నీలంరాజు జీవితంలో..

నీలంరాజు జీవితంలో..


పదిహేనేళ్ల వయసులోనే గాంధీ పిలుపుకు స్పందించి విద్యాలయాల బహిష్కరణ చేసిన దేశభక్తుడు నీలంరాజు వేంకట శేషయ్య. తరువాతి కాలంలో ఆయన ప్రకాశం పంతులుగారికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి ‘స్వరాజ్య’, ‘ఆంధ్రపత్రిక’లలో పని చేసి తర్వాత సొంత వార పత్రిక ‘నవోదయ’ను స్థాపించారు. చాలాకాలం పాటు ‘ఆంధ్రప్రభ’ డైలీకి సంపాదకునిగా కూడా నీలంరాజు వేంకట శేషయ్య వ్యవహరించారు. ఆయన గురించిన విశేషాలను, అనుభవాలను కుమారుడు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ ‘నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే పుస్తకంగా వెలువరించారు. అందులోని కొన్ని ఆసక్తికర భాగాలు ఇక్కడ ఇస్తున్నాం…

” శ్రీశ్రీ రాతలో ఎంతటి ‘ఇమేజరీ’ ప్రవేశపెట్టి రాసేవాడో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవాడు. చమత్కారాలు వాడుతూ సంతోషిస్తూండే వాడు. ఎడం చేత్తో కారమ్స్ ఆడేవాడు. మీరు ఈ చేత్తోనే ఆడుతుంటారా? అని నేను అడిగినప్పుడు “ఔను, నేను లెఫ్టిస్టుని” అన్నాడు.” 

‘నవోదయ’ పత్రిక ప్రముఖ రచయితలనందరినీ ఆకర్షించేది. అందులో శ్రీశ్రీ ‘వారం వారం’ అనే శీర్షిక రాస్తుండేవారు. నెలకు ముప్ఫైరూపాయలు ఇచ్చేవాళ్లం. మా తాహతు అంతే. శేషయ్యగారికున్న వనరుల దృష్ట్యా శ్రీశ్రీ అంతకన్నా ఆశించేవాడు కూడా కాదు (ఆయనకు ‘అవసరమైతే’ ఎంతైనా ఉంటుంది) ‘ఢంకా’ అనే నెలసరి పత్రిక నడిపే ఢంకాచార్యులు గారు -(ఆయనకు ఒక చేయి ఉండేది కాదు -ఎప్పుడూ ఖద్దరు శాలువా కప్పుకొని ఉండేవాడు) శ్రీశ్రీ కనిపిస్తే “శ్రీశ్రీ గారూ మా మీద దయలేదు” అని సరదాగా అనేవాడు. ‘గివ్ ఫైవ్‌రూపీస్ అండ్ టేక్ ది ఆర్టికల్’ అనేవాడు శ్రీశ్రీ బదులుగా. రాసినది జేబులో ఉంటే అప్పటికప్పుడే ఇవ్వగలిగి వుండేవాడు.

లేదంటే, ఆఫీసులో కూచొని నాలుగు తెల్ల కాగితాలడిగి తీసుకొని, ఓ అరగంటలో రాసి (కొట్టివేతలుండేవి కాదు) ఎడిటర్ చేతుల్లో పెట్టి వెళ్లేవాడు. ఆయన డబ్బు అవసరం కూడా అలాంటిదే. ఒక రూపాయైనా అడిగి తీసుకొని సిజర్సు సిగరెట్ పెట్టెలు కొనుక్కునేవాడు. నవోదయ నెలవారీ పారితోషికం నేను ఇవ్వబూనుకున్నప్పుడు, ‘ఆ ముప్ఫైలో మీ రూపాయి మినహాయించుకొని ఇవ్వండి’ అనేవాడు. ఆ రోజుల్లో ఆయన ఒక్కడి పరిస్థితే కాదు, అనేకమంది రచయితల పరిస్థితి అలానే ఉండేది. ఎక్కడా డబ్బు పుట్టేది కాదు. పేరు పేరునా చెప్పడం అనవసరం కానీ, రచయితలు చాలా కష్టం మీద తమ రచనా వ్యాసంగానికి అంకితమై ఉండేవారు. శ్రీశ్రీ ప్రభృతుల మీద నాకు అమిత అభిమానం ఉండేది.


