కడ ప్రదర్శించే కూచి పూడి వారి యక్షగానాలను బాల్యం నుంచి చూసి మోజు పెంచుకొన్నారు .జన్మతహా  మధుర గాత్రం ,విచక్షణా శక్తి ఉన్నాయి .చిన్న చిన్నమాటలతో నాటకం రాసి తోటి పిల్లల చేత నటిమ్పజేస్తూ తానూ నటించి ఒక నాటకం ప్రదర్శించారు .ఇది తెలిసిన తండ్రి బడితే పూజ చేశారు .ఈయన మేనమామ సత్యనారాయణ ఇదే ఈడు వాడు .తమకలాపిపసకు పెద్దలు అడ్డు తగులుతున్నారని మామా అల్లుళ్ళు భావించి తమ తృష్ణ తీర్చేది బెజవాడ అని అక్కడికి చేరారు .ఆకాలం లో మైలవరం జమీందారు ఆధ్వర్యం లో మైలవరం నాటక సమాజం దిగ్విజయంగా నడుస్తోంది .అందులో శ్రీ యడవల్లి సూర్యనారాయణ ,శ్రీ ఉప్పులూరి సంజీవరావు ,శ్రీ గురజ నాయుడు మొదలైన ప్రముఖ నటులు ఉండేవారు .కవి శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి .సంగీత దర్శకులు శ్రీ బాపట్ల కాంతయ్య .ఈ సమాజం లో చిన్న చిన్న పాత్రలకు అవకాశం వచ్చింది గోపాలం గారికి .

 దీనితో నాటకానుభవం కలిగి శకుంతల నాటకం లో శిష్యుని పాత్ర వేశారు .తరువాత పాదుకా పట్టాభిషేకం లో భరతుడు గా నటింఛి అమోఘమైన నటనతో జనామోదం పొందారు .శ్రీ మల్లాది అచ్యుతరామ శాస్త్రి గారు రచించిన ద్రౌపదీ వస్త్రాపహరణం లో విదుర పాత్ర ధరించి వాచకం అభినయంలతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేశారు .ఆయన విదుర నీతులు చెబుతుంటే కలా ,నిజమా ఆయన మానవ మాత్రుడా లేక నిజంగానే విదురుడు దిగివచ్చి బోధిస్తున్నాడా అని ప్రేక్షకులు అబ్బుర పడేవారు .అక్రూర పాత్ర ధారణా చేసి  సెహబాస్ అనిపించుకొన్నారు .అంటే సాత్విక పాత్రలను నటించటం లో ఆయన మేటి నటులు .రంగస్థలం మీద బయట ఇతర  వ్యవహారాల్లో కూడా గోపాలం పరమ సాధువులుగా ఉండేవారు కనుక పాత్రలు పండేవి .ఈ సమాజం ఆర్ధిక చిక్కుల్లో పడి చెల్లా చెదరైంది .

  అచ్యుతరామ శాస్త్రిగారు అప్పుడే సక్కుబాయి నాటకం రాసి దైతావారి కళాభి రుచి గుర్తించి ఆయనకు  ఇచ్చారు .శాస్త్రిగారికి కృతజ్ఞత తోకొంత డబ్బు అందజేసి,నాటకం సర్వహక్కులూ పొందారు .జొన్న విత్తుల శేషగిరిరావు , జొన్న విత్తులసత్యనారాణ ,తు౦గలచలపతిరావు,సూరవరపు వెంకటేశ్వరరావు మొదలైనవారితోకలిసి తానె ఒక కొత్త నాటక సమాజాన్ని స్థాపించి తనకున్న సంగీతానుభావంతో ఆ నాటకానికి కీర్తనలు ,స్వయంగా రాశారు .ఒక ఏడాది పాటు నటులను తీర్చి దిద్ది ప్రదర్శించారు .కీర్తనలు  నటుల హావభావాలు రసజ్ఞలోకాన్ని ఉర్రూత లూగించాయి. ఈ ట్రూప్ తో ఆంద్ర దేశం లో వందలాది సక్కుబాయి నాటక ప్రదర్శనలు నిర్వహించారు .సుప్రసిద్ధ సంగీత దర్శకుడుశ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారికి సక్కుబాయిపాత్రను నేర్పి నటి౦పజేసి ఎన్నో ప్రదర్శనలిచ్చారు .గోపాలం గారు ఈ నాటకం లో పాడిన – విష్ణు పాదాన జన్మించి ,కమనీయ భూమి భాగములు అనే రెండు పద్యాలూ ఆయన గానం చేసిన తీరు అత్యద్భుతం అనిపిస్తాయి ,

కొంతకాలాని సమాజ సభ్యులమధ్య కలతలు ఏర్పడటం తో సమాజం మూత పడింది  .

