త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )

త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )
1930లో హనుమంతరావు గారు కొండా వెంకతప్పయ్యగారి ఇంటి ఆవరణలో ఉప్పు సత్యాగ్రహం చేశారు .ఆరోజు అరెస్ట్ చేయలేదు .తర్వాత ఏడుగురితో కలిసి నమ్బూరుదగ్గర కంతేరు గ్రామం వెళ్లి ,తాటిచెట్ల కున్న కల్లు లోట్టెలు పగుల గొట్టింఛి నందుకు అరెస్ట్ చేసి ,మంగళగిరి సబ్ జైలులో పెట్టారు .తర్వాత విచారించి 9నెలలు కఠిన శిక్ష వేశారు ..తర్వాత రాజమండ్రి జైలుకు ,తర్వాత ఒకనెలకు మద్రాస్ రెసిడెన్సి కి మార్చారు .ఇక్కడ రెండు నెలలున్నారు .తర్వాత బిక్లాస్ కు మార్చి రాయవెల్లూరు జైలుకు పంపగా అక్కడే శిక్షాకాలం పూర్తీ చేసుకొన్నారు .వెల్లూరు జైలులో కాలం హాయిగా గడిచింది .నిత్య గ్రంధ పఠనం,సాయంత్రం షికారు .షికారులో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి మామగారు శ్రీ పురాణం సూరి శాస్స్త్రి గారితో మంచి కాలక్షేపం .ఆయన శాస్త్ర విషయాలను సైంటిఫిక్ గా రుజువు చేసేవారు
శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య ,కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరు కృష్ణారావు ,శ్రీ రాజాజీ ,బెజవాడ గోపాల రెడ్డి గార్లు అదే జైలులో ఉండేవారు .అందరి వద్దా అనేక పుస్తకాలు ఉండేవి .రావు గారి వారిని అడిగి తీసుకొని చదివి తిరిగి ఇచ్చేవారు .ద్విజేంద్ర లాల్ రాయ్ రాసిన హిందీ నాటకాలు చదివారు. రెడ్డి పిచ్చయ్యగారికి రోజూ భాగవతం చదివి వినిపించేవారు రావుజీ .శ్రీరామ కృష్ణ పరమహంస గారి గ్రంథాలన్నీ చదివారు .
జైలు నుంచి విడుదలయ్యాక రావు గారికి పుట్టిన మగపిల్లాడికి’’రామ కృష్ణ ‘’పేరుపెట్టుకున్నారు భక్తిగా ,.తర్వాత ఆడపిల్ల .హిందీ విశారద పాసై మేనల్లడిని పెళ్ళాడి ,పది నెలలు కాపురం చేసి స్ఫోటకం తో జాల్నాలో చనిపోయింది రెండవ ఆడపిల్ల .1931లో పెద్దకొడుకు 1936లో మూడో ఆడపిల్ల పుట్టారు .యితడు ఎల్సియిపాసై తెనాలిలో ఉద్యోగిస్తున్నాడు .రెందోకొడుకు 1935లో మూడో వాడు 1942లో జన్మించారు .అందరికి వివాహాలు చేసి మనవళ్ళతో మనవరాళ్ళతో హాయిగా ఉన్నారు .
ఉప్పు సత్యాగ్రహం లో జైలుకు వెళ్ళినప్పుడు కృష్ణాశ్రమం బాధ్యత శ్రీ వింజమూరి భావనాచార్యులకు రావుగారు అప్పగించారు .ఆయన వృద్ధాప్యం వలన సరిగ్గా నిర్వహించలేక ఒక క్రిష్టియన్ ఉపాధ్యాయు డికిఅప్పగించగా ,జైలు నుంచి వచ్చి ఆయన్ను తొలగించటానికి రావు గారు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది .పరిశ్రమలు ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించటానికి కొన్న ఇనుపస్తంబాలు రేకులు అన్నీ అమ్మి ఆచార్యులు అప్పులన్నీ తీర్చేశారు .జైల్లో ఉన్నప్పుడు తానూ చదివిన టాల్ ష్టాయ్ నవల ‘’వాట్ దెన్ మస్ట్ వుయ్ డు’’లో చెప్పబడిన పంటలను పండించే వారికంటే దాన్ని అనుభవించే వారు ఎక్కువైపోవటం వలన ఆభారం అంతా రైతే భరించాల్సి వస్తోంది ,కాళ్ళూ చేతులు పని చేసే వారంతా రోజుకు కనీసం మూడు గంటలు పని చేస్తే లోకం లో దరిద్రం ఉండదు .అందరూ కూడూ గూడూ లభించి సుఖంగా ఉంటారు అనే సిద్ధాంతం రావు గారికి బాగా నచ్చి,పల్లెటూరి వ్యవసాయం చేయాలని కోరికకలిగి నౌలూరులో ఉన్న భూమిలో చాలాభాగం కరిగిపోగా ,ప్రాతూరులో పినతల్లి ఇచ్చిన పొలం సాగు చేయాలనుకొని ఆమెకు చెబితే అంగీకరించలేదు .