ఆరుద్ర కూడా నవోదయకు వారం వారం రాసేవాడు. తన ‘సినీ వాలీ’ పుస్తకాన్ని శేషయ్యగారికి తర్వాతి కాలంలో అంకితమిస్తూ, ‘వైమానిక దళం నుండి సాహితీ తలానికి తెచ్చిన శేషయ్యగారికి’ అని వ్రాసాడంటే, బహుశా మద్రాసుకు రాగానే ఈయనని కలిసి, నెలకు ముప్ఫై రూపాయల పారితోషికంతో రాస్తానని ఒప్పందం కుదుర్చుకోనుంటాడు. నేను నవోదయలో ‘చైనా బజార్’ అని సంకర తెనుగు భాష (అరవ తెలుగు)లో ‘ఫీచర్’ రాయడం మొదలెడితే ఆయన అభిమానం దాని మీద ఎంతగా ఉండేదంటే సాయంత్రం పానగల్ పార్కు, టి. నగర్‌కు తీసుకువెళ్లి అక్కడ సమావేశమయ్యే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ, గోరాశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు మరికొందరు సాహితీ వేత్తల (చెంతన ఉండి రాకపోతే, రాని వారిదే నష్టం) మధ్య చదివి వినిపించేవాడు. వారంతా పగలబడి నవ్వడం ఒకటే ఆరుద్ర అభిలషించింది. ఈ మధ్యనే ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ఆ ఫీచర్‌లోని కథల్ని ‘చైనా బజార్ కథలు’ అనే శీర్షికతో చిన్న పుస్తకంగా ప్రచురించారు.

ఒకసారి శ్రీ గోరాశాస్త్రి తన బంధువు ఒకాయన రాసిన ఒక చిన్న నవలిక -లేక అతిపెద్ద కథ ఒకటి తీసుకుని రచయితను కూడా వెంటబెట్టుకొని శేషయ్యగారి వద్దకొచ్చాడు. “ఇది మన నవోదయలో ధారావాహికంగా ప్రచురించడానికి ” అని ఆయన చేతికిచ్చాడు. “అలాగే, చూసి చెప్తాను” అన్నారు శేషయ్యగారు. రెండు రోజులయిన తర్వాత సాయంత్రం తాపీగా వారు ఇద్దరూ కలిసి శేషయ్యగారి వద్దకొచ్చారు. శ్రీ గోరాకూ ఎడిటర్‌కూ సుమారు గంటన్నర, రెండు గంటల వాదం నడిచింది. మొత్తం నేను వినలేదు కానీ, “కథ నడిపిన తీరు బాగానే ఉంది – కాని ఇతివృత్తం నాకు సమ్మతం కాదు” అంటారు ఎడిటర్. “ఇతివృత్తంతో మీకేమి పని? రచన బాగుంది కదా? వేయండి” అంటారు శ్రీ గోరా శాస్త్రి. “అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలుపడదు” అంటారు ఎడిటర్. ” క్రమ అక్రమ సంబంధాల సంగతి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసివుంటే వేయడమే”అని గోరా. “ఎడిటర్, పోస్ట్‌మాన్ కాదు.

పాఠకుల యెడల అతడికో బాధ్యత ఉంది”అని ఎడిటర్ శేషయ్యగారు. “ఎడిటర్ కర్తవ్యమంతే అయివుండాలి” అని గోరా. “ఈ ఎడిటర్ అట్లా అనుకోవడం లేదు” శేషయ్యగారు. చాలా పెనుగులాడాడు శ్రీ గోరా -కొంత దబాయింపు- ‘మారల్ బ్రిగేడ్, నైతిక పోలీసు దళం’ అనేవి ఆయనకి కిట్టేవి కాదు. ‘నవోదయ’ శేషయ్యగారి సొంత పేపరైనప్పుడే శ్రీ గోరా అంతసేపు వాదించాడు. శేషయ్యగారు ఆంధ్రపత్రికలో కూచున్నప్పుడు అయితే ఎంత వాదించేవాడో అనుకున్నాను. చివరకు ఆ పెద్ద కథను మా తండ్రి తిరిగి ఇచ్చారు. గోరా అన్నట్లు, రచనా నైపుణ్యం, శిల్పాన్ని చూచి వేసే వారుండవచ్చు. ‘సంఘం మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది?’ అనే బాధ్యత గుర్తుంచుకొని ఆగే వారుండవచ్చు.

