శృంగేరికవి ‘’ఎరుక( లపూడి )గల’’ శర్మగారి ‘రాఘవీయమే ’రాఘవా’’ శతకం

శృంగేరికవి ‘’ఎరుక( లపూడి )గల’’ శర్మగారి ‘రాఘవీయమే ’రాఘవా’’ శతకం  

బ్రహ్మశ్రీ ఎరుకలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు రచించి ,ఈ జూన్ లో ప్రచురించి ఆత్మీయంగా పంపిన రాఘవ శతకం నిన్ననే చేరింది .వీరు గు౦టూరు జిల్లా సత్తెననపల్లి తాలూకా కృష్ణాతీరగ్రామం కామేపల్లిలో జన్మించి ,విజయవాడ లయోలాకాలేజిలో బబిస్. సి. పట్టభద్రులై సౌత్ వెస్ట్రన్ రైల్వే హుగ్లిలో చీఫ్ యార్డ్ మాస్టర్ గా ఉద్యోగించి కర్నాటక లోని శృంగేరి లో విశ్రా౦త జీవితం గడుపుతున్నారు .ఇప్పటికే ధూర్జటీ ,శాంభవీ ,పద్యశతకాలు  పరమభక్తితో రచించి ప్రచురించి ,కుహనా కిరాతం ,మంజుఘోష రచన చేసి ముద్రణలో ఉన్నారు .వారే నన్ను పరిచయం చేసుకొని  నాకు మొదటిరెండుశతకాలుపంపారు .నేనుసమీక్షించా .ఇది వారి మూడవ శతకం .శివ, శివా ,హరి నామ అద్వైత స్మరణతోధన్యులయ్యారు .ఈ రాఘవశతకం తో ‘శ్రీరామపరబ్రహ్మ’’ దివ్య దర్శనం చేయించి రాఘవీయం ను  తీర్చిదిద్దారు .ముందు ముఖ చిత్రం రాఘవాన్వయ వంశమౌళి జానకీజాని  కడుముచ్చటగా ఉంటె వెనుక చిత్రం అంకితం పొందిన రామ భక్త హనుమాన్ మారుతాత్మజుని ‘’నమస్సహస్రముల నా హనుమంతు ని గారవిస్తూ ‘’ న్న చిత్రరాజం,పుస్తకానికి ఆధ్యాత్మిక శోభను ద్విగుణీ కృతం చేశాయి

   124 చంపకమాల ఉత్పలమాల శార్దూల మత్తేభ పద్య శోభ ఈ’’ రాఘవా ‘’శతకం .  శంకరాచార్య గురుపరంపరను పద్యంలో సంస్తుతించి ,’’నీ నెనరున భక్తి న్ దీని వ్రాసితిన్ ‘’అని వినయాంజలి ఘటించి మారుతికి అంకితం చేశారు .నాంది లో ‘’కులదైవంబగు రామ భద్రుగొలువం గూర్మి౦ న్బూన్కితో –ఖిల సంతృప్తి కరంబుగా పరిహృత్ప్రీత్యర్ధమై సేయగా- గొలుతున్ రామకథా మహత్వనిధి న్గూడార్ధ భక్త్యాకృతిన్ –న్దొలుతన్నారదు,వల్మికోద్భవునిదొడ్తో మ్రొక్కి ప్రార్ది౦చెదన్ ‘’అంటూ మత్తేభంలో స్తుతించి ‘’ఆయన ‘’తాల్చే రూపాలనన్నిటినీ ఔరా అని అచ్చెరువొంది ,ధూర్జటి, శాంభవీ శతకాలు రాసి ఇప్పుడు రాఘవ శతకం రాస్తున్నానని మనవి చేసుకొన్నారు .తర్వాత వినాయక సరస్వతీ స్తుతి చేసి ,షష్ట్య౦తాలతో’’హరిమర్కట మర్కటుని’’’’చిరభక్త జనా వనైక చేతస్కునికి ‘’సమర్పించారు .శతక మకుటం’’ రాఘవా ‘’  

‘’  కోన్వస్మిన్ ‘’, అన్న ఆదికవి శ్లోకానికి వివరణగా శార్దూలం లో మొదటి పద్యం రాశారు .’’పుట్టనుబుట్టి యు న్ములుకు ముట్టి గతించిన జంట కేడ్చు నా-పిట్ట యెలుంగు విన్నముని బిట్టడలం,గడకయ్యె కావ్యము ‘’అనిఆదికవినే ఆదికావ్యాన్ని స్తుతించారు .ఆపదలను హరించి సిరులిచ్చి దయా౦త రంగునిశోభావహుని లోక రమ్యుని గానం చేశారుకవి .గాధిసుతానుగామిఅయి,తాటక సంహారం చేసి’’భూరి భుజప్రతాపం ‘’చూపిన రాముడికి కైమోడ్పు ఘటించారు .సరయూ కూలంకషా తీరంలో సాకేత విహారి ‘’సరఘౌఘాభాసి మౌనీంద్ర సంఘ లసత్పద్మ పదుడని సాకేత పతిస్మరణం చేశారు .రామనామ స్మరణ సామర్ధ్యం పెంచుతుంది .మాహాద్భుతకారి ,భార్గుడౌ-చాపదిదృక్ష  నా జనకు శాలకు సాగవే నీవు ‘’అని పరశురామ గర్వ భంగోదా౦తమ్  వినిపించారు .శూర్పణఖ ను ‘’చేటల గోళ్ళ చెల్లెలు ‘’అన్నారు రాక్షస వంశానికి చేటు అని  చూడకుండా అన్న మహీపతి రావణుడు ‘’మహీజ ‘’జానకిని మాటుగా తన పుట్టి తానె ము౦చు కోవటానికి లంకకు తెచ్చాడట.జటాయువు ‘’గోరులు ముక్కు రెక్కలు ఘోర రణాయుదాలుగా దశాననుని ఆపి నీకోసం వేచి ప్రాణాలు దక్షిణగా ఇచ్చాడు అని జటాయు స్తుతి చేశారు .ఉపనిషదధ్వగామి యోగివలె ,న్ధరజాతదర్శనం ‘’పొందాడట మారుతి హనుమ .  లంకానగరం ‘’పురుగు జొరంగరానటుల  పూర్తిగ జుట్టి వార్ధి,రాక్షసుల దట్టమైన కాపు .గా ఉన్నా చొరబడి             