శ్రీకొండా వారు ,శ్రీ కోట లక్ష్మయ్య గారికుమారుడు శ్రీ వెంకటేశ్వర్లు శ్రీ మద్ది వెంకట రంగయ్యగార్లతో ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసి కార్యదర్శి పదవికి రాజీనామా చేసి రావుగారు కృష్ణాశ్రం ను వారికి అప్పగించారు ,రాజీనామా చేయవద్దని అందరూ ఎంత బలవంత పెట్టినా రావుగారు అంగీకరించలేదు .తానూ నెత్తిమీదకు తెచ్చిపెట్టుకొన్న శివశంకర శాస్త్రి గారు చేసిన అల్లరి చాలా బాధించింది .ట్రస్ట్ బోర్డ్ రావు గారి రాజీనామాను అత్యంత బాధాకరంగా అంగీకరించింది .తాను గుంటూరులో కట్టుకొన్న ఇంటిని కూడా అమ్మేసి అప్పులన్నీ తీర్చి ఆశ్రమం తో సంబంధం పూర్తిగా తెన్చేసుకొని 1936వరకు గుంటూరులోనే ఉన్నారు .
మద్ది వారి ఆధ్వర్యం లో ఆశ్రమం లో వడ్రంగం ఇనుపపనులు సిమెంట్ పనులు నేర్పే పారిశ్రామిక పాథశాలగా దాన్ని మార్చారు .ఆయన చనిపోయాక ఎం ఎల్ సి అయిన శ్రీ మద్ది సుదర్శనం గారి ఆధ్వర్యం లో నడుస్తోంది .హరిజన నాయకులను తయారు చేసిన సంస్థ ,ఆశ్రమం లో తయారైన పరికరాల అమ్మకాల వలన విపరీతమైన లాభాలు గడించింది .ఆశ్రమం వదలవద్దని వెంకటప్పయ్య పంతులు గారు ఎంత చెప్పినా రావు గారు వినలేదు .ఆ రోజుల్లో ఆశ్రమం లో చదువుకొన్నవారు చాలా చోట్ల హరిజన హాస్టల్స్ స్థాపించి నిర్వహించారు కొందరు నాయకులై,సంఘ సేవకులై డాక్టర్లు నర్సులు ఉపాధ్యాయులై వెలిగారు .ఒకతను కర్ణాటకలో కలెక్టర్ అయ్యాడు .ఒకాయన అసెంబ్లీలో ,మరొకాయన పార్లమెంట్ లో సభ్యులయ్యారు .
1937లో పినతల్లి అంగీకరించగా రావుగారు ప్రాతూరులో వ్యవసాయం చేశారు .ఖర్చు బారెడు ఆదాయం మూరెడు గా నష్టాలోచ్చాయి రెండేళ్ళు అలాగే గడిపారు .తనకు ఏదైనా పని ఇమ్మని అఖిలభారత హరిజన సేవా సంస్థకు రాశారు .బెజవాడలో శ్రీ వేములకూర్మయ్యగారు నడుపుతున్న హరిజన బాలిక హాస్టల్ బాధ్యత వదులు కొంటున్నందున దాన్ని నడిపే బాధ్యతా తీసుకోమని రావుగారికి ఆర్డర్ పంపారు .1939లో కాపురం బెజవాడకు మార్చారు .కూర్మయ్యగారు హాస్టల్ అప్పగించటం లేదు .ఈ విషయం పైకి తెలియజేస్తే నెల్లూరు వెళ్లి చేరమని ఆర్డర్ పంపగా ,1940లో నెల్లూరు వెళ్ళారు .నెల్లూరు టౌనులో బాలుర హాస్టలు ,బాలికల హాస్టలు బుచ్చిరెడ్డిపాలెం లో ఒకటి కందుకూరులో ఒకటి హాస్టల్స్ ఉన్నాయి .కాపురం పెట్టి వీటి అజమాయిషీ చేస్తూ ఒక ఏడాది గడిపారు హనుమంతరాగారు .
ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సి 1941లో బెజవాడ వచ్చేశారు .రెండేళ్లలో ఇద్దరి పెళ్ళిళ్ళు చేశారు .ఇందులో పెద్దపిల్ల పెళ్లి అయిన కొన్నిరోజులకే స్ఫోటకం తో చనిపోయింది. రెండో అమ్మాయి సిరిసంపదలతో గుంటూరులో సుఖంగా కాపురం చేసుకొంటోంది .1942లో ఈయనమిత్రుడు సంపత్ విధ్వంసక ఉద్యమానికి నాయకత్వం వహించి ఉత్తర భారతమంతా తిరిగి ప్రచారం చేస్తూ పోలీసుల కళ్ళుకప్పి తిరుగుతూ ఒక సారి రావుగారికి ఒక ఉత్తరం రాసి ‘’కొండపల్లి రైల్వే స్టేషన్ లో నా సామాను ఉంది మీరు తీసుకురండి ‘’అని చెప్పాడు .కొండపల్లి సత్రం లో దిగగా అక్కడ గంజాయి పీల్చే సాదువుకనిపించి రావు గారిపేరు చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే ,వచ్చి అరెస్ట్ చేసి గదికి తాళం వేసి రైలులో బెజవాడ తీసుకు వెళ్ళారు రాత్రి ఏడున్నరకు .సంపత్ వివరాలు అడిగారు తనకు తెలీదన్నారు .పోలీసులు ఒక ఇంటి కి తీసుకువెళ్ళి తలుపు తట్టగా లోపల నుంచి సంపత్ రాగా అరెస్ట్ చేసి గవర్నర్ పెట్ పోలీస్స్టేషన్ సెల్ లో పెట్టారు .అది దుర్వాసనతో భరించరాని కంపుతో ఉంది .తెల్లార్లూ ముక్కుమూసుకొని గడిపారు రావుగారూ మిత్రుడూ .ఉదయం కాల కృత్యాల తర్వాత సి ఐడి ఇన్స్పెక్టర్ దామరాజు వెంకటేశ్వరావు వచ్చి కావాల్సిన ముద్దాయి దొరికాడుకనుక ముసలాయన తో మనకేం పని వదిలెయ్యండి అని రావుగారి ని వదిలేశారు .
1948లో బెజవాడ పట్టాభి గారికి సంబంధమున్న ‘’జన్మభూమి ‘’దినపత్రిక స్థాపించారు .మోచర్ల కృష్ణమూర్తిగారు ,చిత్తర్వునాగేశ్వర రావు గారు దీన్ని నిర్వహించేవారు .పట్టాభి గారి రికమండేషన్ వలన అందులో సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చింది .నెలకు వంద జీతం రెండేళ్ళు పని చేశారు .పత్రిక ఆగిపోగా ,ఇన్స్యూరెన్స్ ఏజెంట్ అవతారం కూడా ఎత్తి1955వరకు లాగారు .హరిజన సేవకు చేసిన సేవను గుర్తించి గాంధీ స్మారకనిది వారు రావు గారికి నెలకు 75రూపాయల ఆర్ధిక సాయం గ్రాంట్ చేశారు .1958లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్లదగ్గర మూరకం పాడులో రాజకీయ బాధితుడికి దేశ సేవకు గుర్తింపుగా 5ఎకరాల భూమి ఇస్తే సాగు చేయటానికి బాపట్లలో కాపురం పెట్టి మూడేళ్ళు సాగు చేసి ఫలితం అనుభవించారు 1961లో దాన్ని మంచి ధరకు అమ్మేసి,ప్రాతూరులో ఆ డబ్బుతో ఆరున్నర ఎకరాల మెట్ట భూమి కొని ,పినతల్లి ఇచ్చింది కూడా కలిపి మొత్తం 8ఎకరాలు సాగు చేస్తూ ,ప్రాతూరులోనే పిల్లా జెల్లా తో సుఖంగా గడుపుతున్నారు .
నిరంతర గ్రంధపఠనం ,భవత్ చింతన తో కాలక్షేపం చేశారు .తన కుటుంబానికీ బాదితులకూ ప్రకృతి వైద్యం చేస్తూ వ్యాధులను నివారించారు .45 ఏళ్ల రావు గారమ్మాయి ఋతుస్రావం వలన కడుపులో గుల్మం ఏర్పడి ,మధుమేహంకూడా రాగా ఆహార నియమాలతో ప్రకృతి వైద్యంతో నయం చేశారు. కేన్సర్ క్షయ బిపి నపు౦స కత్వాలను కూడా ఈ చికిత్సతో నయం చేసి ఎందరికో దేవుడు అనిపించుకొన్నారు .ఉప్పు సత్యాగ్రహం లోపాల్గొని జైలుపాలైనందుకు రావుగారికి భారత ప్రభుత్వం తామ్రపత్రం తోపాటు నెలకు 200 ఫించన్ 1972ఆగస్ట్ 15నుంచి ఇచ్చారు .86ఏళ్ల వయసులోనూ త్యాగధనులు శ్రీనల్లపాటి హనుమంతరావు గారు ఆరోగ్యంగా ప్రశాంతంగా సుఖంగా ఉన్నారు .
ఆధారం –శ్రీ నల్లపాటి హనుమంతరావు గారి స్వీయ చరిత్ర
సమాప్తం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.