నవోదయలో శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి రాసిన ఏదో గేయ కవిత్వాన్ని చూసి అమంచర్ల గోపాలరావుగారు ఎంతగా మెచ్చుకున్నారంటే (అప్పుడు ఆయన బొంబైలో ఉన్నాడు) ఆ సంచిక చేత నిడుకొని, బొంబైలో తన ఆంధ్ర స్నేహితులందరి వద్దకూ వెళ్లి, అది వారందరికీ చదివి వినిపించి, నాలుగైదు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజుల్లో మనుషులకు కవితావేశం అలా ఉండేది. దానికై శ్రమనీ, ఖర్చునీ లెక్కచేసే వారు కాదు. ఇప్పుడు ధనమొక్కటే ఆవేశాన్ని జనింపజేస్తున్నట్లున్నది.

రష్యన్ రచయిత చెహోవ్ రాసిన చెర్రీ ఆర్చర్డ్ తెనుగులో అనువాదం చేస్తూ ‘సంపెంగతోట’ అని పేరు పెట్టారు శ్రీశ్రీ. పూర్వమెప్పుడో ‘ఇది అనువదిస్తే బాగుంటుంద’ని అబ్బూరి రామకృష్ణరావుగారు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు ఇద్దరూ ఉన్నప్పుడు అన్నట్లున్నారు. శ్రీరంగం నారాయణబాబుగారు తాను అనువదించాలి అనుకున్నట్లున్నాడు. ఎవరు ముందు మొదలెట్టారు, ఎవరు పోటీ పడ్డారు అనేదాని మీద ఏదో చర్చచేస్తూ తన ‘వారం వారం’లో శ్రీశ్రీ ఏదో రాశాడు. శ్రీరంగం నారాయణబాబుకు కోపం వచ్చింది. ఆయన మధ్య పాపిడి, గిరజాల జుట్టు, కవి వర్యుడి కట్టు బొట్టు విశిష్టంగా కనిపించేవాడు.

ఆహార్యం కూడా నాటకీయంగా ఉండేది. గంభీర వదనంతో నవోదయ ఆఫీసుకు వచ్చి “శేషయ్యగారూ, ఏమి చెప్పను? భాషా దేవిని బలిమి చెరగొన్నాడు శ్రీశ్రీ” అని నాటకీయంగా అన్నాడు. దాని మీద ఏదో కొంత చర్చ జరిగింది. తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ‘వారం వారం’ రాయడానికి నవోదయలో వచ్చి కూచున్నప్పుడు ఆయనతో నారాయణబాబు ఇలా అన్నాడని చెప్తే “అలా అన్నాడా? వాడి మొహం” అని తన పాటికి తాను రాసుకుంటూపోయాడు. శ్రీశ్రీ రాతలో ఎంతటి ‘ఇమేజరీ’ ప్రవేశపెట్టి రాసేవాడో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవాడు. చమత్కారాలు వాడుతూ సంతోషిస్తూండే వాడు. ఎడం చేత్తో కారమ్స్ ఆడేవాడు. మీరు ఈ చేత్తోనే ఆడుతుంటారా? అని నేను అడిగినప్పుడు “ఔను, నేను లెఫ్టిస్టుని” అన్నాడు.

నీలంరాజు వేంకటశేషయ్య జీవితం
నీలంరాజు లక్ష్మీ ప్రసాద్
పేజీలు: 244, ధర: 100
పుస్తకాలకు: నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
040 – 24652337

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.