స్త్రీల పరదాల నిషేధానికి ఉద్యమించి,భారత దేశం లోనే మొట్టమొదటి జిల్లాబోర్డ్ మహిళా ప్రెసిడెంట్ అయిన శ్రీమతి కడప రామ సుబ్బమ్మ (జులై విహంగ కు ప్రత్యేకం

స్త్రీల పరదాల నిషేధానికి ఉద్యమించి,భారత దేశం లోనే మొట్టమొదటి  జిల్లాబోర్డ్  మహిళా ప్రెసిడెంట్ అయిన శ్రీమతి కడప రామ సుబ్బమ్మ (జులై విహంగ కు ప్రత్యేకం )

కడపజిల్ల జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లి లో రామ సుబ్బమ్మ 1902లో కొనుదుల రామ చంద్రా రెడ్డి ,అచ్చమాంబ దంపతులకు జన్మించింది .తండ్రి సంపన్నుడైన సంస్కృత పండితుడు .1911లో జరిగిన అయిదవ జార్జి చక్రవర్తి పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకొన్న ఘనుడు .ఎందఱో విద్యార్ధులకు స్కాలర్షిప్ లిచ్చి చదివించిన ఉదారుడు .రామ సుబ్బమ్మ వివాహం 15వ ఏట కడప కోటి రెడ్డితో 1917లో జరిగింది .ఆయన లండన్ యూని వర్సిటి లో ఎల్. ఎల్ .బి ,ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి లో బిపిఎల్ పట్టాలు పొంది బార్ –అట్- లా అయిన విద్యాధికుడు .అయినా దేశీయాభిమానం జాతీయత దేశ భక్తీ పుష్కలంగా ఉన్న వాడు .ఈ సద్గుణాలన్నీ భార్య రామ సుబ్బమ్మ లో కల్గించాడు .అందువలన ఆమె 1921నుంచే కాంగ్రెస్ లో చేరి జాతీయోద్యమాలలో పాల్గొన్నది .

  సైమన్ కమీషన్ బహిష్కరణ నిరసన సభలు మద్రాస్ లో 3-2—1928 న పెద్ద ఎత్తున వెల్లువలాగా ప్రజలు పాల్గొని దిగ్విజయం కూర్చారు .హైకోర్ట్ దగ్గర ఈ ఉద్యమాన్ని ఆపటానికి తెల్ల సైనికులు కాల్పులు జరిపారు .ఒక అజ్ఞాత వీరుడు చనిపోయాడు .ప్రకాశం పంతులు, కోటి రెడ్డి రామ సుబ్బమ దంపతులు మొదలైన వారెంతో మంది ఆప్రదర్శనలో ఉన్నారు .ప్రకాశం పంతులుగారు ధైర్యంగా ముందుకొచ్చి ‘’ఎవర్రా !నా సోదరులను కాలుస్తున్నది ?నన్ను కాల్చి తర్వాత వాళ్ళను కాల్చండి ‘’అంటూ చొక్కా  గుండీలు విప్పి ఛాతీని తుపాకులకు ఎదురుగాపెట్టి గర్జించారు .ఆ  సింహ గర్జనే ,ఆ నిస్వార్ధ శౌర్య ప్రదర్శనే పంతులు గారిని ‘’ఆంధ్ర కేసరి ‘’గా  గౌరవంగా పిలిపించుకొనేట్లు చేసింది .ఆనాటి ఆ దృశ్యం రామ సుబ్బమ్మ గారి హృదయం పై చెరగని ముద్ర వేసింది .దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవ్వాలని నిశ్చయించు కొన్నది .అదీ ఆంధ్రకేసరి ఆమెపై కల్గించిన గొప్ప ప్రభావం .