   పట్టు వీడని విక్రమార్కునిలా సమాజ పునరుద్ధరణకు ప్రయత్నించినా ఫలించక అప్పుల ఊబిలో కూరుకుపోయారు .ఎందఱో పండితుల  కీర్తనలకు దైతా గోపాలం గారు స్వర కల్పనా చేసి అందించారు .ఎందరెందరో నటులకు పద్యాలు అర్ధ భావ యుక్తంగా పలకటం లో  శిక్షణ ఇచ్చారు ,. అమరగాయకులు ఘంటసాల ,మహానటుడు అక్కినేని వంటి అగ్రశ్రేణిసంగీత దర్శకులు ,నటులు దైతా గోపాలంగారిని సంప్రదించి సలహాలు సూచనలు పొందేవారు .

ఆంద్ర నాటక సంస్కృతిని విస్తృత పరచిన గోపాలంగారు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారి నాటకం ఆధారంగా సి.పుల్లయ్య గారి దర్శకత్వం లో1939లో  వచ్చిన   వరవిక్రయం సినిమాలో  నటించారు.దీనిలో భానుమతి శ్రీరంజని ,పుష్పవల్లి ,బలిజేపల్లి లక్ష్మీ కా౦తకవి గార్లతోపాటు తమసహచర నటులు కొచ్చర్లకోట సత్యనారాయణ ,దాసరి కోటిరత్నం ,తుంగల చలపతి రావులు కూడా నటించారు .  

శ్రీ రాజ రాజేశ్వరి ఫిలిం కంపెని అధినేత శ్రీ కడారు నాగ భూషణం గారి ఆదరణపొంది,ఆ సంస్థ 1941లో నిర్మించిన సతీ సుమతి 1954లో నిర్మించిన సక్కుబాయి ,1955లో నిర్మించిన శ్రీ కృష్ణ తులాభారం చిత్రాలకు రచయితగా  పని చేసి తన పాండిత్యాన్ని ,రచనా పాటవాన్ని చూపించి అప్రతిభులను చేశారు .సతీసుమతి చిత్రానికి గోపాలం గారు రాసిన ‘’నిన్న సాయంత్రము ‘’అనే పాట గొప్ప పేరు తెచ్చింది.కాశీనాథ్ ప్రొడక్షన్స్ బానర్ పై 1958 శ్రీ ఎన్ ఎస్ ఆచార్య దర్శకత్వం లో అమరనాథ్ ,శ్రీరంజని, మీనాకుమారి నటులుగా  నిర్మించిన శ్రీ రామాంజనేయ యుద్ధం లో దైతా గోపాలం గారు ,తాండ్ర సుబ్రహ్మణ్యం ,ఎస్ విఎన్ ఆచార్య పాటలు రాయగా ,శ్రీ జంధ్యాల సంగీతం సమకూర్చారు .ఇదే గోపాలం గారి చివరి సినిమా .దీనిలో సుప్రసిద్ధ రేడియో గాయకుడు శ్రీ మల్లిక్ –స్వామి తోడనా సంగ్రామంఅనే గీతాన్నీ , ,భండన భీము డార్తజన బాంధవ అనే భక్త రామదాసుగారి పద్యాన్ని పాడారు .

  1958లో రచయిత, నటుడు ,గీతరచయిత  మహా శిక్షణా నిపుణుడు ,సంగీతం మెళకువలు ఎందరికో తెలియజెప్పిన శ్రీ దైతాగోపాలంగారు అస్తమించారు .ఈతరం వారికి వారి గురించి ఏమాత్రమూ తెలియదనే, వారి గురి౦చి ఈ  చిరు పరిచయం

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-22-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.