జన వేమన -1
”ఆట వెలది ”ని ఆయుధం గా చేసుకొని ,మూఢ విశ్వాసాలను త్రుంచిన” వేమా రెడ్డి” అనే వేమన 1640-1725 ప్రాంతం వాడు .ఆయన కవిత్వం విశ్వ జనీనం .ఆయనకు కులం ,మతం అంట గట్ట లేం .”విశ్వ కవి ”గా విఖ్యాతుడు .వేమన పద్యం నోటికి రాని తెలుగు వాడు ఉండడు .నా దృష్టి లో ”వేమన ”అంటే” వే” అంటే వెయ్యి విధాలా ”మన” అంటే మనవాడు అని అర్ధం .ఆయన చెప్పింది అంతా ”వేమన వేదమే ”ఒక రకంగా” వేదనే .” సహజ కవి గా వేమన ప్రసిద్ధుడు .ఆయన కవిత్వం ఆత్మాశ్రయం .తనే గురువు తానే శిష్యుడు .యోగి వేమన గా ఆరాధ్యుడు .ప్రజా కవి ,మహా కవి ,విశ్వకవి .తత్త్వం లాగా పాడి ,అందు బాటులోకి భాషను భావాన్ని కవిత్వాన్ని తెచ్చాడు .ప్రబోధం ,సంస్కారం ఆయన పద్య లక్షణం .ఆత్మోద్ధరణ ,సమాజోద్ధరణ వేమన్న ధ్యేయం .”మానవుడే మాధవుడు ”అన్న జ్ఞాన యోగి వేమన .సహజ ,సంప్రదాయ కవి .వేమన నుఅద్వైతిగా ,శైవునిగా ,జైనుడిగా ,చార్వాకుడి గా ఎవరి ఇష్టం వచ్చి నట్లు వారు పిల్చు కొని తమ వాణ్ని చేసుకొన్నారు .ప్రాతస్మరనీయుడు ,చిరస్మరణీయుడు వేమన .వేమన కు ముందు కొంత మంది కవులను ,వారి రచనలను గురించి చెప్పు కొన్నాం .ఒక రకం గా వారంతా ”విస్మృత కవుల ”జాబితాలో చేరడం మన దుర దృష్టం .సాహిత్యం పై మనకు ఉన్న అలసత్వానికి నిదర్శనం .కనీసం ఒక్క సారైనా ఆ మహాను భావులను స్మరించి ధన్యత చెందుదాం అని చేసిన ప్రయత్నమే ఆది .
వేమన సూర్యోదయం
దాదాపు పదహారవ శతాబ్దపు చివరి రోజుల వరకు రెడ్డి రాజులే కవులు .సంస్కృత గ్రందాలనే ఎక్కువ గా రాశారు .శాస్త్ర గ్రంధాలు ,అలంకార శాస్త్రాలు ,సంగీత శాస్త్ర గ్రంధాల పై దృష్టిని కేంద్రీక రించారు .కాకపోతే దైవాల చరిత్ర ,దేవుళ్ళ పై శతకాలు రాశారు .తమ భక్తిని ప్రకటించుకొన్నారు .ఆ కవిత్వం అంతా రాజాస్థానా లకు,పండితు లకే పరిమిత మై పోయింది .సామాన్య జనుల జీవన స్తితి గతుల గురించి ఎవరికీ పట్ట లేదు . ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టి ,వారి చీకటి బతుకులలో జ్ఞాన సూర్యుడిని వెలి గించిన వారు లేక పోయారు .వారి మూఢ విశ్వాసాలను ,చాందస భావాలను మాన్పించే ప్రయత్నం చేసిన వారూ లేరు .కర్తవ్య బోధ చేసి ,కార్యోన్ముఖులను చేసిన వారే కరువయ్యారు .ప్రజల యొక్క ,ప్రజల చేత ప్రజల కొరకు కవిత్వం రాలేదు .సామాన్యుని ,మాన్యుని గా చేసే కవితా ప్రక్రియా రాలేదు .సంస్కృత ఛందస్సు వేదం అయింది కవులకు .అదిగో ,అలాంటి అవసర సందర్భం లోనే వేమన గారు ఒక ప్రచండ భానుడి లాగా అవతరించారు .ప్రజల కోసం కవిత్వం చెప్పాడు .ప్రజల భాష లో చెప్పాడు .ప్రజల పలుకుబడులను ఉప యోగించాడు .మార్మికత లేకుండా ,సూటిగా గుండెల్ని తాకే టట్లు కవిత్వాన్ని రాసి ”ప్రజా కవి ”అని పించుకొన్నాడు .