  1930 ఉప్పు సత్యాగ్రహం లో శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ ,ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ,పొణకా కనకమ్మ ,దుర్గాబాయ్, పట్టాభి ,బులుసు సాంబమూర్తి, ప్రకాశం, కళా వెంకటరావు మొదలైన అగ్రశ్రేణి దేశ భక్త నాయకులతో కలిసి రామ సుబ్బమ్మ రెట్టించిన ఉత్సాహం తో పాల్గొని విజయ వంతం చేసింది .1941 వ్యక్తి సత్యాగ్రహంలో భర్తతో సహా పాల్గొన్నది .భర్తను అరెస్ట్ చేశారు .కాంగ్రెస్ అధ్యక్షులు పట్టాభి చెప్పిన మాట ప్రకారం జైలుకు బయటనే ఉండి,ఎంతోమందికి ప్రేరణ కలిగించి అరెస్ట్ అయ్యేట్లు కృషి చేసింది .ఉద్యమం నిరాఘాటంగా జరగటానికి ఎంతో తోడ్పడింది .1938 డిసెంబర్ లో ఆమె కడపజిల్లా బోర్డ్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ తరఫున ఎన్నికైంది .భారత దేశం మొత్తం పై ఎన్నిక కాబడిన మొట్టమొదటి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా రికార్డ్ సాధించింది .అయిదేళ్ళు సమర్ధంగా పాలించింది .క్విట్ ఇండియా ఉద్యమం లో గా౦ధేఅదేశాను సారం పదవికి రాజీనామా చేసింది .

  ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పటికే ఉద్యమాలు ప్రారంభించారు పైన చెప్పిన మహిళామణులు,కాశీనాధుని ,ఆచంట లక్ష్మీ పతివంటి  నాయకులు .తరచుగా నెల్లూరులో సమావేశాలు జరిపి చర్చిస్తున్నారు .కానీస్వాతంత్ర్య సమరం ముందు ఇదిచిన్న సమస్య అని  భావించి జాతీయోద్యమానికి, గాంధీకి పూర్తీ గా సహకరించారు .అయినా వీలు వెంట సమావేశమై రాష్ట్ర ఉద్యమం గురించి ఆలోచిస్తూనే ఉండేవారు .రాయలసీమను అప్పుడు’’ దత్త మండలాలు’’ అని పిలిచేవారు. ఈపేరు ఆంధ్రపౌరుషానికి తగిన పేరుకాదని శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారెడ్డి, కడప కోటిరెడ్డి ,నివర్తి మృత్యుంజయ శాస్త్రి వంటి నాయకులు ఆపేరును ‘’రాయల సీమ ‘’గామార్చారు .అది రతనాల సీమ  అన్నారు .ఆంధ్రోద్యమం తో మొదటి నుంచి గట్టి సంబంధాలున్న రామ సుబ్బమ్మ ఉపాధ్యక్షులుగా దేశమంతా తిరిగి ,మహా సభలు నిర్వహించి జాగృతి కలిగించింది .ఆమెను ఒకే సారి 40 ఏళ్ళ పాటు కడప పురపాలక సంఘ సభ్యురాలు గా ఎన్నుకొని చరిత్ర సృష్టించారు .ఆపదవిలో అమె చేసిన సేవలు నిరుపమానం .పాకీ స్త్రీలకూ ప్రసవం తర్వాత నెల రోజులు పూర్తి జీతంతో సెలవు ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అంగీకరి౦ప జేసి అమలు పరచిన  కరుణామయి రామ సుబ్బమ్మ .

