తిక్కన భారతం –21

తిక్కన భారతం –21 

                                                                                       స్త్రీ పర్వ నిర్వహణ –1
వీర రౌద్రాలకు ,రస వత్తర సన్నీ వేషాలకు నిలయ మైన యుద్ధం ముగిసింది .యుద్ధ సమయం లో ఉన్న ఉత్సాహమంతా అయి పోయింది .శోకం ,నిర్వేదం ప్రాధాన్యత పొందాయి .సౌప్తికం లో ద్రౌపది పుత్ర శోకం తారా స్తాయి కి చేరింది .స్త్రీ పర్వం లో ఆ శోకం ఇంకా ప్రాధాన్యత చెందింది .గాంధారి ,మిగతా కురు స్త్రీల ఆక్రందన లతో నిండి పోయింది .కరుణ రసం రస సిద్ధి పొందింది .బంధు జన మరణాలతో ,ధర్మ రాజు మనస్సు వికలమయింది .విలపించే స్త్రీ లను చూసి నిర్వేదం పొందాడు .యుద్ధ పరిణామ ఫలిత మేమిటో తెలిసి వచ్చింది .దీని కంతటికీ కారణం తన ద్యూత వ్యసనమే ననిపించింది .ప్రజా పాలనం మీద విముఖత్వ మేర్పడింది .వన వాసానికి వెళ్లాలని సిద్ధ పడ్డాడు .తన వల్ల లోక హాని జరిగింది .కనుక సత్పురుషుని లాగా వ్యధ చెందాడు .పరితాపం తో శుద్ధ మనస్కుడై ,ప్రశాంతి పొందితే తప్ప ,ముందుకు సాగ లేదు .శాంతి తర్వాత గురూప దేశం తో జ్ఞానోదయం కావాలి . దాని వల్ల ధర్మ నిష్ఠ కల్గుతుంది .అందుకే యుద్ధం తర్వాతా శోకాదిష్టిత మైన స్త్రీ పర్వాన్ని రచించాడు వ్యాస మహర్షి .పాప పరిణామా న్ని అందరు అనుభ వించాలి .పాపులే కాక ,పుణ్య వంతుల హృదయాలు కూడా ఆర్ద్రత చెందాలి .అప్పుడే లోకం లో న్యాయం ,ధర్మం ,గురించి స్మృతి  కల్గుతుంది .ఒకడు చేసిన పాపాలకు సంఘం లో అనేకులు నశిస్తారనే ప్రకృతి సత్యం హృదయాలలో నాటు కొంటె తప్ప ,పాప భీతి కలుగదు .పాపభీతి ,అసత్య ,అధర్మాల యెడ విముఖత్వమేర్పడి ,ధర్మ సంస్తాపనకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్దేశం తో ,స్త్రీ పర్వ మంతా శోకానికి నిలయ మై పోయింది .ధర్మ రాజు హృదయం భరించ లేని నిర్వేదనానికి లోనైపశ్చాత్తాపం చెందింది .
ద్రుత రాష్ట్రుని ఏడ్పు తోనే స్త్రీ పర్వం ప్రారంభమైంది .”కొమ్మలు దున్మ మ్రోడ్పడు భూరుహం వలె ”ఆయన ఉన్నాడు .కొమ్మల్ని విరిగిన చెట్టు లాగా ఉన్నాడు అంటే అందర్ని కోల్పోయి జీవచ్చవమైనాడు .”నా కతంబున బోలిసిరి  నందనులు”అని తెలుసు కొన్నాడు .”వీరే కాదు ,చెలులు ,చుట్టంబులు ,సహాయులు ”కూడా నశించారు .దీనికి కారణం తానే .అని పూర్తిగా నమ్మాడు .”ధైర్యం ఎలా వస్తుంది ?అపర కర్మలు ఎలా నిర్వహించాలి ?.ప్రాణం తో ఎలా నిలువ గలను ?”అని వా పోయాడు . సంజయుడు ,విదురుడు దుఖోప శమనం చేసే మాటలు చెప్పి ఊర డించారు .సంజయుడు మాత్రం దుర్యోధనాదుల పాప ప్రవర్తనం ,పెద్ద రాజు లోభప్ర వ్రుత్తి లను తీవ్రం గా విమర్శించాడు .స్వయం క్రుతాపరాధం అన్నాడు రాజుతో .