వేమన భావన లన్నీ విశ్వ వ్యాప్తం అవటం తో విశ్వ కవి అని పించుకొన్నాడు .అలవోక గా చెబుతూనే ,జీవిత రహస్యాలను ,ఆధ్యాత్మిక చింతన ను రగిల్చాడు .జ్ఞాన దృష్టి ప్రసాదించి ,జ్ఞాన యోగి అని పించుకొన్నాడు .యే ”ఆటవెలది ”కోసం తన జీవిత సర్వస్వాన్ని కోల్పోయాడో ,విరాగి అయాడో ఆ ”ఆటవెలది ”అనే అచ్చ తెనుగు ఛందస్సు ను ఆధారం గా చేసుకొని ”విశ్వదాభి రామ ,వినుర వేమ ” అనే మకుటం తో వేమన కవి తెలుగు సాహిత్యం లో గొప్ప శతక కర్త అయాడు .ఆయన పద్యా లన్నీ ప్రజల నాలుక లపై నర్తించాయి .అవసరం ,సందర్భం వచ్చి నపుడు ఉపయోగించే ఉదాహరణలు అయాయి .తెలుగు కవిత్వం కొత్త వెలుగు లను సంత రించు కొంది .తెలుగు ప్రజలకు వేమన ఆశా జ్యోతి అయాడు .ఆత్మాశ్రయం గా ,తత్వాలుగా ,ఆయన చెప్పింది అంతా ”వేమన్న వేదం ”అయింది .తెలుగు వారి గుండెల్లో నిండి పోయాడు .ప్రాతస్మరణీయుడైనాడు .అలాంటి వేమన కవి జీవితాన్ని ,కవిత్వ తత్వాన్ని తెలుసు కోవటం తెలుగు వాడి కర్తవ్యమ్ .అదే మనమూ చేస్తున్నాం ఇప్పుడు .
బ్రౌన్ కనుగొన్న వేమన
ఇంత ఘన చరిత్ర ఉన్న వేమన్న ను మన లాక్షణికులుగుర్తిన్చనే లేదు .లక్షణ గ్రందా లలో ,చివరికి కవుల చరిత్ర లోనూ వేమన కు స్థానం కల్పించ లేదు .ఆంగ్లాధి కారి అయినా ,తెలుగు దేశం పై అభిమానం ,తెలుగు సారస్వతం పై అభి రుచి ఉన్న ”చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ”వేమన పద్యా లను సేకరించి ,శుద్ధ పరచి ,తెలుగు వారికి ఆయన్ను ,ఆయన శతకాన్ని పరిచయం చేశాడు .బ్రౌన్ ఆ పుణ్యం కట్టు కొక పోతే ,వేమన్న ఎప్పటికీ తెలుగు చరిత్ర పుటలకు ఎక్కి ఉండే వాడు కాదేమో ?అందుకే బ్రౌన్ కూడా మనకు చిర స్మరణీయుడైనాడు .ఆ తర్వాత వేమన కవిత్వం పై శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు ,శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారు ,శ్రీ మరుపూరి కోదండ రామి రెడ్డి గారుశ్రీ ఆరుద్ర మొదలైన వారు దృష్టి సారించి వేమన కవిత్వం లోని లోతు పాతు లను ప్రజలకు విస్తృతం గా అంద జేశారు .దానితో వేమన కీర్తి దశ దిశలా వ్యాపించింది .ఇంతటి మహా కవిని చరిత్ర చీకటి లో ఇంత కాలం ఉంచామా అని సిగ్గు పడింది ఆంద్ర జాతి .అప్పుడు అందరు వేమన్న ను భుజాలకు ఎత్తు కొన్నారు .నెత్తిన పెట్టు కొన్నారు .ఆయన భావాలను ,కవిత్వాన్ని తనివి తీరా గ్రోలారు .బ్రహ్మ రధం పట్టారు .నీరాజనాలు అందించారు .”మనిషే దేవుడని ,మానవతా వాదమే వేమన మతమని ”గుర్తించారు .