  సమాజంలో స్త్రీలకూ జరుగుతున్న అన్యాయాలలు ,అక్రమాలు అర్ధం చేసుకొని రామ సుబ్బమ్మ వాటిని ప్రతిఘటించే శక్తి స్త్రీలకూ రావాలని అప్పుడే నిజమైన మార్పు వస్తుందని చెప్పేది .మహిళా వికాసానికి స్త్రీసమాజాలను ,స్త్రీ విద్యనూ సాధనంగా చేసుకొని కృషి చేసింది .ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ లో ఆమె ఆంధ్ర విభాగానికి అధ్యక్షురాలై,రాష్టమంతా తిరిగి మహిళా సమాజాలు ఏర్పాటు చేసి నిజమైన సంఘ సేవ చేసేట్లు చూసింది . మహిళా మహాసభలు పెద్ద ఎత్తున చిత్తూరులో, కడపలో నిర్వహించింది .కడపలో మహిళాకళాశాల స్థాపనకు లక్షరూపాయల విరాళమిచ్చి తోడ్పడింది .ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు కడపలో స్థాపించబడిన ‘’కడప రామ సుబ్బమ్మా కోటి రెడ్డి ప్రభుత్వ స్త్రీల కళాశాల’’కు ప్రారంభోత్సవం చేశారు .అందులకోసం ఒక హైస్కూల్  స్థాపించటానికీ కృషి చేసింది .తొమ్మిదేళ్ళు జిల్లా విద్యాసంఘ సభ్యురాలుగా సేవలందించింది  .ఆంధ్రా, వెంకటేశ్వర యూని వర్సిటీలకు సెనేట్ మెంబర్ అయింది..

  ఆలిండియా సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లో , ,రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంఘం లో సభ్యురాలు .’’గిల్డ్ ఆఫ్ సర్విస్ ‘’అధ్యక్షురాలు.రాయలసీమ క్షామ నివారణకు ధన వస్తు సేవ రూపంగా గొప్ప సేవ చేసింది .హరిజన సేవలో తరించింది. వరకట్న నిర్మూలనానికి పాటుపడింది .రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యురాలుగా 20 ఏళ్ళు ఉన్నది .అనేక విదీశాలు తిరిగి తెలుగు జాతి గౌరవం భాష సంస్కృతు లపై మహోపన్యాసాలిచ్చింది .ముఖ్యంగా స్త్రీలు పరదాలో నుంచి బయటకు రాకపోతే అభి వృద్ధి ,సంక్షేమం ఉండదని మొత్తుకొనేది .దీనిపై ఒక ఉదంతం జ్ఞాపకం చేసుకొందాం .హైదారాబాద్ లో ఆంధ్ర యువతీ మండలిని శ్రీమతి రంగమ్మా ఓబులరెడ్డి అధ్యక్షులుగా ,శ్రీమతి బూర్గుల అనంత లక్ష్మి ఉపాధ్యక్షులుగా నిర్వహిస్తూ 1940లో అయిదవ వార్షిక సభకు కడప  రామ సుబ్బమ్మ ను సభాధ్యక్షులుగా ఆహ్వానించారు .మద్రాస్ రాష్ట్ర మంత్రిగాఉన్న ఆమె భర్త కడప కోటి రెడ్డి గారు కూడా వచ్చారు .అప్పుడు హైదరాబాద్ లో హిందూ స్త్రీలు కూడా పరదా పధ్ధతి పాటించేవారు .మేదర తడికలతో ఒక గోడలాంటిది ఏర్పరచి తడికకు ఒక వైపు మగవారు, మరో వైపు ఆడవారు కూర్చునే ఏర్పాటు చేశారు .లోపలికివచ్చిన రామ సుబ్బమ్మ ‘’పరదా పాటించే సభలో  నేను పాల్గొనను’’ అని నిర్మోహ మాటంగా చెప్పింది .గత్య౦తరం లేక నిర్వాహకులు ఆ తడికలు  ఊడ దీయి౦చ గా సంతోషంగా,ఆత్మ గౌరవంగా సభలో పాల్గొని అద్భుత ప్రసంగం చేసి అందర్నీ మెప్పించింది. సభలోని స్త్రీలు ఆమె మూలంగా పరదాల నుంచి విముక్తి పొందినట్లు మహదానందం పొంది ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేశారు .దాదాపు 80 సంవత్సరాలు జీవించి రామ సుబ్బమ్మ  మరణించింది  .  

  గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-23-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.