రామకథ ఆ ‘’రామ’’ కు చెప్పి అంగుళీయకమిచ్చి  శిరోరత్నం గ్రహించివారాసిని  ‘’గోష్పదీకృతం ‘’చేసి తిరిగొచ్చి ‘’క౦టిని సీత ‘’అని చెప్పిన హనుమను  ‘’కంట్లో వెన్నెలలు ప్రసారమై భస్మలిప్తుడై యోగిగా కనిపించిన మారుతిని అందరికి ‘’మనమంట‘’కౌగిట జంటగా ‘’పూనాడట రాముడు .

 అగస్త్య మహర్షి ‘’చుళికన్వారిధి ద్రావి , వింధ్యదగు ప్రా౦శూత్తం సమున్దించిచూ-పుల దా భూమికి  నొచ్చి ,శాపమిడి,గర్వోద్విగ్ను సర్పంబుగా –నిలకుం దాటక దైత్యగా నదిమే మౌనీన్ద్రుడు అగస్త్యుడు .’’అని చక్కని పద్యం రాశారు శర్మాజీ .రామరావణ యుద్ధానికి ‘’ఉపమలు లేవు ‘’అని తేల్చారు .రావణ సంహారం తర్వాత బ్రహ్మాదులు వచ్చి ‘’అగుదువు నీవు విష్ణువవు అంగన లక్ష్మి ‘’అని ఎరుక చేశారు ‘’నీ కనుమూత రాత్రి విప్పుట అహస్సు ‘’అన్నారు  .అగస్త్యుడు ఆదిత్య హృదయం బోధించి వెళ్ళాక జపించిన రాముడు –‘’ఆదిత్యాద్భుతమంత్రరాజ జప నిష్టాంత స్సముద్భూతతే –జోదర్కంబుగ,రావణా౦తక పటిష్టోదార రవ్యాశిష –ప్రాదుర్భూత పరాక్రమక్రమ ,ధారాస్పూర్తి మత్పూర్వ మం –త్రాధిష్టాతృ ననుగ్రహం బోదివిందట ‘’.  అగ్నిదీవుడు ‘’అనఘ సువృత్త భూమిజ ,మదాజ్ఞగ్రహి౦పుము రామభద్ర ‘’  ఆని సీతను రాముడికి అప్పగించాడు ..

  ‘’ఆగత మౌని మండల సమాదృత వల్మిక సంభవ ప్రధా-రాగ లయ స్వరాలయము రామకథ ..సీత చివరగా నందన యుగ్మము నప్పగించి యా-బిడవిడనాడే మిమ్ము నతివేలము బాధ మిగిల్చి రాఘవా ‘’అని సానుభూతి ప్రకటించారుకవి రాఘవస్వామికి  .అవతార అంతం లో రామప్రభువు అత్యంత దాక్షిణ్య మూర్తిగా  తన వెంట అయోధ్యజనుల౦దర్నీగతులు తీర్చి తనతో దివికి తీసుకువెళ్లి’’ క్షత్రియ’’ శబ్దం సార్ధకం చేశాడట .రాఘవ  చరిత్ర –‘’భవదభి దాను చింతనము ,భావ పవిత్రత సాధకంబు నై౦ –దవ మృదుచందనా భ సముదంచిత  రమ్య మనోజ్ఞము ‘’భవభార నివారణ ఔషధం పగలు రాత్రి దీక్షగా జపింప జేస్తుంది .’’పరమాన౦దదమౌ  ,శుభప్రదమునౌ  ప్రత్యూష వేళన్ భవత్ –స్మరణారంభమొనర్చి’’తన్మయత’’రామారామ ‘’యంచు న్ధను- శ్శరముల్దాల్చిన ప్రాగ్యమౌ హరువును న్స్వాత్మ న్పునః  ప్రత్యూష-స్ఫురణం బై నను వీడనట్టితరుణ౦బు న్గోరుదు న్రాఘవా ‘’అని జీవన్ముక్తికి ఈ శతకం సోపానం కైవల్య సదనం అని ఫలశ్రుతి ప్రకటించారు శ్రీ ఎరుకల పూడి సుబ్రహ్మణ్య శర్మ  కవి  శేఖరులు .ప్రతిఅపద్యం వేదం వేదాంత సారోధర్మమే .ప్రతిపదం భవభయ హరణమే .మహర్షి వాగమృతమే . చదివి తరించటం మన వంతు .

 శర్మగారి చరవాణి – 92904 10049 .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-26-ఉయ్యూరు .–

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.