1640 a.d.ప్రాంతం లో రాయల సీమ లోని రెడ్డి కులం లో వేమన జన్మించాడు .రాజభోగం ఉన్న వంశం .ఆయన గురువు శివ యోగి .స్నేహితుడు అభి రామయ్య బంగారు నగలు చేసే వాడు .అభిరామయ్య ను మోసం చేసి, వేమన గురువు వద్ద ఉపదేశం పొంది ,బీజాక్షరాలు రాయించు కొన్నాడని కధ ఒకటి ప్రచారం లో ఉంది .దాని ఫలితాన్ని వేమన దక్కించుకొన్నాడు .అభిరాముడికి దక్కాల్సిన ఫలితాన్ని తాను దక్కిన్చుకోన్నానని లోలోపల మధన పడుతున్నాడు .అతని కీర్తి శాశ్వతం కావాలని భావించి ,”విశ్వ దా భి రామ వినుర వేమ ”అనే మకుటం లో ఆటవెలది పద్యాలు చెప్పాడు .దీని అర్ధం –విశ్వాన్ని (సమస్తాన్ని )ఇచ్చ్చే దేవుడికి ఇష్టమైనది .దీని లో స్నేహితుని స్మరణా దాగి ఉంది .ఇవన్నీ ఒక్క రోజులో చెప్పిన పద్యాలు కావు .అనేక ప్రదేశాలు తిరుగుతూ ,,తాను చూసిన విషయాలపై స్పందిస్తూ ,సంఘం లోని చెడును ,కుళ్ళు ను ,అవినీతిని ,చూసి ఆగ్రహిస్తూ ,బాధ పడుతూ ,మార్పు రావాలని కోరుకొంటూ ,చెప్పిన పద్యాలు .ముక్తకాలు .ఆ పద్యాలు ప్రజల నాలుక పై జీవించాయి .వేదం లా తరతరాలకు ప్రాప్తించాయి .”వానలో తడియని వారు ,వేమన పద్య మరంద ధార లో తని యని వారు ”లేరు .గ్రామీణ జీవితానికి అద్దం పట్టాడు .ఆయన పద్యాలలో ఆనాటి సమాజ పు పోకడలన్నీ కనీ పిస్తాయి .ఒక విధం గా సమకాలీన చరిత్రను పద్యాలలో బంధించాడని పిస్తుంది .చివరకు సర్వం త్యజించి ”యోగి వేమన ”గా మారి పోయాడు .
వేమన ప్రతి దాన్నిహేతు వాదిలాప్రశ్నించటం నేర్పాడు .అస్పృశ్యత ను నిరశించాడు .అందరికి సంఘం లో సమాన గౌరవం ఉండాలని ,సంఘ సంస్కర్త లా చెప్పాడు .విరాట్ పోతులూరి వీర బ్రహ్మం గారు” కాల జ్ఞానం ”రాశారని మనందరికీ తెలుసు .ఆయనే ”వేమన్న మా అన్న ”అని గౌరవించారు,ఆత్మీయం గా పిలిచారు . .ప్రజలకు శాస్త్రీయ దృక్పధం కలిగించిన వాడు వేమన .ఆయన వేసిన ప్రతి అడుగు భావి తరాలకు బాట .ఆయన చెప్పిన ప్రతి మాట ”నీతి ముత్యాల మూట ””సాను జాత మయ్యే సకల కులము ”అన్నాడు వేమన .అంటే -ఒకే కులం లోంచి ,అన్ని కులాలు పుట్టాయి అని అర్ధం .కులం పోరు జాతి ఐక్యతకు చేటు అని భావం .ఈ స్ఫూర్తి తోనే పలనాటి బ్రహ్మ నాయుడు ”చాప కూడు ”పెట్టి సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేయించాడు .సిక్కుమత నాయకుడు గురు నానక్ ”లంగరు ”అనే సహా పంక్తి భోజనం ఏర్పాటు చేశాడు .”ఉర్వి నొక్క కంచము బెట్టి -,పొత్తు గుడిపి, కులము పోలయ జేయి ”అన్న సంస్కర్త మన ,జన వేమన .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –18-8-12-కాంప్–అమెరికా