ఇప్పుదేడ్చి లాభం లేదు -హాస్యాస్పదం అనీ అన్నాడు .”సుహృజ్జనంబు లుపదేశించిన మాటలు విన లేదని నువ్వే అంటావు .-ఏడ్చి ప్రయోజనమేమిటి ?నీకు ,నీకొడుక్కి ,దుశ్శాసన ,కర్ణ ,శకుని ల మాటలే రుచి కరం గా ఉంటాయి అని ఈస డించాడు .”ముందుకు దూకు తాడే కాని ,కార్య తంత్రానికి పూను కోడు .దాన్ని నువ్వు మాన్ప లేవు .వాడి బలం మగటిమ నచ్చి ,లోభం తో ప్రవర్తించావు .తృష్ణ తో అతి సాహసానికి పూనితే ఫలితం ఇలాగే విపరీతం గా ఉంటుంది ”అని లోక న్యాయం తో సంజయుడు ఛీ వాట్లు పెట్టాడు .”అందు కోవటానికి వీలు లేకుండా ,ఆపదలకు నిలయ మైన కొండ చరియ లో ఉన్న తేనె కోసం ప్రలోభ పడి  ,కిందా మీదా తెలీకుండా తెగ పరి గెత్తె తిండి పోతు కు పట్టే గతే నీకూ పట్టింది .అలభ్య మైన పాండవుల సంపద యెడ అతి లోభం తో ,,యుక్తాయుక్తాలను వదిలి ,శ్రీ కృష్ణ ,విదురాదుల హిత వచనాలను విన కుండా తృష్ణ తో అతి సాహసం గా ప్రవర్తిన్చావు ”అని దెప్పి పొడిచాడు .–”తాన చుట్టు  దగిల్చి యున్న యుదగ్రతం దరి కొన్న ,దా — పానుభూతికి నోర్వ జాలక ,యప్రయోజన వాక్య ,సం –తాన శోషిత వక్త్రుడై ,యతి దైన్య మొందెడు వాని ,య-ట్లైన నీదు విలాప మన్యుల కాట పట్టగు భూవరా !”అని అతనిఅవి వేక  ప్రవర్తనకు ,దాని ఫలితానికి స్వయమ్క్రుతాప రాధమే కారణమన్నాడు .ఇప్పుదేద్వాతం అవివేకమే నన్నాడు .ఈ సమయం లో అలా అనటం న్యాయమా అని మనకు అని పిస్తుంది .కాని ద్రుత రాష్ట్రుడికి ఇది అవసరమే .ఉచితం కూడా .విదురుడు మాత్రం వైరాగ్యాన్ని బోధించాడు .”యవ్వనం ,రూపం ,ద్రవ్యం అనిత్యం .ఇవి పోతే ఏడవటం అవి వేకం ”అన్నాడు .ఉదాహరణ గా ఒక విషయం చెప్పాడు ”.మట్టి కుండ రూపం పొంది,ఎండి ,కాలి  ,చివరకు పగలటం ఎంత సహజమో ,జన్మించిన వానికి ,మృత్యువు అట్లా సహజం ”అన్నాడు .భవ బందాలపై ,విరక్తి కల్గించి ,వైరాగ్యం అవలంబిప జేయటం విదురుని కర్తవ్యమ్ .ఇలాంటి భావాల్ని చెప్పటానికి అనుకూల మైన శైలి ,రీతిని ఎన్ను కుంటాడు తిక్కన సూటిగా ,సంక్షిప్తం గా అర్ధ వంతం గా చెప్తాడు .యుద్ధం వరకు మహా భారతం ఐహిక సంబంధ మైంది .తరువాత అంతా ఆముష్మిక సంబంధం ..ఈ ఆరంభం విదురుని తోనే చేయిస్తాడు –”వెడలు నెడ ,గాఢ పీడం –బడి ,సుడువడి ,యోని నోత్తు వడి ,యొక భంగిన్ –వేడలగా ,గ్రహ భూతముల –ప్పుడు ,దొడగి ,యనేక దురితములు గల్పించున్ ”–భూమిని పీదిస్తే గ్రహాలన్నీ అనేక అనర్ధాలను తెస్తాయి అని సారాంశం .ఇలా చిన్న చిన్న మాటలతో ,సూటిగా , భావ గర్భితం గా వేదాంత విన్యాసం చేయిస్తాడు తిక్కన యోగి .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –31-7-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.